ఎర్రరంగు బురద

ధారావాహిక నవల 12వ వారం

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు. ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు. కొడుకు తన డబ్బులు దక్కనియ్యలేదని పగబట్టిండు ఏదులు తండ్రి.  ఒకరోజు పగటిపూట ఇంటికొస్తూ దారిల మందను సరిచూసుకుంటన్న ఏదులు మీద పడ్డరు ఆయుధాలతో.. ఏదులును చంపి కూడా తప్పించుకున్నరు తండ్రికొడుకులు. నాంచారి ఒంటరిదైంది. ఏదులు కొడుకులతో ఎట్టి చేయించుకోవాలని అనుకున్నడు సంగడు. పెద్దకొడుకు నాగులును సంగనితో పంపింది. చిన్నకొడుకును హాస్టల్ల ఏసింది. సంగడింట్ల జీవిత పాఠాలు చదువుతుండు నాగులు.  వాన కురుస్తున్న రాత్రి ఒంటరిగున్న నాంచారి ఇంటికి చేరిండు ఎంకులు. పక్క గుడిసెల గొల్లమల్లమ్మను తోడు పండబెట్టుకున్నది. ఇద్దరు కలిసి ఎంకులు పనిపట్టిన్రు. నాంచారి భయంతో జొరమొచ్చింది. తండ్రి వచ్చి తీసకపోయిండు.

————ఇక చదవండి——–

వీరన్న ఆ తర్వాత నిమ్మలంగ వచ్చి కోళ్ళను పందులను అమ్మేసిండు.. నాంచారి తనకు సాయం చేసిన గొల్లమల్లమ్మను పట్టుకుని ఏడ్చింది. ఆ ఇంటి జాగను  పక్కనే ఉన్న గొల్లమల్లమ్మకే అమ్మేసి… ఊరిడిసి పెట్టి తండ్రి ఊళ్ళనే చేరింది.

 నాంచారి కొడుకులు పెద్దగయ్యిన్రు… ఈరన్న తన పిల్లలతో సమానంగ బిడ్డ పిల్లలను సాదిండు…

భర్త లేని లోటు తప్ప ఏకష్టం రానియ్య లేదు ఈరన్న తన బిడ్డకు. తండ్రి సాయంతో నాంచారి జీవితం దొర్లిచ్చుకొచ్చింది. పిల్లలు పెద్దగయిన్రు పెద్ద కొడుకు నాగులు తప్ప, మిగిలిన ఇద్దరు హాష్టల్ల చదువుతున్నరు.

కాలిన చేతితో నాంచారి కూలి కష్టం చెయ్య లేదని కుట్టు మిషిను నేర్చుకోమన్నడు తండ్రి.

“అయన్ని నాకు రావు నాయినా.. కూలికే పోత” అన్నది. కానీ తల్లిదండ్రి, చెల్లెలు సముదాయించినంక ఒప్పుకున్నది. ఎడమ చేత కత్తెర పట్టుడు కష్టమయింది కాలిన చేతికి బట్టచుట్టుకొని కత్తిరించడం నేర్చుకుంది. మొదట్లో చాలా నొప్పి అనిపించేది.. ఒకొక సారి కాలిన చర్మం ఊడి నెత్తురు కారేది అయినా పట్టుదలతో నేర్చుకుంది. తండ్రి మిషిన్ కొనిచ్చిండు.. ఒకరితో మాట పడకుండ బట్టలు కుడుతుంది. నీడపట్టున కూర్చొని ఎంతోకొంత సంపాదిస్తున్నది.

