శర్వాణి మానస పుత్రిక – మృణాళిని

పద్మశ్రీ చెన్నోజుల

రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, అనువాదకురాలిగా ,ప్రొఫెసర్ గా తెలుగు , ఆంగ్ల సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన చుండూరి మృణాళిని గారి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
వీరు 1956వ సంవత్సరము జూన్ 17వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నాగమణి – పార్థనాథశర్మ అనే దంపతులకు జన్మించారు . వీరి తండ్రి జీవిత బీమా శాఖలో బ్రాంచ్ మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండేవారు . తల్లి కర్ణాటక సంగీతంలో గొప్ప విద్వాంసురాలు అయినప్పటికీ ఆమె ప్రతిభ పెద్దగా బయటకు రాలేదని చెప్పవచ్చు. వీరి మాతామహులు అంటే వీరి తల్లి తండ్రి గారు అయిన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు సంగీత , సాహిత్యాలలో గొప్ప విద్వాంసులు. వీరి అమ్మమ్మ గారికి కూడా సంగీతంలో చాలా మంచి ప్రతిభ ఉండేది కానీ ఆనాటి పరిస్థితుల వల్ల వీరి ప్రతిభ కూడా పెద్దగా బయటకు రాలేదని చెప్పవచ్చు . వీరి తాతగారు ( తండ్రికి తండ్రి )అయిన రఘునాథాచార్యులు పేరు మోసిన క్రిమినల్ లాయర్ మరియు హోమియో వైద్యులు . ఎనిమిది మంది సంతానంలో వీరు చిన్నవారని , ప్రముఖ రచయిత ,పౌర హక్కుల ఉద్యమకారుడు అయిన బాలగోపాల్ గారు వీరికి సహోదరుడు అని చెప్పారు.

వీరి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అవడం వల్ల తరచుగా బదిలీలు జరుగుతూ ఉండే కారణంగా వీరి విద్యాభ్యాసం చాలా ప్రాంతాల్లో కొనసాగించాల్సి వచ్చింది . విజయనగరం , విశాఖపట్టణం ,తిరుపతి ,కావలి ,హైదరాబాద్ ఇలా వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం కొనసాగింది.

   హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1979లో తెలుగులో ఎం. ఏ. 1981లో ఎం.ఫీల్. 1986లో పిహెచ్. డి. 1995లో ఇంగ్లీషులో ఎం. ఏ. పట్టాలను ,
1999 – 2000లో మదర్ థెరిస్సా విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. ఉమెన్ స్టడీస్ లో ఉత్తీర్ణత సాధించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక పరిశీలన విభాగంలో లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు .1982 – 83 లో ‘సుభాషిణి ‘ అనే మాస పత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించారు. ‘ దర్పణం ‘ అనే వీడియో మ్యాగజైన్ కొంతకాలం నడిపారు .1984 – 91 మధ్యకాలంలో ఉదయం దినపత్రికకు చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు . వరల్డ్ స్పేస్ రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత మళ్లీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్ గా పని చేశారు . వీరి ప్రతిభా పాటవాలను గుర్తించిన ఆనాటి వైస్ ఛాన్సలర్ సి . నారాయణ రెడ్డి గారు వీరిని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించారని చెప్పారు వీరికి గురువుగారైన సీనియర్ రెడ్డి గారు వీరి ప్రతిభా పాటవాలను గుర్తించి ఉద్యోగాన్ని చేపట్టమని ప్రోత్సహించారని చెప్పారు.యునైటెడ్ స్టేట్స్, చైనా , మారిషస్ ,మలేషియా , నార్వే తదితర దేశాలలో పర్యటించి పలు సాహితీ గోష్టు లలో పాల్గొని సిద్ధాంత పత్రాలను సమర్పించారు .ఆల్ ఇండియా రేడియో , దూరదర్శన్ , తెలుగు చానళ్ళలో 2000 పైగా కార్యక్రమాలను నిర్వహించారు .

వీరు అందుకున్న పురస్కారాలు:

యద్దనపూడి సులోచనారాణి

వాసిరెడ్డి సీతాదేవి

అబ్బూరి ఛాయాదేవి

తురగా జానకిరాణి

రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారం

తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013

13 జులై 2016 మాల్గుడి కథల పుస్తకానికి గాను పురస్కారం

బెస్ట్ టీచర్ అవార్డు

గృహలక్ష్మి స్వర్ణకంకణ అవార్డు (2007)

తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చే:

బెస్ట్ ట్రాన్స్లేటర్ అవార్డు (మాల్గుడి డేస్)

అవంత్స సోమసుందర్ అవార్డు (విమర్శకు)

