రచనలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి – డా. పులిగడ్డ విజయలక్ష్మి

సరస్వతీ సమ్మాన్, స్వర్ణ కంకణ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత్రి, కవయిత్రి డా. పులిగడ్డ విజయలక్ష్మి గారితో తరుణి ముఖాముఖి….అరుణ ధూళిపాళ.

జీవితంలో ఏదైనా సాధించాలనుకోవడం సహజం. కానీ అది అంత సులభసాధ్యం కాదు. అలాగే ఒకప్పుడు ముఖ్యంగా చదువు విషయంలో ఆడవాళ్లకు ప్రోత్సాహం తక్కువ.  అయితే  చదువును అమితంగా ప్రేమించి, సంకల్పబలం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ డాక్టరేట్ సాధించి,  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొంది, కవయిత్రిగా రచయిత్రిగా ఇప్పటికీ తన సాహితీసేవను కొనసాగిస్తున్న డా. పులిగడ్డ విజయలక్ష్మి గారి జీవితం గురించి ఆమె మాటల్లోనే చూద్దాం..

అమ్మా నమస్కారం….

1. మీరు జన్మించిన స్థలం, పుట్టినతేదీ, బాల్యం గడిచిన తీరును, విద్యాభ్యాసాన్ని వివరించండి.

జ. నమస్కారమండీ.. నాపేరు పులిగడ్డ విజయలక్ష్మి. నేను అక్టోబర్1,1942 న గుంటూరులో జన్మించాను. తెలుగు తిథుల్లో చెప్పాలంటే విజయదశమి రోజు. అందుకే మావాళ్ళు నాకు విజయలక్ష్మి అని పేరు పెట్టారు. నేను ఏడాది వయస్సు ఉన్నప్పుడే మా నాన్నగారు గతించారు. మా అమ్మ నన్ను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. మాతామహుల ఇంట్లో పెరిగాను. మా పూర్వీకులు జమీన్లు. కానీ దానధర్మాలు ఎక్కువ కావడం వల్ల ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. మా అమ్మగారి పేరు ఆయలూరి లలితాదేవి. నాన్నగారు ఆయలూరి సుబ్బారావు. ఇక చదువు విషయానికి వస్తే బి.ఏ. వరకు గుంటూరులో చదివాను. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో  ఎమ్.ఏ, పిహెచ్ డి లు చేసాను.

డా. పులిగడ్డ విజయలక్ష్మి

2. నాన్నగారు అంత చిన్నప్పుడు చనిపోవడం వల్ల మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఆటంకాలు ఏమైనా ఎదుర్కొన్నారా?

జ.ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. మా అమ్మగారికి నన్ను చదివించాలని బాగా కోరిక. 12 ఏళ్ళ వయస్సులోనే మా మేనమామతో వివాహం జరిగింది   (పులిగడ్డ శివానంద శర్మ ).గుంటూరులో ఎస్.ఎస్.ఎల్.సి పాస్ అయినప్పుడు ఆ వీధి వాళ్ళు వచ్చి మీ మనవరాలు 1st వచ్చిందని పేపర్ చూసి చెప్పడం గొప్ప ఆనందం. ఇక ఆ తర్వాత ఏం చేయాలని ప్రశ్న. మా తాతగారు హిందీ, ఇంగ్లీష్ వచ్చు కదా ఇంకా చదువెందుకు అన్నారు. మావారి అన్నగారు (పెద మేనమామ) పెళ్లి అయింది కదా చదువెందుకు? అన్నారు. చదువుతానని నేను, చదివించాల్సిందేనని అమ్మ పట్టు పట్టాము. మీరు నమ్మరు.. అపుడు నాకొక ఆలోచన వచ్చింది. నాకు పెళ్ళిలో పెట్టిన అమ్మమ్మ గారి బుట్టాలు తాతయ్య చేతికిచ్చి ఇవి అమ్మి, వచ్చిన డబ్బులతో ఫీజు కట్టమన్నాను. అంతకు ముందే మావారు “అందరూ ఫెయిల్ అయితే అది మాత్రం 1st క్లాస్ లో పాసయింది కదా! నెల నెలా నేను డబ్బులు పంపిస్తాను చదివిద్దాం” అన్నారు. అప్పటికి ఆయన మాథ్స్ టీచరుగా ఉదయగిరిలో చేస్తున్నారు. సరేనని తాతయ్య ఫీజు కట్టి గుంటూరులోని ” గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్” లో చేర్చారు.అక్కడే ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యాయి. ఇంటర్ అయిపోయాక బాబు పుట్టాడు. ఒక సంవత్సరం పాటు చదువు ఆగింది. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశాను. ఆ లెక్చరర్ల ప్రభావంతో లెక్చరర్ ని అవ్వాలన్న కోరిక బలీయంగా నాటుకుంది. దాంతో ఎమ్. ఏ చేయాలనుకున్నా. ఎప్పుడూ చదువు ధ్యాసే ఉండేది.

3. తిరుపతిలో మీ విద్యాభ్యాసానికి సంబంధించిన అనుభవాలు ఎటువంటివి?

