‘ఘర్షణ‘కథల సంపుటి ఆవిష్కరణ సభా విశేషాలు

తెలంగాణ రచయితల సంఘం , పాలపిట్ట బుక్స్ సంయుక్త ఆధ్వర్యంలో, సుందరయ్య విజ్ఞాన కేంద్రం , బాగ్ లింగంపల్లి, హైదరాబాదులో 22-9-2023 న ఆవిష్కరించబడిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి రచన ‘ ఘర్షణ ‘ కథా సంపుటి ఆవిష్కరణ సభకు సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి గారు ముఖ్య అతిథిగానూ,ఈ పుస్తక ఆవిష్కర్తగానూ విచ్చేశారు . తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు , ప్రముఖ కవి శ్రీ కందుకూరి శ్రీరాములుగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీమతి మంత్రి శ్రీదేవి గారు విశిష్ట అతిథిగా, సృజన రంజని అంతర్జాల పత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు(సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా, సృజన రంజని అంతర్జాల పత్రిక సంపాదకులు)గారు గౌరవ అతిథిగా విచ్చేశారు.
ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవి డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు , ప్రముఖ రచయిత్రులు శ్రీమతి షీలా సుభద్రాదేవి గారు , నెల్లుట్ల రమాదేవి గారు , వాణి దేవులపల్లి గార్లు విచ్చేశారు.

శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు మాట్లాడుతూ నీహారిణి గారి కుటుంబానికి వీరి కుటుంబానికి మధ్య ఉన్న స్నేహాన్ని గురించి తెలిపారు . ఘర్షణ పుస్తకాన్ని గురించి మాట్లాడుతూ ఘర్షణ లేకుండా మనిషి జీవితం ఉండదని , తెలంగాణ ప్రాంత గ్రామీణ మాండలికంలో ఈ పుస్తక రచన జరిగిందని , ఘర్షణ లేకుండా మనిషి జీవితం ఉండదని ఈ కథలు ఋజువు చేస్తున్నాయి అనీ అన్నారు. కథకు జీవం పోసే లక్షణం రచయిత కుండాలంటారు . రచయిత లనేవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, దాన్ని అన్ని కోణాల నుండి చూసి విశ్లేషించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే రచయితగా మనగలరని , నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తే ఎప్పటికీ రచయిత కాలేరని చెప్తూనే ఈ స్పృహ తోనే నీహారిణి కథలను రాసినట్లున్నవనీ అన్నారు. లైంగిక విషయాలపై పిల్లలకు ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం అని, దానిపై వారికి అవగాహన కలిగే విధంగా మాతృమూర్తులు పిల్లలకు సహకారం అందించాలని , అలా ఉన్నప్పుడే పిల్లలు స్వీయ నియంత్రణపై అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంతో ఉన్న కథ ‘ ఘర్షణ‘ కథ అని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి . పసి పిల్లలపై లైంగిక నేరాలు ఎక్కువగా సమీప బంధువులు , ఇరుగుపొరుగు వారి వల్లనే జరుగుతున్నాయన్న విషయాన్ని మనం ఎక్కువగా పత్రికల్లో చదువుతూనే ఉంటాం. మనవారే కదా అన్న మితిమీరిన నమ్మకమే ఇటువంటి నేరాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణమని మానసికవేత్తలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు . ఇకపోతే వీరి ప్రసంగం ఎక్కువగా స్త్రీ శరీర ధర్మాలపై సాగింది. రచయితలనేవాళ్ళు ఏ విషయాన్ని గురించి మాట్లాడడానికైనా వెనుకాడరాదని ,ఒక సమస్యకు చక్కని పరిష్కారం అందించడానికి గాని, సమాజానికి ఒక సందేశాన్ని అందించడానికిగాని ముందుండాలనే ఆలోచన దీనికి కారణమై ఉండవచ్చు అని నా అభిప్రాయం. మాతృమూర్తి పై వీరు రాసిన ‘ తొలి గురువు ‘ అనే కవిత (అది నేను చదవకపోయినా) వారు చెప్పిన మాటల సారాంశాన్ని బట్టి చూస్తే పిల్లల పెంపకంపై తల్లి ఏ విధంగా స్పందించాలన్న విషయాన్ని వీ రు చక్కగా వివరించారు. ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ప్రతి మనిషి అందులో తన వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగిందా అన్న దిశగా ఆలోచించాలని, అది సమాజ హితానికి పునాది రాయి వంటిదన్న సందేశం నాకు స్ఫురించింది. కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులంతా ఆ తప్పును ఖండించగలిగినప్పుడు ఆ సమస్య గడప దాటి బయటకు రాకుండా ఆ ఇంట్లోనే పరిష్కరించబడుతుంది . సమాజంలో దౌర్జన్యాలు , అరాచకాలు జరగకుండా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ మూలస్తంభం అనే విషయాన్ని గుర్తించాలి. ఈ కవిత ద్వారా ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి అందించారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీమతి మంత్రి శ్రీదేవిగారు తమ ప్రసంగంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు . డాక్టర్ నందిని సిద్ధారెడ్డిగారు అమరవీరులపై రచించిన గీతాన్ని వీరు తమ గాత్ర సౌరభంతో పాడి వినిపించి అందరిని అలరించారు . ఒక్క చినుకు చాలు పుడమి పులకించడానికి ఒక ప్రశంస చాలు హృదయం వికసించడానికి అంటూ, ముసి ముసి నవ్వుల మాటల విషయం ఎరగని వ్యక్తి అంటూ ,
ప్రముఖ కవయిత్రి , రచయిత్రి, బహుళ పత్రిక సంపాదకురాలైన జ్వలిత గారిని వీరనారిలాగా కత్తి దూస్తారని,వీరూ ఈ సభకు రావడం ఎంతో బాగుంది అన్నారు. సభకు చాలా మంది కవులు, రచయిత లు రావడం ఒక పండుగ వాతావరణం లా ఉన్నదని, ఇలా పలు విధాలుగా పరిమళభరితమైన కవన కుసుమాలతో ప్రసంగానికి చక్కని మెరుపులద్దారు. వీరు నీహారిణి గారిపై రచించిన కవిత మొత్తం వారి ప్రస్థానాన్ని కళ్ళ ముందుంచింది. 1969 ఉద్యమకారులు శ్రీ శేషభూషణ్ రావు గారి (నల్లగొండ) కుమార్తెనని చెప్పారు . తండ్రిగారి నుండి వీరికి సంక్రమించిన సాహితీసుగంధా లు వీరిని చక్కని కవయిత్రిగా తీర్చిదిద్ది ఉండవచ్చు. ఏ సభల్లోనైనా మాట్లాడగలిగే ధైర్యము తనకు రావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచ్చిన ధైర్యమని, తనకు తెలుగు భాష పై పట్టు కలగడానికి, లోతుపాతులు తెలుసుకోవడానికి తనకు దేశానిర్దేశం చేసిన ఎంతోమంది ప్రముఖులకు మీరు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం.

కొండపల్లి నిహారిణి గారి బంధువు, ప్రముఖ కవయిత్రి అయిన శ్రీమతి వాణి దేవులపల్లిగారి ప్రసంగం ఎక్కువగా నిహారిణి గారి కుటుంబంతో ఉన్న అనుబంధంపై , నిహారిణిగారికి వీరికి మధ్య ఉన్న చిన్ననాటిస్నేహం పై ఎక్కువగా కొనసాగింది .తమ రెండు కుటుంబాలు సాహితీ నేపథ్యం ఉన్నవే కావడం వల్ల తమ మధ్య ఉన్న స్నేహం మరింతగా బలపడిందని అంటారు .

స్త్రీలు విభిన్న రంగాలలో పురోగమించడానికి కుటుంబంలోని పురుషులు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని , అవి లేకుండా ఏ స్త్రీ కూడా ముందడుగు వేయలేదని కృతజ్ఞతలు తెలపడం , మంచిని ఆహ్వానించాలని, నిజాన్ని నిజాయితీగా అంగీకరించాలన్న ఒక చక్కని సందేశాన్ని సమాజానికి అందించినట్లుగా గ్రహించాలి. సభలోని రచయిత్రులు అందరూ తమకంటే వయసులో చాలా పెద్దవారైన షీలా సుభద్రాదేవికి పాదాభివందనం అనడం నేను ప్రత్యేకంగా గమనించాను. రచయిత లనేవారు ఎప్పుడైనా ఒక నమూనాగా ఉండాలనే సూచనను అందించినట్లుగా గ్రహించాలి.

