యూనివర్సిటీ పని మీద అకస్మాత్తుగా 12.12.2010న తిరుపతి వెళ్తున్నాను. ట్రైన్లో రిజర్వేషన్ దొరక్కపోవడంతో బస్సుకు బయలుదేరాను. నా పక్కన ఒకామె కూర్చొని ఉంది. కొద్దిసేపు తర్వాత మా ఇద్దరికీ మాటా మాటా కలిసింది. పరస్పరం పరిచయాలయ్యాయి. పిల్లల గురించి అడగ్గానే ఆమె మంచు పర్వతంలా కరిగిపోయింది. తన గురించి, తన కొడుకు గురించి చెప్పడం మొదలు పెట్టింది. ఆమెను చూస్తే చక్కని సంస్కారవంతురాలిగా అనిపించింది. ఈమెక్కూడా బాధలున్నాయా అని అనిపించింది. అయినా ఆమె చెప్తూ ఉంటే కొన్ని విషయాలు ఓపిగ్గా విన్నాను. ఇంకా కొన్ని విషయాలు తెలియాలంటే ఈ నా ఉత్తరం చదువుకోండి, ఇది నా యథార్థగాథనే, ఇందులో అతిశయోక్తులు ఏమీ లేవు, దాపరికాలు అంతకన్నా లేవు. మీకు ఓ కొడుకు ఉంటే నా అనుభవాలు. మీకు పనికి వస్తాయి. మీరైనా జాగ్రత్తగా ఉంటారు అంటూ తన హ్యాండ్ బాగు నుండి, కవరు తీసి ఇచ్చింది. ఆమె మాటల్లోనే, ఆమె రాసుకున్న ఆ లేఖలోని విషయమే ఇది.
‘ఆ రోజు ఫిబ్రవరి 22,2003. మా ఆయన లేరు. ఊరికి వెళ్లారు. అర్థరాత్రి పన్నెండు గంటలు. గాఢనిద్రలో ఉన్నాను. టెలిఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ ‘ఎస్.టి.డి.సౌండ్’ ను సూచిస్తూ లాంగ్ బెల్ మోగుతూ ఉంది. ఇంత అర్ధరాత్రి ఎవరబ్బా? ఈ అర్ధరాత్రి చేస్తే గీస్త నా పుత్ర రత్నం ‘వాసే’ కావచ్చు. ఎన్ని రోజులైంది వాడిని చూసి, ఎన్ని రోజులైంది వానితో తృప్తిగా మాట్లాడి? చూస్తుండగానే ఏండ్లకేండ్లు –నాలుగేండ్లు గడిచిపాయె. అయనా వీడు ఇప్పుడు, ఈ అర్ధరాత్రి చేయడం ఏమిటి? చాలా రోజుల తర్వాత ఈ రోజు ఎనిమిది గంటల నుండి తొమ్మది గంటలవరకు తీరిగ్గా ఓ గంట తండ్రితో ఊరికి ఫోన్ చేసి, మాట్లాడాడని తండ్రి చెప్పాడు. మళ్లీ ఇంతలోనే నాకు ఫోన్ ఏంటని అనుకుంటూ ఫోన్ ఎత్తాను.
నేను అనుకున్నట్టు ఆ పోన్ చేసింది నా ఏకైక పుత్రుడు వాసే. ఒక్క క్షణం నా మనస్సు ఎగిరి గంతేసింది. నా కొడుకు ‘అమ్మా! నిన్ను చూసి నాలుగేళ్ళయింది, నిన్ను చూడాలని ఉంది, వస్తానని అంటాడేమో? లేక నన్ను రమ్మంటాడేమో? తానే వస్తానని అంటే బాగుండు, తండ్రి కూడా చూసేవాడు” అని అనుకుంటూ మనసు ఒక్క క్షణంలోనే పరి పరివిధాల ఆలోచించింది.
నేనే కాదు ఏ తల్లైనా తన కొడుకు ఫోన్ రాగానే, అందులోనూ అమెరికా లాంటి దూరదేశం నుండి చేస్తున్నాడంటే ఇంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తుంది. ఫోన్లో నా కొడుకు గొంతు. మెత్తగా ఉండే బదులు, ఖంగు ఖంగుమంటూ మోగుతూ ‘నువ్వు, నాన్నా పొద్దున్నే వెళ్ళి సైకాలజిస్టుకు చూపించుకోండి’ అనిపించింది.
