సులోచనాంతరంగం

కథ

రంగరాజు ప్రసాద్

సులోచన అటు ఇటూ పచార్లు చేస్తున్నది చిరాకుగా… గేటు వైపు చూస్తున్నది- మళ్లీ ఇంట్లోకి వస్తున్నది- మళ్లీ గేటు వైపు చూస్తున్నది. భర్త కోసమో? కన్నవారి కోసమో కానేకాదు… పనిలో సహాయపడేందుకు వచ్చే పని అమ్మాయి కోసం! సులోచనకు ఫక్కున నవ్వొచ్చింది… ఇంత చిన్న అగ్గిపెట్టెంత ఉన్న ఇంటిలో పనికోసం పనిమనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటే నవ్వొస్తున్నది…
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎంత పని చేసే వాళ్లం అందరం!… అరవై సంవత్సరాల క్రింది ఆలోచనలోకి జారుకుంది సులోచన! గతం గుర్తుకు వస్తే వర్తమానం మర్చిపోవడమే !
” తన పుట్టిల్లు ఎంత విశాలంగా ఉండేదో? చతుర్శాల భవంతి, నాలుగు మన సాలలు, నాలుగు అఱ్ఱలు, ముందు బంకులు, ఇంటి వెనుక వైపు వంట ఇల్లు, భోజనాలు చేసే పెద్ద హాలు, దేవుని గది, దాని పక్కనే చాయ సాయబాన, ఆ పక్కనే దాలి అఱ్ఱ [ దాలి అంటే పాలు కాచే పిడకలతో మండే పొయ్యి] ఈ దాలి అఱ్ఱలోనే మజ్జిగ చిలికే వారు. మడి బట్టలు ఉతికి ఆ పక్కనే ఆరవేసే వారు.
పల్లెటూరి అందాలే వేరు. ఆ పల్లెల్లో కూడా మా ఊరు ఇంకా అందంగా ఉండేది. అంత పూర్వకాలంలో కూడా.. ఒక పద్ధతి ప్రకారం.. మా నియోగుల ఇళ్లన్నీ ఒక పక్కనే, ఏ కులవృత్తులకు వారి వారికి ఓకే వాడలో అందంగా నిర్మించిన ఊరది.
ఇండ్లన్నీ కలిసి ఉండటంతో పని చేసేవాళ్లు చక్కగా పేడతో చానుపి చల్లితే, పిల్లలందరూ రోజూ ఈ కొన నుండి ఆ కొన వరకు పోటి పెట్టుకొని పెద్దపెద్ద ముగ్గులు వేసేవాళ్ళం.
ప్రతి శుక్రవారం ఇళ్లన్నీ ఎర్రమట్టితో అలుకు పెట్టితే… చీపురు పుల్లలు కట్ట కట్టి ఒక బ్రష్ వలెచేసి, సున్నంలో కానీ, బియ్యం రుబ్బిన పిండిలో కానీ ముంచి” టక్కుటక్కున” డిజైన్ వలె ముగ్గు వేసే వాళ్ళం.
తీనెలకు (బార్డర్) తెల్లటి గోడమీద ఎర్రటి ముగ్గులు మేమే కాదు, మా అన్నయ్య కూడా వేసేవాడు. అంత పెద్ద ఇంట్లో ముగ్గులు పెట్టేసరికి మాకు నడుంనొప్పి పెట్టేది. దేవుడి పాత్రలు కూడా మేమే తోమే వాళ్ళం.
మధ్యాహ్నం నౌకర్లు అడవి నుండి మోదుగు ఆకులు కోసుకొని తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. మేమందరం భోజనాలు విస్తర్లలోనే చేసేవాళ్ళం. దాదాపు రోజూ వంద విస్తర్లు అవసరమయ్యేవి. అందరం కలిసి కుట్టేవాళ్లం. మా అన్నయ్య విస్తర్లు కుట్టడంలో బహు నేర్పరి. కొన్ని మోదుగు ఆకులు సుతలి తాడుతో తోరణాల వలె కుచ్చి, ఆకులు దొరకని సమయంలో ఉపయోగపడేలా జాగ్రత్తగా దాచి పెట్టే వాళ్ళం.
