జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు .స్వేచ్ఛాయుతమైన స్వతంత్రమైన జీవితం వేరు. సాంప్రదాయ బద్ధమైన జీవితాన్ని గడుపుతూ వ్యక్తిత్వ నిర్మాణంతోపాటు లక్ష్య సాధన కొరకు కార్యాచరణకు పూనుకోవడం వేరు. అందులోనూ ఒక మహిళగా కాస్త కష్ట సాధ్యమే అని చెప్పాలి .
నీహారిణి గారి విషయంలో కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన ఐదు పదుల జీవితం లో కుటుంబ బాధ్యతవ ఒత్తిడి లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని మళ్ళీ చదువువైపు దృష్టి సారించి నాలుగు సంవత్సరాల పాటు శ్రమించి పరిశోధకురాలిగా పట్టా పొందారు. మనం మాట్లాడుకోవడానికి చిన్న విషయంగా కనిపించినా ఇది మహిళలందరికీ చాలా స్ఫూర్తి దాయకమైన విషయం.
సాహిత్య మూలాలు వారి పుట్టినింటి లోనూ మెట్టినింటి లోనూ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి నీహారిణి గారికి చిన్నతనం నుండి వారికి తెలియకుండానే రచనాసక్తి ఏర్పడి , పెద్ద అయ్యేనాటికి సహజంగానే పదునుదేలి తనతోపాటు సాహిత్యాభిలాష కూడా పెరుగుతూ వచ్చింది. సాహిత్య పఠానసక్తి , రచనా శక్తి తనదైన విధానం లో నిలుపుకున్నారు . ఇది అంత సులువు కాదు. నిరంతర కృషి, సాధన అవసరం. నీహారిణి గారు వీటిని స్వంతం చేసుకున్నారు.
****
సాహితీ ప్రపంచం ఒక సముద్రం లాంటిది. ఆ ప్రవాహ వేగానికి తట్టుకుని నిలబడి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాక యువ రచయిత్రులను ప్రోత్సహిస్తూ వారి రచనలకు వేదిక కల్పించి గైడ్ చేస్తూ తనతో సమాన స్థాయిలో గౌరవించడం చాలా గొప్ప విషయం.
వ్యక్తిత్వం:-
కొండపల్లి నీహారిణి గారి గురించి వినడమే కానీ వారిని ప్రత్యక్షంగా చూసిన పరిచయం నాకు అంతకుముందు లేదు. 2019 ఫిబ్రవరి 7న వారి రాచిప్ప కథల సంపుటి ,సృజనరంజని వ్యాసాలు పుస్తకాలు ఆవిష్కరణ సభ రవీంద్రభారతిలో జరిగింది. ఆ కార్యాక్రమానికి రావలసిందిగా నాకు నిహారిణి గారు ఫోన్ చేసారు.
అంతకు ముందే కలవాలనే కోరిక ఉన్నందున ఆహ్వానించిన వెంటనే వెళ్ళాను.కార్యాక్రమం మధ్యలో నన్ను పేరుతో పాటు చెప్పి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పారు.అలా చెప్పడం లోనే వారి ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రస్పుటమవుతుంది.
ఆ కార్యాక్రమానంతరం స్వయంగా నాకు వారి పుస్తకాలు బహుకరించి ఫోటో తీసుకోవడం మర్చిపోలేను.
ఆకార్యాక్రమంలో పిహెచ్ డి లో గైడ్ గా ఉన్న వెల్దండ నిత్యానంద రావు గారు పాల్గొన్నారు వారు నిహారిణి గారి కథలగురించి మాట్లాడుతూ కథల్లోని వాక్యనిర్మాణం గురించి విర్శించారు.ఆమాటకు ప్రతిస్పందన గా నాలుక కరుచుకుని చిరునవ్వు తి సరిదిద్దుకుంటానని చెప్పారే గాని ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించలేదు.
ఒకసారి ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు గారు తెలంగాణ రచయితల సంఘం తరపున హైదరాబాద్ బుక్ ఫేయిర్ లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో పాల్గొనడానికి ఆహ్వానించారు .ఆ కార్యాక్రమంలో నిహారిణి గారు కూడా పాల్గొన్నారు. వారు అంతకు ముందు రోజే ఇండియా వచ్చారు. కానీ కొత్తగా కవిత రాసుకుని వచ్చి చదవడం ఆమె తాను చేస్తున్న పని విషయం లో కనబరిచే శ్రద్ధ కనిపిస్తుంది.
ఎప్పుడైనా నేను రాసిన కవిత పేపర్లో కనిపిస్తే వారు ఇండియా లో ఉన్నా అమేరికా లో ఉన్నా ఆ కవితలోని పద నిర్మాణం గురించి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది.
ఇలా సాహిత్య సభల్లో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఎప్పుడు ఏ సాహిత్య కార్యక్రమంలో కలిసినా మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఒక కవిత గురించో… ఒక వ్యాసం గురించో.. మొదలై అందులోని లోటుపాట్లను చర్చించడం మెలుకువలు చెప్పుకోవడం ఇలాంటి మాటలతో సాగుతాయి .
అలాంటి వ్యక్తిని గురించి మాటల్లో కంటే కవిత రూపంలో చెప్పడం ఇంకా బాగుంటుంది.
**””””
ఆమె కలిసినప్పుడు..,
ఒక ఆత్మీయ సందర్శనం
జరిగిన అనుభూతి !
ఆమె చిరునవ్వు పెదాలపై నిత్యం నాట్యం చేస్తుది !
ఆమె స్పందన ఆత్మీయ
ఆలింగనం చేసినట్లు అక్కున చేర్చుకుని
ఒక పరిష్కారం కానుక గా ఇస్తుంది!
ఒక చల్లని స్నేహహస్తాన్ని చాచి నిలుస్తుంది!