ఉషోదయం

తరాల అంతరం

              మాధవపెద్ది ఉషా

‘అబ్బా ఊరుకోమ్మా నీ చాదస్తం నువ్వూనూ. నాకు తెలుసులే’

‘నీకెందుకు నాన్నా ఈ వయసులో ఈ లేనిపోని తాపత్రయం. హాయిగా కృష్ణా! రామా1 అనుకుంటూ కూర్చోక’

‘ఈ మధ్య మా అత్తగారికి మరీ ఈ ధోరణి ఎక్కువైంది. చెప్పిందే చెప్పి ఒకటే నస పెట్టేస్తోంది. భరించలేకపోతున్నామనుకో.’

పైన చెప్పిన మాటలు తరచూ చాలా ఇళ్లల్లో వినపడేవే. సాధారణంగా వయసు దాటిన తరువాత అంటే యాభై ఐదు అరవై వచ్చాక ప్రతి మనిషిలోనూ ఈ చాదస్తం, ధోరణీ ప్రారంభమవుతాయి. సామాన్యంగా ఆ వయసు వచ్చాక సటు మనిషి బాధ్యతలన్నీ దాదాపు తీరిపోవటంతో వారి చేతిలో ఖాళీ సమయం ఎక్కువ ఉండటం, ఉద్యోగస్థులైతే అదే సమయంలో పదవీ విరమణ చేయటంలో ఏమీ తోచక అతిగా మాట్లాడటం మాటకు ముందు మా కాలంలో ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పడం లాంటి పోకడలు కనిపిస్తూంటాయి.

పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిపై చూపించిన ప్రేమ, ఇచ్చిన సలహాలు వాళ్ళు పెద్దవాళ్ళై ఓ వ్యక్తిత్వం వచ్చి తమ సొంత నిర్ణయాలు చేసుకునే స్థాయికి ఎదిగాక కూడా తల్లిదండ్రులు ఇంకా వారిని చిన్న పిల్లలగానే పరిగణిస్తూ వారికి ఎప్పటిలాగే అన్ని విషయాలలోనూ సలహాలు ఇవ్వడం, ఇవ్వడానికి ప్రయత్నించటం వగైరాలు నచ్చని పిల్లలు పెద్దలను అరుచుకోవటం, విసుక్కోవటం జరుగుతూంటుంది. దీన్నే జనరేషన్ గ్యాప్ అంటాం.

ఇక్కడ పిన్నలు ఓ విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే పెద్దలలో ఈ చాదస్తం, ధోరణి వగైరా ఉన్నాయనీ, వారి ప్రవర్తన ఎదుటివారికి చీకాకు కలిగిస్తోందనీ వారికే తెలియదు. ఓ విధంగా చెప్పాలంటే ఆ వయసులోని పెద్దల మనస్తత్వం పసిపిల్లలను పోలి ఉంటుంది.

అందుకే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను కసురుకోవటం, లేక ఈసడించుకోవటం చేయకుండా, వారికి సౌమ్యంగా వారి బలహీనతల గురించి విశదంగా అర్థమయ్యేటట్లు చెప్పి తామూ పెద్దవాళ్ళమయ్యామనీ, తమ సొంత వ్యవహారాలలో తాము స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగామనీ, అది కూడా మీ చలవేననీ వారికి ప్రేమతో నచ్చచెప్పాలి. ఇన్నాళ్ళూ మీరు మా కోసం కష్టపడ్డారు. ఇక మీకు మానసికంగానూ, శారీరకంగానూ విశ్రాంతి కావాలి కనుక మీరు మీ కిష్టమైన హాబీలు ఎన్నుకుని హాయిగా ఏ చీకు చింతా లేకుండా గడపండని వారికి ఆప్యాయంగా చెప్పాలి. ఏమీ తోచకపోతే ఏ తీర్థయాత్రలకో వెళ్లి రమ్మని ఆ ఏర్పాట్లు కూడా తామే చేయాలి. అంతేకానీ ‘నీకెందుకమ్మా మా విషయాలు.. మేం చూసుకుంటుంటే నువ్వెళ్లు ఇక్కడ్నుంచీ’ అంటూ వారిని అవమానించకూడదు.

ఇక్కడ పిన్నలు గుర్తించవలసిందేమిటంటే తమకూ ఒకరోజు వయసు మళ్ళుతుంది. తాము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు తమ తల్లిదండ్రులున్న స్థానంలో ఉంటామనీ అప్పుడు తమ పిల్లలు కూడా ఇలాగే తమని నిరాదరిస్తే తట్టుకోగలమా అని ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. ఇక పిన్నలు తమకు కూడా పెద్దతనంలో చాదస్తం ధోరణి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకుగానూ మితంగా మాట్లాడగలగటం, అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

సత్కర్మ