రోజూ పచ్చని విస్తరిలో ముద్దపప్పు, వేడివేడి అన్నం, అరచేతి నిండానెయ్యి, ఆవకాయ, పెరుగుతో భోజనం చేస్తే పండగ నాడు పంచభక్ష్య పరమాన్నాలు తిన్నంత తృప్తిగా , సంతోషంగా ఉండేది. కూరగాయలు దొరకకపోయినా చక్కని ఆరోగ్యంతో ఉండేవాళ్ళం. అప్పుడు ఎక్కువగా టిఫిన్లు లేకపోయేవి. ఉప్పుడు పిండి, తప్యాల చెక్క, వేపుడు బియ్యం, కారప్పూస, చక్కిలాలు లాంటివి ఉండేవి.
కూరగాయలలో ఆలుగడ్డ, క్యారెట్, టమాటాలు ఇంట్లో నిషేధం! ఉల్లి, వెల్లుల్లి కూడా తినక పోయేవారు. చాయలు -కాఫీలు ఉండక పోయేవి. చిన్న పిల్లలం పాలు తాగే వాళ్ళం. మా ఇంట్లో కొందరు బస్తీ నుండి వచ్చిన కోడళ్ళకు కాఫీ తాగే అలవాటు ఉండేది. నీళ్ళు కాచే గదిలో పెద్దవాళ్లకు చాటుగా కాఫీ చేసుకొని తాగే వారు. రోజూ ఇరవై మందికి స్నానాలకు నీళ్లు కట్టెల పొయ్యి మీద, ఇత్తడి కొప్పెరతో కాగబెట్టే వాళ్ళు.
మా ఊళ్లో ఏ ఇంట్లోనూ తాగేందుకు తీయటి మంచి నీళ్ళు ఉండేవి కావు. అన్నీ ఉప్పునీటి బావులే ఉండేవి. అందుకే తాగేందుకు మంచినీళ్లు వాగు నుండి తెచ్చుకునే వాళ్ళం. మా ఊర్లో ఊరినానుకొని రెండు వాగులు ఉన్నాయి. దయ్యాల వాగొకటి, పెద్ద వాగొకటి. దయ్యాల వాగు అంటే ఊర్లో ఎవరైనా చనిపోతే వారిని ఆ వాగు చుట్టుపక్కల దహనం చేయడం, లేదా పాతిపెట్టడం చేసి, ఆ వాగులో స్నానాలు చేసి వచ్చేవారట. అందుకని ఆ చనిపోయిన వారు దెయ్యాలు అవుతారని ఒక మూఢనమ్మకం. ఆ వాగు నుండి నీళ్ళు తెచ్చుకోక పోయే వాళ్ళం. దెయ్యాల వాగు దాటి పెద్ద వాగుకు పోయి మంచినీళ్లు తెచ్చుకోవాలి.
అందరి ఇళ్లల్లోని ఆడపిల్లలు బిందెలు తోమడానికి చింతపండు బిందెలో వేసుకొని, మేము రోజు వారీ తొడుక్కునే తెల్లటి రవికలు ఉతికేందుకు బట్టల సబ్బు, రవికలువెంట తీసుకొని వెళ్లి, నింపాదిగా ముచ్చట్లు చెప్పుకుంటూ.. బట్టలు ఉతికి, బిందెలు తోముకుని, మంచినీళ్లు నింపుకుని ఒడ్డున కూర్చునేవాళ్ళం. మా వదిన, మా చిన్నాయన గారి భార్య చిన్నమ్మ ఇద్దరూ చక్కగా పాటలు పాడేవాళ్ళు. వాళ్ళిద్దరికేమో పాటలు పాడుకోవాలని సరదా ఉండేది. కానీ ఇంట్లో తాతయ్య ఏమిటా? పాటలు పాడడం, ఈ కూనీరాగాలేమిటి? ఇదేమన్నా భోగం వారి మేళమా? అని కోప్పడేవారు. ఆ కాలంలో ఆట పాటలు ఒక భోగం కులం వారే పాడుతారని తాతయ్య ఉద్దేశ్యం! మా పాటలు పాడి, వినాలనే కోరికను అలా వాగు ఒడ్డున, మంచినీళ్లు తెచ్చే నెపంతో తీర్చుకునే వాళ్ళం! పెద్దవాళ్ళకు మడితో మంచినీళ్లు వంటస్వామి తెచ్చేవాడు. యాభై మంది ఉన్న ఇంట్లో ఎన్ని నీళ్లు తెచ్చినా సరిపోకపోయేవి. ముచ్చట్లు పెట్టుకునేందుకు వాగు మాకు ఒక అడ్డా!
