సృష్టిలో ‘ మానవత్వం ‘అనే పదం చాలా విలువైనది. మానవత్వం లేని జీవనం అర్థరహితమని ఘంటాపథంగా చెప్పవచ్చు .మానవత్వం అంటే దయ ,సానుభూతి, సమానత్వం, సహృదయత, కరుణ,ప్రేమ కలిగి ఇతరులను గౌరవించడం .నిజాయితీ సుహృద్భావాలతో మసలుకోవడం, ఇతరుల క్షేమం కోరి, వారికి సహృదయతో సహకరించడమే మానవత్వం.
‘ ఏ కులము వెన్నెలది ‘?తెమ్మెదలెట్టి జాతికి చెందినవి? అట్టిదే కదా మానవత్వం’ అన్నారు సి.నా.రే.
పాతాళంలో కృంగిపోయి సమస్యల వలయంలో చిక్కుకున్న వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ధైర్య ,స్థైర్యాలు అందిస్తూ ఆదుకోవడం నిజమైన మానవత్వం. పరస్త్రీల ఎడ మాతృభావం ,తోటి వారిపై సోదర భావం, పెద్దలు, గురువులు, తల్లిదండ్రుల యందు దైవత్వ భావం కలిగి ఉండడం మానవత్వం. మానవత్వం చూపడం అంటే ఆపదలలో ఉన్న వారిపై దయ ,సానుభూతి వ్యక్తపరుస్తూ వారితో సామరస్యంగా మెలిగి, వారికి సహాయ సహకారాలు అందించడం. ఆదుకున్నామంటూ వారిని తక్కువ చేసి చూడడం, అగౌరవపరచడం అనేవి చాలా పెద్ద తప్పులు. వృద్ధులు, అనాధలు, దీనులను కనికరంతో ఆదుకోవాలి.పరుల ఎడ సానుభూతి కలిగి, నైతిక విలువలతో ప్రవర్తించడం మానవత్వం యొక్క ప్రధాన లక్షణం .
పిల్లలకు బాల్యం నుండే మానవతా విలువల్ని పెంపొందేలా జాగ్రత్తగా పెంచాలి. అహింస, మర్యాదామన్ననల్ని నేర్పాలి. అప్పుడే పెరిగి పెద్దయ్యాక వారు మానవీయ విలువల్ని అలవర్చుకుని ఉన్నత విలువ కలిగి ఉంటారు. సమాజాన్ని భిన్న కోణాల్లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా గమనిస్తూ పిల్లలు పెరుగుతుంటారు. ఆ సంఘటనలు, వ్యక్తుల ప్రభావం అది మంచైనా, చెడైనా సరే వారిపై ఏర్పడుతుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ వారిని సరైన దారిలో పెట్టేలా దయ, పరోపకారం, చిత్తశుద్ధి, సానుభూతి, దానశీలత, గౌరవ మర్యాదలు, నీతి, నిజాయితీలను తెలిపేలా ప్రేరణాత్మకంగా కథారూపంలో వారికి వివరించాలి. తద్వారా సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలు పొందవచ్చో గొప్ప వారిని ప్రేరణాత్మకంగా చూపిస్తూ కథలు చెప్పాలి. ముఖ్యంగా ప్రథమ గురువైన తల్లిదే ఆ బాధ్యత అని నా అభిప్రాయం. చక్కని దిశా నిర్దేశనంతో మాతృమూర్తి పిల్లలను పెంచాలి.
కొందరు తల్లిదండ్రులు మితిమీరిన క్రమశిక్షణతో పిల్లల్ని పెంచే క్రమంలో, వారు ప్రతికూల ధోరణులతో తయారవుతున్నారు. దృశ్య మాధ్యమాల ద్వారా కూడా పిల్లలు చెడు మార్గానికి ప్రేరేపితులౌతున్నారు. సినిమా ,టీవీలలో సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ పిల్లలు పెడదోవ పట్టకుండా వారి చిత్రీకరణలు ఉండాలి.
కొంతమంది మానవతా దృక్పథం కలిగిన యువత అలాంటి వారి వైపే ఆకర్షితులై వారితో సత్సంబంధాలు కలిగి ఉంటూ సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ,వృత్తిలో సైతం తమ దారిని సమాజ సేవలో భాగంగా వైద్యం ,ఉపాధ్యాయ, రక్షణ ఇంకా ఇతర సేవా రంగాలను ఎంచుకుంటున్నారు.
మానవ సంబంధాల్లో పరిణతి, పరిపక్వత ఉంటే మానవీయ దృక్పథం పరిఢణవిల్లి మనుషుల మధ్య లేదా దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడి శాంతి, సుహృద్భావాలు నెలకొల్పబడి సమాజ శ్రేయస్సుకు ఉపయుక్త మైనప్పుడు మానవతా విలువలు విశ్వవ్యాప్తమౌతాయి.