అలా అనగానే, ఆ మాటలు – అనగానే ఒక్క క్షణం నివ్వెరపోయి, ‘అనేది వాడేనా? వాడు అన్నది నన్నేనా? వాడు నా బాబేనా? నేను ఈ లోకంలోనే ఉన్నానా?’ అనే సందేహం వచ్చింది. నన్ను నేను గిల్లి చూసుకున్నాను. నేను స్పృహలోనే ఉన్నాను. ఇంతలో మళ్లీ అతని గొంతు దశదిశలు దద్దరిల్లింపజేస్తూ వినిపించింది. ‘చెప్పేది నీకే, వినిపిస్తుందా? పొద్దున్నే పిచ్చాసుపత్రికి వెళ్ళి చూపించుకుంటారా? లేదా’ అని గద్దాయించాడు. ఆ మాటలు వింటుంటే నాకాశ్చర్యం వేసింది. నన్ను ‘మీరు’ అని సంబోధించడం తప్ప ‘నువ్వు’ అని సంబోధించడం ఎరగని నా బాబేనా? నా కోడుకేనా? అని అనిపించింది. అయినా వెంటనే తేరుకొని ‘ఎందుకు వెళ్ళాలి’ అని ప్రశ్నించాను. ‘నువ్వు నా మీద, నా భార్యమీద, నా అత్త మీద పెత్తనం జేస్తున్నవ్. నన్ను, నా భార్యను, నా అత్తను బదునాం జేస్తున్నవ్, నువ్వ నాయనమ్మలాగా తయారవుతున్నవ్’ అని అన్నాడు.
వాడి ప్రతి మాట నన్ను ఆశ్చర్యపరుస్తున్నది. నిజానికి వాడు అనే మాటలకు ఏ ఒక్క దానికి జవాబు చెప్పలేకపోతున్న. దిమ్మెరపోయిన ఒక్క క్షణం నాకు ఏ అనాలో తెలియడం లేదు. నిరుత్తరురాలినయ్యాను నేను. ఆ క్షణంలోని నా స్థితి గురించి ఎన్ని ఉపమానాలు చెప్పినా తక్కువేనని అనిపించింది. ‘అసలు ఆ అమ్మాయి (కోడలు) నా వద్ద ఎప్పుడున్నది, ఆమె పెళ్ళయ్యిన రెండు రోజులకే వాడితోనే అమెరికా వెళ్ళిపాయె, ఇదేమి చిత్రం?’ ఆ అమ్మాయి మధ్యలో వాళ్ల తాతను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఒక్క రాత్రి. అదీ ఎంతో బలవంతం మీద మా వద్ద ఉందేమో. ఉన్న ఆ కొద్దిసేపు, నిప్పుమీద ఉన్నట్లు, మౌన వ్రతం పట్టిన దానిలాగనే ఉంది. నేను ఇప్పుడు ఏమి చెప్పినా వాడి తలకెక్కదు. ‘ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’. మా మధ్య కాలం దూరంతోపాటు, ఆత్మీయతల దూరం పెరిగిందనుకుంటా’నని ఆలోచిస్తూ, జవాబు ఏమీ చెప్పకుండా అలా నిలుచుండిపోయాను. పోన్ పెట్టేసిన శబ్దం వచ్చింది.
ఏ కొందరి తల్లులకో అలా తాను ఊహించినట్లు జరుగుతుందని అనుకుంటాను. అలా అందరి తల్లులకు జరిగితే ఈ కథ ఎందుకు ఇంత దూరం వస్తుంది? అని అనుకుంటూ వచ్చి బెడ్ మీద వాలానో లేదో మళ్లీ ఫోన్. మళ్లీ ఏమి ఉరుమో, ఏమి పిడిగో ఏమో అనుకుంటూ ఫోన్ ఎత్తాను.
