ప్రముఖ చిత్రకారిణి ఏలె ప్రియాంక ఇంటర్వ్యూ by వంగ యశోద

బతుకమ్మ అంటే పల్లె ప్రజలు ప్రకృతితో మమేకమై చేసుకునే పండుగ. విరబూసిన అడవిపూలను దేవతగా పూజించే ఆచారం. ఆనందం, ఆరోగ్యం కలిసిన ఈ పండుగ నేపథ్యంలో ప్రముఖ ఆర్టిస్ట్ ప్రియాంక ఏలే నిర్వహించిన పూలమ్మ సిరీస్ ఎగ్జిబిషన్ కళా అభిమానులను ఆకట్టుకుంది. దశాబ్దాకాలంగా తన కుంచెతో ఆలోచింపచేసే చిత్రాలను వేస్తున్న ప్రియాంక ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో తరుణి ముఖాముఖి…

తరుణి : నమస్కారం!. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్స్ వేస్తున్నారు?
ప్రియాంక : చిన్న తనం నుంచి రంగుల మధ్యనే పెరిగాను. కారణం మా నాన్న ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు. నాన్న వేసే చిత్రాల్లో పల్లె కనిపించేది. నేను సిటీలో పుట్టిపెరిగినా తరచుగా పల్లెటూరికి వెళ్లేవాళ్లం. నాన్నమ్మ, అమ్మమ్మల ఇంటికి వెళ్లాంటే ఎంతో సంతోషం. నేను చూసిన పల్లెటూరు నాన్న చిత్రాల్లో ప్రతిబింబించేది. దాంతో నాన్న చిత్రాలు చూస్తూ.. రంగులతో ఆడుకోవడం చిన్నతనం నుంచే మొదలైంది. అయితే చిత్రాలు వేయడం ప్రారంభించి పదేళ్లు పైనే అయ్యింది.
తరుణి : ఇప్పటివరకు ఎన్ని ఎగ్జిబిషన్స్ ఏర్పాటుచేశారు. మీ చిత్రాలపై నాన్న ప్రభావం ఏ మేరకు ఉంది
ప్రియాంక : చిన్నతనంలో నాన్నను చూసి పెయింటింగ్ వైపు వచ్చిన మాట వాస్తవమే.. కానీ, ఆ తర్వాత నా కంటూ ఒక ప్రత్యేకమైన శైలీని ఏర్పాటుచేసుకున్నాను. దేశవిదేశాల్లో ఇప్పటివరకు దాదాపు 70కి పైగా గ్రూప్ ఎక్జిబిషన్ లో నేను వేసిన చిత్రాలను ప్రదర్శించాను. సోలో ఏగ్జిబిషన్స్ కూడా ఏర్పాటుచేశాను. ఇది నా ఐదవ సోలో ఎగ్జిబిషన్. అయితే నాన్న చిత్రాలతో కలిసి ఇంత పెద్దస్థాయిలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
తరుణి : మీకు ఎలాంటి చిత్రాలు వేయాలంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్ట్ అంటేనే ఓపిక ఎక్కువ కావాలి. మీకు ఒక చిత్రాన్ని పూర్తి చేయడానికి ఎం సమయం పడుతుంది.


ప్రియాంక : ప్రకృతి సంబంధమైన వాటిని వేయడానికి ఇష్టపడుతాను. బుద్ధిజీవి అయిన మనిషి కాకుండా జీవరాశులు ఎన్నో ఉన్నాయి. జంతువులను, పూలను చిత్రికరించడం అంటే నాకు చాలా ఇష్టం. అలా వేసిన అనేక పెయింట్స్ తో ఈ సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశాం. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ ప్లోరల్ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శించడం ఆనందంగా ఉంది. ఈ సోలో కోసం నేను రెండున్నర సంవత్సరాల నుంచి పెయింటింగ్స్ వేశాను. పెయింటింగ్ సైజు, అంశాన్ని బట్టి ఐదు నుంచి పదిరోజుల్లో ఒక చిత్రం పూర్తి చేస్తాను.
తరుణి : మీ బాబు చాలా చిన్నవాడు కదా ఇంటి బాధ్యతలు, బాబు ఆలనాపాలన చూస్తూ కళకు సయమం కేటాయించడం సాధ్యమవుతుందా
ప్రియాంక : నాకు వృత్తి, ప్రవృత్తి రెండూ చిత్రాలు వేయడమే. అందుకే పెయింటింగ్ ను హాబీగా కాకుండా జాబ్ లా అనుకుంటాను. రోజూ ఆఫీస్ అవర్స్ మాదిరిగానే స్టూడియోకు వెళ్తాను. మా వారు అజయ్ ప్రకాష్ ఎంతో సహకారం అందిస్తారు. బాబు ఆరవ్ ప్రకాష్ కు ఇప్పుడు మూడేళ్లు. బాబు మూడు నెలల వయసు నుంచే ఈ షో కోసం నేను పెయింట్స్ వేయడం ప్రారంభించాను. ఉదయమే ఆఫీస్ కు వెళ్లి బాబు కోసం వచ్చి వాడికి పాలు పట్టి మళ్లీ వెళ్లేదాన్ని. అమ్మ, అత్తమ్మ వాడిని చూసుకునేవారు. కుటుంబ సహకారం ఎంతో ఉంది.

తరుణి : మాతృత్వం కెరీర్ కు అడ్డు అని చాలామంది మహిళలు అనుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం
ప్రియాంక : ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదు. కుటుంబం సహకారం ఉంటే పిల్లల పెంపకం కెరీర్ కు ఇబ్బంది కాదు. అయితే చేయాలనుకున్నది మాత్రం ఆపవద్దు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు అమ్మ బాధ్యత చాలా ఉంటుంది. వాళ్లు పెరిగే కొద్ది కాస్త సమయం ఉంటుంది. కెరీర్ కోసం మాతృత్వాన్ని వాయిదా వేసుకోవద్దు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
తరుణి : నేటి యువతకు క్రియేటివ్ ఫీల్డ్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.


ప్రియాంక : క్రియేటివిటీకి ఎప్పుడు ఆదరణ ఉంటుంది. అది ఏ రంగంలోనైనా సరే. కొత్త ఆలోచనలు సరికొత్త అవకాశాలను కల్పిస్తాయి. ముఖ్యంగా యువత మూస పద్దతిలో కాకుండా కొత్తగా ఆలోచించాలి.
తరుణి : పెయింటింగ్ తో పాటు థియేటర్ ఆర్డ్ వైపు వెళ్లారు. బాలనాగమ్మ కథపై పరిశోధనలు చేశారు. కారణం
ప్రియాంక : కళలు తరతరాల చరిత్రను తెలియజేస్తాయి. పెయింటింగ్ తో పాటు థియేటర్ ఆర్ట్ అంటే ఆసక్తి ఎక్కువ. అందుకే థియేటర్‌ ఆర్ట్‌పై పీహెచ్‌డీ పూర్తి చేసి థీసిస్‌ సబ్‌మిట్‌ చేశాను. పరిశోధనాంశంగా బాలనాగమ్మ కథ ను ఎంచుకున్నాను. ఇటీవలే పరిశోధన గ్రంథం పూర్తి చేశాను. ఇది చాలా గొప్ప పరిశోధన గ్రంథం అవుతుంది.

 

వంగ యశోద

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏమండి కథలు