జ: డిగ్రీలో అత్యధిక మార్కులు ఉండడం, ఇంటర్వ్యూలో ( ఆరోజుల్లో ఇంటర్వ్యూలు ఉండేవి ) వారికి నేను ఇచ్చిన సమాధానాలు నచ్చడం వలన తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సీటు వచ్చింది. మా తాతగారు, అమ్మ, నేను, బాబు, మూడునెలల పాపతో తిరుపతిలో ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అప్పుడు ఎంతో ఇష్టంతో కష్టపడి చదివేవాళ్ళం. అస్తిపాస్తులు ఉన్నాయనో, డబ్బు ఉందనే ధీమాతోనో లాపర్వాగా చదివిన చదువులు కావు.  ఉదాహరణకు ఒక్క విషయం చెబుతాను. పింగళి  లక్ష్మీకాంతం గారికి నేను ప్రత్యక్ష శిష్యురాలిని. అది నాకు పుణ్యంగా, మహాద్భాగ్యంగా భావిస్తాను. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఒక ఆదివారంనాడు సంస్కృతం క్లాసు తీసుకుంటానని మమ్మల్ని కాలేజ్ కి రమ్మన్నారు. 8గంటలకు క్లాసు అంటే 7.45 కల్లా అందరం క్లాసురూంలో ఉన్నాము. సరిగ్గా 8గంటలకు ఆయన క్లాసులో అడుగుపెట్టారు. అదీ పంక్చువాలిటీ అంటే. సంస్కృత వ్యాకరణం ప్రారంభించారు.దాదాపు పన్నెండున్నర,ఒంటిగంటవరకు ఆయన గళం ఆగలేదు, మేమెవ్వరమూ కదల్లేదు. అంత గొప్ప బోధన అది. ఇప్పటికీ ఆనాటి వ్యాకరణం చెవుల్లో గింగురుమంటూ ఉంటుంది. ఇప్పుడేముంది?.. అంతేకాక భద్రరాజు కృష్ణమూర్తిగారు మాకు రీడర్, కోరాడ మహాదేవ శాస్త్రిగారు, పంగనామాల బాలకృష్ణగారు వీళ్లంతా దిగ్ధంతులు. వారి బోధనలో చదువుకున్నాను కాబట్టి నేను కూడా అంతో ఇంతో చదువు నేర్చుకున్నానని భావిస్తాను. అదే సమయంలో ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఇవ్వడం ప్రారంభించారు (1963 ). మేము అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి 23 మందిమి ఉంటే అధిక మార్కులతో గోల్డెమెడల్ నేను సాధించాను. అలా యూనివర్సిటీలో మొదటి గోల్డ్ మెడలిస్ట్ నేను కావడం గర్వకారణం.

4. మీకు డాక్టరేట్ లభించిన నేపథ్యం ఎటువంటిది?

జ: నాది ఎమ్.ఏ అయిపోయాక గుంటూరుకు వచ్చాము. ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాను. మొదటగా ట్యుటోరియల్ లో మాథ్స్ టీచరుగా కెరీర్ ప్రారంభించాను. నెల తిరిగేసరికి చిత్తూరులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. సంవత్సరం తర్వాత గుంటూరు బదిలీ అయింది. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా తెలుగు అకాడమీ పెడుతుండడంవల్ల మా వారిని అక్కడికి వెళ్లమని వాళ్ళ ప్రొఫెసర్ సూచించడం వల్ల ఆయన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అకాడమీలో చేరారు. ఆయన కూడా పూనా యూనివర్సిటీ లో లింగ్విస్టిక్స్  ( భాషాశాస్త్రంలో ) యూనివర్సిటీ ఫస్ట్. ఈలోగా నేను హైదరాబాద్ కు డిప్యుటేషన్ మీద తెలుగు అకాడమీకి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే అలిపిరాల విశ్వంగారి సూపర్ విజన్లో ” స్వాతంత్య్రానంతర ప్రజా కవిత్వం” మీద ఎంఫిల్ చేసాను. ఆ తర్వాత మడుపు కులశేఖర రావుగారి వద్ద “తెలుగు కావ్య నాయికలు ” అనే అంశంపై పి.హెచ్.డి.చేసాను. రామాయణ, మహాభారతం నుండి ప్రబంధాల వరకు తీసుకున్నా. ఎమ్.ఏ. అంతా ఆధునికం అయితే పి హెచ్ డి ప్రాచీనం. మా తాతగారు భాషా ప్రవీణ. మా అమ్మ వేల పద్యాలు రాసింది. అందుకే వారి ప్రభావం నాపైన ఉంది. ఇక ఉద్యోగం, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్లు, మధ్యమధ్యలో నా రచనలు.. ఇలాంటి వాటితో పి.హెచ్.డి.కొంత ఆలస్యమైంది. ఎమ్.ఏ లో పింగళి గారి బోధనకు ఎంత అనురక్తురాలినయ్యానో చెప్పలేను. అలాగే ఇక్కడ కులశేఖర రావు గారు నాకు మహోపకారం చేశారు. వారిద్దరినీ జీవితంలో మరువలేను. ఎలాగంటే.. వారే రెండు మూడు సార్లు నాకు ఫోన్ చేసి “ఏంటమ్మా నువ్వు రావాలి కదా, చేయాలి కదా!” అన్నారు. వ్యక్తిగత బాధ్యతలతో సమయము లేదని, నేను చేయలేకపోతున్నా అన్నాను. అప్పుడాయన నేను అడగకుండానే నాకు సహాయం చేసారు. అది నా అదృష్టం. ఇక మా వారు టైపింగ్ పనులు చూసారు.ఇలా అందరి సహకారంతో డాక్టరేట్ పొందాను.

ఇక నా విద్యార్థుల విషయానికి వస్తే నండూరి రామకృష్ణ గారి రెండవ కుమారుడు నండూరి శోభనాద్రి నా శిష్యుడు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీలో 1st గోల్డెమెడల్స్ పొందినవారు నా శిష్యులు. టి. వి డైరెక్టర్ మంజులానాయుడు, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ శైలజ, ప్రముఖ రచయిత పిల్లలమర్రి హనుమంతరావు గారి ముగ్గురు కూతుళ్ళు, బేగంపేట కాలేజీ లెక్చరర్ మిసెస్ జేమ్స్ అని వాళ్ళ కూతురు మాలా బెన్ ఐపీఎస్..వీళ్లంతా నా శిష్యులే. అలా ఎంతోమంది…మరో విషయం నా ఇద్దరు కూతుళ్లు, పెద్ద అబ్బాయి ముగ్గురూ గోల్డ్ మెడలిస్టులు. రెండవ కొడుకు పి డి ఎస్ గిరినాథ్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, కోచ్ కూడా.. ఇది నా గొప్పతనమని కాదు. వాళ్ళు చదువుకున్నారు. మేము చదివించాము. కాబట్టి చదువుకోవాలనే కోరిక విద్యార్థుల్లో ఉండాలి.

5. మీ సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో అనుభూతులు, అనుభవాలు ఎటువంటివి?

