జరిగిన కథ:
(అర్జున్ సుభద్ర, కూతురు స్పూర్తి, కొడుకు అభిమన్యు కోరిక మీద అమెరికాకు బయిలుదేరుతారు. అర్జున్ ఎక్కడైనా, ఎవరికైనా ఇబ్బంది కలుగుతోందని అనిపిస్తే వారు అడగకపోయినా వారికి సహాయము చేయటము అలవాటు. అన్యాయాన్ని సహించడు. దాని వలన కొన్ని సార్లు తను ఇబ్బందులలో కూడా పడుతుంటాడు. అతని స్వభావము తెలిసిన పిల్లలు కొంచం జాగ్రత్తగా ఉండమని, అనవసరంగా ఎందులోకీ వెళ్ళవద్దని హెచ్చరిస్తారు. కానీ నేను ఫౌజీని (మిలిట్రీవాడిని) అట్లా చూస్తూ ఊరుకోలేను అంటాడు అర్జున్. పారిస్ లో గర్భవతి అయిన అమ్మాయికి సహాయం చేయాలని, ఆ అమ్మాయి బాబును పట్టుకొని, కాసేపు ఎత్తుకుంటాడు. దానితో కాస్త ఆయాసపడతాడు. మొత్తానికి మినియాపోలీస్ కొడుకు ఇంటికి చేరుతారు.
ఇక చదవండి.)
-2-
బద్దకంగా కళ్ళు తెరిచింది సుభద్ర. వంటి మీద బరువుగా ఏదో ఉంది. ఒక్కసారే భయపడింది ఏమిటిది అని. ఓసారి కళ్ళు నులుపుకొని, చేతితో తడిమింది. మెత్తగా పరుపులా ఉంది. జరిపి, లేచి కూర్చుంది. ఒక్క క్షణం ఎక్కడ ఉందో అర్ధం కాలేదు. గది కొద్దిగా చీకటిగా ఉంది. చుట్టూ చూసింది. గోడకు చిన్న లైట్ వెలుగుతోంది. పక్కకు చూసింది. అర్జున్ కూడా అప్పుడే లేచి చూస్తున్నాడు. చిన్నగా కళ్ళు చిరు చీకటికి అలవాటు పడి, పక్కన అర్జున్ కనిపించాకా, ఓ ఇప్పుడు మినియాపోలీస్ వచ్చాము కదా అనుకొని, మీద ఉన్న కంఫర్టర్ ను పక్కకు జరిపి లేచింది. అప్పటికి అర్జున్ కూడా లేచి కూర్చున్నాడు. పక్క గది లో నుంచి చిన్నగా చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. లేచి ఫ్రెషప్ అయి బయటకు వెళ్ళింది. గది దాటగానే డ్రాయింగ్ రూం ఉంది. అక్కడ ఎదురు నుంచి లైట్ పడుతోంది. ముందుకు వెళ్ళింది. డైనింగ్ టేబుల్ అయ్యాక, వంటిల్లు ఉంది. అక్కడ శశి ఏదో వండుతోంది.
“గుడ్ మార్నింగ్ శశీ. ఒక రోజంతా పడుకున్నట్లున్నాము. కాఫీ ఫిల్టర్ ఎక్కడా?కలుపుకుంటాను” అంది.
“గుడ్ మార్నింగ్ కాదాంటీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాత్రి ఎనిమదయ్యింది. డిన్నర్ రెడీగా ఉంది. భోజనం చేస్తారా? కాఫీ ఇవ్వనా?” శశి అడుగుతుండగానే అర్జున్ టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు.
“ఇప్పుడు రాత్రేనా? ముందు కొంచం టీ ఇవ్వమ్మా. ఒక అరగంట అయ్యాక భోజనం చేస్తాను” అన్నాడు.
“నాకూ టీనే కావాలి. ఎక్కడా చూపించు కలుపుతాను” అంది సుభద్ర.
“ఒక వారం ఆగు మమ్మీ కలుపుకుందువుగాని. ముందు జట్ లాగ్ తగ్గనీయి” అన్నాడు అభీ పక్కన సిట్టింగ్ రూం నుంచి వస్తూ.