‘ఇగో మా అత్తకు మాటి మాటికి పోన్ చేసి మాట్లాడ్తావట. నువ్వు పోన్ చెయ్యొద్దు, మాట్లాడొద్దు. ఆమెనేమో ఇంటికి రమ్మని పిలుస్తావట. ఆ పిలుపులు గిలుపులు చేయకు’ అని సీరియస్గా అన్నాడు. ఆమెనేమో ‘నువ్వు నాకు పోన్ చేయకపోతే నాకెవరున్నారు. మీరు తప్ప’ అని అంటుంది. వాడేమో ఇలా అంటాడు. అయనా కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. అక్కడే అమెరికాలోనే ఉంది. వాడికి ఆ విషయం తెలుసు. అయినా ‘మంచిది’ అని జవాబు చెప్పే లోపలే వాడు మళ్ళీ ఫోన్ పెట్టేశాడు.
మళ్లీ నేను ఆలోచనల్లోకి వెళ్ళాను. ‘ఇదేంటబ్బా! వాడి పెళ్లయి నాలుగేండ్లు. నాలుగేళ్లలో ఒకటిన్నర ఏండ్లు వాని అత్త. వాని దగ్గరే ఉంది. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఒక్కసారి ఒక్క నెల మాత్రమే, ఆమె తన కొడుకు కొడుకు (మనుమడు) పుట్టడంవల్ల వాళ్ల దగ్గర ఉంది. అయినా ఏమో లే? వాడు చెప్పినట్టే చేద్దాం’ అని అనుకుంటూ మంచం మీద నడుం వాల్చాను.
మళ్లీ పోన్ శబ్దం వినగానే మళ్లీ ఏదో ఆలోచించడం మొదలుపెట్టాను. వాడికి ఇప్పుడు ముప్పై రెండు ఏళ్ళు దాటాయి. వాడికి ఇరవై ఎనిమిది ఏండ్లకు పెండ్లి అయింది. వానికి పదిహేను ఏండ్లు వచ్చేవరకు, వాన్ని నేను ‘గురువు’ లాగే ట్రీట్ చేసాను. తల్లి లాగా కాదు. ఆ తర్వాత ‘ప్రెండ్ లా చూసాను. అలాంటిది ఇప్పుడు వీడు నన్ను పిచ్చాసుపత్రికి పొమ్మంటాడా? మళ్ళీ ఇప్పుడు ఏకంగా కైలాసానికి పొమ్మని అంటాడేమో అని అనుకుంటూ, లేచి వెళ్లి, ముచ్చటగా మూడోసారి ఫోన్ ఎత్తాను.
మళ్ళీ ఏదో అడ్డదిడ్డం వాగాడు. ‘వరకట్నం అడిగి నా భార్యను, అత్తను వేధిస్తున్నావని’ అన్నాడు. అన్నిటికీ నేను చెవిటి దాన్ని అయ్యాను. వాడి భార్య, వాడి అత్త ఈ నాలుగేండ్లలో ఏ మూడు నెలలో హైదరాబాదులో ఉన్నారు. ఇక్కడి నుండి అమెరికాకు ఫోన్ చేయాలంటే నా నెల జీతం ఒక్క రోజుకవుతుంది. ఆ మాత్రం ఆలోచన కూడా లేని వెధవను కన్నాను అని నాల నేను అనుకొని, నా మూర్ఖత్వాన్ని తిట్టుకుంటూ మంచం మీద నడుం వాల్చాను. పెండ్లి కాగానే మగవాడికి బుర్ర పని చేయడం మానేస్తుందేమో… అందులోనూ అమెరికా వెళ్లిన మగవారిలో ఏ కొందరికో తప్ప, చెప్పాల్సిన పనే లేదు. దాదాపు అందరి పనీ అంతే అనుకుంటా. అమెరికాలో ఉండే వాళ్ళకు ఉండే చెవులే కదా, కన్న పాపానికి తల్లులు అన్నీ భరించాల్సిందే. అయినా వాడిని ఏమీ అనలేక, వియ్యపురాలుకు ఉత్తరం రాసాను.
శ్రీయుత గౌరవనీయులైన మహారాజు రాజశ్రీ గంగాభాగీరథి సమానులైన సుమిత్రగారికి నమస్కారాలు. మేము క్షేమం. మీరు క్షేమమనుకుంటాను. ఈ ఉత్తరం నా లోని మానసిక సంఘర్షణకు ఉదాహరణ.