జ. నాకు ఆంధ్రప్రదేశ్  చిట్టచివరి జిల్లా చిత్తూరులో మొట్టమొదట ట్యూటర్ పోస్ట్ వచ్చింది. ఆర్డర్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. డైరెక్టర్ ఎల్. బుల్లయ్య గారు. ఆయన జాయింట్ సెక్రటరీని కలవమన్నారు. ఆయన సెక్షన్ కి వెళ్ళమన్నారు. సెక్షన్ సూపరింటెండెంట్ క్లర్క్ కి చెప్పాడు. క్లర్క్ నాకు టైప్ చేసిన ఆర్డర్ చేతికిచ్చాడు. అందులో చిత్తూరుకు అపాయింట్ అయినట్టు ఉంది. అపుడు నాకు 20 ఏళ్ళు. నేను వెంటనే సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్లి ” చిత్తూరుకు వేశారు. అక్కడ కాలేజ్ లేదు కదా!” అన్నాను.( నవ్వుతూ…. ..ఊరుకోవచ్చు కదా అలా అడిగాను) ” లేదమ్మా, కాలేజ్ పెట్టారు. మీరు వెళ్లి జాయిన్ అవ్వండి” అన్నారు ఆయన సౌమ్యంగా. అప్పుడు నేను “లేదండి. మాది గుంటూరు. ఇద్దరు పిల్లలు. నేను చిత్తూరుకు వెళ్లలేను. గుంటూరులో ఇవ్వండి. లేకుంటే లేదు” అని ఆర్డర్ కాగితం ఆయన టేబుల్ మీద పెట్టి వెనుతిరిగాను.     (గట్టిగా నవ్వుతూ ఎవరైనా వింటే నవ్వుతారు.. గవర్నమెంట్ ఉద్యోగం వదులుకుంటారా ఎవరైనా ) ఏంటంటే నేను యూనివర్సిటీ ఫస్ట్. ఇది కాకపోతే ఇంకోటి అని. అలాంటి ఆలోచన రాకూడదు. కానీ కలిగింది. నేను, మా తాతగారు గేటు దాటి బయటకు రాగానే ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చి ” అమ్మా! మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు” అన్నాడు. వెనక్కి తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాం. అప్పుడాయన ” అమ్మా! నీ మంచి కోరి చెబుతున్నా. నా మాట విను. ( ఎవరంటారు అలా…) ముందు నువ్వు చిత్తూరులో జాయినవ్వు. ఆ తర్వాత సంవత్సరం వరకు నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ వేయిస్తా” అని నచ్చచెప్పారు. నిజంగా అది భగవంతుని కృపనా, మానవత్వమా…అర్థం కాలేదు. సరేనని ఆయనకు నమస్కరించి ఫ్యామిలీతో చిత్తూరుకు వెళ్ళాను. 1964 విషయం ఇది. ఎక్కడ దిగాలో తెలియదు. నేరుగా కాలేజ్ కి వెళ్లి, జాయిన్ అయ్యి లేడీస్ స్టాఫ్ రూంకి వెళ్ళాను. అక్కడున్న ముగ్గురు, నల్గురు లెక్చరర్లతో నేను మా ఫ్యామిలీతో, సామనుతో సహా వచ్చాను. ఎక్కడ ఉండాలో అర్థం కావడంలేదు. అన్నాను. బోటనీ లెక్చరర్ ధనలక్ష్మి “మా ఇంటికి రండి” అన్నది. ఒక్కటే చిన్న హాలు అది. అందులోనే సర్దుకొని ఇల్లు వెతుక్కున్నాను. ఇంకో విషయం. చిత్తూరు డిగ్రీ కాలేజ్ లో నండూరి రామకృష్ణమాచారి గారు హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్. ఒక వారం రోజుల తర్వాత ఆయన ఏదో పనిమీద తిరుపతి యూనివర్సిటీకి వెళ్లి వచ్చారు. వచ్చాక “అమ్మాయ్ ఇలా రా” అని పిలిచి తాను తిరుపతికి వెళ్లిన విషయం చెప్పి అక్కడ యూనివర్సిటీ లో పింగళి లక్ష్మీకాంతం గారు, ఆచార్య భద్రిరాజు గారు, చెన్నారెడ్డి గారు వీళ్లంతా ‘విజయలక్ష్మి ఎలా ఉంది’ అని అడిగారని చెప్పాడు. ” అసలేంటి నువ్వు…ప్రతివారూ నీ గురించే అడుగుతున్నారు. నీ గురించి నాకేం అర్థం కావడం లేదు” అన్నారు నవ్వుతూ..అప్పటినుండి ఆయన నన్ను కన్నతండ్రిలా చూసారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నాకు సహాయం చేసారు. అది నా గొప్ప పుణ్యం. ఇక ట్రాన్స్ ఫర్ సంగతి. జి.ఎస్. ఆచార్య గారు అని మా కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన కూడా తెలుగు డిపార్ట్ మెంటే. ఆయన నాతో “అమ్మా! నేను హైదరాబాద్ వెళ్తున్నా” అన్నారు. “సార్! నా అప్లికేషన్” అని బదిలీ అప్లికేషన్ ఇచ్చాను. నేను చెప్తాను బుల్లయ్యకు అన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అట. నాకేం తెలుసు? అంతేకాదు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా పట్టుకొని వచ్చారు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి వెంటనే వెళ్ళాలి. జీతం ఇంకా రాలేదు. ప్రిన్సిపాల్ గారే 150 రూపాయలు ఇచ్చారు. సామానంతా సర్దుకొని బయలుదేరాను. నండూరి రామకృష్ణ గారు మా ఇంటికి వచ్చి దగ్గరుండి మమ్మల్ని రిక్షా ఎక్కించి, మరో రిక్షాలో ఆయన బస్ స్టాండ్ కి వచ్చి బస్ ఎక్కించి 150 రూ. ఖర్చులకు ఇచ్చారు. అంతటి ఔదార్యులు వాళ్ళు. గుంటూరు నుండి చీరాలకు ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడినుండి మావారు తెలుగు అకాడెమీకి డిప్యుటేషన్ మీద హైదరాబాద్ కు వేయించారు. అలా 1973 నుండి 5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసి చిట్టచివర 2000 సంవత్సరంలో వివేకానంద కాలేజ్ విద్యానగర్లో రిటైర్ అయ్యాను.

