చంద్రయాన్ -3 ఓ విజయ యాత్ర

26-8-2023 తరుణి పత్రిక సంపాదకీయం

విశ్వంతరాళాలలో ఎన్నో వింతలు అద్భుతాలు. కోటానుకోట్ల నక్షత్రాలు ఐతేనేమి, లెక్కలేనన్ని గ్రహాలైతేనేమి, ఎన్నెన్నో అంతరిక్ష సముదాయాలైతేనేమి విశ్వం లో కనిపిస్తాయన్న జ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్నది మానవ చరిత్ర. వీటితోపాటు తోకచుక్కలు ఉంటాయని కనుగొన్న శాస్త్రీయత ఇది. ఈ విజ్ఞాన తేజస్సు అంతా ఆకాశంలోని వింతలను అందిపుచ్చుకుంటున్న శాస్త్రజ్ఞుల కృషికి ఎప్పుడైనా అభినందనలు తెలియజేయాల్సిందే. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వంటి ఎన్నో ఎన్నో బలాలు చాలా రూపాలలో విశ్వంలో ఉంటాయని తెలుసుకున్నారు. అంతరిక్షంలో ఉన్న వివిధ పదార్థాలకు మూలకణాలు ఉంటాయని వాటిని పరమాణువులు అంటారని ఇవి అన్ని గొప్ప శక్తులను కలిగి ఉంటాయని తెలుసుకున్నారు. కేంద్రక శక్తి,గురుత్వాకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, ఇతరములైన అనంతశక్తులు కలిగి ఉంటాయని తెలుసుకున్నారు. పాలపుంతలు అని సౌర మండలం అని గెలాక్సీలు అని కాలబిలాలు అని నెబ్యులాలు అని ఇలా ఎన్నో పేర్లను పెట్టుకున్న శాస్త్రవేత్తల విజ్ఞానానికి జోహార్లు అర్పించవలసిందే! శక్తి వివిధ పదార్థాల రూపాలైతేననేమి గతి అను గతి భౌతిక నియమాలు అయితే నేమి, ప్రతి అణువులోని కణాలలో ఊహించలేనంత శక్తి కలిగి ఉంటుందని అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్న శాస్త్రజ్ఞులు ఏ దేశస్తులైనా సరే ఎవరికివారు గొప్పవాళ్ళే. అయితే భారతదేశానికి అద్భుతమైన చరిత్ర ఉన్నది,ఈ శాస్త్ర విషయంలో అని ప్రపంచంలోని దేశాలు అన్ని ఒప్పుకుంటున్నాయి.

అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహగతులు ఉంటాయని పరిశీలించినప్పుడు వాటి చలనాలను అంచనా వేసినప్పుడు
ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు ఇంకా బహిర్గతం అవుతూనే ఉన్నాయి. అయితే “చంద్రయాన్- 3” “Chandrayaan -3 ” విజయవంతమైన ఈ సందర్భంగా మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి పరిశీలించుకోవడం అవసరం. శాస్త్రజ్ఞుల బుద్ధి కుశలత వల్ల ఈ సక్సెస్ సాధ్యమైంది. చంద్రుని ఉపరితలం మీద చంద్రయాన్ ద్వారా యంత్రాన్ని దింపగలిగారు. దీని ద్వారా చంద్రుని పైనున్న విలువైన సమాచారం సేకరించే
పని ప్రారంభమవుతుంది చంద్రుని పైన వాతావరణం ఎలా ఉంది ?నీరు ఉన్నదా? ఉంటే ఏ మేరకు ఉన్నది ,ఆ మట్టి లోపల లోహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఈ పరిశోధన సాగుతుంది. ఈ యంత్రం సేకరించిన విషయాలను వెంట వెంటనే భూమి మీద ఉన్న ఇస్రో శాస్త్రజ్ఞులకు పంపిస్తూ ఉంటుంది .దీని ద్వారా శాస్త్రీయంగా అన్నీ కనుక్కుంటారు. ఇది భవిష్యత్తులో జరగబోయేవి.
అయితే, ఎన్ని రకాల ప్రశ్నలు ఎన్ని రకాల చర్చలు ఎన్ని రకాలు తర్కవి తర్కాలు బయలుదేరాయో ఈ విషయం పైన. ఒకటి అంత ఖర్చు పెట్టి ఇది కనుక్కోవడం అవసరమా అని ఓ వాదన. చంద్రుణ్ణి గ్రహమనీ,ఆ గ్రహం ప్రభావం మనుషుల మీద పడుతుందని మభ్యపెట్టినట్టుగా ఎద్దేవా చేస్తూ వచ్చే ఒక వాదన. చంద్రుని దేవుడు అంటారు ఇదేంటి అని ఒక విమర్శ. అన్ని మతాల వాళ్ళూ చంద్రుని గురించి మూఢవిశ్వాసంతో ఉన్నారు అని ఒక మాట. ఇంతే కాకుండా ఎంత శాస్త్రీయ పరిజ్ఞానం వచ్చినా సామాజిక కోణంలో ఏ మార్పు రాలేదు అని మరో విమర్శ.
అందరికీ చేతిలో ఫోన్ కావాలి. అందరికీ ఇంట్లో టీవీ మోగాలి. అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోగలగాలి, డ్రా చేసుకోవాలి అదీ ఇంట్లోనే కూర్చుని మరీను!
ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయమైనా మన ఇంటి ముందు వాకిట్లో వాలిపోవాల్సిందే ఆధునికత అనేది ఆడుకుంటూ వెనకాల పరిగెత్తుకు రావాల్సిందే. ఎవరికి ఎంత తెలిసినా తెలియకుండా సైన్స్ అనే గుర్రాన్ని ఇంటి ముందు గుంజకు కట్టేసినట్టే భావిస్తారు.
నమ్మకాల విషయం, తనదాకా వస్తే అని ఒక సామెత ఉంది మన దగ్గర….
ఎవరి నమ్మకాలు వాళ్ళ వి , ఎవరి కష్టాలు వారివి. ఆ కష్టాలను దాటాలని చేసే ప్రయత్నాలు వాళ్ళవి. వీటికి మూర్ఖత్వం అని పేరు పెడతామో , తెలివి తక్కువ తనం అని ఓ విశేషణాన్ని అంటగడతామో కానీ, మనకెందుకులే అని మాత్రం వదిలేయం. ఇది మానవ నైజం. అన్ని సందర్భాలలో అన్ని విషయాలలో అందరి విషయాలలో వేలు పెట్టడం వంటిది.
ఎన్నో ఏళ్లు కఠినమైన పరిశ్రమ చేసి సాధించిన విజయాన్ని ఎక్కడో కూర్చుని ఏదో మాట్లాడేస్తుంటారు. సామాజిక కోణంలో ఆలోచిస్తే, మనసులో భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వ భావంతో అందరిని చూడాలి అనే ఒక మంచి ఆలోచన ఉండాలి కానీ చంద్రుని గురించి , మరి ఏదో గ్రహం గురించి కనుక్కున్నంత మాత్రాన దీనికి దానికి సంబంధం ఏముంది? మంచి వాళ్ళు అయితే అందర్నీ మంచిగానే చూస్తారు.

