సాయంకాలం నాలుగు గంటలవుతోంది. సూర్యుడికి ఇంటికి వెళ్ళాలని అనిపించటములేదేమో అటూఇటూ చూసుకుంటూ సమయం గడిపేస్తున్నాడు. తరువంతా ఆక్రమించుకున్న పెద్దకొమ్మలకు పచ్చని ఆకులతో, ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మలో నుంచి ఓ కిరణాన్ని కిందికి దింపి చూసాడు. చిన్న లాన్ లో వేసి ఉన్న గుండ్రటి టేబుల్ కు ఎదురెదురుగా, లేత పసుపురంగుమీద, చిన్నచిన్న ఎరుపు పూలు ఉన్న చీర, ఎరుపు రంగు జాకెట్టు, తెలుపు నలుపు కలిసిన జుట్టుతో వేసిన ఒత్తైన జడతో ఒకావిడ, ఆమెకు ఎదురుగా లేత మట్టిరంగు పాంట్, గులాబీ తెలుపు గీతలున్న షర్ట్, పూర్తిగా పండిపోయిన లేత బంగారు రంగులో మెరుస్తున్న బాబ్డ్ హేర్ ఆవిడ కూర్చుని ఉన్నారు. చాలా సేపటి నుంచి వారిద్దరూ అక్కడే కూర్చుని ఉన్నట్లు వారి మధ్య ఉన్న గుండ్రటి బల్ల మీద ఉన్న, ఆరిపోయిన రెండు టీ కప్స్ చెపుతున్నాయి. ఇద్దరూ దీర్ఘాలోచనలో ఉన్నార
***
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.
యుద్ధానికి వెళ్ళిన ఒక్కొక్కరూ తిరిగి వస్తున్నారు. కొంతమంది ఆ యుద్ధం లోనే వీరమరణం పొందారు. ఇంటి దగ్గర తమవారి రాక కోసం ఎదురు చూస్తూ వున్నారు కుటుంబ సభ్యులు.
***
బుకెట్ హాల్ కోలాహలంగా ఉంది. అన్న రూబెన్, భర్త జేమ్స్ యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చిన సంతోషంలో ఎమిలీ బంధువులందరినీ పిలిచి పార్టీ ఇస్తోంది. ఇరవై అయిదు సంవత్సరాల జోసఫ్, వైన్ గ్లాస్ పట్టుకొని అందరినీ పలకరిస్తూ హాల్ అంతా కలియజూసాడు. ఒక్కసారిగా పెద్ద నవ్వు వినిపించి అటువైపు చూసాడు. కొంత మంది యువతీ యువకులు గుంపుగా నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వారిలో నలుపు రంగు లాంగ్ గౌన్, రెండువరసల మంచి ముత్యాల దండ, పెద్ద ముత్యపు చెవిదిద్దులు, పెదవులకు బ్రౌన్ కలర్ లిప్స్టిక్ తో చేతిలో వైన్ గ్లాస్ తో, లేత గులాబీపువ్వులా ఉన్న అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయికి దాదాపు పంతొమ్మిది, ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు. పెద్ద పొడగరి కూడా కాదు. అయిదూ మూడు ఉంటుందేమో! ఆమె డ్రెస్సింగ్ లో, ఆహార్యంలో ఒక విధమైన సొగసు ఉంది. ఎవరీ అందాలభరిణ అని కుతూహలంగా అటువైపు నడిచాడు. అందరూ మాటలు ఆపి అతనిని హాయ్ జోసఫ్ అని పలకరించారు. విక్టోరియా వైపు ఎవరీ అమ్మాయి? అని చూస్తున్న జోసఫ్ కు విక్టోరియాను పరిచయం చేసారు. ఒక్కసారిగా పెద్ద మ్యూజిక్ మొదలయ్యేసరికి అందరూ అటు వైపు తిరిగారు. ఒకొక్క జంట డాన్సింగ్ ఫ్లోర్ మీదకు చేరుకుంటున్నాయి.
