ఆ పా ( త )ట మధురం :

చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన…

రాధికాసూరి

చెల్లెలి కాపురం ( 1971 ) చిత్రం లోనిది ఈ పాట . నిర్మాత ఎం. బాలయ్య గారి ( మొదట సంశయించినా) అభిరుచి మేరకు సంస్కృత సమాసభూయిష్టంగా, అందమైన పదాల పొందికతో, సాహితీకర్త శ్రీ సి. నా.రె .గారు పాటకు పరిమళాల సొబగులు అలదిన తీరు అమోఘం. సంగీత సమ్రాట్ కె.వి .మహదేవన్ గారి సారధ్యంలో గాన గంధర్వులు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళ సీమ నుండి జాలువారిన ఈ ఆణిముత్యానికి నాయికా నాయకులు శ్రీమతి వాణిశ్రీ , శ్రీ శోభన్ బాబు గార్ల చక్కని అభినయ కౌశలం తోడై విజయ ఢంకా మ్రోగించిందీపాట . ఇక విషయ వివరణ లోకి వెళ్తే…

సభాస్థలిలో వేదిక పైనుండి ఒక నర్తకి తన నాట్యాభినయానికి అనుగుణంగా ఆశవుగా కవిత్వం చెప్పి ఒప్పించే ఒక్క కవి పుంగవుడు కూడా ఈ ప్రాంగణంలో లేడా ! అంటూ విసిరిన సవాలకు దీటుగా స్పందిస్తూ నాయకుడి సమాధానంగా , అతని గళం నుండి జాలువారిన మనోహర కవితాఝరికి దృశ్యరూపం , ఈ ‘నాట్యకవితాగాన’ రసఝరి . సాధారణంగా మనం ఏదో ఒక ప్రక్రియను చూసి నచ్చితే స్పందిస్తాం. అలాంటిది కవిత్వం , గానం , నర్తనం ఈ మూడు కలగలిసిన ప్రయోగం ఒక అద్భుతం గా పేర్కొనవచ్చు . ఒక గండు కోయిల గంభీర గాత్ర రస ప్రవాహానికి కవితాత్మ తోడైతే స్పందించిన మయూరపు నాట్య హేల ఎలా ఉంటుందో సుస్పష్టంగా ఆవిష్కరించిన తీరు… ‘పిల్లగాలి తెమ్మరలకు హంస మంజీర నాదాలు తోడైనట్టు …’ ‘మధువులొలికే గాన మాధుర్యానికి మంద్రస్థాయి మురళీరవం జతగూడినట్టు’ … ‘కవితా రసఝరికి స్పందించిన రాతి శిల్పం సజీవమైన నాట్యకేళి గావించినట్టు’ అత్యంత సుందరంగా చిత్రీకరించిన మనోనికేతన దృశ్య రూపం.

ఇక పాటలోనికి పరకాయ ప్రవేశం చేస్తే – నాయకుడు తన కావ్యాత్మలోని కవితాఝరికి సరితూగేలా స్పందిస్తూ నీ నాట్య కౌశలాన్ని ప్రదర్శించమని సున్నితంగా చెప్తూనే , తన పదావేశాన్ని సంస్కృత పదభూయిష్టంగా , సుందర సమాసాల కలబోతతో ముందుకు సాగించి, రౌద్ర రసస్ఫోరకంగా వర్ణించే తీరు… అత్యద్భుతం.

చరణ కింకిణులు. . . నీ కాలి అందియలు ఘల్లుమని సవ్వడి చేయగా, హస్తభూషణమైన నీ ముంజేతి గాజుల మనోహరమైన సవ్వడుల నడుమ , నీ పదనర్తనం లో హంస గమనాలొలికిస్తూ, మత్తెక్కించే తరంగనాదాలకు ప్రేరేపితమైన నీ నడుము సయ్యాటల నడుమ చక్కగా నాట్యమాడమని చెప్తూ – అందంగా ముడివేసిన కడలి అలల్లాంటి నీ కురులతో, తీగ లాంటి శరీర కదలికల నడుమ అందంగా నర్తించమంటూ- ఇంకో రకంగా చెప్పాలంటే… మదగజపు మందగమన లయలు , కలహంస పదసౌందర్యపు హొయలు, శూన్యాన్ని తలపించే జఘన కదలికల నడుమ మెరుపుతీగ లాంటి నీ మేని విరుపులతో చక్కని నాట్య కౌశలాన్ని ప్రదర్శించమని సున్నితంగా చెబుతూనే-

నీ కులుకులు గని… నీ నాట్య విలాసాన్ని చూసి నా పద ప్రయోగం వెల్లువ కాగా నీ నాట్యాభినయాన్ని చూసి నాలో నవనవోన్మేషపు కవన ఝరులుప్పొంగగా నర్తించమని చెప్తూ-