ఈ మధ్యే మనం కలువక చాలా రోజులైంది. గత ఏడెనిమిది నెలల నుండి మనిద్దరం బాగా మారిపోయాం. ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి. ప్రతిరోజు రోజుకు మూడుసార్లు – 1. ఉదయం లేవగానే, 2. మధ్యాహ్నం 3,4 గంటలకు, 3. రాత్రి పడుకోబోయే ముందు మీరు నన్ను చూడకుండానే ఫోన్ చేసేవారు. నన్ను చూడకుండానే దాదాపు నాలుగు నెలలు నాతో మాట్లాడారు. ఆ తర్వాత మనం కలిసిన తర్వాత వారానికి ఒక్కసారైనా మా ఇంటికి వచ్చేవారు. మీకు ఈ విషయం గుర్తు లేకపోవచ్చు. కాని మీరు దాచిపెట్టిన ఫోన్ బిల్లులు చూసుకొండి ఒక్కసారి లేదా అదీ మరిచిపోయి ఉంటారు.
మీ అల్లుని స్నేహితునికి 24 సంవత్సరాలు. మా ఆయన స్నేహితునికి 75 సంవత్సరాలు. అయినా వాళ్లు, ఆ ఇద్దరు ‘మిమ్మల్నీ ఏదో అన్నారని, వారిని నాతో కొట్టించారు, గుర్తుందా?’
పోనీలే. 2000లో మొదటిసారిగా – మీరు అమెరికా వెళ్లినపుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకొండి. ఒకరినొకరం విడిచి ఉండలేని ప్రాణ స్నేహితుల్లాగ మంచం మీద పడుకోని ఎంతసేపు ఏడ్చాం? గుర్తుకు లేదా? ఇప్పుడేమో నేనే ఫోన్ చేసినట్లు, నన్ను అంటున్నారు.
అందుకు కారణాలు నాకు నాలుగైదు కనిపిస్తున్నాయి. 1. నా అవసరం నీకు తీరిపోవడం, 2. ఒకరి నుండి మరొకరు ఎక్కువ ఆశించడం, 3. ఎవరికి వారు తాము చేసేదే కరెక్ట్ అని అనుకోవ డం. 4. ఒకరు మరొకరిని మార్చాలని ప్రయత్నం చేయడం, 5. ఎవరికి వారు తమ చెడును గ్రహించకపోవడం, 6. ఇంట్లో ఇద్దరికి – ఐదుగురికి, ఆరుగురికి – సూపర్ ఇగోలు ఉండడం – ఇవే నాకు ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి.
నయా పైసా కట్నం తీసుకోకుండా నీ బిడ్డను పెండ్లి చేసుకునేవరకు – దేవతలా అనిపించిన నేను ఈ రోజు మీకు ‘డస్ట్ బిన్’ ను అయ్యాను. నిజంగా మనం – వియ్యం పొందినవాళ్ళలాగా మాత్రమే ప్రవర్తిస్తే నేను హాయిగా నా వ్యవసాయం, ఉద్యోగం చేసుకుంటూ, ‘ఇచ్చినవారిని ఈగలాగ’ చూసేదాన్ని.
గుండెమీద చెయ్యి వేసుకొని, ఒక్కసారి ఆలోచించండి. మా విశాఖపట్నం వియ్యంపునికి, వియ్యపురాలికి నేను ఏనాడైనా పోన్ చేసానా? మీ కూతురులాగే నా కూతురు అమెరికాలో ఉన్నా కూడా, నా బిడ్డకు ఏనాడైనా ఇక్కడి ఏ విషయాలైనా చెప్పానా?
మేం పిల్లనిచ్చినవారికి (వియ్యపులకు) చాలా విలువ ఇస్తాం. అల్లుడు ఏం చెప్పనా, వియ్యంకుడు ఏం చెప్పినా ఏ విషయాలకైనా ప్రథమప్రాముఖ్యం ఇస్తాం. వాళ్లను కాదని ఏమి చేయం, వాళ్లను ఏమి అనం. సాధారణంగా వారికి తెలియకుండా ఏ పనీ చెయ్యం. మేం అల్లుని వద్ద నిలబడను కూడా నిలబడం. మరి మీరేమో అందుకు పూర్తి విరుద్ధమాయె.