 

6. విశ్వ సాహితీ సంస్థవారు ప్రచురించిన “నాటి పురాణం – నేటి సమాజం” దేన్ని గూర్చి విపులీకరిస్తుంది?

జ: విశ్వ సాహితీ సంస్థలో పోతుకూరి సాంబశివరావు గారు వెళ్ళిపోయాక దానికి జయరాములుగారు అధ్యక్షులైనారు. మాకు బాగా తెలిసిన

వ్యక్తి. పురాణాలను వెలికి తీసుకురావాలని ఆయన కోరిక. వాటిలో ఉన్న విషయాన్ని మన సమాజానికి ఎంత ఉపకరమో, ఏది గ్రహించాలో దానిని విమర్శనాత్మక దృష్టితో, సామాజిక స్పృహతో రాయాలని ఆయనకు ఆలోచన కలిగి నాకు ఫోన్ చేశారు. మీరు కూడా ఏదైనా ఒక దానిమీద రాయమని చెప్పి, మీరు ఏది రాస్తానంటే అదే ఇస్తామన్నారు. అప్పటికే నా దగ్గర కొన్ని పురాణాలు ఉన్నాయి. దాంట్లో బ్రహ్మ వైవర్త పురాణం ఉంది. దానిపైన రాస్తానన్నాను. దానికోసం 20, 30 సార్లు చదివాను. అందులో విపులంగా ఏది తీసుకోవాలో, ఏది వదిలేయాలో అన్నీ తయారుచేసాను. ఆయన కూడా కొన్ని సూచనలిచ్చారు. అలా కొంతమందికి ఆయన ఈపని అప్పగించారు. అందులో మొట్టమొదటగా రాసిచ్చినది నేనే.

7. “నారాయణ ద్విశతి” లఘు పద్యకావ్య రచన ఆలోచనా తరంగానికి ప్రేరణ ఏమిటి?

జ:  ‘నారాయణ ద్విశతి’ మొత్తం కంద పద్యాల రచన. రిటైర్మెంటు అయ్యాక నేను కొన్ని విషయాలను గమనించాను. మన సంప్రదాయంలో శవాన్ని ఎత్తినపుడు నారాయణ, నారాయణ అంటారు. శైవులైతే శివ శివ అంటారు. ఒక్క నామం చేతనే మోక్షం సిద్దిస్తే నారాయణ నామాన్ని రామకోటి లాగా రాస్తే ఎంతో పుణ్యం కదా. అని ఆ భగవంతుని కృప వలన ఆలోచన వచ్చింది. వెంటనే ఆ పుస్తకాలు తెప్పించుకుని ‘ఓం నమో నారాయణ’ అని అష్టాక్షరి రాస్తుండేదాన్ని. నా మూడవ కూతురు ఉష “అమ్మా, ఎన్నో పద్యాలు చక్కగా రాస్తావు కదా! ఈ నామాలు రాయడం దేనికి? విష్ణుమూర్తి మీద పద్యాలు రాయొచ్చు కదా” అన్నది. అదే ప్రేరణ నాకు. సరేనని రాయడం మొదలుపెడితే 200 పద్యాలు అయ్యాయి. మా ఇంటికి దగ్గర్లో  ‘శ్రీవెంకటేశం’ మాసపత్రికకు సంబంధించి ‘వెంకటేశ మహా మంత్రం పీఠం’ అనే పేరుతో ఆఫీసు ఉండేది. మా అమ్మాయి వాణి ఆ పత్రిక నిర్వాహకులు సాయిరెడ్డి గారిని ఈ శతకం వేస్తారా? అని మాటవరుసకు అడిగితే తప్పకుండా వేస్తాం కానీ వీటి అర్థాలు మాకు తెలియవు. అందుకే మీ అమ్మగారిని వీటికి భావాలు కూడా రాసి ఇవ్వమని చెప్పమన్నారు. అలా భావాలు రాసి పంపితే ఆ మాస పత్రికలో ధారావాహికంగా వేశారు. ఆ తర్వాత నేను వారితో ఈ పీఠం ద్వారానే ఇది ప్రింట్ అవుతే బాగుంటుందని అన్నాను. వారు ఒప్పుకోవడం, ప్రింట్ చేయడం, ఆవిష్కరణ అన్నీ జరిగిపోయాయి.  కొన్నేళ్ల తర్వాత బేగంపేట కాలేజీలో రంగయ్యగారని ( హిందీ హెడ్ ఆఫీస్ వారు) ఆ పద్యాలను హిందీలోకి అనువదించారు. నిజంగా చెప్తున్నాను ఇది అంతా ఆ సరస్వతి అమ్మవారి కటాక్షమే తప్ప మరోటి కాదు.

8. శతక సాహిత్యంలో ఎన్నో శతకాలు ఉండగా కానూరి లింగమూర్తి గారి శతకానికి భావానువాదం చేయడానికి కారణం చెప్తారా?