“జెట్ లాగ్ తగ్గటమేమిటీ? నాకేమీజబ్బు లేదు” కంగారుగా అంది సుభద్ర.
“జెట్ లాగ్ అంటేజబ్బు కాదు మమ్మీ.ఇండియాకు, ఇక్కడికీ దాదాపు పన్నెండు గంటల సమయముతేడా కదా? మీకు ఇప్పుడు రాత్రి.అందుకే ఇదో ఇదే మీరు ఇప్పటిదాకా నిద్ర పోవటమేజెట్ లాగ్! ఇక్కడి టైమింగ్స్, వాతావరణానికి మీరు, మీ శరీరం అలవాటు పడాలి. అంతే” అభి వివరించాడు.
“ఓ అంతేనా? నేను ఇకేమిటో అనుకొని భయపడ్డాను.మాకు అప్పుడే అక్కడ ఎండలు మొదలయ్యాయి. ఇక్కడేమో చలిగా ఉంది. స్వెట్టర్ తీయాలి బయటకు” కొద్దిగా వణుకుతూ అంది.
“అందుకే మీకు కంఫర్టర్ కప్పాను” నవ్వాడు అభి.
టీ తాగి, పిల్లలకు తెచ్చిన బహుమతులు, స్వీట్స్, పచ్చళ్ళు బయటకు తీసారు. వద్దన్నా తెచ్చారుగా అంటూనే స్వీట్ పాకెట్ విప్పి, స్వీట్ తీసుకున్నాడు. ఆరాధ్యా, ఆకాశ్ వాళ్ళ కోసం తెచ్చినవి చూసి వావ్ బామ్మా, తాతా అంటూ సంబరపడిపోయారువాళ్ళు.
వారం రోజులకు అక్కడి వాతావరణముకు అలవాటు పడ్డారు. అభీ, శశీ వాళ్ళ ఆఫీస్ పనులలో బిజీ అయ్యారు. కాకపోతే కరోనా తరువాత వర్క్ ఫ్రం హోం నే ఎక్కువగా ఉండటము తో ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలు స్కూల్ కు వెళుతున్నారు.
సాయంకాలంటీ తాగుతూ బెడ్ రూం కిటికీ లో నుంచి బయటకు చూస్తున్న సుభద్ర “అండీ జనాభా వాకింగ్ చేస్తున్నారు. లాన్ లో ఉడతలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో! భలే పరుగెత్తుతున్నాయి” ఉత్సాహంగా అంది.
ఇద్దరూ తలుపు తీసి, బయటకు వెళ్ళారు. ఒక్కసారిగా చల్లటి గాలి తగిలింది. ఇంకో వైపు నుంచి చెట్ల సందులో నుంచి పడిన నీరెండచిరు వేడిని కలిగిస్తోంది. ఓపక్క చిరు చలి, ఇంకోపక్క చిరువేడి చాలా తమాషాగా అనిపించి “అండీ గ్రీష్మం లో హేమంతం. ఇదే నులి వెచ్చని గ్రీష్మం” అంది సుభద్ర పమిట నిండుగా కప్పుకొని, ఎండపొడన చలి కాచుకుంటూ…
“ఎంత పుస్తకాల పురుగువు అయితే మాత్రం ఏకంగా ఋతువులనే కలిపేసావా?”
“అదంతే” నవ్వేసింది.
“అభీ, వాతావరణం హాయిగా ఉందిరా. కొంచం దూరం వాకింగ్ చేసి వస్తాము” లోపలికి వచ్చి షూస్ వేసుకుంటూ అప్పుడే అటు వచ్చిన అభితో అన్నాడు అర్జున్.
“ఎక్కువ దూరం వెళ్ళకండి డాడీ. మళ్ళీ దారి తప్పిపోతారు. సెల్ దగ్గర ఉంచుకో. దారి మర్చిపోతే కాల్ చేయి. కొంచం ముందుకు వెళితే కాస్త పెద్ద పార్కుంది. అక్కడికి చాలా మంది వాకింగ్ కు వస్తారు. ఇప్పుడిప్పుడిడే చలి తగ్గుతోంది కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు. మొదటిరోజే హడావిడి పడకండి. జాగ్రత్త” అంటున్న అభీతో, “సరలేరా. నువ్వు కంగారు పడకు కొంచం దూరమే వెళ్ళి వస్తాము” అన్నాడు అర్జున్.