వచ్చేటప్పుడు తల మీద బిందె! ఆ బిందె మీద మరో ,చిన్న బిందె… రెండు చేతులలో రెండు చెంబులు మంచినీళ్లు పట్టుకుని, జారుతున్నపొలాల గట్ల మీద నుండి నడిచి వచ్చే వాళ్ళం, జారి పడేవాళ్ళం. వర్షాకాలంలో పెద్ద వాగు నుండి వచ్చే తోవలో దెయ్యాల వాగు మోకాళ్ళ లోతు నీళ్లలో నుండి చీరలు, కొంగులు పైకి చెక్కుకుని నడిచి వచ్చే వాళ్ళం. అయినా భయం లేకపోయేది. ఆ నీళ్ళలో ఈత కొట్టే వాళ్ళం. ఆడుకునే వాళ్ళం.
మా అన్నయ్య వారపత్రికలు పోస్టులో తెప్పించేవాడు. మా ఊళ్లో పోస్ట్ ఆఫీస్ లేదు. పక్క ఊర్లో ఉండేది. ఆ పత్రికలు ఎప్పుడో రెండు మూడు రోజులకు వచ్చేవి. రోజూ వాటికోసంఎదురు చూసే వాళ్ళం.
ఆ పత్రికలో లోని కథలు చదువురాని వాళ్లకోసం, చదవడానికి తీరికలేని వాళ్ల కోసం వాగులో బిందెలను తోముతూ, చెప్పుకునే వాళ్ళం. ఒకళ్ళు చదువుతే అందరూ వినే వాళ్ళు. ఆ రచనల మీద వ్యాఖ్యానాలు చేసేవారు. అలా సరదాగా గడిచిపోయేది.
మా మేనత్త, మా అన్నయ్య, అక్కయ్యలు, వదిన అందరం కూర్చుని రామాయణ, భారత, భాగవత కథలు, పద్యాలు చెబుతూ, వినేవాళ్ళం!
పల్లెటూరు కావడంతో ఏ ఇతర వ్యాపకాలు, సినిమాలు లేక మాకు పుస్తకాలే పెద్ద కాలక్షేపం. కాసేపు ఆటలు కూడా ఆడేవాళ్ళం. రెండు పెద్ద పెద్ద తాటి చాపలు పరచుకొని, ఎనిమిది మంది – నలుగురు ఒకవైపు, మరో నలుగురు మరోవైపు జట్లుగా కూర్చొని పచ్చీసు ఆడేవాళ్ళం. పచ్చీసు ఆడినంతసేపు గొడవలే గొడవలు.. నా కాయ చంపేశారని ఒకరు, దొంగ పందెం పెట్టారని ఒకళ్ళు, దూగ పడితే దస్ పడిందని అన్నారని మరొకరు, తొండి పందెం వేశారని గోలగోలగా ఉండేది. కచ్చకాయలు ఆడేవాళ్ళం. ఆ కచ్చకాయలు మా ఇంట్లో తయారు చేసే వాళ్ళం. వాగులో తెల్లటి పలుగురాళ్ళు ఏరుకొని తెచ్చి, రోటిలో ఊకతో కలిపి నూరితే… గుండ్రంగా కచ్చకాయలు తయారయ్యేవి.
మా అన్నయ్య మాతోపాటు ఆటలు ఆడే వాడు, బతకమ్మను కూడా చక్కగా అందంగా పేర్చేవాడు.
పండగల అయితే మా ఇంట్లో ఒక వైభవమే! ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మా తాతయ్య మమ్మల్ని వరుసలో నిలబెట్టి భాగవతంలోని కృష్ణ జననకాల ఘట్టం చాలా శ్రావ్యంగా తాను పాడుతూ.. మా చేత పాడించేవాడు. ” స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును” అని ” పాడిరి గంధర్వోత్తములు… ఆడిరి” అనీ; చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనీ పాడేవారం ; కృష్ణుడి మీద పద్యాలు పిల్లలందరికీ కంఠోపాఠమే ఎవరికైనా రాకపోతేనో, చదవకపోతేనో గుడ్లురిమి చూసేవాడు మాతాతయ్య.