నాంచారి చిన్న కొడుకు మంగడు హాష్టల్ల సదువుకుంటున్నడు. ఆడపిల్ల పిల్లలకు తల్లిగారి ఊర్ల హక్కులేదన్న కుల కట్టుబాటు, నాగులుకు అడుగడుగున అడ్డుబడ్డది. నాగులుకు తాత ఇమ్మర్స వచ్చింది, నెమ్మదస్తుడు తొందరతనం లేదు. తండ్రి భుజాల మీదినుండి ప్రపంచాన్ని చూడాల్సిన బాల్యంలో.. ఒక తాత తండ్రిని బలి తీసుకొని, తమను అనాధలను చేస్తే, ఆడపిల్ల తండ్రయినా మరో తాత అందరి బాధ్యత తీసుకున్నడు.. ఆ తాతకు విద్యలేని మూర్ఖత్వం, స్వార్థంతో కూడిన అహంకారం. ఈ తాతది విద్యతో కూడిన వివేకం. మంచి మిత్రుల స్నేహంతో అలవడిన సంక్షేమం గుణం. ఏ బిడ్డైనా తమ బిడ్డసుంటిదే అనే జ్ఞానం. సొంత సుఖాలెరుగని నిశాల హృదయం. మంచి మనసున్న తాతను చూస్తూ పెరిగిన నాగులు చాలా నేర్చుకున్నాడు. బడి ముఖం ఎరుగని నాగులుకు పుస్తకాలలో పాఠాలు తెలవదు. కానీ జీవితం చాలా పాఠాలు నేర్పింది. అందుకే ఎవరితో తగువుకు పోయేవాడు కాదు. ఎవరైనా రెచ్చగొట్టినా అక్కడి నుండి గమ్మున వెళ్ళిపోయే వాడు. అది కూడ నచ్చలేదు కొందరు కులపోళ్ళకు, ఆ ఊరి యువకులకు కూడా.

కానీ నాగులుకు ఒక్కరిద్దరు స్నేహితులుండే వారు.  స్నేహితులు, తాత, చిన్నమ్మతో కలిసి కొంత అక్షర జ్ఞానాన్ని పొందాడు నాగులు. అందరి ప్రోత్సాహంతో పదవ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాశాడు. కానీ తెలుగు తప్ప అన్నీ ఫేలయ్యిండు. నిరాశ పడి తలపట్టుకొని కూర్చున్న నాగులును చూసి తాత భుజం తట్టి లేపిండు.

“నా తోటి రాయ్యా.. నాగులూ.. నీకో మనిషిని చూపిస్తా..” అని పక్క ఊళ్ళకు తోలక పోయిండు. రెండు కిలోమీటర్లు ఉంటదది. అక్కడ ఒక కిరాణ కొట్లో కూర్చున్న ముసలాయన దగ్గరికి తీసక పోయిండు. అతనికి ఒక చెయ్యి మోచేతి వరకు లేదు. మరో చేయికి రెండు వేళ్ళు లేవు. అయినా ఎంతో ఓపికగా షాపుకు వచ్చిన వాళ్ళకు సరుకులు అందిస్తున్నడు.

వీరన్నను చూసి ఆత్మీయంగా నవ్వుతూ  “ఏం వీరన్నా.. ఏంటి ఈరోజు ఈ సమయంలో వచ్చినావు. ఏమయిన పని మీద వచ్చినవా….” అని అడిగిండు.

 “ఔను సార్.. మీ గిరాకి అయినంక మాట్లాడుతా.. కానియ్యండి. ఇక్కడ కూసుంట” అని పక్కన ఉన్న వేప చెట్టు నీడన కూసున్నడు మనవడితో.

  వెడల్పుగా నీడ కమ్ముకున్న కొమ్మలతో ఇంత ఎత్తున ఉన్న, ఆ వేపచెట్టు లోపల ఒక తాడిచెట్టు కూడా ఉంది. అది చూసి నాగులు ఇదేమి చిత్రం ఇదెట్ల కుదురతది అనుకున్నడు. ఆ సంగతే తాతను అడుగుతే అనుకున్నడు. కానీ పరీక్షల్ల ఫేలయిన దిగులు ఆ కుతూహలాన్ని మింగేసింది.