జ: మంచి ప్రశ్న.  బ్రౌన్ అకాడెమీ వారు నన్ను పిలిచి భాగవతం విద్యార్థులు చదవడం లేదు. ఏవీ అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి కృష్ణలీలలు కానీ రుక్మిణీ కళ్యాణం, గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర ఈ నాలుగు అంశాల పైన స్పష్టంగా పోతన రసమాధుర్యాన్ని తెలుపుతూ రాసిస్తే ప్రింట్ చేస్తామన్నారు. అసలే భాగవతమంటే ఇష్టం. పోతన అంటే చచ్చేంత ఇష్టం. భక్తికి, ఆధ్యాత్మికతకు, మాధుర్యానికి పోతన, కావ్య శిల్పానికి తిక్కన, మనలను పరుగులెత్తించడానికి శ్రీనాథుడు ఇలా ఒక్కొక్కరు గొప్పవారు. వాళ్ళు నాకు రాయమని ఇచ్చిన పుస్తకాల్లో  మూడు పూర్తి చేసి ఇచ్చాను. నాల్గవది రాస్తూ వున్నా. అక్కడ వుండే డైరెక్టర్ మూర్తిగారు నాతో కానూరి లింగమూర్తి గారు తొమ్మిది శతకాలు కలిపి ‘శతకమంజరి’ పేరుతో రాసారని, వారి ముని మనవడు మురళి అమెరికాలో ఉంటాడని, వారి తాతగారి పుస్తకం ప్రింట్ కావాలని నన్ను కోరుతున్నాడని అందువల్ల మీరు ప్రతిపదార్థం రాయకపోయినా కనీసం భావం రాస్తే చాలన్నారు. నాకు సమయం చిక్కదని, అకాడెమీలో ఎంతోమంది వున్నారు. వాళ్ళచేత చేయించమని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. మీరు సమయం తీసుకొని అయినా రాయండని అన్నారు. సరేనని ఒక్కొక్క పద్యం చదువుతుంటే ఆహా! ఒకే పద్యంలో..సీసంలో చంపకమాల, చంపకమాలలో ఉత్పలమాల, ఉత్పలమాలలో కందం, కందంలో తేటగీతి ఇలా ఉన్నాయవి. కళ్ళు తిరిగాయి నాకు. నాగబంధం, గరుడబంధం, పద్మబంధం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్కో పద్యాన్ని 10, 15 సార్లు చదివాను. గొప్ప విషయం ఏమిటంటే పక్షవాతం వచ్చి మంచం మీద పడుకొని లింగమూర్తి గారు చెప్పిన పద్యాలవి.  తిరుమల రామచంద్రరావు గారి లాంటి వాళ్ళు పీఠికలు రాసారు. అందివచ్చిన అవకాశంగా భావించి మొదలు పెట్టాను. అయితే వారానికొకసారి మూర్తిగారు ఫోన్ చేసి మురళి గారు తొందరపడుతున్నారని, ఎప్పుడు అవుతాయని, ఆయన అమెరికా నుండి రానున్నారని అడుగుతూ వున్నారు. సగం పూర్తయిందని మిగతా సగం ఎవరితోనయినా రాయించుకోమన్నాను. లేదు..మీరే రాయండి అన్నారు. చాలా బాధగా అనిపించింది. ఏంటి నా గొప్ప? ఇన్నిసార్లు పెద్దాయనతో అడిగించుకుంటున్నానని,  ఆరోజు నుండి మూడు నెలలు రాత్రింబవళ్లు తిండీ తిప్పలు మానేసినట్టుగా రాసాను. అమెరికా నుండి మురళి గారు వచ్చి, పుస్తకాలు ప్రింట్ చేయించారు. ఆయన్ని చూడడం అదే మొదటిసారి. ఆ పుస్తకాలను ఆయన తమ బంధువులలో పాండితీ ప్రతిభ ఉన్నవారికి చూపిస్తే వాళ్లంతా ముక్తకంఠంతో ఏమీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టు వేయమన్నారట. ఆ విషయం ఆయనే స్వయంగా సమావేశంలో చెబుతూ నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఆనందించాల్సిన  విషయమది.

 

9. పాల్కురికి సోమనాథుని కవితా వైభవాన్ని గురించి ఎందుకు రాయాలనిపించింది?

జ: ఎందుకు రాయాలనిపించకూడదు? (నవ్వుతూ ) పోతన భాగవతం రాయాలనిపించే రాసాను. నారాయణ ద్విశతి అంతే.  నేను ఎమ్.ఏ చదివే రోజుల్లో జి.ఎన్. రెడ్డి గారు అని ( ఆ తర్వాత వి.సి. అయ్యారు ) ప్రీవియస్ లో బసవపురాణం బోధించారు. దాంట్లో బెజ్జ మహాదేవి గురించి చదివి వినిపించారు. రెండుసార్లు వినేటప్పటికి నాకు నోటికి వచ్చేసింది. అంత మాధుర్యం ఉన్న కవిత్వం అది. శివుని తన కొడుకులా భావించి బెజ్జమహాదేవి తల్లిగా సపర్యలు చేసిన కథ అది. అలాగే గొడగూచి కథ కూడా. ఇలాంటి భక్తుల కథలు విన్న తరువాత ఒళ్ళు పులకించిపోయింది. అందుకే ఆయన కవిత్వ గొప్పదనాన్ని రాయాలనే కోరిక కలిగి రాసాను.

10. ‘వ్యాస కౌముది’ పేరిట మీరు రాసిన వ్యాసాలు వెలువడిన సందర్భాన్ని వివరించండి.

జ: మొట్టమొదటి నుండీ నేను రేడియోకి వ్యాసాలు రాసేదాన్ని. హైదరాబాద్ కి వచ్చాక రాయడం ఎక్కువైంది. నేను రాసిన టాక్స్, పాటలు, వ్యాసాలు రేడియోలో వచ్చేవి. అంతేగాక ప్రతీ సంవత్సరం జరిగే భారతీయ కవి సమ్మేళనంలో ( వివిధ భాషలు ) పాల్గొనేదాన్ని. నాటికలు కూడా రాసాను. వాళ్ళు ఒక్కొక్క టాపిక్ ఇచ్చి దాని మీద రాయమనేవారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆశాపూర్ణాదేవి గారి మీద కూడా రాయమని నాకు ఆఫర్ వచ్చింది. అలాగే రావూరి భరద్వాజ గారు, తురగా జానకీరాణి గారు వీళ్ళ గురించి రాయమని మంచి అవకాశాలు వచ్చాయి. రాసాను. అలాగే ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రికలకు కూడా వ్యాసాలు రాసాను. టీవీలకు రాసాను. పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు రాసిన వ్యాసాలూ ఉన్నాయి. ఆధ్యాత్మిక మైన విషయాలకు సంబంధించినవి. పురాణాల్లో మనసుకు నచ్చిన అంశాల పట్ల రాసినవి ఇలాఎన్నో .. వీటన్నింటినీ కలిపి ‘వ్యాసకౌముది’ వేశాము.

11. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన మీ “పోతన భాగవతం – భక్త శిఖామణులు”

రచన గురించి చెప్పండి.

