సంకల్పం

కథ

కె. విద్యుల్లత

‘రాయల్ కన్వెన్షన్ సెంటర్,’-   “అమ్మయ్య వచ్చేసానా,” అనుకుని బైక్ ని, ఫోన్లో జిపిఎస్ నీ ఆపాడు పృద్వి.

నెమ్మదిగా బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. “హార్టీ వెల్కమ్ టు అవర్ సిల్వర్ జూబ్లీ”

– మిస్టర్ అండ్ మిసెస్ అనురాగ్, అవని. వెల్కమ్ బోర్డులో ఉట్టిపడుతున్న రిచ్ లుక్ చూసి నవ్వుకున్నాడు పృథ్వి.

అప్పటికే పార్టీ మొదలయ్యి చాలాసేపు అయింద నుకుంటా. లోపల అంతా హడావిడిగా ఉంది. ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు.

తనకసలు ఇలాంటి పార్టీలకు రావడమే ఇష్టం ఉండదు. కానీ తల్లిదండ్రుల మాట కాదనలేక వచ్చాడు.

ఈ అనురాగ్ గారు ఐఏఎస్ ఆఫీసర్, తన తండ్రి స్నేహితుడు. ఎప్పుడో స్కూలు,కాలేజీలలో కలిసి చదువుకున్నారట. తర్వాత అతను బాగా చదివి ఐఏఎస్ గా ఎదిగారు.

తన తండ్రి మాధవ్ మాత్రం చదువులో ఎక్కువ కష్టపడకుండా డిగ్రీతో అయిందనిపించి అతని తండ్రి దగ్గర నుంచి వచ్చిన బిజినెస్ లో చేరిపోయాడు. కాకుంటే అందులో చాలానే కష్టపడి తండ్రి అందించిన చిన్న వ్యాపారాన్ని ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా పెంచుకుంటూ పోయి ఈరోజు సిటీలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగాడు.

ఈరోజు కూడా బిజినెస్ మీటింగ్ కోసం అర్జెంటుగా ముంబై వెళ్ళవలసి రావడంతో తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ కి తన తరఫున వెళ్ళమని బలవంతం చేయడంతో తప్పనిసరై వచ్చాడు పృథ్వి.

లోపల ఏర్పాట్లు భారీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఎంతోమంది ప్రముఖులైన ఐఏఎస్ ,ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు కూడా ఉన్నారు అక్కడ.

నెమ్మదిగా అందర్నీ చూసుకుంటూ డయాస్ వైపు వెళ్తున్న పృథ్వి,” ఏయ్ హలో! నువ్వేంటి ఇక్కడ?” అన్న పలకరింపుతో ఆగిపోయాడు.

ఎదురుగా నందిని, తన క్లాస్మేట్ .అసలే అందమైనది, పైగా ఈ పార్టీ కోసం బాగా రెడీ అయి వచ్చిందనుకుంటా ఇంకా అందంగా మెరిసిపోతోంది.

“హలో నందినీ, నువ్వా, బాగున్నావా? గ్లాడ్ టు మీట్ యూ,” పలకరించాడు పృధ్వీ.

“ఆ బానే ఉన్నాను, ఫర్లేదే నా పేరు గుర్తుంది ఇంకా నీకు,” నవ్వింది నందిని.

ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు ఇబ్బందిగా నవ్వాడు పృథ్వి.

“సర్లే ఓకే ,ఆ అవని గారు నా హస్బెండ్ కి దగ్గర బంధువులు అందుకే వచ్చాను. పద మా ఆయన్ని పరిచయం చేస్తాను,” అంటూ ముందుకు కదిలింది నందిని.

“ఇతనే నేను చెప్పిన పృథ్వి, ఇతను నా భర్త మనోజ్,” ఇద్దరినీ పరిచయం చేసింది నందిని.

“ఓ!మీ కాలేజ్ హ్యాండ్సమ్ అనీ, నీతో సహా చాలామంది అమ్మాయిలు ట్రై చేసినా ఎవ్వరికీ ఓకే చెప్పలేదని చెప్పిన హీరో పృథ్వి ఇతనేనా?” నవ్వుతూ అడిగాడు మనోజ్.

“నువ్వు చెప్పింది నిజమే, ఇప్పటికీ హీరోలానే ఉన్నాడు,”మనోజ్ అంటుంటే మొహమాటంగా నవ్వాడు పృద్వి.

“ఓకే అయితే ,మీ ఇద్దరూ మీ కాలేజీ కబుర్లు చెప్పుకోండి. అమ్మయ్య థాంక్స్ బ్రదర్. నేను ఇప్పుడు ఫ్రీ.ఐ కెన్ ఎంజాయ్ ది పార్టీ,” అంటూ డ్రింక్స్ వైపు కదులుతున్న అవినాష్ ని చూస్తూ, “ఏయ్ ఎక్కువగా తాగకు, టేక్ కేర్ డియర్,” ప్రేమగా బెదిరిస్తున్న నందిని ని చూసి నవ్వుకున్నాడు పృద్వి.