జోసఫ్ కొద్దిగా తల వంచి, చేయి విక్టోరియా ముందుకు చాపి “డాన్స్ కు రాగలవా ప్లీజ్” మృదువుగా అడిగాడు. చేయి చాపిన అతని వైపు పరిశీలనగా చూసింది. దాదాపు ఆరడుగుల ఎత్తు, నలుపురంగు సూట్, మెడలో తెల్లని బో, చక్కని తలకట్టు, మంచి మేనిఛాయ, నవ్వు మొహంతో ఉన్న జోసఫ్ ను చూడగానే మదిలో తెలియని కలవరం కలిగింది. అప్రయత్నంగా తన చేయిని అందించింది. విక్టోరియా నడుము చుట్టూ ఒక చేయి వేసి, ఇంకో చేయి అందుకొని, చిన్నగా అడుగులు వేయిస్తూ మాటలు ప్రారంభించాడు. విక్టోరియా దగ్గరితనమును ఆస్వాదిస్తూ మంద్ర స్వరంతో “రేపు రెస్టారెంట్లో కలుద్దామా?” అడిగాడు జోసఫ్. సరే అన్నట్లు తల ఊపింది విక్టోరియా.
***
జోసఫ్ నవ్వు విక్టోరియాను రాత్రంతా నిద్రకు దూరం చేసింది. ఉదయం నుంచే కలవరపాటు మొదలయ్యింది. వార్డ్ రోబ్ తీసి ఏ డ్రెస్ వేసుకోవాలాని ఒక్కొక్కటే తీసి చూస్తోంది.
“జోసఫ్ తో డేటింగా?”
ఒక్కసారిగా వినిపించిన ఆ మాటలకు వెనక్కి తిరిగి చూసింది. కొద్దిగా నవ్వు, కొద్దిగా ఈర్ష్య మిళాయించి చూస్తున్న కజిన్ రేచెల్ కనిపించింది.
“అలా అని ఇంకా ఏమీ అనుకోలేదు. చూడాలి” జవాబిచ్చి, లేత గులాబీ రంగు గౌన్ తీసుకొని వాష్ రూం లోకి వెళ్ళింది.
మేరీ కూతురి మేకప్ ను ఒక్కసారి గమనించి, బుగ్గల మీది రోజ్ ను సరిదిద్దింది. ముంగురులు మృదువుగా సవరిస్తూ “రియా(విక్టోరియా), జోసఫ్ మంచి కుర్రాడు అని విన్నాను. కుటుంబమూ మనకు తెలిసినదే. గట్టిగా మాట్లాడి, పెద్దగా నవ్వుతూ ఉండక, సున్నితంగా ఉండు” సుద్దులు చెప్పింది.
“పో మమ్మీ! నేను నవ్వనులే” పెద్దగా నవ్వుతూ వెళ్ళింది. మనసులో మాత్రం జోసఫ్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో, ముందు ముందు ఈ స్నేహం ఎటు దారి తీస్తుందో అని కాస్త బెరుకుగానే ఉంది విక్టోరియాకు.
బెరుకుబెరుకుగా రైన్ బో కేఫ్ దగ్గరకు వెళ్ళింది విక్టోరియా. తలుపు ముందు నిలబడి ఉన్న జోయ్ (జోసఫ్) నవ్వుతూ చేయి చాచేసరికి కాస్త తడబడింది. ఇద్దరూ లోపలికి వెళ్ళి ఒక మూల కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెపుతూ, నవ్విస్తూ విక్టోరియా బెరుకు పోగొట్టాడు జోయ్. కాలం ఎంత గడించిందో కూడా తెలియనంతగా గడిచిపోయింది.
“రియా రేపు స్ట్రీట్ షాపింగ్ వెళ్దామా?” వీడ్కోలు తీసుకుంటూ అడిగాడు జోయ్. “ఊ” తలూపింది రియా.
ఇంటికి రాగానే రేచల్ ” రియా, ఎక్కడికి వెళ్ళారు? ఏం మాట్లాడుకున్నారు?” ఆసక్తిగా అడుగుతున్నా అలిసిపోయాను అని లోపలికి వెళ్ళిపోయింది. రాత్రంతా జోయ్ నవ్వు, సరదా కబుర్లు, ఆక్టివ్నెస్ కలవర పెడుతూ నిద్రకు దూరం చేసాయి!