జ:  ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ అంశం వాళ్ళు ఇచ్చినదే. ఆధ్యాత్మిక, సామాజికంగా, వైజ్ఞానిక రంగంలో ఇలా వివిధ అంశాలపై రచనలు రావాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో నాకు పోతన భాగవతంలోని భక్తుల గురించి ఇచ్చారు. ఎంతోమంది భక్తులలో 9 మందిని తీసుకున్నాను. పరీక్షిత్తు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, రుక్మిణీ, నారదుడు, అంబరీషుడు, గజేంద్రుడు, భీష్ముడు, కుచేలుడు.. వీళ్ళ భక్తి తత్పరతను గురించి రాసాను.

12. మీ రచనల్లో ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతటి ఆధ్యాత్మిక చింతన ఏర్పడడానికి కారణం ఏమిటి?

జ:  వారసత్వం కూడా కావచ్చు. నా సొంతం కూడా వుంది. రచనల గురించి చెప్పాలంటే నేను చిన్నప్పుడు అనేక స్కెచ్ లు రాసాను. కథలు, కవితలు కథానికలు,నవలలు అన్నీ రాసాను. ఏదీ వదిలిపెట్టలేదు. ఆముద్రితాలు కూడా చాలా ఉండేవి. ఎక్కడ పోయాయో తెలియదు. 30 ఏళ్ళ వరకు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను. తెలుగు అకాడెమీకి వచ్చినప్పటి నుండి దృష్టి మరలింది. వేలూరి సహజానంద గారు ఆయన అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో చీఫ్ గా వుండేవారు. ఆయన కొత్తపల్లి వీరభద్రరావుగారికి ఫోన్ చేసి విశ్వనాథ సత్యనారాయణ మీద సెమినార్ పెట్టాం. మీ అకాడెమీ నుండి ఎవరైనా రిపోర్టర్ ను పంపించండి. అని అడిగారు. వీరభద్రరావుగారు నన్ను పిలిచి విశ్వనాథ వారిమీద ఉపన్యాసాలు ఉన్నాయట. సహజానంద గారు పిలుస్తున్నారు. వెళ్ళి ఎవరెవరు ఏమిచ్చారో రిపోర్ట్ రాసి ఇవ్వండి. వాళ్ళు బ్రాడ్ కాస్ట్ చేస్తారట అన్నారు. తప్పదుగా వెళ్ళాను. రెండు మూడు రోజులు జరిగాయవి. రిపోర్ట్ సహజానందగారికి ఇచ్చి వచ్చాను. ఆయన కొత్తపల్లి వీరభద్రరావుగారికి ఫోన్ చేసి మీ అకాడెమీలో ఇంత బాగా రాసేవాళ్ళున్నారా? అన్నారట. చెప్పాలంటే ఒక్కో ప్రక్రియ ఒక్కో రకంగా ఉంటుంది. శైలీ విధానం వేరుగా ఉంటుంది.రిపోర్ట్ అనేది సమీక్ష కదా..వివరంగా రాయాలి. అప్పటినుండి సహజానంద గారు దేనికైనా నన్నే పిలిచేవారు. రావూరి భరద్వాజ గారు కూడా నన్ను వదలిపెట్టలేదు. తురగా జానకీరాణి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇక ఇంటి వాతావరణంలో పూజలు, వ్రతాలు చేసేదాన్ని. చిన్నప్పటినుండీ ఆధ్యాత్మికత ఉండేది. తాతయ్య, అమ్మ, మావారు అందరూ ఆధ్యాత్మిక చింతన ఉన్నవారే. పద్యాలు రాసేదాన్ని కదా.మా అమ్మ, నేను కలిసి ‘శ్రీకృష్ణ విలాసం’ అనే ప్రబంధాన్ని రాసాము. అప్పుడు నాకు 18 ఏళ్ళు. విగ్రహ స్థాపనలు చేసేటప్పుడు కొంతమంది అమ్మవారిమీద, అయ్యవారి మీద పుస్తకాలు రాసివ్వమని అడిగేవాళ్ళు. ముకుందమోహిని అనే పేరుతో అమ్మవారి మీద పద్యాలు రాసాను ( శంభు మోహిని లాగా ). రామకృష్ణ మఠం వారు పిలిచి పోతన భాగవతంలోని దశమస్కంధంలోని ప్రతీపద్యాన్ని మాకు భావం రాసి ఇవ్వమని అచ్చు వేస్తామన్నారు. 25 వేల కాపీలు వేశారు. అన్నీ అయిపోయాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో భాగం ఇచ్చారు. నా అదృష్టవశాత్తు దశమస్కంధం లభించింది. భాగవతమంతా “శ్రీకైవల్య పదంబు చేరుటకునై” పద్యం నుండి మొదలుకొని 12 స్కంధాలు వచనంలో రాసాను. మహాభారతం లోని మహోపాఖ్యానాలు, శివలీలలు ఇంకా రాస్తున్నాను. ఇవన్నీ నాకు అందివచ్చిన అవకాశాలే. ఏది ఏమైనా అదంతా భగవంతుని కృపనే కానీ మరొకటి కాదని భావిస్తాను.

13. మీరు రాయని ప్రక్రియ లేదని మీరే చెప్పారు. అందులో మీకు ఎక్కువ మక్కువ కలిగించింది ఏది?

జ: ఇక్కడ ఇది ఇష్టం అని చెప్పడానికి లేదు. కానీ ఏదైనా ఒక అంశం మనసుకు నచ్చినట్లయితే దాన్ని పూర్తిగా వివరంగా సమీక్ష రాయడం నాకు అలవాటు. ఉదా.. పురాణాల గురించి తీసుకుంటే దాన్ని సమాజానికి అన్వయించి రాయడం.ముఖ్యంగా మనం దాంట్లో ఏది తీసుకుంటే బావుంటుంది, దేన్ని వదిలేస్తే బావుంటుంది అనేది ఆలోచించి రాయాలనుకుంటా. భీష్ముడి గురించి రాసాను. భీష్ముడు భారతమంతా ఉంటాడు. ఏ సందర్భాల్లో ఆయన ఏది చెప్పాడు, ఎలా ప్రవర్తించాడు? అందులో ప్రజలకు ఉపయుక్తంగా ఉండేవి ఏవి? దేన్ని అవలంబించాలి అనే దానిపై దృష్టి పెట్టి ఆ విచక్షణతో ఏ ప్రక్రియ అయినా సమగ్రంగా రాసేదాన్ని.