బెస్ట్ ఇండోనేషియన్ షో అవార్డులు (3 సార్లు)
ప్రజ్వలిత అవార్డు

వీరి రచనలు:

ప్రేమిస్తే పెళ్లవుతుందా? ( నవల)

నేరేటివ్ టెక్నిక్ ఇన్ తెలుగు నావెల్ (ఆంగ్లంలో విమర్శా గ్రంథం)

తెలుగు ప్రముఖులు చమత్కార భాషణలు

ఇ(ఇంతి)తి హాసం

కోమలి గాంధారం

మాల్గుడి కథలు ( అనువాదం)

గుల్జార్ కథలు (అనువాదం)

ప్రతిధ్వని

నిశ్శబ్ద విప్లవాలు

సకల

తాంబూలం

రఫీ (ఒక ప్రేమ పత్రం)

రచనా శక్తి తనకు తన తల్లి వైపు నుండే సంక్రమించిందని ,తండ్రి తమ చిన్న వయసులో ఉండగా చాలా ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి పెట్టేవారని , ఇంగ్లీష్ సినిమాలు తండ్రి ఎక్కువగా చూస్తూ ఉండేవారని , దానివల్లనే పుస్తకాలు చదవడం పైన ఆసక్తి చిన్ననాటి నుండే తనతో పాటు ఇంట్లో అందరికీ ఉండేదని చెప్పారు . కులమతాల పట్టింపులు తమ ఇంట్లో ఎప్పుడూ కనిపించేవి కావని , తమ ఇంటికి వచ్చే దిగువ స్థాయి ఉద్యోగులను తమ తల్లిదండ్రులు చాలా ఆప్యాయంగా పలుకరించే వారని , తల్లిదండ్రుల్లో ఉన్న అభ్యుదయ భావాల కారణంగానే తమకీ సంస్కారం అలవడిందని చెప్పారు.

రేడియో, టెలివిజన్ ద్వారా చాలామంది ప్రముఖులను తాను ఇంటర్వ్యూ చేశానని , రేడియోలో మొట్టమొదటి ఇంటర్వ్యూ దాశరథి కృష్ణమాచార్యులవారిని చేశానని , అది తనకు చాలా నచ్చిందని , వారు జీవించినంత కాలం తమ మధ్య చక్కని స్నేహం ఉండేదని చెప్పారు . అక్కినేని నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు వారిని కూడా ఇంటర్వ్యూ చేశానని, ఆ ఇంటర్వ్యూ తనకు బాగా పేరు తెచ్చి పెట్టిందని , వారు కూడా ఆమరణాంతం తనతో స్నేహంగా ఉండే వారని చెప్పారు .అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ చక్కగా సమాధానాలు ఇచ్చే వారని , వ్యవహార శైలిపై తాను ప్రశ్నలు అడిగినప్పుడు వారు చాలా స్పోర్టివ్ తీసుకున్నారని , చక్కని స్నేహశీలి అని చెప్పారు .ఆ తర్వాత గానగంధర్వులు ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం గారిని , దర్శకులు కె. విశ్వనాథ్ గారిని , సి . నారాయణ రెడ్డి గారిని , బాపు గారిని , ఇంకా చాలామందిని ఇంటర్వ్యూలు చేశానని , సి.నారాయణరెడ్డి గారు 2,3 సార్లు ఇంటర్వ్యూ చేయడానికి తనకు అవకాశం ఇచ్చారని, డిసెంబర్ 15 బాపు గారి పుట్టినరోజు కారణంగా 2,3 సార్లు ఇంటర్వ్యూ చేశానని , ఒక్కోసారి ఒక్కో కోణం నుండి ప్రశ్నలు అడిగేదాన్నని చెప్పారు. ఇంటర్వ్యూల కారణంగా తనకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయని, అదే విధంగా చాలా చక్కటి స్నేహాలు కూడా తనకు అందాయని చెప్పారు.

విద్యాభ్యాసం కారణంగా తిరుపతిలో తాను నాలుగు సంవత్సరాలు తన తాతగారైన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి ఇంట్లో ఉన్నానని , అప్పుడు తన మేనమామ అయిన జయంత గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడర్ గా ఉండేవారని, వారి సతీమణి అయిన పద్మ గారు తెలుగు పత్రికలు విరివిగా చదువుతూ ఉండేవారని , స్వల్ప అనారోగ్యం కారణంగా వారు చదవలేకపోవడంతో తనను పత్రికలు చదివి వినిపించమని అడిగే వారిని అప్పుడు మొదలైన ఆ అలవాటు తనలో తెలుగు రచనలకు కారణమైందని చెప్పారు.