కృష్ణాష్టమి రోజు పెద్ద పెద్ద స్తంభాలకు ఉట్లుకట్టి; అందులో పెరుగు పాలు మీగడ ముంతలో పోసికట్టే వారు.కట్టెతో కొట్టే వాళ్లకు అందకుండా తాడు పైపైకి లాగేవారు.. అదొక సరదా ఆట. కృష్ణజనన సందర్భంలో సంతోషాలే…సంతోషాలు…
రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేసి, అర్ఘ్య పాత్ర ఆచమనలిచ్చి, పాయసం చిక్కుడు ఆకుల్లో నివేదన చేసి, ఆదిత్య పారాయణం చేసే వారు. ఏ పండగకు ఆ పండుగ విధి విధానంగా జరగవలసిందే!
ఉగాది పండుగ రోజు ఇల్లంతా శుభ్రం చేసి, మామిడి ఆకుతోరణాలు కట్టి, పచ్చడి, నైవేద్యం పెట్టి, భక్ష్యాలు మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడితో పండగ భోజనం బహు పసందుగా ఉండేది. ఆడపిల్లలతో ఇల్లంతా కళకళలాడేది.
దసరాకు అల్లుళ్ళు వచ్చేవారు. మొక్కజొన్న కంకులతో పాటు చెట్టు కాండలతో తెచ్చి కట్ట కట్టి గడలు కట్టేవారు. కాణిగిరి బడి ( ప్రైవేటు బడి) పంతులు ముందు నడుస్తూ, పిల్లలందరూ ఇద్దరిద్దరు జట్లుగా ..” అయ్యవారికి చాలు ఐదు వరహాలు! పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు” అంటూ చేతులలో కట్టెలకు రంగురంగుల కాగితాలు జెండాల వలే అతికించి, అవి పట్టుకుని బడిపంతులు గారి వెంట ఇల్లిల్లూ తిరిగే వాళ్లం! ఇంటియజమానులు అయ్యవారికి డబ్బులు ఇచ్చే వాళ్ళు.
దీపావళి పండుగ తెల్లవారుజామునే, దేవుడికి హారతిచ్చి, ఇంట్లోని మగవారికి కూడా హారతిచ్చి, మంగళ స్నానం కొరకు మాడకు నూనె రాసేవాళ్ళు.
నౌకర్లు చింత చెట్టు బెరడు, సోరుప్పు దంచి పలుచటి బట్టలో మూట కట్టి, తంగేడు పంగలకర్ర మధ్య ఈ మూటను నారతో కట్టి “దుందువలు” తయారు చేసేవాళ్ళు. ఆ మూట మీద బండి ఇరుసులకు వాడే ఆయిలు పోసి అంటించేవాడు. అవి ఇప్పటి మతాబాల వలె, కాకరపువ్వొత్తులు వలె చిటపట మంటూ వెలిగేవి.
నౌకరు చిన్న వాళ్లందరినీ తన చుట్టూ నిలబెట్టుకొని, కట్టె పుల్లలతో చేసిన “కోలలు” తిప్పుతూ తమాషాగా పాటలు పాడేవాడు. ఈ ప్రక్రియ దృష్టి దోషం తీసేందుకు.
కార్తీక పౌర్ణమి రోజుకు ఒక రోజు ముందే కుమ్మరి ఒక పెద్ద గంప నిండా మట్టి ప్రమిదలు తెచ్చేవాడు. ఇంట్లో ఉన్న పెద్దలంతా ఒక నెల ముందు నుండే పత్తితో వత్తులు చేసేవారు. ఆముదం లేక నువ్వుల నూనె సిద్దెలలో నింపి, ఒత్తులు అందులో నానబెట్టి, మట్టి ప్రమిదలలో వేసి, ఇంటి చుట్టూ, బంగ్లామీద, తులసి కోట ముందు వెలిగించి, నువ్వులు -బెల్లం, జామ కాయ ముక్కలు రాముల వారికి నైవేద్యం పెట్టి, దీపాల దగ్గర కూడా నివేదన చేసి, ఆ బాట వెంట పోయేవారికి “జీడికంటీ రాములోరి ప్రసాదం” తినండి – రాముడి దీవెనలు పొందండి… అంటూ పాటలు పాడుతూ ప్రసాదం పంచిపెట్టేవారు. [ దీన్ని పంచ గజ్జాయం] అంటారు.
