పచ్చని పచ్చిక బయలును చూస్తే మనసంతా ఏదో ప్రశాంతతకు లోనౌతుంది . విశాలమైన ఆకాశాన్ని చూస్తే అద్భుత ధైర్యం ఏదో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎగిరే పక్షి, పరిగెత్తే నది , స్థిరమైన కొండ ఎన్నో ఆలోచనలకు గురి చేస్తుంటాయి. వీచే చల్లని గాలి, చిక్కని అమావాస్య చీకటి,చక్కని మాఘమాసపు వెన్నెల మనుషుల కు అన్నీ అవసరమే.
జీవితము సర్వకళ సమాహారం. సంతోషాలు, దుఃఖాలు,కష్టసుఖాలు అనుబంధాలు వైరాగ్యాలు అన్నీ కలగల్సి ఉంటాయి. ఈ అన్నింటి కీ కారణాలుంటాయి. ఇవన్నీ స్త్రీల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో, స్త్రీల ఔన్నత్యానికి తోడ్పడుతున్నాయా, స్త్రీల ను అధఃపాతాళానికి తోసేందుకు ప్రేరకాలు అవుతున్నాయా గమనించడమే స్త్రీవాదం. దీంట్లో సమాజం పాత్ర ఎంత ఉంది? పురుషుల పాత్ర ఎంత ఉంది? తోటి స్త్రీల పాత్ర ఎంత ఉంది అనేవి కూడా లెక్కలోకి తీసుకోవాలి. తిండి నిద్ర కూడు గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలు స్త్రీలకు సమాన ప్రతిపత్తితో అందుతున్నాయా? స్త్రీల శ్రమ శక్తికి మూల్యం సమాన నిష్పత్తిలో అందుతున్నాయా శ్రమ దోపిడీ ఎంత అవుతుంది అనే విషయాలను చర్చలోకి తీసుకువచ్చి చైతన్యవంతులను చేయాలి.
ఎన్ని ఆకర్షణ లు! ఎన్ని ఆంక్షలు! వీటితోపాటు అస్తిత్వాన్ని కాలరాసే పితృ స్వామ్య పరిస్థితులు.ఈ దుఃఖ తంత్రులను తెగ్గోసేయాలి.ఈ అన్యాయాలను తుడిచేయాలి. ఒక్కసారి గా బాధలన్నీ తుడిచిపెట్టుకుపోతాయా? పోవు. అసలు ఈ అణచివేత లు ఆమె కు అర్థం కూడా కావు అటువంటి స్త్రీ లెందరో సమాజం లో ఉన్నారు.ఇవన్నీ వెలికితీసి, పరిష్కారం సూచించేందుకే , మహిళలకోసం ఉద్యమించారు.శ్రామిక వర్గం కోసం ముందుకు వచ్చిన మహిళా దినోత్సవానికి క్రమంగా అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం జరిగింది.ఇక వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సమస్యల్ని పరిష్కరించడానికి పూనుకున్నారు.హక్కులు అందేలా కృషి చేశారు.
ఇటువంటి సామాజిక అవగాహన పేదా గొప్ప అనే తేడా లేకుండా అందరూ కలిగి ఉండాలి.కొంతైనా సాంస్కృతిక చైతన్యం కలిగి ఉండాలి. How to read life? జీవితాలను చదవాలి అనే జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారు? కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులు వ్యక్తిగత జీవితం పైనా, సామూహిక జీవనం పైనా ఎంతో ప్రభావాన్ని చూపుతారు.
1 దేశం కోసం 2. సమాజం కోసం 3. కుటుంబం కోసం స్త్రీ ల ఆలోచనలు సాగాలి. కుటుంబం అనగానే వ్యక్తిగత జీవితం ముందుకు వస్తుంది.
ఈ అన్ని బాధ్యతలు చేపట్టినా స్వీయ చైతన్యం గురించి పట్టించుకోరు.ఇక్కడే కావాల్సిన నష్టం జరుగుతుంది. అంతేకాదు అలా కష్టనష్టాలకు,అవమానాలకూ గురైన స్త్రీ లు తమ చుట్టూ ఉన్న సమాజానికి పరోక్షంగా,వాళ్ళకు తెలియకుండా నే నష్టం చేస్తారు అసలే పురుషాధిక్యత లో మ్రగ్గిన వాళ్ళు కాబట్టి ప్రతీకారాన్ని తీర్చుకోలేక,అంటే ఆమె తండ్రి, భర్త,సోదరుల వంటి బంధాల ద్వారా కలిగే ఆధిపత్యాన్ని తన తోటి స్త్రీలైన అత్త, కోడలు, ఆడపడుచులు వంటి బంధువుల పై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టి లోలోపల రగిలే జ్వాల ను చాలా చల్లార్చుకుంటారు.
ఇది ఓ అసంకల్పిత చర్యగా అభివర్ణించాల్సిన అవస్థ. దీనికి రెండు వైపులా నష్ట పోయేది స్త్రీ లే! ఇది పసిగట్టి బయటపడాలి స్త్రీ లు.ఈ చైతన్యాన్ని తీసుకువచ్చేందుకే మహిళా దినోత్సవం ఉపయోగపడాలి.
ఆడవాళ్ళు ఆడవాళ్ళని ద్వేషించడం మాని, తోటి స్త్రీల ఉన్నతికి పాటుపడాలి.అప్పుడే March 8th Women’s Day ఉద్దేశ్యం నెరవేరుతుంది.ఇది ఇంతవరకే పరిమితమై రాస్తున్నది.
____***___