షీలా సుభద్రాదేవిగారు మాట్లాడుతూ 1911 వ సంవత్సరంలో నీహారిణి గారిని ఒక సభలో చూడడం జరిగిందని , రచయితలనేవా రు తన చుట్టూ జరిగే విషయాలకు తన సొంత కల్పనను జోడించి రచనలు చేయాలని అంటారు. తాను ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తినని, కానీ తన రచనలు తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా చేశానని, ఘర్షణ కథా సంపుటి తెలంగాణ మండలిక సొబగులతో కూడుకొని ఉందని , రచయిత్రి కథలోని చర్చల్లో తన అభిప్రాయాలను పాఠకులను మెప్పించే విధంగా వ్యక్తపరచడం చాలా అభినందించే విషయమన్నారు.

ప్రముఖ అంతర్జాల పత్రిక సృజన రంజని సంపాదకులైన తాటిపాముల మృత్యుంజయుడు గారు మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలోని వారికి ఐటీ ఫలాలు అందగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమైనట్లని , ప్రభుత్వం ఆ దిశగా యువతను ప్రోత్సహించాలని ఒక చక్కని సూచన చేశారు .వీరు తమ ప్రసంగంలో ‘ స్వేచ్చాపంజరం ‘ , ‘ప్రయాణంలో పదనిసలు’ అనే కథల గురించి ప్రస్తావించారు.

కాళోజి పాత్రధారైన అశోక్ రెడ్డి గారి పరిచయం చాలా ఆనందాన్ని కలిగించింది.

రచయిత్రి తండ్రిగారైన శ్రీ రాఘవరావు గారిపై పోటీ చేశారని, ఆ పోటీలో రాఘవరావుగారు అత్యధిక మెజారిటీతో గెలిచారని చెబుతూ ఉండగా రచయిత్రిని ఉద్దేశించి”మీ నాన్నను నేను గెలిపించాను” అంటూ చక్కని చలోక్తి విసిరి సభలో నవ్వులు పూయించడం ముచ్చట గొలిపింది . తన ప్రత్యర్థి(వారిప్పుడు సజీవంగా లేకపోయినప్పటికీ ) కూతురి కార్యక్రమానికి రావడం, అందరినీ నవ్వుల్లో ముంచెత్తడం, రచయిత్రి గారిని తన కూతురు అంటూ చెప్పడం వారిపై గౌరవభావం ఏర్పడే విధంగా చేసింది.

కూర చిదంబరం గారు తమ అభినందనలు తెలిపి రచయిత్రి దంపతులను సన్మానించడం , దేవేంద్రాచారిగారు సమాజ హితానికి తన వంతు కర్తవ్యంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించడం అభినందించదగిన విషయం.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ కందుకూరి శ్రీరాములుగారు సోమవారం కవి సమ్మేళనం గురించి, దానికి నిహారిణిగారు అందిస్తున్న సహాయ సహకారాల గురించి చక్కగా వివరించారు.