వీరన్న అది గమనించాడు. చూసినవా నాగులు.. సృష్టి చేసే చిత్రం. తాటి గేగును ఇంత పెద్ద వేపచెట్టు తొర్రలో ఎవరు ఎట్లా నాటుంటరు ? అనిపించింది కదా..  ఈ వేపచెట్టు అన్ని రకాల పచ్చులకు నీడనిస్తది. ఏపచ్చో ఆశకొద్దీ తాటిటెంక తెచ్చుకొని తినలేక జారిడుసుకొనుంటది, అదే ఎవరూ పట్టించుకోకున్నా వానలకు తడిసి మొలకెత్తి నాటుకొని, తన ఉనికిని చాటుకొనుంటది. ఇట్ల రెండు చెట్లు ఒక దాంట్లో ఒకటి మొలిస్తే అక్కడ దేవుడుంటడని చెప్తరు. అట్లా ప్రతి ప్రాణిల దేవుడున్నడో లేడో కానీ ప్రతి చెట్టులో దైవముంటది. అదే మిగిలిన ప్రాణులన్నింటికి కావలసిన గాలిని, నీడను, పత్రిని, పూలను, పండ్లను, కలపను, మందులను అందిస్తది. ప్రతి దానికీ కాలం కలిసి రావాలె, దానికి మనిషి ప్రయత్నం కూడా కావాలె. చిన్న చిన్న ఓటమిలకు కష్టాలకు భయపడొద్దు దిగులు పడొద్దు బిడ్డా.. పది సంవత్సరాల పొడుగున దినాం బడికి పోయి, సార్లు చెప్పేది విని, సదువు నేర్చినోల్లు సుత ఫేలయితరు. ఒక్కనాడు బడికి పోకున్నా ఒక్క దాంట్ల పాసయినవు. మిగిలినయి కూడ పాసయితవు. అంత బెంగ పడితె ఎట్లా..” వీరన్న మాటలు వానాకాలం వరదలా సాగుతనే ఉన్నయి. నాగులు తలొంచుకొని తాత మాటలు వింటనే ఉన్నడు.

దుకనంల జనం తగ్గిన్రు… ఆకరి మనిషికి సరుకులు అందిస్తూ.. వీరన్నను రమ్మని చెయ్యి ఊపిండు, షాపుల పెద్దాయన. “లే.. లే.. ఆ సారు పిలుస్తాండు” అని మనుమడితో షాపు దగ్గరికి వచ్చి..

 “వీడు నా మనుమడు, పేరు నాగులు పదోతరగతి తప్పిండు. ఒకటే చింతపడి కూసున్నడు.. మిమ్మల్ని సూపిద్దామని వచ్చిన సారు. మీ కథ మీరు చెప్తెనే బాగుంటది.. నాకు సుత మల్లొకపాలి ఇనాలనిపిస్తుంది.. చెప్పండి” అన్నడు వీరన్న.

“నీదొక విచిత్రం.. నాదేమున్నది. జీవితం ఎటు నెట్క పోతె అటే పోయిన.. ఏది చేసినా నా మనసు చెప్పినట్టే విన్నా.. జీవితాన్ని ఉన్నదున్నట్టు అనుభవించాలె. ఓటమైనా గెలుపైనా రెండూ సమానమే.. గెలుపు ఆనందాన్నిస్తది, ఓటమి ప్రపంచాన్ని సూపిస్తది, గెలుపు వైపు దారి సూపిస్తది. అర్దం చేసుకోవాలె మనమే. ఇంకా సెప్పాలంటే ‘కన్ను తెరిస్తే జననం – కన్ను మూస్తే మరణం మధ్యలో ఉన్నది జీవితం’ జీవితం గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. అవి నెరవేరక దిగులు పడొద్దు. సరెగని పదో తరగతి ఏమన్న బ్రహ్మవిద్యా.. ఇయ్యాల కాకపోతే మల్ల సారి పరీక్ష రాయాలి.. అప్పుడు కాకపోతే మళ్ళీ సారి రాయాలె. భయపడొద్దు, భయం మనిషిని లొంగ తీసుకుంటది.. జో డరేగా.. ఓ మరేగా..” అంటూ చెరొక సోడా కొట్టి ఇచ్చాడు. వీరన్న ఆ సోడా సీసాలందుకొని మనవడికొకటిచ్చి తానొకటి తాగిండు.