సంక్రాంతికి అయితే నెల రోజుల ముందు నుండే పండగ హడావుడి ప్రారంభమయ్యేది. మార్గళి నోము నోచడం, తెల్లవారు ఝామునే గోదాదేవి రచించి, గానం చేసిన ” తిరుప్పావై” గానం చేయడం, కోవెలకి వెళ్లడం, అక్కడ కూడా పాశుర అనుసంధానం చేసి, భక్తులందరి తో కలిసి, గోష్ఠి నిర్వహించుకొని, వేడివేడిగా పొంగలి ప్రసాదం తీసుకొని ఇల్లు చేరడంలో చలిని కానీ, మంచు వానను కానీ లెక్కచేయక పోయే వాళ్ళం! ఇక సంక్రాంతికి అయితే వాకిలి నిండా ముగ్గులు, బంతి పూల దండలు కుచ్చడం, ఫలశ్రుతి రోజు “బుడబుడపళ్ళు” ( భోగి పళ్ళు) పోయడం, నోములు నోచుకొని, వాయనాలు ఇచ్చుకోవడం, గోదా కళ్యాణం చూడడానికి వెళ్లడం ఇలా ఎన్నెన్నో వేడుకలు…
ఈ పండుగకు చక్కిలాలు, అరిశలు, నువ్వుల లడ్డూలు స్వయంగా పిండి రోకళ్ళతో దంచుకొని, ఒకరి ఇంట్లో మరొకరు సాయంగా చక్కిలాలు అల్లడానికి వెళ్ళేవారు. అలా అలసట లేకుండా ఎన్ని అప్పాలైనా సునాయాసంగా చేసే వాళ్ళు.
కార్తీక మాసంలో “కొత్త ” పెట్టే వాళ్ళు . అదొక హడావిడీ !ఎలా అంటే రోళ్ళు, రోకళ్ళు కడిగి, కుందెనలతో సహా అన్నింటికి సున్నం ,జాజుతో అలంకరణ చేసి రోట్లో కొత్త వడ్లు పోసి పాటలు పాడుతూ దంచే వాళ్ళు.

పాట:— యెంకటేసుడవయ్యా- వెన్నుడా వయ్యా!
ఎట్లు నెరిసితివయ్యా? ఈ గట్లా నడుమా!
ఆహూం !! ఆహూం!! ఆహూం!!

గట్టుల్లూ కావయ్యా – కనకసిరి మేడల్లూ!
మేడల్లు కావయ్యా – మేరు నగపు కొండల్లూ!!
ఆహూం !! ఆహూం!! ఆహూం!!
అని పాడుకుంటూ కొత్త ఒడ్లు దంచి పాయసం చేసి అందరికీ ప్రసాదంగా ఇచ్చే వాళ్ళు. కొత్తగా పండించిన ధాన్యం మీద వారికున్న గౌరవమది!
ఆడ మగ అందరు శ్రమించేవారు. బావి నుండి నీళ్ళు చేదడం, పసుపు కారం దంచడం, పిండ్లు విసరడం మొదలైనవి చేసేవాళ్ళు.
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు ముద్దగా నూరి, నువ్వులు ముద్దగా నూరి అందరికీ ఒంటికి పట్టించి, మంగళ స్నానం చేయించే వారు. అందుకే శరీరాలు నిగనిగలాడేవి. మా పిల్లలందరికీ తలకు నూనె మర్దనా చేస్తే మా నాయనమ్మ తలలో పొగలు తేలేవి, గంగాళం నిండా నీళ్ళతో తల స్నానం చేయించేది. ఇలా ప్రతి వారం ఇంతమందికి ఓపికగా… అంతేకాదు మా మేనత్తలు వచ్చినా అందరికీ ఇలాగే చేయించేవారు. పండగలకి మా మేనత్తలు ఎడ్లబండ్లతో వస్తే వాకిటి నిండా బండ్లు ఉండేవి.
