దొరసాని

ధారావాహికం – 2వ భాగం

లక్ష్మీమదన్

ప్రయాణం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి… పిండి వంటలు స్వీట్లు పచ్చళ్ళు రకరకాల పొడులు ఇలా అన్ని ప్యాకింగ్ చేయడం జరిగిపోయింది… అమ్మాయి పెళ్లి అయిన నెలకే అల్లుడితోపాటు అమెరికాకు వెళ్ళిపోయింది అందువల్ల తన పట్టు చీరలు నగలు అన్ని ఇక్కడే వదిలేసింది అమ్మాయి కోరిక మేరకు కొన్ని సూట్ కేసులో సర్దుకుంది…

తను సర్దుకోవాల్సిన బట్టలు అసలు అర్థం కావడం లేదు నీలాంబరి ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది నేను ఎలాంటి బట్టలు కట్టుకోవాలి ఇలా ఆలోచిస్తూ రోజూ వారి చీరలు ఒక సూటు కేసులో ఖరీదైన చీరలు నగలు మరో సూట్ కేసులో పెట్టుకుంది… అక్కడ మందులు దొరకవు కాబట్టి కావలసిన మందులు కూడా టౌన్ నుండి తెప్పించుకొని ప్యాక్ చేయించుకుంది… ఇక్కడ ఉంటే ఆమందుల అవసరం ఇప్పటివరకు పడలేదు కానీ ఏమో కొత్త ప్రదేశం ఎలా ఉంటుందో! ఇలా అనుకొని అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.

” మహేశ్వరి ఓ మహేశ్వరి ఒకసారి ఇలారా” నీలాంబరి.

” దొరసాని వచ్చేస్తున్న” క్షణంలో ప్రత్యక్షమైంది మహేశ్వరి.

” ఈ సూట్ కేసులు వస్తువులు అన్నీ కింద గదిలో పెట్టించు మళ్ళీ వెళ్లే ముందు రోజు ఒకసారి లెక్క చూసుకోవాలి అలాగే బరువు చూసే యంత్రం కూడా అదే గదిలో పెట్టించు” అని చెప్పింది..

“అక్కడికి వెళ్లిన తర్వాత నాకు కుంకుడుకాయలతో తల స్నానం కుదురుతుందో లేదో అందుకని కుంకుడుకాయ పులుసు బాత్రూం లో పెట్టి కాస్త నా తల అంటి.. నాకు తల స్నానం చేయడంలో సహాయం చెయ్యి” అని చెప్పింది నీలాంబరి.

నీలాంబరి ఎప్పుడు కుంకుడుకాయలతోనే తల స్నానం చేస్తుంది ఎక్కువగా రసాయనం పదార్థాలు ఉన్న వస్తువులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితోనే తాను తృప్తి పడుతుంది. ఒంటికి కూడా ఎప్పుడు సున్నిపిండి మాత్రమే వాడుతుంది అది కూడా ఇంట్లో తయారు చేసినదే… పెసర్లు బియ్యము బావంచలు గంద కచ్చురాలు వేసి చక్కగా ఇంట్లో విసిరిన పదార్థాలతో తను స్నానం చేస్తుంది… తల స్నానం చేశాక సాంబ్రాణి వేయించుకోవడం మానదు… ఇలా తనకు ఉన్న అలవాట్లు మరోచోట కుదురుతుందో లేదో అన్న భయం కూడా ఉంది.

