సస్యశ్యామల క్షేత్రంలో మొలిచిన చిరు మొలక
పాడిపంటలు ధాన్యరాశులు పట్టు పరికిణీలు పసిడి హారాలు
రాజకీయం రణతంత్రం చిరపరిచితం కట్టిపడేసే రూపలావణ్యం
తన మాటే వేదం చేసిందే శాసనం
ఆత్మగౌరవమే ఆభరణం హృదయం ప్రేమమయం
మంచికి నిలువెత్తు సాక్ష్యం పంతానికి ప్రతిరూపం
ఆగ్రహిస్తే అగ్నిగోళం
తక్షణం మలయమారుతం
పలక పట్టిన నాడే పరిమళించిన విద్యాకుసుమం
అక్షర సుమాలలో ప్రకృతి కాంతను బంధించినా
ఛందస్సుల మరువపు పత్ర సౌరభాలతో వాక్యమాలికలల్లినా
పదాల పోహలింపుతో ప్రహేళికలు నిర్మించినా అన్నీ రెండు పదుల లోపే
ప్రాథమిక విద్యతో పాటే పత్రికాపఠనం
ప్రముఖుల విజయ గాథలే స్ఫూర్తిదాయకం
సమస్థాయిలో కుదిరిన సరిజోడి
అనురాగానికి లోటు లేదు ఆప్యాయతకు కొదువే లేదు
కానీ పరస్పర విరుద్ధ భావాలతో పల్టీ కొట్టిన బ్రతుకు బండి
బాధ్యత లేని భాగస్వామ్యం సఖ్యత లేని సాహచర్యం ఆచూకీ లేని అమ్మతనం ఫలితం నిర్వేదం నిస్తేజం
ఔషధాలే అనుపానం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణం
సుదీర్ఘ నిరీక్షణ ఫలం పొత్తిళ్లలో ప్రతిరూపం
అమ్మ తనమే పరమావధిగా సాగిన జీవనయానం
చిట్టి చేతులు కవితలల్లడం మొదలెట్టాక గానీ గుర్తు రాలేదు సుషుప్తిలోకి జారుకున్న తన కలాన్ని జాగృతపరిచే సమయం ఆసన్నమైందని
తన ప్రతిరూపం పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పుడు గానీ జ్ఞప్తికి రాలేదు తానో చక్కని భాషావేత్తనని
చిన్ని గువ్వ కాన్వాసుపై కుంచెను కదిలిస్తుంటే గాని స్ఫురించలేదు తన చిత్రకళా కౌశలం దిశానిర్దేశం చేయాల్సిన తరణం ఇదేనని
పిల్ల కోయిల గొంతు సవరించాక గానీ గుర్తు రాలేదు స్వరరాగఝ రులలో ఓలలాడిన సంగీత స్రష్టనని
కనుమరుగైన కళాకుంజాలను తట్టిలేపిన అమ్మతనం తనని పుడొక నిత్య చైతన్యశీలిగా మార్చిందని అమ్మతనం కొంగు బిగించి అడుగు ముందుకు వేయాల్సిన సమయం ఇదేనని ఆ అడుగుజాడలే చిన్ని పాదాలకు అనుసరణీయాలని