మరునాడు ఇద్దరూ స్ట్రీట్ వాక్ చేస్తూ, రంగు-రంగుల ఈకలతో చేసిన అందమైన టోపీలు అమ్మే అతనిని చూసి ఆగిపోయారు. అందమైన ఒక టోపీ కొని, “రియా, ఇది నీ డ్రెస్ కు సూట్ అవుతుంది” అంటూ విక్టోరియా చేతికి ఇచ్చాడు. టోపీ అందానికి మురిసిపోతూ “థాంక్యూ జోయ్” అని తీసుకుంది.
సాయంకాలము జోయ్ తో కలిసి తిరగటమూ, రాత్రిళ్ళు జోయ్ తలపులతో కలలు కనటమూ ఆరునెలలు గడిచిపోయాయి. రేపు “మినటొంకా” లేక్ క్రూజ్ కు వెళుదాము అన్నాడు జోయ్! ఆరోజు ఉదయం లేచినప్పటి నుండి మనసు తెలియని భావోద్వేగం పొందుతోంది. ఎందుకో కలవర పడుతోంది. రోజుకన్నా శ్రద్ధగా అలంకరించుకుంది. మేరీ దగ్గరకు వెళ్ళి, చేయి పట్టుకొని “మామ్, లేక్ క్రూజ్ కు వెళుతున్నాము. వచ్చేసరికి ఆలశ్యం కావచ్చు” అని చెప్పింది.
మొహమంతా పరుచుకున్న మెరుపులు, కాంతులు వెదజల్లుతున్న కళ్ళు, కూతురు చాలా అందంగా కనిపించి, తల వంచి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ “జాగ్రత్తగా వెళ్ళిరా” అంది మేరీ.
డెక్ మీద నిలబడి, మినటొంకా లేక్ కు చుట్టూ ఉన్న ఇళ్ళను, నీలిరంగులోని నీళ్ళనూ, నీటి మీద పడి వెండి వెలుగులు చిమ్ముతున్న సూర్యకిరణాలనూ అబ్బురంగా చూస్తూ, “జోయ్ ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడు” అని చెపుతూ వెనుదిరిగిన రియా కు జోయ్ ఎర్రగులాబీ పూవుతో కనిపించేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది.
జోయ్, రియా ముందు, మోకాలి మీద కూర్చొని, చేతిలోని గులాబీని రియా ముందుకు తీసుకొచ్చి, “రియా ఈ నీలి ఆకాశం, ఆకాశంలో బంగారు, వెండి కాంతులతో మెరుస్తున్న సూర్యుడు, ఈ అనంత జలవాహిని సాక్ష్యంగా అడుగుతున్నాను ‘నన్ను పెళ్ళాడతావా?’ ” మృదువుగా అడిగాడు.
జోయ్ ప్రపోజల్ కు ఎప్పుడో అడుగుతాడని తెలిసినా, కొంచం తడబడి, సిగ్గుతో తల వంచుకొని, గులాబీని అందుకుంటూ అంగీకారం తెలిపింది.
పట్టరాని సంతోషముతో రియాను గాఢ౦గా హత్తుకున్నాడు జోయ్. గట్టిగా చప్పట్లు వినిపించేసరికి, ప్రేమికులు ఈ లోకంలోకి వచ్చి చూసారు. వారిద్దరి చుట్టూ క్రూజ్ క్రూ, ఇతర ప్రయాణికులు నిలబడి చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. వారితో కేక్ కటింగ్ చేయించారు.
***
ముద్దుల కూతురు రియా, తెల్లని పొడవాటి వెడ్డింగ్ గౌన్, మెడలో గొలుసు, చక్కని హేర్ స్టైల్, ఎత్తైన షూస్, చేతిలో పర్స్ ధరించి, టక్సిడో సూట్, ఫార్మల్ వైట్ షర్ట్, వెస్ట్, విల్ టై, తెలుపు రంగు గ్లౌజులు, డెర్బీ షూస్ లతో మెరిసిపోతున్న అల్లుడు జోసఫ్ చేయి అందుకొని వెళుతుంటే, అందంగా ఉన్న ఆ జంటను కన్నులపండువుగా చూసుకుంటూ సంతోషంగా చేతులు ఊపారు మేరీ, రూబెన్!
