ఛల్లి ఛత్రిపై
చల్లిన గవ్వలో
తీవెల చేరిన
నీలి కన్నులు
వల్లి మాటున
దింటెన గంటలో
మాటలు ఆడని
విష్ణుక్రాంతలు
భువికి చేరిన
దివి కాంతలవో
అల్లితెమ్మెరతో
గుసగుసలాడే
వర్ణవర్ణముల
మృదు కర్ణంబులు
అపరాజితకివి
తాటంకములో
తుంపెసలాడే
నీలోపలములు
లతాగృహాన
నర్తనలాడే
లోలలోచనలు
పూపింఛములు
వెలుగు వేల్పుకివి
అంజలులో
పచ్చల కడలిని
కంబువులో
ఇంద్రుని తేరుకు
తోరములో
వనాలు దాచిన
శంఖువులో
చూడూ,చూడివి
ఛల్లి ఛత్రిపై
చల్లిన గవ్వలు
తీవెల చేరిన
నీలి కన్నులు.