అంత పెద్ద భావానికి ఈ విషయానికి పోలికెక్కడ? అసలు పోల్చాల్సిన అవసరం ఏముంది? ఇది మనిషి గుణానికి సంబంధించింది అది మనిషి విజ్ఞానానికి సంబంధించింది..
మారాలి అనుకునే వ్యక్తులు ఇప్పటికైనా ఎప్పటికైనా మారతారు.ఎవరో చెప్పక్కర్లేదు. స్వతహాగా రావాలి.
ఏదో ఒక సందర్భం వచ్చింది కదా ఒక మాట అనేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఉంది ఈనాటి పరిస్థితి . ఈ మాట అన్నా,ఎవరికి ఉండే స్థిరభిప్రాయాలు వారికి తప్పకుండా ఉండే ఉంటాయి.
పేరుగన్న దేశాలు కూడా చేయలేని కార్యక్రమాన్ని మన దేశం ” భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ” “ఇస్రో” సాధించింది అనే విజయ గర్వాన్ని నిజంగా గర్వంగానే భావించాల్సిన విషయం . చంద్రుని దక్షిణ ధ్రువాన్ని పరిశోధించడానికి ప్రయత్నం చేయడం, సూర్యరశ్మి కూడా పడని ఆ చీకటి ప్రాంతాల్లో ఈ యంత్రాన్ని చంద్రయాన్ పంపించడం ఇది భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. ఇది చంద్రుడి పైనున్నటువంటి ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు ఎలా ఉంటుంది ఏ విధంగా మార్పు చెందుతుందో అనే విషయాన్ని పరిశోధిస్తుంది అలాగే ఉపరితలం పైనున్న అయాన్లు ఏ పరిణామం చెందుతుంటాయి అనేది తెలుసుకుంటుంది ధర్మోఫిజికల్ ఎక్స్పరిమెంట్ చంద్రుని ఉపరి తలంపైన ఉన్న లక్షణాలను కొలుస్తుంది ఇవన్నీ సిద్ధం చేసి చంద్రుని మీద ఒక మ్యాప్ తయారు చేయడం కూడా సాధ్యమయ్యేలా పనిచేస్తుంది. చంద్రుని పైన ఖనిజ సంపద ఎంత ఉంది,రసాయనాలు ఏమైనా ఉన్నాయా,శిలాజాల పరిశోధన వంటి ఎన్నో విషయాలు కొత్తగా కనుక్కోవడం మారుతున్నటువంటి ప్రపంచానికి అవసరం. ఇది కంప్యూటర్ ఎరా! ఇది రోబోట్ల యుగం!!


ఖగోళ శాస్త్రం ఒడిసిపట్టిన భారతీయ శాస్త్ర పరిజ్ఞానం వేల ఏళ్ళ కిందిది. సంస్కృతంలో ఇవన్నీ వేద కాలాలలోనే రాసినటువంటివి ఉన్నాయని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి! కానీ మనం నమ్మం!!
సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాల విషయాలు , విశ్వంలో ఉన్నటువంటి గ్రహాల కూర్పు విషయాలు, సౌర వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయాలు వంటివన్నీ సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయని ఇదంతా భారతదేశం ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి విజ్ఞాన సంపదని యావత్ ప్రపంచం ఒప్పుకుంటుంది. గణిత శాస్త్రం లోహ శాస్త్రం తర్కశాస్త్రం తత్వశాస్త్రం వైద్యశాస్త్రం ఒక్కటేమిటి అన్ని శాస్త్రాలు సంస్కృతంలో రాసి ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా మన దేశం కీర్తిని మనవాళ్లే ఒప్పుకోరు. శాస్త్రీయంగానే కాదు ఆధ్యాత్మికంగానూ చెప్పడం వల్ల వచ్చిన సమస్య అయింది. కానీ నిజం దాగదు కదా.సైన్స్ ను సైన్స్ గానే చూడాలి. మానసిక ఆధ్యాత్మిక చింతన లకు పొంతన గా చూడకూడదు. నెలవంక మనవంక చూసిందన్నా, చంద్రుడి ని చందమామన్నా, పిల్లలకు జాబిల్లి గోరుముద్దలైనా, దోబూచులాటల ప్రేమ బంధాల కథ అయినా మనుషుల జీవితాలు సాగినంత కాలం అలా అందమైన ఊహ లలో అందంగా నే ఉంటాడు. ఉండనివ్వాలి. ఎవరెన్ని చెప్పినా సూర్యుడు ఎండ నే కురిపిస్తాడు, చంద్రుడు వెన్నెలనే కురిపిస్తాడు. ఆ అగ్ని ని ఈ చల్లదనాన్ని పిడికిట పట్టకున్నా గుండెల్లో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. కొందరికి పెరుగు పరమౌషధం లా మంచిని చేకూరుస్తూ పనిచేస్తుంది కొందరి ఒంటికి అస్సలే పడదు. పెరుగన్నం కొందరికి ఇష్టం కొందరికి అయిష్టం . శాస్త్రీయ పరిజ్ఞానం మానసిక సంఘర్షణల లో వెతకాలనుకోవద్దు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏం చేస్తున్నావంటే ఏమని చెప్పను ?

అమెరికాలో బామ్మ