మీరు మాకు బిడ్డను ఇచ్చుకున్నవాళ్లు. నా కుటుంబంలో అసలు జోక్యం చేసుకోకూడదు. అదే సమయంలో నేను కూడా మీ గురించి పట్టించుకోకూడదు. ఈ విషయం నాకు తెలిసినా నేను మీ గురించి ఆలోచించడానికి, పట్టించుకోవడానికి ఒకే ఒక కారణం. మీరు ఒంటరి ఆడవారని అనుకోవడం, మీరు నష్టపోకూడదని అనుకోవడం, భర్తలేనివారని మర్యాద ఇవ్వడం. అయినా మా బాబు చెప్పినట్టు నేను మీ గురించి ఆలోచించకూడదు. అది నా తప్పే. ఒప్పుకుంటున్నా.
నేను ఎవరు ఏది చెప్పినా వింటాను, నిజమని నమ్ముతాను. మీరు మా అబ్బాయికి పిల్లనివ్వడానికి వచ్చినపుడు, చాలా వాస్తవాలు దాచారు. మీరు వడ్డీ వ్యాపారాలు చేస్తారని చెప్పలేదు. బట్టల వ్యాపారం చేస్తారనీ, చెప్పలేదు. ఇంకా ఇంకా ఏమో ఏమో చెప్పలేదు. పైగా ఎవరూ లేరని చెప్పారు. మీ ఆయన ఎలా చనిపోయాడనీ, ఎందుకు చనిపోయాడనీ మేం అడగన లేదు. మీరు చెప్పనూ లేదు. నిజాలు తెలిస్తే మీ దరిదాపులకు కూడా నేను రాకపోదును.
నేను మా ఆయనతో గొడవ పెట్టుకొని, చదువుకున్న కోడలు కావాలని, యాక్టరు కోడలు కావాలని కోరి కోరి కొనుక్కొని తెచ్చుకున్నాను. నాకు విషపు బిళ్లలను తీపిమందు బిళ్లలుగా ఇస్తారని అనుకోలేదు. నేను ఎందరినో చూసాను. కాని గోముఖ వ్యాఘ్రంలాంటి వారు కూడా కొందరు ఉంటారనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఏ మాత్రం తెలిసినా నా జీవితం మరోలా ఉండేది. ‘శని నెత్తిమీద కుసుంటే ఎటూ సొంపనీయదట. ఇదే కాబోలు మీరు మమ్మల్ని వ్యాపార దృష్టితో చూసారు. కాబట్టి, బిజినెస్ లో చేసినట్లే ‘యూజ్ అండ్ త్రో’ చేస్తున్నారు. మేం అందరినీ వ్యవసాయదారులుగా, పదిమందికి అన్నం పెట్టాలని చూస్తాం. ఇక్కడే ఒకరినొకరం తప్పుగా అంచనాలు వేసుకున్నాం. అదే ఈనాడు ఇన్ని సమస్యలకు కారణమవుతున్నది. ఒక వస్తువు కొంటే మరో వస్తువు బోనస్ వస్తుందని అనుకోలేదు. అసలు వస్తువు కన్నా బోనస్ వస్తువు విలువ ఎక్కువుంటుందని ఎప్పుడనుకోలేదు. కోడలును కొనుక్కుంటే కోడలు తల్లి కూడా ఆమె వెంట వస్తుందనుకోలేదు. జరిగిపోయిందానికి ఇప్పుడు ఎవరమూ ఏమీ చేయలేం. మీకు నా కొడుకును ఇల్లరికం ఇచ్చాననుకొని నేనే సర్దుకొనిపోతాను, పోతున్నాను. ఇక మిగిలింది ఒక్కటే నా చర్మంతో చేసిన చెప్పులు మీరు తొడుక్కోవడం.