14. ‘కోకిలమ్మ పిలుపు’ వచన కవిత్వ సంపుటి గురించి చెప్పండి.

జ :  ఇందులో మొత్తం నేను రాసిన ఎన్నో కవితలు సంపుటిగా వేశాము. ఇందులో నేను రాసిన వాటిని లలిత సంగీతంలో పాలగుమ్మి విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు పాడారు. మ్యూజిక్ కూడా ఇచ్చారు.

15. మీ ‘శివలీలలు’ రచనకు ప్రేరణ ఎలా కలిగింది?
జ: మా అమ్మ లలితా దేవి. దేవీ ఉపాసకురాలు. ఆమె ఎప్పుడూ అమ్మవారిని తలుస్తుండేది. ప్రహ్లాదుడు చెప్పినట్లు ” పానీయంబున్ త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాస, లీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్,సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాపాన సంధానుండై మరచెన్ సురారి సుతుండు ఏతద్విష్యమున్…” అన్నట్లు నిద్రపోయే ఆ కొద్ది సమయం మినహా ఎప్పుడూ అమ్మవారిని కొలుస్తుండేది. వేల పద్యాలు రాసేది. అయితే నాకొక వేదన మనసును తొలుస్తుండేది. నారాయణ ద్విశతి, భాగవతం రెండూ విష్ణు సంబంధమైనవే. మరి శివుడిని మర్చిపోయానేంటి అని…అయితే ఒకసారి మాడుగుల నాగఫణిశర్మ గారి అవధానంలో పృచ్ఛకురాలిగా వున్నాను. నా పక్కనే మారుమాముల దత్తాత్రేయ శర్మగారు ఉన్నారు. మీరు శ్రీ వేంకటేశం పత్రికకు రాస్తున్నది చదువుతున్నాను. చాలా బాగుంది. అని మా ‘దర్శనం’ పత్రికకు కూడా రాయండి. అన్నారు. ఆ శివుని పలుకుగా శివలీలలు రాస్తానండి అన్నాను. ఆయన ఎంతో సంతోషించారు. నా దగ్గర ఉన్న పది పురాణాల్లో ఒక్కొక్క దాంట్లో శివుని గూర్చి ఏమున్నదో, ఆయన లీలా విలాసం ఏంటి? అలా అంతా చదివి అసలు శివతత్వం అంటే ఏమిటి? అని ఉపోద్ఘాతంతో మొదలు పెట్టి రాశాను. దాదాపు పది ఏళ్లనుండి రాస్తున్నా. ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే ‘అష్టాక్షరి’ వాళ్ళు వచ్చి మాకు కూడా ఏదైనా రాయండి. అని అడిగారు. ‘భీష్ముడు’ రాసి ఇస్తానన్నాను. గత మూడేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ‘సప్తగిరి’ కి కూడా రాస్తూ వున్నా.

16. పీవీ మనోహరరావు గారి “సర్వార్థ సంక్షేమ సమితి” ద్వారా పురస్కారం లభించిన అనుభూతి ఎటువంటిది?

జ:  ‘శ్రీవెంకటేశ్వర’ మాసపత్రిక సాయిరెడ్డి గారి గురించి చెప్పాను కదా! ఆయన ‘రథయాత్ర’ పేరుతో ప్రతీ సంవత్సరం సమావేశం ఏర్పాటు చేసేవారు. అంతకుముందే ‘నారాయణ ద్విశతి’పుస్తకం ప్రింట్ అయింది. రథయాత్ర సమావేశానికి పీవీ మనోహరరావు గారు వచ్చారు. నాకు ఆయానెవరో తెలియదు. సమావేశం పూర్తయి రథయాత్ర కోసం బయలు దేరుతున్నాం. అప్పుడు వారు ఎదురుపడ్డారు. నా దగ్గర ఆగి, పుస్తకావిష్కరణ జరిగినప్పుడు చూసి నన్ను గుర్తు పట్టారేమో! మీ నారాయణ ద్విశతి పుస్తకాన్ని మాకు పంపండి అన్నారు. నాకు ఆయన అడ్రస్ ఏమీ తెలియదు. పెద్దాయన కదా! ఏమీ మాట్లాడలేదు. ఆయనే మీరు పోతుకూరి సాంబశివరావుకు అందజేయండి. ఆయన నాకు పంపుతారు అన్నారు.  ఆయన అడ్రస్ కూడా తెలియదు. కనుక్కుని పంపాను. అపుడు “సర్వార్థ సంక్షేమ సమితి” ద్వారా పురస్కారం ఇచ్చారు. దాంట్లో భాగంగా నారాయణరెడ్డి గారు మొమెంటో ఇస్తే, మనోహరరావు గారు క్యాష్ ఇచ్చారు.  గవర్నర్ రమాదేవి గారు శాలువా కప్పారు.  ఆ తర్వాత ఆయన పుస్తకాలకు కూడా రెండు, మూడు వ్యాసాలు రాయించారు.

17. మీరు పొందిన అనేక పురస్కారాల్లో “ఇది చాలు జీవితానికి” అనుకున్నది ఏది?

జ: ( తడుముకోకుండా ) ‘సరస్వతీ సమ్మాన్’… భోపాల్ వారి అఖిల భారత భాషా సాహితీ సమ్మేళనం అనే సంస్థ వారు ఫిబ్రవరి 17, 2022 లో ఇచ్చారు. నేను భోపాల్ కి వెళ్లలేక పోయాను. అందువల్ల అలా వెళ్ళని వాళ్లకు హైదరాబాద్ లో ఫిబ్రవరి 17, 2023 న ఇచ్చారు. మీరన్నట్లు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. అందులో సరస్వతీ దేవి సన్మానం అంటే అంతకు మించి ఏం కావాలి? పోతుకూరి సాంబశివరావు గారు ‘విశ్వభూషణ్’ ఇచ్చారు. హైదరాబాద్ వారు తెలుగు భాషారత్న ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా “జీవన సాఫల్య పురస్కారం” వచ్చింది. నిన్న గాక మొన్న జూన్ 15 వ తారీఖున (2023) సాహితీ కిరణం వారు పింగళి జగన్నాథం వారి సాహితీ పురస్కారం ఇచ్చారు.

