సమకాలీన తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న రచయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు.
కవితా సంపుటాలు, వ్యాస సంపుటాలు, జీవితచరిత్రలు, యాత్రా సాహిత్యం, కథా సంపుటాలు ఇలా ఈ రచయిత్రి తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో తనదైన ముద్ర వేశారు.
‘ఘర్షణ’ కథల సంపుటి ప్రముఖ తెలుగు రచయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి కలం నుంచి జాలువారిన గొప్ప సాహిత్య నిధి. ఆకర్షణీయమైన ఈ సంపుటి మానవ జీవిత వాస్తవికతను లోతుగా విశ్లేషించింది. వివిధ జీవన వైరుధ్యాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రచయిత్రికి మనిషి మీద ఉన్న ప్రేమ, మానవత్వం మీద తపన స్పష్టంగా కనిపించింది.
మారుమూల పల్లె జీవితం నుంచి మొదలుపెట్టి, పెద్ద నగరాలు, విదేశాలు, ప్రాంతం ఏదైనా మనుషులంతా ఒకటే. మంచితనం అనే సుగంధం మనలో నింపుకుంటే మన చుట్టూ సమాజంలో ఎంతో అందాన్ని, ఆనందాన్ని తిలకించవచ్చు అని రచయిత్రి చెబుతున్నట్లు అనిపించింది ఈ కథల ద్వారా.
నీహారిణి గారి ప్రతి కథలో స్త్రీల సమస్యలు వారి మనోవేదన అంతర్లీనంగా చర్చించబడ్డాయి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలపై ఆవిడకు ఉన్న అపారమైన జ్ఞానం కట్టిపడేస్తుంది.
‘ ఘర్షణ ‘అనే పేరుతో వెలువరించబడిన ఈ సంపుటిలో 19 కథలు ఉన్నాయి. దేనికదే ఒక వైవిధ్యమైన ఇతివృత్తం కలిగి ఉంది. ప్రతి కథలోనూ చర్చించబడిన అంశాలు నిత్యజీవితంలో అందరికీ ఉపయోగకరమైనవే. తెలంగాణలోని నిర్మలమైన గ్రామ జీవితం నుంచి గజిబిజి అయిన నగర జీవితం వరకు మానవ జీవిత సార్వత్రిక ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ నిహారిణి గారి కథనాలు విభిన్న ప్రకృతి దృశ్యాలలో ప్రయాణిస్తాయి.
ఈ సంకలనానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వివిధ పాత్రలు వాటి స్థాయిని బట్టి ప్రదర్శించే పోరాటపటిమ. నిత్యజీవిత సంఘర్షణలో ఆ పాత్రలు చూపించిన పరిణతి మనకు మార్గదర్శకత్వం చేస్తుంది.
ఒక ప్రత్యేకమైన కథ ‘ఘర్షణ’లో నేటి ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ్యతను రచయిత్రి చెప్పిన తీరు అద్భుతం. ఆడపిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా తమ చుట్టూ ఉండే తమ కుటుంబ సభ్యులు, లేదా పరిచయస్తుల వల్ల ఎదుర్కొనే లైంగిక వేధింపులను తెలుసుకోవడానికి వారికి మంచి, చెడు స్పర్శ గురించి, ఎదుటి వారి ప్రవర్తనలో తేడాల గురించి కనీస జ్ఞానాన్ని ఈయవలసిన ఆవశ్యకతను ఈ కథలో రచయిత్రి చక్కగా చెప్పారు.
తీరం చేరని కెరటం కథలో ఒక స్త్రీ భార్యగా, ఇంటి కోడలిగా, తల్లిగా వివిధ పాత్రలు ఎంత సమర్ధవంతంగా పోషిస్తుందో ఆవిడ జీవించి ఉన్న సమయంలో గుర్తించలేకపోయిన భర్త, ఆమె మరణంతో తానెంత కోల్పయాడో, ఆమె లేని బ్రతుకు ఎంత బాధాకరమో తల్చుకుని కుమిలిపోయే భర్త పాత్ర మన చుట్టూ సమాజంలో ఉండే ఎంతో మంది మగవారికి ప్రతీక లా అనిపించింది.
తొక్కులాట కథలో మగవారిచే మోసగింపబడి, అభాగ్యులై, కొన్ని సందర్భాల్లో పిచ్చివారిగా కూడా మారిపోయినా, అటువంటి స్రీల పట్ల కూడా జాలి చూపని ఈ లోకపు కర్కశత్వం భయపెడుతుంది.
ఈ కథలు చదివేటప్పుడు ఒక రచయిత్రి (రచయిత) యొక్క సామాజిక బాధ్యత ప్రస్ఫుటంగా ప్రతి కథలో తొంగి చూసినట్లు అనిపించింది.
అలసిన ఊసులు ,దండన కథలలో ఈ భూమిపై నువ్వు చేసిన పాపాలకు శిక్ష ఇక్కడే దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం ఇక్కడే చేసుకోవాలి అనే రచయిత్రి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేం.