అది యమునా సుందర తీరం…

రాధాకృష్ణుల అమలిన శృంగారాన్ని అత్యంత హృద్యంగా వర్ణించిన తీరు అతి సుందరం . ఆహ్లాదకరమైన యమునా తటి ప్రాంగణంలో అందమైన బృందావనంలో చలువరాయని నిండు పున్నమి కాంతులలో హాయిని గొల్పే మలయ మారుతపు వీచికల చిరుసవ్వడు లలో చల్లని ఇసుకతిన్నెల నడుమ వియోగబాధచే రాధిక ఏకాంతంగా నడుస్తుండగా … వెన్నుని పిల్లంగోవి (మురళి ) తరంగాలు అమృతధారులై రాధ మదిని తాకగా పరవశమొంది స్పందించిన రీతిగా, పాదరస ప్రవాహంలా హుషారుగా నర్తించమంటూ –

నా పలుకుల కెనయగ…

నా పద సంపదకు సరైన రీతిలో స్పందిస్తూ నీ నర్తనావిన్యాసాన్ని ప్రదర్శించమంటూ నా ( కవితాఝరికి ) కవితాత్మకు తగు రీతిలో జీవం పోస్తూ నీ నాట్య విలాసాన్ని ప్రదర్శించమంటూనే –

ఫాలనేత్ర సంప్రదమ జ్వాలలు…(తపోభంగం చేసిన పూవింటి వెేలుపుపై కృద్ధుడైన మహాదేవుడు తన మనోనేత్రం (మూడవకంటి) తో భస్మీపటలం గావించిన సందర్భంలోని రౌద్ర సన్నివేశపు దృశ్య రూపం మహాద్భుతం) ముక్కంటి కోపాగ్ని జ్వాలల్లో మన్మధుడు దహింపబడగా నాథుని కోల్పోయిన రతీదేవి శోకతప్తయై రోదిస్తుండగా హిమగిరుల మీద ప్రమద గణాలు కనిపించగా, ప్రళయ కాలం ఆసన్నమైందా అన్నట్లుగా ప్రమదగణాలు తాండవం చేస్తుండగా మేఘగర్జనల హోరు నాలుగు దిశలు వ్యాపించునట్లు మద గజఘీంకార ధ్వనులు నడుమ వేయి తలల పాము భీకర బుసలు సల్పుతున్నట్లు ఓ అరాళకుంతలా నీ నాట్య విన్యాసాన్ని నలుదిశలు వ్యాపించునట్లు నీ అభినయ కౌశలాన్ని కళ్ళల్లో, కనుబొమలలో , పెదవుల యందు ముఖారవిందంలో , కంఠమందు మెడవంపులలో నీ వయ్యారపు నడుము వంపులతో నీ కరద్వయం లో పాదపల్లవాలలో శరీరంలోని అణువణువులో వివిధ భంగిమల అత్యద్భుత కదలికలు నడుమ నీ నాట్య విన్యాసాన్ని ప్రదర్శించమంటూ సాగుతున్న కవి గాత్ర ధాటికి నిలువలేని నర్తకి తన ఓటమిని అంగీకరిస్తూ అతని పాదాల చెంత వినయంగా ఒదిగిన తీరు సదా ప్రశంసనీయం. గెలుపు ఓటములను హుందాగా స్వీకరించినప్పుడే మనిషి వ్యక్తిత్వపువికాస ఔన్నత్యం విదితమవుతుందనడానికి ఇదొక చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

జనసామాన్యానికి ఇంత కఠిన సమాసాలు, సంస్కృత పదసమ్మిళితపు పాటను అర్థం చేసుకోవడం కష్టం. ఒకరకంగా చెప్పాలంటే అసాధ్యమే !భాషకు పదును పెట్టి, ఆపోశన పట్టి అలవోకగా తన గాన వాహిని లో ఓలలాడించిన బాలూగారు సదా ప్రశంసనీయులు. ఇక నాయకులు శ్రీ శోభన్ బాబు గారు గ్లామర్ హీరోగా ఇమేజ్ ఉండి కూడా డీగ్లామరైజ్డ్ రోల్ లో నటించడం ఒక సాహసం. నాయిక వాణిశ్రీ గారు చక్కని నాట్యాభినయం ప్రదర్శించారు. సినారె గారి కలం కదిలిన తీరులో ఎన్నెన్ని భాషా సొగసులో ! నిర్మాత బాలయ్య గారి అభిరుచికి, సంగీతజ్ఞుడి బాణీలకూర్పుతో, కవి హృదయ స్పందన నుండి ఆవిర్భవించిన పాటకు గానగంధర్వుడి సమ్మోహన గాత్రానికి నాయికానాయకుల చక్కని అభివ్యక్తీకరణతో విరాజిల్లిన ఈ పాటను తెరకెక్కించిన తీరు అత్యద్భుతం , అజరామరం.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శర్వాణి మానస పుత్రిక – మృణాళిని

జీవిత లక్ష్యం