పదవీ విరమణకు చే రువులో ఉన్న తన తండ్రి తనను ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టమని సూచించారని , ఆ సూచన ప్రకారంగానే టైపు , షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని, బి. ఏ . తృతీయ సంవత్సరంలో ఉండగానే ఒక న్యాయవాది దగ్గర ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించానని , అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉన్నానని , ఉద్యోగం చేయని రోజు అంటూ తన జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పారు . తండ్రి డిగ్రీతో చదువును ఆపమన్నారని , కానీ తనకు చదువు పట్ల ఉన్న విపరీతమైన అభిమానం వల్ల తాను అందుకు సుముఖత వ్యర్థపరచలేదనీ, జ్యోతిషంలో కూడా మంచి పట్టున్న తన తండ్రి తన జాతకాన్ని చూసి తాను చాలా విద్యావంతురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని , విదేశీయానాలు కూడా ఉన్నాయని తెలుసుకొని ఎట్టకేలకు తన ఉన్నత విద్యాభ్యాసానికి అంగీకరించారని చెప్పారు.

రచనలో భాగంగా తాను చాలా ప్రక్రియల్ని స్పృశిం చానని , అన్నింట్లో తనకు బాగా నచ్చిన ప్రక్రియ అధిక్షేపహాస్యం అని చెప్పారు. కోమలిగాంధారం , తాంబూలం ఈ రెండు అధిక్షేపహాస్య రచనలేనని,ఈ రెండు రచనలు చాలా ఆదరణ పొందాయని చెప్పారు . ఉదయంలో ‘కామాక్షి కబుర్లు ‘ అనే కాలమ్ వ్రాసానని , వనిత పత్రికకు వ్రాసిన కథలకు చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పారు . ఒక ప్రక్రియ పైన తాను ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించలేదని , విభిన్నమైన ఆసక్తులు తనకు ఉండడం వల్ల అన్ని రకాల ప్రక్రియల్ని తాను స్ప్రుశించాల్సి వచ్చిందని ,అది తన బలమో, బలహీనతో తెలియదంటారు . హాస్యానికి విదేశాలలో మంచి ఆదరణ ఉంది కానీ మనదేశంలో మాత్రం హాస్యాన్ని రెండవ శ్రేణి ప్రక్రియగానే పరిగణిస్తారని చెబుతారు . నవలపై పరిశోధన చేశానని , అది చేశాకగాని నవల రావడం చాలా కష్టం అన్న విషయం తనకు అర్థం కాలేదని అంటారు.
‘ అసమర్ధుని జీవ జీవన యాత్ర ‘ ‘ అల్పజీవి ‘ ‘ అతడు – ఆమె ‘ ‘ఊబిలో దున్న ‘ పై ఎం . ఫిల్. చేశారు . కథ , నాటకం , సంగీతాలపై దృష్టి సారించారు. వీరి తల్లి , అమ్మమ్మ , తాతగారు సంగీత విద్వాంసులు అవడం వల్ల వీ రు చిన్నతనం నుండి సంగీతాన్ని అభ్యసించారు. వీణ కృతుల వరకు నేర్చుకున్నారు . చదువు , సంగీతం రెండింటిని సమన్వయపరచడంలో ఇబ్బందులు ఎదురవడంవల్ల సంగీతాన్ని వదులుకొని పూర్తి దృష్టి చదువుపై కేంద్రీకరించాన ననీ, తన జీవితంలో అసంతృప్తి అంటూ ఏదైనా ఉందంటే అది సంగీతాన్ని వదులుకోవడం ఒక్కటేనని చెబుతారు. డిగ్రీ చదివే రోజుల్లో కళాశాల మ్యాగజైన్లో కథ రాయడంతో రచనా వ్యాసంగం మొదలైందని ఆ తర్వాత రేడియో కోసం ‘ కిటికీ ‘ అనే గల్ఫిక సీరియల్ గా వచ్చిందని చెబుతారు . 1985 ప్రాంతంలో అనువాద కథలు ఎక్కువగా వ్రా స్తూ ఉండేదాన్ని చెబుతారు. పది కథలకు పైగా వ్రాశారు. గ్రీకు , భారతీయ పురాణాల్లో స్త్రీల గురించి ‘ నిశ్శబ్ద విప్లవాలు’ ‘ ప్రతిధ్వని ‘ అనే వ్యాస సంకలనం , ఇతిహాసం అనే అద్భుతమైన రచన చేశారు.
2000 సంవత్సరంలో వచ్చిన కోమలిగాంధారం అధిక్షేప రచన, 2008లో వచ్చిన ‘ ‘ ‘ ” తాంబూలం కూడా మంచి సామాజిక సెటైరున్న రచన.
తాను ఒకసారి ఓలా క్యాబ్ లో ప్రయాణిస్తూ ఉండగా డ్రైవర్ ” మేడం మీరు మృణాళిని గారు కదా” అని అడిగారనీ , టీ. వీ . ప్రోగ్రామ్స్ లో చూసి ఉంటారులే అని తాన నుకున్నానని, కానీ ఆ తర్వాత అతను “తాంబూలం రైటర్ మృణాళిని గారు మీరేనా అండి” అన్న ప్రశ్న తనను చాలా ఆశ్చర్యానందాలకు గురిచేసిందని , ఒక అపరిచిత వ్యక్తి అలా హఠాత్తుగా అభిమానాన్ని వ్యక్తీకరించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెబుతారు.