మమత విరిసిన వేళ, పాలాల్ల, నువ్వు అట్లా అన్నావని, కథలలో రచయిత్రి స్త్రీవాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథలు విభిన్న కోణాల్లో స్త్రీ సమస్యల్ని ,వాటికి సమాధానాల్ని సూచిస్తున్నట్లు ఉన్నాయి. స్మహిళల సమస్యల్ని మరో మహిళ మాత్రమే పూర్తిగా అర్థం చేసుకుని దానిని పరిష్కరించడానికి అవసరమైన తెగింపు చూపగలదు అనే విషయం పాలాల్ల కథలో సత్తెమ్మ పాత్ర ద్వారా స్త్రీ లోకానికి మార్గదర్శకం చేయించారు రచయిత్రి.
ఇలా దాదాపు అన్ని కథల్లో కూడా మనకు ఏదో ఒక రూపంలో జీవితపాఠాలు రంగరించి రాసిన నీహారిణి గారికి జోహార్ చెప్పకుండా ఉండలేం.
తెలుగు భాషపై, ప్రత్యేకించి మనదైన సొబగులున్న తెలంగాణ యాసపై నిహారిణి గారికి ఉన్న పట్టు ప్రతి వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి కథలో ఏదో ఒక సందర్భంలో రచయిత్రి తన భావాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించడం చాలా బాగుంది. సంభాషణల కన్నా నెరేషన్ లేదా చర్చ పద్ధతిలోనే ఎక్కువగా కథలు సాగడం వల్ల ఇది చాలా సులువుగా చేయగలిగారు రచయిత్రి.
అన్ని కథలు చాలా బాగున్నప్పటికీ ‘కొత్తచూపు’ అనే కథలో స్త్రీలు బహిష్టు సమయంలో విడిగా కూర్చోవడం అనే సాంప్రదాయం కనీసం ఆ సమయంలో వారికి కావలసిన విశ్రాంతి ఇస్తుంది కనుక మంచిదే అని రచయిత్రి ఒక పాత్ర చేత చెప్పించడం కొంత ప్రశ్నార్ధకంగా అనిపిస్తుంది. నీహారిణి గారు చెప్పినట్లు ఆ మూడు రోజులలో స్త్రీకి విశ్రాంతి అవసరం అనేది నిజం. ఐతే ఈనాడు స్త్రీపురుషులిద్దరూ ఆర్థిక పరమైన సమానత్వం సాధిస్తున్నారు కనుక అప్పుడు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం తీసుకోవలసిన ఆవశ్యకత ఇంకా స్పష్టంగా చర్చించవలసిన అంశం అని నా అభిప్రాయం.
మెజారిటీ కథలు చాలా బాగున్నాయి.పాత బతుకులు – కొత్త పాఠాలు కథలో వివిధ కారణాల వల్ల మనుషులు ఒంటరి జీవితం అనుభవించవలసి రావడం ఎంత బాధాకరమో చెప్పారు నీహారిణి గారు. పాతకాలపు ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా కనీసం అత్తమామలతో సఖ్యతగా ఉండే అవసరాన్ని అందులోని ఆనందాన్ని ఈ కథలో స్పష్టం చేశారు.
సెల్ ఫోన్ (టెక్నాలజీ) యువతను పెడదోవ పట్టించడం పై రాసిన కథ ఎర్రజీరలు. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వారితో తల్లిదండ్రులు కఠినంగా ఉండవలసిన అవసరం తెలియజేసారు ఈ కథలో రచయిత్రి.
అమెరికాలో మన వారి జీవన శైలిని కూడా నీహారిణి గారు ఎంతో అద్భుతంగా చిత్రించారు. ప్రయాణంలో పదనిసలు, ఆకాశం అంచుల్లో కథలలో ఏ దేశం, ఏ ప్రాంతం అనేది కాక మంచి, చెడు అనేవి మనుషులను బట్టి ఉంటుంది అని స్పష్టం చేశారు ఆవిడ.
ఇప్పటికే తెలుగు సాహిత్యంలో మంచి కవయిత్రిగా, విమర్శకురాలిగా, రచయిత్రిగా ఎన్నో కితాబులు అందుకున్న డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి ఘర్షణ కథా సంపుటి తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి మరియు ఆలోచింపచేసే కథలను మెచ్చుకునే ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ లైబ్రరీలో తప్పక చేర్చవలసిన ఒక పుస్తకంగా నేను దీనిని భావిస్తున్నాను.
భారతీయ, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ జీవన సౌందర్యం, స్త్రీ జీవితంలోని వివిధ ఘర్షణలు ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన సుసంపన్నమైన కథనాలతో, నైపుణ్యంతో కూడిన కథనంతో నీహారిణి గారు వెలువరించిన ‘ఘర్షణ’ కథా సంపుటి తెలుగు సాహిత్యం పాఠకుల ఆత్మలను స్పృశిస్తుంది అనే నమ్మకాన్ని మరింత బలపరిచింది.
(ఓ సారి చూడండి అంతే .. వాట్సప్ గ్రూప్ సౌజన్యంతో..)