అందంగా పూలతో అలంకరించిన కార్ ఒక ఇంటి ముందు ఆగింది. అటుగా వచ్చి, తలుపు తీసి దిగమన్నట్లుగా చేయి అందించాడు జోయ్, రియాకు. జోయ్ చేతిని అందుకొని, సుతారంగా దిగి, చుట్టూ చూసింది. అది ఒక చిన్న కాలనీ. చిన్నచిన్న ఇళ్ళు అక్కడక్కడా ఉన్నాయి. వాటి ముందు చక్కని లాన్, పూల మొక్కలు ఉన్నాయి. అవన్నీ చూస్తున్న రియాను నడిపించుకుంటూ, ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తాళం తీసి, రియా చేయి పట్టుకొని లోపలికి అడుగేసాడు జోయ్. తలుపు తీసి లోపలికి రాగానే వారిద్దరి తలల మీద పువ్వుల జల్లు కురిసింది. ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు నడిచింది. ఎదురుగా బల్ల మీద “వెల్ కం టు మై డియర్ క్వీన్” అని రాసి ఉన్న అందమైన కార్డ్, పెద్ద పూలబుకే కనిపించాయి.
“ఇదంతా ఏమిటి? ఎవరిదీ ఈ ఇల్లు?” అడిగింది కొద్దిగా ఆశ్చర్యంగా, కొంచం సంబ్రమముగా!
“ఎవరిదేమిటి? మన ఇల్లే! నా రాణి కోసం కొన్నాను. ఇవన్నీ నేనే చేసాను”
“జోయ్!” అంటూభావోద్వేగంతో జోయ్ ని హత్తుకుంది రియా!
ఇల్లంతా పరుగులు పెడుతూ చూసింది. చిన్న సిట్టింగ్ రూం, పక్కనే డైనింగ్ టేబుల్, దాని ముందు కిచెన్ గట్టు, ఆ పక్క నుంచి పైకి మెట్లు! గౌన్ ను ఒక చేతితో, ఒక చేయి జోయ్ చేతిలో పట్టుకొని సుతారంగా ఒక్కొక్కమెట్టు ఎక్కింది రియా. మెట్లకు ఎదురుగా ఒక బెడ్ రూం, పక్కన ఇంకో బెడ్ రూం, వాటి ముందు చిన్న ఖాళీ స్థలం. మెట్ల మీదుగా పచ్చని ఆకులతో ఒక తీగ అల్లుకొని పైకి వచ్చింది. ఇల్లంతా అక్కడక్కడ చిన్నచిన్న పూల కుండీలతో ముచ్చటగా ఉంది. కిందికి తీసుకెళ్ళి, పక్క తలుపు తీసి, బయటకుతీసుకెళ్ళాడు. అక్కడ చిన్న లాన్, దాని మీద గుండ్రటి టేబుల్, దాని చుట్టూ నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లు ఉన్నాయి. ముచ్చటగా ముద్దుగా ఉన్న ఆ ఇల్లు ఎంతో నచ్చింది రియాకు.
“రా కూర్చో” అని కూర్చోబెట్టి, బల్ల మీద ఉన్న వైన్ ను గ్లాస్ లోకి వంపి, తనూ ఒక గ్లాస్ తీసుకొని “చీర్స్” అన్నాడు జోయ్.
అలా ఆనందంగా మొదలయిన వారి జీవిత నౌకలోకి, హార్రీ, టాం, గ్రేస్ చేరారు. జోయ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా పెరిగి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. రియా ఉద్యోగం చేయాలనుకోక , తన కాలాన్ని జోయ్ ని, పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఆనందంగా ఇంటి పట్టునే ఉండిపోయింది. జోయ్, రియాలది ఒకటే మాట, ఒకటే బాట. ఏనాడు వారిరువురూ పోట్లాడుకోవటము, వాదించుకోవటములాంటివి ఏరోజు వారి మధ్య చోటు చేసుకోలేదు. ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉండి, ఏదైనా సమస్య వచ్చినా సామరస్యంగా సంప్రదించుకుంటారు. బంధుమితృలలో చక్కని ఆదర్శదంపతులుగా పేరు తెచ్చుకున్నారు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యి, పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడ్డారు. హార్రీ వారి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు. గ్రేస్ ఇడెన్ పేరీ లో ఉంటుంది. టామ్ మటుకు ఆస్ట్రేలియా వెళ్ళాడు.
