ఓ మనసా ఏమిటి నీ పరుగు….
ఎక్కడికి చేరాలని…..
అటు గతానికా ఇటు భవిష్యత్తుకా
ఏముంది అక్కడ పొందడానికి. ఒకసారి వెనుతిరిగి చూడు……
గతం రాదు, భవిష్యత్తు నీది కాదు
విసిగి వేసారి పోవటం లేదా…
అలసి సొలసిపోవటం లేదా నీవు…
వర్థిల్లు వర్తమాన నిర్మితిలో
స్థిరంగా ఉంటే నీకు సుస్థిరత.
ఏ అపసోపాలుండవు….
నీలోనే ఉంది ఈ విశ్వమంతా
ఎక్కడికి చేరాలంటే అక్కడికి చేరగలవు…..
నీవే ఒక అనంత జ్ఞానానివి,
దేహికి ఒక ప్రబోధకానివి…
జ్ఞానికి మార్గదర్శివి…
ఎందుకు ఈ అర్థం లేని పరుగులు
నీలోనే ఉంది అనంతశక్తి…
మరుగెందుకు మనసా….
వగపెందుకు మనసా….
నీవు వ్యర్థపదార్థానివి కావు
పరమార్ధానికి దారి చూపే పరాశక్తివి
దేనికి ఈ వెతుకులాట….
నిశ్చల సాక్షిగా చూడు సర్వాన్ని…
అప్పుడు ఆనందమే అంతా ఆనందం కాదేమి వింత
ఏమిటి నీ పరుగు ఓ మనసా…
మనోవిలాస మర్మం తెలుసా