నందిని పృథ్వి గురించి చెప్పిన మాటలు కొంతవరకు నిజమే. పృద్వి  చదువులోనే కాక ఆటపాటలన్నిటిలోనూ ముందుండేవాడు. అందగాడే కాక డబ్బున్న వాడు కూడా అవడంతో చాలామంది అమ్మాయిలు అతనికి దగ్గర అవ్వాలని ప్రయత్నించారు.

కానీ పృద్వి ఎందుచేతోఎవ్వరికీ  ఆ అవకాశం ఇవ్వలేదు.

అనురాగ్, అవని గార్లు ఇద్దరూ చాలా సందడిగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ, వాళ్ళ 25 సంవత్సరాల దాంపత్య జీవితం గురించి జోకులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉన్నారు.

వాళ్ల దగ్గరికి వెళ్లి తన తండ్రి పంపించిన కపుల్ రింగ్స్ ఇద్దరి చేత తొడిగించి ,తన తండ్రికి చూపించడం కోసం సాక్ష్యంగా ఒక ఫోటో దిగి పక్కకు వచ్చేసాడు పృథ్వి.

“హే పృథ్వీ, నీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ని పరిచయం చేస్తాను, రా,” అంటూ చెయ్యి పట్టి లాక్కుని వెళ్తున్న నందిని వెనకాల విసుగ్గా వెళ్ళాడు.

ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలా అని అతని ఆరాటం.

“హలో అనూ,ఇతనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానే, నీ లాగానే సొసైటీ, సేవా అంటూ ఉంటాడని, మై ఫ్రెండ్ పృథ్వీ,” టకటక చెబుతూ తన చెయ్యి కూడా తనే అనూ చేతికి ఇచ్చేస్తున్న నందిని వైపు కోపంగా చూసాడు పృథ్వీ

“హాయ్ అండీ, నైస్ టు మీట్ యూ,” అంటున్న వ్యక్తి వైపు అప్పుడు చూశాడు.

ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి చకితుడయ్యాడు.

అంత పెద్ద పార్టీలో చాలా సాధారణంగా డ్రస్ చేసుకొని ఉన్న ఆమె మొహం లో ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

చామన ఛాయ, సాధారణమైన ఎత్తు, అంతకన్నా చాలా సామాన్యమైన అందం ఆమెది. అంటే అందగత్తె కాదు కురూపి కాదు. కానీ, మొహంలో ఒక రకమైన ప్రశాంతత. కళ్ళనిండా ఆత్మవిశ్వాసం, చూడగానే గౌరవించాలనిపించే రూపం.

“నమస్తే అండీ,”అసంకల్పితంగా చెప్పాడు పృథ్వీ. “తను అనూష అని, మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. నీలాంటి వ్యక్తిత్వమే తనది కూడా. నువ్వు తండ్రి వ్యాపారం వద్దని సొంతంగా ఉద్యోగం చేస్తూ సమాజసేవ అంటూ తిరుగుతుంటావు కదా.

తను కూడా అంతే.తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు. తనని ఏ ఇంజనీరింగో చేసి సెటిల్ అవ్వమంటే, కాదని జర్నలిజంలో పీజీ చేసి సమాజసేవ అంటూ తిరుగుతుంటుంది.

పెద్ద ఛానెల్లో ఉద్యోగం వచ్చినా చేరలేదు. అక్కడ తను ఇష్టంగా, స్వతంత్రంగా పనిచేయడం కుదరదని తన ఉద్దేశం. ఏదో చిన్న ఛానెల్లో ఉద్యోగం చేస్తూ తన మనసుకు నచ్చినట్లుగా బ్రతుకుతుంది.

నీ ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది తన ప్రవర్తన. అందుకే నీకు ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్పాను,”

గుక్క తిప్పుకోకుండా చెప్పింది నందిని.

“ఇక పృథ్వి గురించి నీకు కొత్తగా చెప్పేదేమీ లేదు కదా! ఇదివరకే చాలాసార్లు చెప్పేశాను. కాకుంటే ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో నాకు పూర్తిగా ఐడియా లేదు,” అనూష కి చెప్పింది.

“ఎక్స్క్యూజ్మీ,” నందిని మాటలు కానీ, తనని కానీ పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూస్తూ,

“ఎంత పొగరు,”అనుకోకుండా ఉండలేకపోయాడు పృథ్వి.

 


 

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నొప్పింపక తానొవ్వక

గుణత్రయాంబిక