దొరవారు బయట పనులు మానుకొని ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు ఎందుకంటే నీలాంబరి వెళితే ఎన్ని నెలలకు వస్తుందొ తెలియదు.. ఆమెని విడిచి ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండలేదు ఆ బాధ ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది… కానీ” అమెరికా సంబంధం చేసిన తర్వాత తప్పదు కదా అమెరికా సంబంధాల వేటలో పరుగులు తీసి ఎంత తప్పు చేసామో ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకున్నారు” భూపతి.
” కొడుకు అయినా విదేశాలకు వెళ్లకుండా ఉంటే చాలు నాకు కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది వ్యవసాయం పనులు ఊరి పనులు ఎన్నో ఉన్నాయి జమీందారీ తనము పోయిన కూడా ఊరు వాళ్ళందరూ కలిసి తనని సర్పంచ్ గా గెలిపించి ఊరు బాగోగులు చూసుకోమని చెప్తున్నారు.. వారు అంత గౌరవంతో అడిగితే కాదని ఎలా అనగలం అని ఊరికి కావలసిన సౌకర్యాలు అన్నీ చేయించాడు… రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్న ఊరికి రోడ్డు వేయించడం మంచినీళ్లు.. హాస్పిటల్స్ ఇంకా స్కూలు అన్నింటిని ఊర్లో ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పట్టణం పోవాల్సిన అవసరమే లేదు అందుకే ఇప్పటికీ దొరతనం పోయిన ఊరి ప్రజలు దొరగానే కొలుస్తున్నారు… ఇలా ఆలోచిస్తున్న భూపతి కొడుకు వచ్చి నిలబడింది చూడనే లేదు…

” నాన్నా! ఏమో ఆలోచిస్తున్నారు చాలాసార్లు పిలిచాను” అన్నాడు నీలాంబరి భూపతిల కొడుకు సాగర్.

” ఏమీ లేదురా అమ్మ అమెరికా వెళుతుంది కదా ఇన్ని రోజులు మనకు ఎలాగా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు భూపతి…

” నాన్న నేను ఆ విషయం మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చాను.. నాకు కూడా అమెరికాలో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది మరొక 15 రోజుల్లో వెళ్లాల్సి వస్తుంది” అన్నాడు సాగర్..

” అదేంట్రా నువ్వు అప్లై చేసింది కూడా మాకు తెలియదు అమ్మకు తెలిస్తే తట్టుకోగలదా ఇటు అక్క ఇటు నువ్వు ఇద్దరు వెళ్ళిపోతే మేము ఎలా ఉండగలం” అన్నాడు భూపతి.

” మంచి అవకాశం నాన్న వదులుకుంటే చాలా కష్టం అమ్మకు మీరే ఎలాగైనా నచ్చి చెప్పండి.. నా దగ్గరికి కూడా వచ్చి ఉండండి నేను కూడా వస్తూ ఉంటాను” అని చెప్పాడు ఆ నిర్ణయం స్థిరమైనది అని అర్థమవుతూనే ఉంది ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదని కూడా తెలిసిపోయింది అందుకే భూపతి ఏమి మాట్లాడకుండా తన కళ్ళలో తిరిగిన నీటిని కనపడకుండా మొహం తిప్పుకొని..

” సరే నేను అమ్మతో మాట్లాడుతాను” అని అన్నాడు.

” థాంక్యూ నాన్న” అని నాన్నని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సాగర్.

బయటకు వచ్చిన నీలాంబరి…

” సాగర్ ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు ఏ విషయం గురించి?” అని అడిగింది. ఆమె ముఖంలో ఎప్పటిలా ఉన్న చిరునవ్వు మాయమైపోయింది ఎందుకంటే కూతురు దగ్గరికి వెళుతున్నాను అని ఆనందం కన్నా ఇల్లు వదిలి బయటకు వెళ్తున్నాను అనే బాధనే ఎక్కువగా ఉంది…

” సాగర్ కూడా అమెరికా వెళ్తానంటున్నాడు అక్కడ జాబ్ కు అప్లై చేసుకున్నాడట 15 రోజుల్లో జాయిన్ కావాలట” అని చెప్పాడు.

ఆ విషయం ముందుగానే పసిగట్టిన నీలాంబరి ఏమాత్రం తొట్రు పడకుండా ” అవునా సరే వెళ్ళనీయండి వాళ్ళ భవిష్యత్తుకు మనం ఎందుకు ఆటంకం కావాలి?” అన్నది నీలంబరి.