చలి, ఎండ కలసిన నులివెచ్చని గ్రీష్మపు నీరెండలో, కొంగు కప్పుకొని వాకింగ్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది సుభద్రకు. “అండీ ఎంత బాగుందో కదా!” పరవశంగా అంది.
ఇంతలో కాళ్ళ దగ్గర నుంచి ఏదో పరుగెత్తినట్టుగా అనిపించి, ఉలిక్కిపడి కిందకు చూసింది. ఓ కుందేలు, రోడ్ కు అటువైపుగా వెళ్ళి కూర్చొని వీళ్ళ వైపు మిటుకుమిటుకూ మంటూచూస్తోంది.
“హాయ్ కుందేలూ…” ఆశ్చర్యంగా అరిచింది.
“ఇదో ఇటు చూడు” సంభ్రమంగా అన్నాడు అర్జున్.
“తాబేలు” ఇంకా ఆశ్చర్యపోతూ అంది.
వీళ్ళ మాటలు నచ్చన్నట్లుగా కుందేలు పక్కనున్న చెట్లలోకి పారిపోయింది. తాబేలు చిన్నగా గడ్డిలోకి పోతోంది. ఇద్దరూ దానీ కాసేపు చూసి నడక సాగించారు. అభి చెప్పిన పెద్ద పార్క్ కనిపించింది. అందులోకి వెళ్ళారు. అక్కడ ఒక చోట కొంత మంది ఇండియన్స్ బెంచీల మీద కూర్చొని కనిపించారు. అందులో అకాయన వీళ్ళ దగ్గరకు వచ్చి, “I am Patel” అని పరిచయం చేసుకున్నాడు. అర్జున్ కూడా తమ ఇద్దరినీ పరిచయం చేసుకున్నాడు. ముగ్గురూ కలిసి అక్కడ ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళారు. అందరినీ పరిచయం చేసాడు పటేల్ సాబ్. వాళ్ళంతా విజిటర్స్ వీసా మీద హాలీడేయింగ్ కు వచ్చినవారే. వాకింగ్ లో ఈ పార్క్ లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. పటేల్ భార్య శుభాబెన్ సుభద్ర తో చాలా స్నేహంగా మాట్లాడింది.
“రేపు అందరమూ పాట్లక్ హెవీ చాయ్ పార్టీ పెట్టుకున్నాము మీరు కూడా రండి అని ఆహ్వానించాడు పటేల్.
వాళ్ళందరూ స్నేహంగా మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. “చీకటిపడుతోంది. పిల్లలు గాభరా పడతారు. మేమూ ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాము. మాకూ ఏమైనా చెప్పండి” అంటూ లేచాడు అర్జున్.
“మీరు ఇప్పుడేగా వచ్చారు. రెస్ట్ తీసుకోండి. అన్నట్లుమీరు కార్డ్స్ ఆడతారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సీనియర్ సెంటర్ ఉంది. అందరూ సీనియర్స్ వస్తారు. కార్డ్ గేంస్ పోకర్, బ్రిడ్జ్ ఇంకా చాలా ఆడతారు. ఇంకా వేరే ఆక్టివిటీస్ కూడా ఉంటాయి. నేను అప్పుడప్పుడు వెళుతుంటాను” అని చెప్పాడు పటేల్ సాబ్.
“నేను బ్రిడ్జ్ ఆడతాను. సుభద్ర పోకర్ ఆడుతుంది. మేము వెళుతాము. అడ్రెస్ ఇవ్వండి” అని అడ్రెస్ తీసుకొని, మళ్ళీ రేపు కలుస్తామని వచ్చేసారు.
వీళ్ళను చూడగానే “ఇప్పుడే మిమ్మలిని వెతకటానికి వద్దామనుకుంటున్నాను” అన్నాడు అభి.
“నువ్వు చెప్పిన పార్క్ కు వెళ్ళామురా. అక్కడ చాలా మంది మనవాళ్ళ గ్రూప్ కలిసారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము. అన్నట్లు ఇక్కడ సీనియర్ సెంటర్ ఉంటుందిట. అక్కడ సీనియర్స్ కు చాలా ఆక్టివిటీస్ ఉంటాయట” చెప్పాడు అర్జున్.
