ఎన్నో సార్లు చచ్చి బతికాను కనుక
అనేక పునర్జన్మలు లభించినట్టే లెక్క
అరగని విషయాల కప్పిపూత కోసం
మనసు చుట్టూ శుక్లాలు
పెరగడం మంచిదే
ఎవరో అభినందనలు తెస్తుంటారు
వాళ్లకు నేను పట్టు పురుగులాగా గూడు అల్లుకోమని
తాబేటి దేహంలా ముడుచుకోమని చెప్తుంటాను
ముళ్ల కంపలా అయితే
మనల్ని మనం కోల్పోతాం కనుక
బిగదీసి ఉండ చుట్టుకొని
దొర్లిపోవడమూ మంచిదే
ఎక్కడో పూలవనం దొరకకపోదు..
ఊట చెలిమె దగ్గర ఆగిపోతే
మళ్లీ చిగురించినట్టే
నువ్వు అనుకునేది నిజమే
వెలితిని ఇట్లాటి మాటలతో
చేదును పూసిన చెక్కర చేసి మింగుతామని
నేను చెప్పేది కూడా నిజమే
మనసుల లేకితనం మనకు
వెలితినే మిగులుస్తుందని
ఇంతకీ ఈ పూట ఏం చేద్దాం
నాతో పాటు మొలకల్ని తెస్తున్నాను
కాసిన్ని మన హృదయంలో నాటుకుందాం
అవి విత్తనం వేసేనాటికి మళ్లీ పునర్జన్మ రాకపోవచ్చు
కానీ
ఆ పూల పరిమళం రేపటి సాయంత్రాన్ని
మనం కలిసి చూస్తామని వాగ్ధానం చేస్తూ
నమ్మకమై
వ్యాపిస్తుంది…