నిశ్చలంగా ఉన్న నీటిలో
అలా ఓ రాయి విసిరి
సుడిగుండాల్ని సృష్టించి
ఆశ్చర్యపోతావు..! .
ప్రశాంతంగా సాగుతున్న
నదిలో ఓ అడ్డుకట్ట వేసి,
ఉప్పెనల్ని ఊరేగిస్తూ
వేడుక చూస్తావు ….!
ప్రేమగా అల్లుకున్న
కాకిగూడు కూలదోసి
కుంటి సాకులు చెప్తూ
కోకిలను రమ్మంటావు…! .
కూర్చొని సేదదీరే
కొమ్మలు నరికి
కలషాలు కక్కుతూ
కారడవి కావాలంటావు…!
ఆట ఆడుతూ …..
ఆనందించమ్మంటే
అధికారం కోసం
వేట మొదలుపెట్టావు
కోటలు కట్టావు….
కోట్లు మూటలు కట్టావు…
కలిసి జీవించటం మరిచి,
జానెడు పొట్ట కోసం
జగమంతా ఏలేద్దామని,
ఆరడుగుల నేల కోసం
ఆకాశం అందుకుందామని
ఆరాటం ఆపలేదు
పోరాటం మానలేదు
కానీ,
నాదనుకునే నీ శరీరంతో
అవధి అడుగుల్ని తాకలేదు
అంతరీక్షం అంతు చూడలేదు
ఆకాశాన్ని దాటే ప్రయత్నంలోనే
అనంత విశ్వంలో
శూన్యంగా మిగులుతున్నావు
అస్సలు నువ్వు శూన్యమేనా….!