“రేపు సీనియర్ సెంటర్ ఎక్కడ ఉందో చూసి తీసుకెళుతాను” అంది శశి.
“రేపు వద్దమ్మా. పార్క్ లో పాట్లక్ చాయ్ పార్టీ ఉంది. మేము ఏదైనా చేసి తీసుకొస్తామని చెప్పాను.తీసుకొస్తామన్నాము, వాళ్ళు వద్దన్నారనుకో. సీనియర్ సెంటర్ కు ఎల్లుండి వెళుదాము” జవాబిచ్చాడు అర్జున్.
“ఓ అప్పుడే పార్టీ కూడా అరేంజ్ చేసుకున్నారా? ఎవరితోనైనా ఎక్కడైనా మీరు ఇట్టే కలిసిపోతారు అంకుల్” మెచ్చుకుంది శశి.
“ఒరేబాబా దారిలో కుందేలు, తాబేలు కనిపించాయిరా. పొద్దున ఉడత కూడా ఎంత పెద్దగా ఉందో!చుట్టూ చెట్లు, దారి పక్కన పూల పొదలు, ఈ జంతువులూ అచ్చం ఆశ్రమవాటికలా ఉంది” సంబరంగా అంది సుభద్ర.
“ఇప్పుడు కొంచం కొంచం ఎండ వస్తోంది కదా, ఇవన్నీ బయటకు వస్తాయి. జింకలు, దుప్పలు కూడా వస్తాయి. మన బాక్యార్డ్ లోకే వస్తాయి. ముద్దుగా ఉన్నాయని వాటి దగ్గరకు పోకు. అవి అడవి జంతువులు. చాలా వైల్డ్ గా ఉంటాయి. పొడుస్తాయి” హెచ్చరించాడు.
మరునాడు పొద్దున్నే, సాయంకాలానికి ఏమి చేసి తీసుకెళ్ళాలా అని తర్జన భర్జన పడి, ఆల్రెడీ వాళ్ళు హెవీవి ఏవో ప్లాన్ చేసే ఉంటారు. అసలు తమని ఏమీ తేవద్దని కూడా చెప్పారు కానీ మరీ చేతులూపుకుంటూ వెళితే బాగుండదని, లైట్ గా ఉంటుందని ఇంట్లో ఉన్న ఆపిల్స్, అరటిపండ్లు, మామిడిపండ్ల్లు అన్నీ సన్నసన్న ముక్కలుగా కట్ చేసి, క్రీం, వెనిల్లా ఎసెన్స్ కలిపి ఫ్రూట్ క్రీం చేసింది సుభద్ర. మమ్మీ, డాడీల హడావిడిని చూసి, “రాను రాను అంటూ వస్తూనే పార్టీలోకి దిగి బిజీ అయిపోయావుగా డాడీ” అన్నాడు అభి నవ్వుతూ.
జగదీష్ వాళ్ళు, భాటియా వాళ్ళు తిరిగి ఇండియాకు వెళుతున్నారు. అందుకనే ఈ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. పటేల్ సాబ్ వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరూ పార్క్ కు అటూ ఇటూ ఉంటారు. వీళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. పార్టీలో బాగా కలిసిపోయి, ఫొటోలు తీసుకున్నారు. చిన్నచిన్న ఆటలు ఆడారు. కొంత మంది పాటలు పాడారు. అందరూ బాగా కలిసిపోయారు. ఇక చీకటి పడుతోందని అంతా లేచారు. అర్జున్ అందరి దగ్గరా సెల్ నంబర్ లు తీసుకున్నాడు.
“రేపు సీనియర్ సెంటర్ కు వస్తారా?” అడిగాడు పటేల్ సాబ్.
“మా కోడలు తీసుకెళుతానన్నది. వద్దామనే అనుకుంటున్నాను” అన్నాడు అర్జున్.
మా అబ్బాయి నన్ను డ్రాప్ చేస్తానన్నాడు. అయితే రేపు అక్కడ కలుద్దాము” అన్నాడు పటేల్ సాబ్.
(సశేషం)