***
“మమ్మీ నువ్వూ, డాడ్ ఈ రోజు చర్చ్ నుంచి మా ఇంటికి లంచ్ కు రండి” ఫోన్ చేసింది గ్రేస్.
“జోయ్ వెళదామా?” అడిగింది, సెల్ చేతిలో పట్టుకొని.
కొంచం ఆలోచించి “సరేలే వెళుదాము” జవాబిచ్చాడు.
హారీ, టామ్, గ్రేస్, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ చర్చ్ ముందునిలబడి రియా, జోయ్ కు స్వాగతం పలికారు.
“టామ్ నువ్వెప్పుడు వచ్చావురా? మాకు కాల్ అయినా చేయలేదు” ఆశ్చర్యంగా అడిగాడు జోయ్.
నవ్వి ఊరుకున్నాడు టామ్. ప్రార్ధన తరువాత “గ్రేస్ ఇంటికేనా?” అడిగింది రియా.
“కాదు మిసిసిపి లేక్ క్రూజ్ కు వెళుతున్నాము” జవాబిచ్చింది గ్రేస్.
వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందరూ మిసిసిపి నది దగ్గరకు వచ్చారు. నౌక లోకి ఎక్కాక, వారిని సరాసరి డెక్ మీదకు తీసుకెళ్ళింది అక్కడి స్టాఫ్ లోని ఒక అమ్మాయి. డెక్ మీద అంతా బెలూన్ లు, పూలతో అలంకరించి ఉంది. మధ్యలో ఆరు అంతస్తులతో చక్కని పూలు,లతలు ఐసింగ్ చేసిన కేక్ పెట్టి ఉంది. దాని మీద,
“Happy 60th Wedding Anniversary to Classy couple”
అని అందంగా రాసి ఉంది. ఆ సర్ప్రైజ్ ఏర్పాటులను చూసి రియా, జోయ్ ఆశ్చర్యపోతూ హార్రి వైపు చూసారు.
“మాదేమీ లేదు. ఇదంతా గ్రేస్ ప్లాన్. మమ్మలిని రమ్మని కాల్ చేస్తే మేమంతా వచ్చాము” చెప్పాడు టామ్.
గ్రేస్ వైపు మురిపెంగా చూసింది రియా. జోయ్ తనకు ఎలా ప్రపోజ్ చేసాడో ఓసారి మాటలలో గ్రేస్ కు చెప్పింది. అది గుర్తుంచుకొని, తమ 60వ ఆనివర్సరీని ఇలా సర్ప్రైజ్ గా అరేంజ్ చేసింది. అసలు ఇది తమ 60వ ఆనివర్సరీనా? అరవై సంవత్సరాలు గడిచాయా? తెలియనే లేదు! ఉద్వేగంతో పిల్లలను దగ్గరకు తీసుకున్నారు రియా, జోయ్!
***
“జో, ఏమిటీ మాట్లాడుతూనే ఆలోచనలోకి వెళ్ళావు? ఏమాలోచిస్తున్నావు” అడిగింది విక్టోరియా జ్యోతిని.
ఆలోచనల్లో నుంచి తేరుకొని, “నీ గురించే ఆలోచిస్తున్నాను రియా. మీ ఇల్లు చూసి, ఇక్కడ కూర్చుంటే నువ్వు చెప్పిన నీ కథ గుర్తు వచ్చింది. 60యవ ఆనివర్సరీ చేసుకున్నారా? ఎంత అదృష్ఠవంతులు మీరు. మరి ఆ తరువాత…” అన్న జ్యోతి మాటలు పూర్తి కాకుండానే..,
“ఆ తరువాత… రెండు సంవత్సరాలకు నా పక్కనే పడుకున్న, నా జోయ్ నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. నాకు ఏ కష్టమూ లేకుండా మా పిల్లలతో పాటూ నన్నూ ఓ పసిపాపలా చూసిన జోయ్, అన్నింటిలో నన్ను సంప్రదించి నిర్ణయం తీసుకునే జోయ్, ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా నిశ్శబ్దంగా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు.” జవాబిచ్చింది రియా.
“మరి అప్పటి నుంచి ఇక్కడ ఒక్కదానివే ఉంటున్నావా?” కొద్దిగా సంశయంగా అడిగింది జ్యోతి.