18. అప్పట్లో రచయిత్రులకు, కవయిత్రులకు ఆదరణ ఎలా ఉండేది?                                                                    జ: జ: అప్పట్లో రచయిత్రులు, కవయిత్రులు రాసిన రచనలకు ఆదరణ బాగానే ఉండేది. కోడూరి కౌసల్యాదేవి, యద్ధనపూడి సులోచనారాణి మొదలైన నవలా రచయిత్రులు, కథా రచయిత్రులు వుండేవారు. ఊటుకూరు లక్ష్మీకాంతం గారు తప్ప పద్య రచనలు చేసినవారు తక్కువ. కథలు, నవలలు రాసినవారు చాలా ఎక్కువ.  ఒక రెండు దశాబ్దాలపాటు రాజ్యమేలారు వాళ్ళు.

19. “సాహితీ జిగీష” సంస్థ వ్యవస్థాపకులుగా మీరు చేస్తున్న సాహితీ సేవను వివరించండి.

జ: అంతకుముందు మేము రాసిన పుస్తకాలు ఆవిష్కరించడానికి గానీ, ఉపన్యాసాలు ఇవ్వడానికి గానీ వేరే సంస్థల తోడ్పాటు అవసరం ఉండేది. అలా పదేళ్లు గడిచింది. ఇన్ని సంస్థల్లో తిరిగి చేసాం కదా! మనమే ఒక సాహితీ సంస్థ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. తద్వారా జన్మ ధన్యమౌతుందని భావించి ఆగస్ట్ 24, 2022లో ‘సాహితీ జిగీష’ అనే పేరుతో సంస్థను స్థాపించాము. ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మొదటిసారి సంస్థను పరిచయం చేస్తూ భోజనాలు ఏర్పాటుచేసాము. ఒకసారి పద్య కవిసమ్మేళనం పెట్టి కవులు, కవయిత్రులకు సన్మానాలు చేసాము.  మరోసారి భారతం సహస్రాబ్ది వేడుకల సందర్భంగా ఈ సంస్థలో సమావేశాలు ఏర్పాటు చేసాము. కవిత్రయంపై ఉపన్యాసాలు ఇప్పించాము. మా ఇద్దరు అమ్మాయిల్లో పెద్దమ్మాయి భారతంలో భీమసేనుని పాత్రపై పి హెచ్ డి చేస్తే, రెండో అమ్మాయి అర్జునుని పాత్రపై పి హెచ్ డి చేసింది. మాఇంట్లో భారతం అంటే అందరికీ ఇష్టం. ఆ తర్వాత మా రెండవ అమ్మాయి ఉమాశశి రాసిన పుస్తకావిష్కరణ సమావేశం జరిగింది. దానిని ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ ప్రొఫెసర్ స్వరాజ్య లక్ష్మిగారు ఆవిష్కరించారు. అలాగే మా అమ్మగారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించాము. అందులో భాగంగా బండారుపల్లి రామచంద్ర రావుగారికి “భక్త కవి వరేణ్య” బిరుదును, మరుమాముల దత్తాత్రేయశర్మ గారికి “సాహితీ ప్రభాస” బిరుదునిచ్చి సత్కరించాం. భువనవిజయం ఏర్పాటుచేసి ప్రదర్శన నిర్వహించాము. మా అమ్మగారి శతజయంతి సమావేశం జరిగిన రోజునే ఖమ్మం నుండి మైథిలీ దేవిగారు వచ్చి నాకు స్వర్ణకంకణం బహూకరించడం మా అమ్మ ఆశీర్వాదం. ఆ తర్వాత ఎస్వీ రామారావు గారి సహస్ర పూర్ణ చంద్ర దర్శన సందర్భంగా ఆయనకు పలువురు అర్పించిన అక్షరమాలతో ‘అక్షరదీపిక’ పుస్తకావిష్కరణ జరిపించాము. ఇక వచ్చే ఆగస్టులో మరో సమావేశం జరుగనుంది.

20. ప్రస్తుత రచయిత్రులకు, కవయిత్రులకు మీరిచ్చే సందేశం, సూచన ఏమిటి?

జ: నాదొక్కటే సలహా. ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఏ అంశం తీసుకున్నా అది సమాజానికి ఏరకంగా ఉపయోగపడుతున్నదనేది మన ఆలోచనల్లో ఉండాలి. అది వచనమా, పద్యమా, కథా, నవలా అన్నది ప్రధానం కాదు. చక్కగా, సందేశాత్మకంగానైనా, రసాత్మకంగానైనా రాయాలి. ఒకటికి రెండుసార్లు చదువుకొని భావం సరిపోయిందా, చెప్పాలనుకున్నది చెప్పానా, ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అనుకుంటూ తనకు తాను పునస్సమీక్ష చేసుకోవాలి.  ఇకపోతే ఈ కాలంలో కూడా ఆడవారిమీద జరుగుతున్న దురాగతాలకు సంబంధించి ఎంతోమంది రకరకాల రచనలు చేస్తున్నారు. అవి ఆచారణాత్మకంగా ఉండాలి. చైతన్యులను చేయాలి. అవగాహన కల్పించాలి. ఇంకో విషయం విదేశీ వ్యామోహం, ధనం పట్ల ఆకర్షణ యువతను విదేశాలకు వెళ్ళడానికి పురి కొల్పుతోంది. కుటుంబాలకు, తల్లిదండ్రులకు దూరమై వారి కంటినీటికి కారణం అవుతున్నారు. మన జాతి సంస్కారాన్ని ,మన సంస్కృతిని కాపాడడం యువతధర్మం. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఎన్ని హోదాలు పొంది,ఎంత సంపాదించావన్నది ఒక ఎత్తు అయితే మన జాతి లక్షణాలను గౌరవించడం, వాటిని నిలబెట్టడం మన బాధ్యత. అదీ యువత అర్థం చేసుకోవాల్సింది.

అమ్మా! మీ నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇంత సమయాన్ని మాకోసం వెచ్చించిన మీకు మా పత్రిక తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.

సెలవు.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తట్టిలేపిన మాతృత్వం

ఆషాఢంలో మైదాకు ( గోరింటాకు )