“సారూ మీ కథ చిన్నప్పటి నించి చెప్పండి. నాకయితే ఒక సిన్మా కథ లెక్కుంటది” అన్నడు.

“ఆం ఏముందిలే ఒకరికి కథ, మరొకరికి వ్యథ.. మాది ఖమ్మం దగ్గర బొగ్గుట్ట. మా నాయన బొగ్గుబాయిల పనిచేసేది. మేము ముగ్గురన్నదమ్ములం. నేను సిన్నోడ్ని.. మా అమ్మ టీ.బీ. వచ్చి చచ్చి పోయింది. అమ్మ సచ్చిపోయేనాటికి నాకు ఆరేళ్ళు ఉంటయేమో. మా నాయన మా సిన్నమ్మను మారుమనువు సేసుకున్నడు. మా సిన్నమ్మకు వాళ్ళ మేన బావంటే ఇష్టం. పెళ్ళయినంక కూడా, నాయన డ్యూటీకి పోయినంక, ‘ఆయన’ మా చిన్నమ్మ కోసం వచ్చేది.. అప్పుడు నన్ను చూసి కసురుకునేది సిన్నమ్మ. మా అన్నలెప్పుడు ఇంట్ల ఉండకపోదురు.

ఒకసారి ఎందుకో సిన్నమ్మ నన్ను కొట్టిందని, ‘నేను మా నాయనకు చెప్తా..’ అంటే.. మా సిన్నమ్మ తన బావ సంగతి సెప్తనని భయపడ్డది. మా నాయన డ్యూటీ నించి రాక ముందే వాళ్ళ బావొచ్చిండు. ఇద్దరు కలిసి బాగ కొట్టిన్రు. దెబ్బలు తట్టుకోలేక నాకు సోయి తప్పింది.

కళ్ళు తెరిచి చూసేటప్పటికి రైలు స్టేషన్ల ఉన్న.

ఇంటికాడ ఉన్నప్పుడు ఆరేళ్లు వచ్చినా బడికిపోయేటోడిని కాదు. అందుకే అది ఏ ఊరో తెలవదు. ఏ స్టేషనో తెలవదు. పచ్చటి బోర్డు మీద నల్లటి అక్షరాలు కనబడ్డయి. కానీ చదివే రాని నాకు ఏం తెలుస్తది. ఒళ్లంతా దెబ్బల నొప్పులు, ఆకలి అక్కడే పండుకొని ఏడుపొందుకున్న. ఎవరూ పట్టించుకోలేదు. ఎంతసేపు ఏడ్చిన్నో తెలియదు. నోరు ఎండకపోతాంటే.. పంపు కాడ నీళ్ళు తాగి వచ్చి మళ్ళక్కడే కూసున్న. అంతల్నే ఒక రైలొచ్చి ఆగింది. అందులకు ఎక్కిన. ఆకలయితాంది. రైల్ల ఏమోమో అమ్మడానికి వచ్చినయి. అందరు కొనుక్కోని తింటున్నరు. ఆకలితో వాళ్ళ ముందు చెయ్యి చాపిన, దయగల తల్లి ఒకామె ఒక బిస్కట్ పొట్లం ఇచ్చింది.. గబ్బ గబ్బ మొత్తం తిన్న, కుతిక పట్టింది. రైల్ల ఉన్న పంపుల నీళ్ళు తాగిన.

“ఏ అయి తాగొద్దురా” అన్నడు ఒక పెద్దాయన. ఆ నీళ్లు తాగొద్దు అన్నడు గాని ఏం తాగాలో చెప్పలేదు. అట్లా అడుక్కొని తినడం అలవాటయింది. అడుక్కోని తినాలె స్టేషన్ల పండుకోవాలె. మళ్ళీ రైలెక్కాలే ఎక్కడ దిగుతున్ననో.. ఏ రైలెక్కుతున్ననో.. ఎన్ని రోజులు గడిచిందో తెలవదు. ఒకసారి పోలీసులు పట్టుకున్నరు.

— సశేషం—-

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దిక్కు? 

గోరింటాకు సంబరాలు