“ఒక నెల మా పెద్ద మనవడు వచ్చి ఉన్నాడు. ఆ తరువాత గ్రేస్ నన్ను వచ్చి వాళ్ళింట్లో ఉండమంది. కానీ నాకే ఇష్టం లేదు. ఈ ఇల్లు జోయ్ నాకోసం కొన్నాడు. అన్నీ అమర్చాడు. దేనికీ లోటులేకుండా చేసాడు. అరవై రెండు సంవత్సరాలు ఒకే ప్రాణంగా ఈ ఇంట్లోనే ఉన్నాము. ప్రతి తలుపు, ప్రతి గోడ, ప్రతి వస్తువు జోయ్ ను తలపుకు తెచ్చేవే! జోయ్ జ్ఞాపకాలు ఈ ఇంట్లో అణువణువునా ఉన్నాయి. అవి వదిలి నేను ఎక్కడికీ పోదలుచుకోలేదు. అవే నా ఊపిరి! నా సర్వస్వం!” ఉద్వేగంగా అంది రియా.
“రోజంతా ఒక్క దానివే గడుపుతావా? ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరకు వెళుతావా?”
“జోయ్ లేకుండా నేనెప్పుడూ బయటకు వెళ్ళలేదు. ఏ పార్టీ, ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమూ కలిసే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఒంటరిగా…, అంటూ కన్నీళ్ళను బయటికి రాకుండా ఆపుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా , గొంతు పెగలక ఆగిపోతుంటే, అర్థమైన జ్యోతి సన్నగా వణుకుతున్న రియా చేతిని తన చేతులలోకి తీసుకుని ఓదార్పుగా పట్టుకుంది. జ్యోతి ఆత్మీయ స్పర్శతో కాస్త కుదుటపడిన రియా, మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. నాకు ఎక్కడికీ వెళ్ళాలనిపించదు జో. వెళ్ళినా ఏదో ఇబ్బందిగా, అందరూ నన్నేదో విడిగా, ఆక్వర్డ్ గా చూస్తున్నట్లనిపిస్తుంది” జవాబిచ్చింది.
“ఆక్వర్డ్ గా చూస్తారా? అదేమిటి? మీకూ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా?” ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి.
“రిస్ట్రిక్షన్స్ ఏమిటీ? అవేవీ మాకు లేవు. నాకే ఇష్టం ఉండదు. రోజూ కాసేపు సీనియర్ సెంటర్ కు వెళ్ళి కార్డ్స్ ఆడుకుంటాను. చర్చ్ లో వాలంటీర్ గా చేస్తాను. ఈ మధ్య గ్రేస్, నీకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి. ఇంక డ్రైవింగ్ చేయకు. కాబ్ పిలుచుకో లేదా బస్ లో వెళ్ళు అంటుంది. ప్రతివారం వచ్చి నాకు కావలసినవి తెచ్చి ఇస్తుంది. మధ్యమధ్య వాళ్ళింటికి వచ్చి ఉండమని గొడవ చేస్తుంటుంది. నేను రానంటానని, పిల్లలను చూడాలనుకుంటానని ప్రతి సంవత్సరమూ మా పిల్లలందరినీ థాంక్స్ గివింగ్ రోజున వాళ్ళ ఇంట్లో గెట్ టుగేదర్ ఏర్పాటు చేస్తుంది. అయినా నేను ముసలిదానిని ఏమిటి? నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్ ను. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను. మలివయసులో యవ్వనం ఎంజాయ్ చేస్తున్నాను” అంటూ పెద్దగా నవ్వుతున్న రియాను, ప్రతిదానికీ పెద్దగా నవ్వుతుంటే, అబ్బా ఇంతలా నవ్వుతుందేమిటి అని రియా గురించి అనుకునే జ్యోతి, విస్మయంగా, విచారంగా ఆ నిశ్శబ్ద ఝరిని అలా రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది! కొమ్మల సందులో నుంచి ఓ సూర్య కిరణం, నోరంతా తెరిచి పెద్దగా నవ్వుతున్న రియా తెల్లని పంటి మీద పడి, కనురెప్పల మాటున ఉన్న, కన్నీటి చుక్క మీద తళుక్కున మెరిసింది!