మన మహిళామణులు

శ్రీమతి పింగలి ప్రమీల

శుభోదయం, శ్రోతలకు నమస్కారం అంటూ ఆప్యాయంగా పలకరించే పింగళి ప్రమీల గారి స్వరం ఆకాశవాణి వినే శ్రోతలకు సుపరిచితం.

పింగళి ప్రమీల

ప్రభుత్వ అధికారి, ప్రజా ప్రతినిధి, సాహితీ ద్రష్ట, రైతు మహిళ ఇలా ఆకాశవాణికి విచ్చేసే అతిథి (గెస్ట్) ఎవరైనా సరే…వారితో సమయస్ఫూర్తితో, సందర్భానుసారంగా ముచ్చటించగల నేర్పు ఆమెది. ఆకాశవాణిలో ఆమె వాణి, ఆమె బాణీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. కీ.శే. వేదగిరి రాంబాబు గారి జ్ఞాపకాల ధారావాహిక “గుర్తుకొస్తున్నాయి” కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి “కార్గిల్ కథలు” స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 35 భాగాలు, ఎర్రంశెట్టి సాయి, మాడుగుల రామకృష్ణ గారి హాస్య నాటికలు, ఆకాశవాణిలోని శబ్ద భాండాగారం నుంచి రూపొందించిన సజీవ స్వరాలు కార్య క్రమం, జాతీయ కవి సమ్మేళనాలు, కవితా దినోత్సవాలు….ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలతో గత పాతికేళ్ళుగా శ్రోతలకు వీనుల విందు చేశారు వీరు. (ఇప్పటికీ చేస్తున్నారు కూడా). మరి వారి వృత్తి, ప్రవృత్తి తదితర విషయాలన్నింటినీ పింగళి ప్రమీల గారి మాటల్లోనే తెలుసుకుందాం.

అందరికీ నమస్కారం!