ఇంటి ముందు గంగాళంలో నీళ్లు, చెంబు ఉండేది. రాగానే కాళ్ళకు నీళ్ళిచ్చేవారు. ఆ సమిష్టి కుటుంబం వైభవమే వేరు.
లోపలికి వచ్చిన వారిని మంచి తీర్థం కావాలా? చల్ల తీర్థము కావాలా? అని అడిగి, చల్ల తీర్థం అంటే మజ్జిగ, ఏది అడిగితే అది ఇచ్చేవారు. అప్పుడు చాయ్ లు కాఫీలు లేవు. మర్యాద మన్ననలు మెండు. పెద్దలకు దండాలు పెట్టేవారు.
కుల మత భేదాలు పట్టింపులు ఉండక పోయేవి. మా ఇంటి దగ్గర వైదిక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో రాంబాయమ్మ గారని ఒక వైదిక బ్రాహ్మణ వృద్ధురాలు ఉండేది. మేము బొడ్డెమ్మ ఆట కోసం రుద్రాక్ష పూలకోసం వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. ఆమె మమ్మల్ని ఇంట్లోకి రానివ్వక పోయేది. రుద్రాక్ష పూల దండలు దీపం చెమ్మె చుట్టూ పెట్టి ఉంచేది. మేము ఇంటివెనకకు వెళ్ళగానే…

రాంబాయమ్మ:– అస్సే! ఎవరషే? అనేది బిగ్గరగ ( అంటే ఎవరే పిల్లా అన్నట్టు!) మేము అమ్మమ్మా! అని మేము అనగానే…
రాంబాయమ్మ:– అష్లాగషే! యేమిషే? ( అలాగా! ఏమిటి? ఎందుకు వచ్చారు?) అని లోపలికి తొంగి చూసి కోడలితో
” విస్సా వఝ్ఝుల వారి బుజ్జినష” ఆ విస్సాయి కిస్సారషే? ( వఝ్ఝుల వారింటి మనుమరాలు వచ్చిందే) అని కోడలికి చెప్పేది.
“యెంత వర్చష్షే” పిల్లదానికి?( ఈ పిల్ల ఎంత అందంగా ఉందో!)
“ఒషేష్” అల్లా వెళ్ళకు! ” ఆ పక్కన గావంఛా ఆర వేశాను”. తాకకూ ( నా మడిబట్ట ఆర వేశాను.. ముట్టుకోకు) అని కోడలు వైపు చూసి,
” అది ఎండింధంఛావా? లేదంఛావా? ( ఎండిందా? లేదా?)
” ఒసే ! చెముడషే? చూస్తివషే? ( నీకేమైనా చెవుడా? విన్నావా? చూసావా?)
ఇలా సాగేది సంభాషణ!
మేము ఆమె మాటలు వినడానికీ, ఆమె కట్టిన రుద్రాక్ష పూలదండను దొంగిలించడానికి వెళ్ళేవాళ్ళం! ఆమెను ఎవరో పిలుస్తున్నారని చెప్పి ఇంటి ముందుకు ఆమెను పంపించి, ఇంటి వెనక ఉన్న ఎలక్కాయలు, రుద్రాక్షపూలు దొంగతనంగా తెచ్చుకునే వాళ్ళం! అదో సరదా!
బ్రాహ్మణ అన్నమ్మ నాయనమ్మ ఇంట్లో ఎన్నో నోములు నోచుకునే వారు. తులసి ముందు చిలుకు నోము, కన్నె నోము, సంజెనోము నోచుకోని, పసుపు కుంకుమలు వాయనాలు ఇచ్చేది.
నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి, పుట్టమన్ను, నువ్వుల ముద్ద, చలిమిడి ముద్ద ప్రసాదంగా ఇచ్చేది. అన్నమ్మ నాయనమ్మ, ఆమె కోడలు చక్కగా పాటలు పాడేవారు. మా ఇంటికి కూడావచ్చి పసుపు బొట్టు తీసుకొని వెళ్ళే వారు.