జర్నలిజం చేయడం తనకు చాలా ఉపకరించిందని , దాని ద్వారా మంచి విషయాలు నేర్చుకున్నానని చెబుతారు . సంఘటనాత్మక కవిత్వం అనేది చాలా మంచి పరిణామమని , ఒక సంఘటన జరిగినప్పుడు సమాజంలోని కవులు , రచయితలు వెంటనే స్పందించడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందంటారు. సివిల్ సర్వీసెస్ శిక్షణలో భాగంగా చాలామందికి తాను పాఠాలు నేర్పుతానని, తనకు అధ్యాపక వృత్తిలోనే చాలా సంతృప్తి కలిగిందని, దీన్ని నిర్లక్ష్యం చేశానని బాధపడ్డ సందర్భాలు కూడా లేకపోలేదని చెప్పారు . సమీక్ష గురించి వివరిస్తూ రచయిత మనసులో ఏముందో తెలుసుకోవాలని, అందులోని మంచి విషయాలను మొదట చెప్పి ఆ తర్వాత చెడు విషయాలను చెప్పాలని , రెండిటిని చెప్ప గలిగినప్పుడే సమీక్ష పరిపూర్ణమవుతుందనీ చెప్పారు.
మహాభారతాన్ని మించిన రచన ప్రపంచ సాహిత్యంలో లేదని , రామాయణ , మహాభారతాలు చదవకుండా ఏ సాహితీ ప్రక్రియ కూడా పూర్తి కాదని, వాటిని పౌరాణిక గ్రంథాలుగా కాకుండా ఒక వ్యక్తి తనను తాను సంస్కరించుకునే విధంగా , తన ఆలోచనలను మార్చుకునే దిక్సూచిగా పరిగణించాలని చెబుతారు.
మృణాళిని గారికి ప్రజ్వలిత అవార్డు వచ్చిన సందర్భంగా ప్రసేన్ బెల్లంకొండ గారు రచించిన సన్మాన పత్రం ఎంత అద్భుతంగా ఉందో, వారి వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందో అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని, నిరంతర కృషి , పట్టుదలఎక్కడ ఉంటే అక్కడికి కీర్తిప్రతిష్టలు వెతుక్కుంటూ వస్తాయని ఇటువంటి వారిని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. మృణాళిని
గారు ఒక వ్యక్తి కాదు శక్తి. ఆమె వాగ్దాటి , వ్యంగ్యోక్తులు , చమత్కారాలతో సాగే వారి ఉపన్యాసాలు వినడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ ఉపన్యాసాలు విని ఎంతోమంది జీవిత గమనాన్ని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్న విషయం ఒకానొక సందర్భంలో వారి నోటి వెంట వచ్చింది . తెలుగు భాషలో వ్యంగ్య రచనలు చేయగలిగిన అతి కొద్ది మంది స్త్రీలలో మృణాళిని గారు ఒకరిని, ఆమె అజాతశత్రువు అని , తన ను తానుగా నిలబెట్టుకున్న వ్యక్తి అని , ఒక సమర్థవంతమైన స్త్రీగా , వ్యక్తిగా , విద్యావంతురాలిగా స్ఫూర్తి ప్రదాతలు అనీ ప్రసేన్ బెల్లంకొండ గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని సాహితీ వేత్తలెందరో ముక్తకంఠంతో ఏకీభవించారు. కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన ఈ మణిదీపం విద్యార్థిలోకానికి , స్త్రీ జాతికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.

One Comment

Leave a Reply
  1. నమస్కారములు
    ఇటీవల తెలుగు సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పదవి పొందినారు డాక్టర్ మృణాళిని మేడమ్ గారు. వారి విశేష సాహిత్య కృషి గురించి తెలుసుకొనటానికి అవకాశం కలిగింది. మీ వ్యాసం బాగుంది. అభినందనలు. శుభాకాంక్షలు.

    ప్రచురించిన ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి మేడమ్ గారికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఆ పా ( త )ట మధురం :