ప్రముఖ కవి మరియు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథి అయిన డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు సోమవారం కవి సమ్మేళనంపై , కవి సమ్మేళనానికి వీరు అందిస్తున్న సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, కుటుంబ వాతావరణంలో ఆప్యాయతానురాగాలతో నడిచే ఈ కార్యక్రమంలో వీరి సూచనలు మార్గదర్శకాలని చెప్పారు . ఇక ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడుతూ మానవీయ కోణంలో ముఖ్యంగా వృద్ధులు, స్త్రీలు , బలహీనపక్షాల తరఫున నిలబడి ఈ పుస్తకాన్ని రచించారని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు పుస్తక ఆవిష్కర్త అయిన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డిగారు మాట్లాడుతూ నిహారిణి గారు గ్రామీణ జీవితం , పట్టణ జీవితం , పాశ్చాత్య జీవితం మూడు రకాలైన జీవన విధానాల్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి అని , రెండు ఉన్నత కుటుంబాలలోని విశిష్టమైన వ్యక్తులు ( తండ్రిగారు , మామగారు) విజయదుందుభి మోగించడానికి కారకులని, వీరి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు వెలకట్టలేనివని, కుటుంబ నేపథ్యం అనేది వ్యక్తి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే అంశం అని చెప్పారు.
కథ సంపుటిలోని ప్రతి కథ, ప్రతి పాత్ర ఘర్షణతో కూడుకున్నవే అయినప్పటికీ , ఒక చక్కని పరిష్కారాన్ని చూపించారని, రచయితలనేవారు సమస్యకు ఒక పరిష్కారం చూపించే విధంగా రచనలు చేయాలని అన్నారు.
వీరి ప్రసంగం కూడా ఎక్కువగా స్త్రీ శరీర ధర్మాలపై సాగింది. దీనికి ఉదాహరణగా వారు తమ కుటుంబంలో జరిగిన ఒక విషయాన్ని వివరిస్తూ, దానికి పరిష్కారం ఒక పురోహితుడి ద్వారా దొరికిందంటూ చెప్పారు. శాస్త్రపు లోతులు తెలిసిన వ్యక్తి(ఇక్కడ పురోహితుడు) సమాజానికి చక్కని దిశానిర్దేశకుడు అయి ఉండాలన్న విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. సాంకేతిక పరికరాలు వినియోగం గురించి మాట్లాడుతూ వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే హాని ఉంటుందని వాటిని ఏ విధంగా వినియోగించాలన్న విషయంలో మనిషి విజ్ఞతను ప్రదర్శించాలని చెప్పారు . మనిషికి ఎన్ని హంగులు , ఆర్భాటాలు ఉన్నప్పటికీ కూడా పంచుకోవడానికి మనుషులు ఉండాలంటూ వీరరాఘవమ్మ పాత్రను ఉద్దేశించి చెప్పారు. ఇందులో రచయిత్రిలోని తెలివితేటలు మాత్రమే కాకుండా, ఒక చక్కని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం వారు పడుతున్న ఉబలాటాన్ని , ఆ దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలు అభినందించదగినవన్నారు.

ఇక రచయిత్రి గారు మాట్లాడుతూ వేదిక నలంకరించిన సాహితీ వేత్తలను అభినందిస్తూ , మయూఖ అంతర్జాల పత్రికలో లేఖాసాహిత్యంపై సీతాలక్ష్మి గారి ‘ అలనాటి లేఖా సాహిత్యం‘ పై వ్యాసాలు చాలా విజ్ఞానదాయకంగా ఉన్నాయని , ప్రతి ఒక్కరు వాటిని చదవాలని సూచించారు. తరుణి పత్రికలోని కవయిత్రులను ,రచయిత్రులను మరియు సభకు విచ్చేసిన ఎంతో మంది ప్రముఖులను పేరుపేరునా పరిచయం చేయడం , తమ కుటుంబాల్లోని వ్యక్తులను పరిచయం చేయడమే కాకుండా , వారు తన రచనా వ్యాసంగానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారో, తనను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో తెలియజేయడం, వారి జీవిత భాగస్వామి సహకారం వారికి ఎంతగా ఉందో చెప్పడం, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపడం వారిలోని మంచితనానికి నిదర్శనం .
అహోబిలం ప్రభాకర్ గారు తాము చిత్రించిన వర్ణ చిత్రాన్ని ఈ ‘ఘర్షణ‘ కథల పుస్తకానికి చక్కని ముఖ చిత్రంగా అందించారు . నక్కా హరికృష్ణగారు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు.

సభకు విచ్చేసిన ప్రముఖులకు మరియు వివిధ కవులు , రచయితలు అందరికీ పేరుపేరునా వందనాలు సమర్పించుకుంటూ , అందరిని ప్రత్యక్షంగా చూడగలిగిన అవకాశాన్ని కలిగించిన నీహారిణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ , ప్రతి ఒక్కరూ చదవ వలసిన అవసరం ఉందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను..

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

మార్పు దిశగా