” అదేంటి నువ్వు చాలా బాధపడతావని నేను భయపడుతున్నాను ఇంత మామూలుగా ఈ విషయం తీసుకుంటావని నేను ఊహించలేదు”అన్నాడు భూపతి.

తను బాధపడితే భర్త ఇంకా బాధపడతాడని గ్రహించిన నీలాంబరి తన బాధను మనసులోని అణిచివేసుకుని మీదికి నవ్వుతూ అతనికి ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

” సాగర్ మరి నీ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకో అక్క వాళ్ళ దగ్గరికి నీకు ఎంత దూరం ఉంటుందో తెలుసుకుని నాకు చెప్పు వీలైతే నీ దగ్గరికి కూడా వచ్చి వెళ్తాను” అన్నది నీలాంబరి.

ఒక్కసారిగా ఆశ్చర్య పోవడం సాగర్ వంతు అయింది అమ్మ ఇంత తొందరగా ఒప్పుకుంటుందని అతను అనుకోలేదు…

” అమ్మా! అమ్మా! నువ్వేనా ఇలా అంటుంది నిజమా ఇంత సంతోషంగా నన్ను పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా థాంక్యు థాంక్యు వెరీ మచ్” అని అమ్మను హత్తుకున్నాడు సాగర్.

చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది నీలాంబరి.

ఇంత తొందరగా ఒప్పుకోవడానికి కారణం నీలాంబరికి తెలుసు ఎందుకంటే… నీలాంబరి పదవ తరగతి వరకు స్కూల్ కి వెళ్ళింది చాలా చురుగ్గా ఉండే అమ్మాయి కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత జమీందారీ ఇళ్లలో స్కూలు పంపడం కుదరదు కదా అందుకని పదవ తరగతి పరీక్షలు రాయగానే స్కూలు మానేసి ఇంట్లోనే చదువుకుంది. ముగ్గురు టీచర్స్ వచ్చి అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు అందుకనే తనకు తెలుగు ఇంగ్లీషు రాయడం చదవడం బాగా వచ్చు దూరవిద్య ద్వారా పరీక్షలు రాసిన నీలాంబరి తెలుగులో పీజీ కూడా చేసింది. ఇప్పుడు పిల్లలకు అవకాశాలు వస్తుంటే నేను ఎందుకు అడ్డు తగలాలి వాళ్ళ దూరంగా వెళ్లిపోవడం బాధాకరమే కానీ వద్దు అని చెప్పి నిష్ఠూరం కావడమే తప్ప వాళ్ళు మన మాట ఎలాగూ వినరు నిర్ణయం తీసుకొని మనకు చెప్పారు అంటే మనము సరే అని మాత్రమే అనాలి అని అర్థం చేసుకుంది నీలాంబరి…

తను వెళ్లవలసిన రోజు రానే వచ్చింది లగేజ్ అంతా రెండు కార్లలో సర్దేసి ఎయిర్పోర్ట్ కు బయలుదే రారు భూపతి నీలంబరి సాగర్…

ఊర్లో ఉంటే ఎప్పుడూ భారీ చీరలు కట్టుకునే నీలాంబరి ఇప్పుడు లైట్ గా ఉండే లెమన్ ఎల్లో కలర్ జార్జెట్ చీర కట్టుకొని చేతులకు కొంచెం గాజులు తగ్గించి మెడలో సింపుల్ గా ఉండే నగలు మాత్రమే వేసుకొని తన పెద్ద జడను కొప్పుగా బిగించి చాలా సామాన్యంగా తయారయింది ఎవరైనా చూసినా కూడా నీలాంబరి ఊళ్లో ఉన్నాయి దొరసానిలా లేదు అనుకుంటారు.. ఈ అలంకరణలో కూడా ఆమె అందం మెరిసిపోతుంది… ఎయిర్పోర్ట్ దగ్గరికి దాదాపు చేరుకున్నారు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన ప్రకృతి- ఆహారం, The Nature

ఈ లోకం