మీరు, మీ బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్టే వరకు నా ముక్కు మొకం తెలియకుండా గంటల కొద్దీ, నెలలకొద్దీ, నాకు పోన్ చేసారు. ఇప్పుడేమో మీరు రివర్స్ గేరులో వచ్చి, నా మీద నిందలు వేస్తున్నారు. నేను కంగారుపడ్తానని ఎక్కడున్న ఫోన్ చేసి మీరు, అమెరికాలో అడుగుపెట్టగానే నన్ను ఓ ‘తద్దినం’లాగా భావిస్తున్నారు. ఏమిటీ ఈ చిత్రం? ఏమిటీ ఈ దౌర్భాగ్యం?
చేతినిండా పనితో క్షణం తీరికలేని నేను, మీతో అమెరికాకు ఎప్పుడు మాట్లాడాను? ఓ.కె. ఈనాడు – ఒకరినొకరు – మనం కలవకుండా ఉండాలని అనుకోవడం – ఫోన్ చేసుకోవడానికి కూడా తటపటాయిస్తుండడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
పైగా నేను మీతో మాట్లాడినట్లు పితూరీలు చెప్పి, ఎంతకాలం నిజం దాస్తారు? నేను ఇప్పటివరకు నా ఇంటికి రావద్దని ఎవరినీ అనలేదు. ఇకపైన అనను కూడా.
నాకు ఇతరుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒకరితో మరొకరిని తిట్టించలేదు కూడా. నా శ్రతువు నా యింటికి వచ్చినా ఎందుకు వచ్చావనే మాట కూడా అనలేను. దీన్నిబట్టే తెలుస్తుంది. నాది ఎంత దౌర్భాగ్యం బతుకో. నాకు ఇంత జరిగినా నా కూతురుతో ఒక్క మాట కూడా నేను చెప్పుకోలేదు. నా ఇంటికి వచ్చేవారు నా స్నేహితులైతే, నాతో పాటు కష్టసుఖాలు పంచుకుంటారు. స్నేహంలో తప్పు ఒప్పులుంట సరిదిద్దుతారు, సరిదిద్దికుంటారు. పొట్ట కూటికోసం అబద్ధాలు చెప్పే వారంటే నాకు పరమ అసహ్యం. అది నా నైజం. అది ఇష్టపడ్డవారే నాతో స్నేహం చేస్తారు, చేయాలి. లేకపోతే దొబ్బేయాలి. అంతేకాని స్నేహం పేరుతో, చుట్టరికం పేరుతో నా కుటుంబంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు’ అంటూ ఆమెకు ఓ సుదీర్ఘ ఉత్తరం రాసాను.
ఆ ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లో వేయడానికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓ కొత్త తద్దినం మొదలవుతుందేమోనని ఆలోచించి, ఆ ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లో వేసే బదులు నా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని, నా సోదను మోసే అక్షరాలను నా వెంటే తెచ్చుకొని, నాకు నేనే సర్ది చెప్పుకొన్నాను.
ఇప్పుడు మీతో చెప్పుకొని, నా గుండె బరువును కొంత దించుకున్నాను’ అని నాతో చెప్పి, ఆమె కన్నీళ్ళ పర్యంతమైంది. ఆమె సొదను ఒక స్నేహితురాలిగా పంచుకున్న ఆ లేఖను, మీ స్నేహితురాలిని మీకే ఇస్తున్నానంటూ, ఆ లేఖను తిరిగి ఆమె చేతిలో పెట్టాను. తిరిగి ఆ లేఖను ఆమె నా చేతికిచ్చి, మరెవరికైనా పనికి వస్తుంది ఈ నా అనుభవం, ఏదైనా పత్రికకు దీన్ని ఇవ్వండి’ అని అంది. నేను దానిని ఏం చేయాలో పాలుపోక నిశ్చేష్టురాలినై, ఆ లేఖను నా బ్యాగులో వేసుకున్నాను. ఈ రోజు పాత బ్యాగులు సర్దుతుంటే అది బయటకు వచ్చింది. కొన్నేళ్ళ క్రితం దాదాపు 20 ఏండ్లు క్రితం జరిగిన ఆ సంఘటన మళ్లీనా కండ్ల ముందు కదలాడింది. ఆమె బాధను, మీ ముందుకు తెచ్చాను. తస్మాత్ జాగ్రత్త.