జీవితాలు ఇలా ఒక క్రమపద్ధతిలో సాగేవి ఇంటి పెద్దలు ఎలా పాటిస్తే ఆచార వ్యవహారాలు అలాగే సాగేవి. ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేనేలేవు. వర్ణానికి సంబంధించి, వంశానికి సంబంధించి, ఇంటికి సంబంధించి, పూర్వం నుండి ఇంట్లో ఎలా పాటిస్తే అలా పాటించడం, వంశానుసారంగా పెళ్లిళ్లు ప్రయోజనాలు, ఊరి పడి కట్టుగా పాటించేవారు. ఇవేవో కట్టడి వలెనో, నిర్భందం వలెనో కాదు… ఆపేక్ష, ఆప్యాయతలు , ఆత్మీయతలతోనే కొనసాగించేవారు. ఋతువుల ప్రకారం ఆహారాలు నైవేద్యంగా సమర్పించి తినడం వల్ల ఆరోగ్యంగా, పూర్ణ ఆయుష్షులుగా జీవించారు. భోజనానికి ముందు వైశ్వానరము పాటించే వాళ్ళు. ఔపోసన పట్టే భోజనం చేసేవారు.
ఇంట్లో గేదలు ఈని కొత్త దూడలను కంటే ఆదో సరదా!! జున్ను పాలు అందరిఇళ్ళలో ఇచ్చి రావడం, ఇంట్లో జున్ను కాయడం, కృష్ణునికి నైవేద్యం పెట్టడం.. అందరం ఆ జున్ను పాలు తాగడం! జున్నుపాల పండుగను ఎంతో సంబరంగా చేసుకునే వాళ్ళం. మా! బాల్యం బంగారు బాల్యం!
ఆ పుట్టిన లేత దూడలకు ” వెన్న ముద్దాకు” ఏరుకొనితెచ్చి దూడలకు తినిపించే వాళ్ళం!
మాకు పండ్ల తోటలు ఉండేవి. మామిడి, సీతాఫలాలు పుష్కలంగా వచ్చేవి. అల్ల నేరేడు చెట్టు ఉండేది. జామపండ్లు పుష్కళం.
ఇక మా చదువుల గురించి అయితే మరీ విడ్డూరం? చెక్క పలక, చాలా పెద్దగా ఉండేది. దానికో తాడు, మధ్యమధ్యన బొగ్గు- కాకరాకు దంచి ఆ చెక్కకు పూసే వాళ్ళం. దానిమీద రాయడానికి రాతి బలపం ( పాల రాయి) మేము పోగొడతామని దాన్ని కూడా తాడుతో చెక్కకు కట్టి ఉంచే వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ చెక్క పలక చాలా బరువు ఉండేది.
చదవని వాళ్లను పంతులుగారు కోదండం ఎక్కిరించేవారు.( కోదండం అంటే కాళ్లకు తాడుకట్టి తలకిందులుగా దూలానికి వేలాడదీయడం) గోడకుర్చీ వేయించేవారు, బిస్కీలు తీయించేవారు.
(బిస్కీ అంటే కుడిచేతితో ఎడమచెవి- ఎడమచేతితో కుడిచెవి పట్టుకొని, కూర్చుంటూ లేస్తూ లెక్కపెడుతూ ఉండాలి) ఆడపిల్లలు చదువకుంటే శిక్ష ఏమిటంటే ఇసుక మీద వేలుతో అక్షరాలు దిద్దాలి. సాయంత్రానికల్లా వేలు వాచిపోయేది. పంతులు చేతిలో ఒక పేంబెత్తం ఉండేది. దాంతో కొట్టేవాడు.
బడికి వెళ్ళేటప్పుడు చంకలో ఒక తాటి చాప, చేతిలో చెక్క పలక తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే బడిలో నేల మట్టితో ఉండేది. సిమెంట్ గచ్చు ఉండకపోయేది. వర్షం పడితే చెక్కపలకే గొడుగయ్యేది.
ఇలా పాత జ్ఞాపకాలలో పడి, పనిమనిషి రాక కోసం చూస్తున్న సులోచన! “అమ్మగారూ! ఏంటండీ? ఎందుకలా కూర్చున్నారు? ఏమైంది?” అని అడిగేసరికి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన సులోచన “బాగానే ఉన్నాను! మా చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం వచ్చి అలా కూర్చుండిపోయాను అంతే!” అంటూ గబగబా ఇల్లు తుడిచేయ్ అయ్యగారి పూజకు వేళయింది … అంటూ లోపలికి వెళ్ళింది సులోచన!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈ లోకం

అమ్మ