నా పేరు పింగళి ప్రమీల. పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లాలోని రామారెడ్డి గ్రామం. మెట్టిన ఊరు విజయవాడ.
1987 లో కీ. శే. శ్రీ ఏటుకూరి బలరామమూర్తి గారి ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం.
కుటుంబ పరిచయం : సహచరుడు పింగళి ఆదినారాయణ (late), కూతురు సూర్య తేజ, అల్లుడు కౌండిన్య, మనవడు సిద్ధార్థ్ ,
కొడుకు శశికాంత్, కోడలు కిరణ్మయి.
చదువు… ఎం.ఏ.తెలుగు, ఎం. ఏ. సోషియాలజీ ,పిజి డిప్లమా ఇన్ జర్నలిజం, పి జి డిప్లమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా, పిజి డిప్లమా ఇన్ ఉమెన్ స్టడీస్, మరో నాలుగు సర్టిఫికెట్ కోర్సులు. డిగ్రీ మొదటి సంవత్సరం అయిన వెంటనే పెళ్లయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో మిగతా కోర్సులన్నీ పూర్తి చేశాను.
వృత్తి స్వతంత్ర ప్రాత్రికేయురాలు. అలాగే హైదరాబాద్ ఆకాశవాణిలో సాధారణ ప్రయోక్త (క్యాజువల్ అనౌన్సర్) గా విధులు.
ఇతర వ్యాపకాలు: పలు పత్రికలు, మ్యాగజైన్ లకు కథలు, కవితలు, వ్యాసాలు రాయడం. సాహిత్య కార్యక్రమాలకు వెళ్లడం. పిల్లల కార్యక్రమాలకు వెళ్లడం, పిల్లలకు సృజనాత్మక విద్యను అందించే పలు పాఠశాలలతో కలిసి నడవడం మొదలైనవి .
1995వ సంవత్సరంలో వార్తలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్టు ప్రయాణం మొదలు. 1999లో విజయవాడ ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా ప్రవేశం. అది తాత్కాలిక ప్రాతిపదికన (అసైన్మెంట్ బేసిస్) లో మాత్రమే కాబట్టి కొంత కాలం వనితా జ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ టైం ఉద్యోగంలో కూడా కొనసాగాను. 2010 సంవత్సరం నుంచి ఆకాశవాణిలో మాత్రమే పని చేస్తున్నాను.
పత్రికల్లో, టీవీలో పనిచేయడం ఒక రకమైన అనుభవం అయితే ఆకాశవాణిలో పనిచేయడం మరొక రకమైన అనుభవం. ప్రింట్, దృశ్య, శ్రవణ (మూడు)మాధ్యమాల్లో పని చేసే అవకాశం నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఏది ఒకదానితో ఒక దానికి పోలిక లేదు. దేని ప్రత్యేకత దానిదే.
ప్రస్తుత ఆకాశవాణి ఉద్యోగ విషయానికి వస్తే నేను సాహిత్యం, జానపదం నాటకాలు, ప్రసంగాలు ఇలా అన్ని విభాగాల్లో పని చేశాను. ‘బి’ గ్రేడ్ డ్రామా ఆర్టిస్ట్ ని కూడా. అప్పుడప్పుడు నాటకాల్లో కూడా పాత్ర పోషిస్తుంటాను. ఇక చేసే పని విషయానికి వస్తే… ప్రసారం చేయాల్సిన కార్యక్రమాన్ని రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, ప్రోగ్రామ్ ని షెడ్యూల్ చేయడం, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చేయడం, కార్యక్రమాలకు స్క్రిప్ట్ రాయడం… శ్రోతలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు, అలాగే ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని కార్యక్రమాలను చేయడం… మొదలైనవి నా విధులు.
కార్యక్రమం ఏదైనా సరే… శ్రోతకి వినిపించాలి అంటే పలు దశల్ని దాటాల్సి ఉంటుంది. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామింగ్,ఇంజనీరింగ్ మూడు విభాగాల సమన్వయంతో మాత్రమే ఒక కార్యక్రమం రూపుదిద్దుకొని శ్రోతకు చేరుతుంది. ఇందులో మళ్లీ పలు ఉప విభాగాలు కూడా ఉంటాయి.
సుమారు పాతికేళ్ల ఈ కాలంలో ఆకాశవాణి కి విచ్చేసిన ఎంతో మంది ప్రముఖుల పరిచయాలు నాకు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు. చిన్నప్పుడు సహజంగా ఉండే అనుమానం రేడియో లోపలికి మనుషులు ఎలా వెళ్లి మాట్లాడుతారు. అనే అనుమానం నుంచి ఏకంగా రేడియోలోనే పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇక
ప్రస్తుత విషయానికి వస్తే ఆకాశవాణిలో ప్రతి శని, ఆదివారాలు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే చిన్న పిల్లల కార్యక్రమం ” బాలానందం” ‘బాల వినోదం’ చేస్తున్నాను.
ఏ విభాగంలో, ఏ పని చేసినా… నా వృత్తి, ప్రవృత్తి రెండూ ఒకటే కాబట్టి ఇక్కడ చేసే ప్రతి పని నాకు ఆనందాన్ని ఇచ్చేదే. అందువల్లనే గత పాతకేళ్ళుగా ఆకాశవాణితో నా ప్రయాణం కొనసాగుతోంది.
చివరిగా మరో విషయం కూడా పిల్లల కోసం ‘కథా ప్రపంచం’ అనే యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టాను. వీలైతే వినగలరు. అలాగే మీ, (మీకు తెలిసిన) చిన్నారులను ఆకాశవాణి ‘ బాలానందం ‘ కార్యక్రమం లో పాల్గొనేట్టు ప్రోత్సహించగరు. ధన్యవాదాలు.
పింగళి ప్రమీల
ఫోన్: 9494541268

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీ బాల కృష్ణ లీలలు

శర్వాణి మానస పుత్రిక – మృణాళిని