గ్రీష్మ తాపము

రంగరాజుపద్మజ

ఇంటి వాడి కోపము ఇంగిలీకమోలె
భగ్గుమంటే సంతు సదురుకున్నట్టు…

ఆకలై కాలు చేయి;పెయ్యి కదలనట్టు…
కాలమసలు కదలడమే లేదు!

పేదవాని ఆలోచనోలె! పగలు సెగలు
తెగుత లేదు ముడిపడుతులేదు!

ఉద్దెరకు సామానియ్యడని తెలిసీ
దుకాణానికి పోయినట్టు-
ఉత్తరానికి తిరిగే సూర్యుడేమో!

చేతగానోణి కోపమోలె
రోజురోజుకు ఎండ మండిపోయె!

సగటు ఆడదాని నిట్టూర్పు వలె,
వేడి గాడ్పులు వీయబట్టె!

చెప్పులు లేని కాళ్ళకు
ఇసుక సెగలై తాకె!

అప్పులున్నోడికి అరువు పుట్టనట్టు…దప్పి తీర్చుకొన…
బావులు -చెరువులెండిపోయె! చెలిమెలే కరువాయె

బాటసారులొచ్చి నీడకని ఆగంగ-
పుకడుకొచ్చే నీళ్లు- పుడిసెడుకు
పిరము చేసి అమ్మబట్టె!అంగడోడు!

చెట్టు – చేను చెలుకలెండిపోయె!
అధికారి ముందు నౌకరోలె
మాడ మంట పుట్టి-నోట మాట రాక పాయె!

నాలుగు తలలోడికి – నెగులెందుకో?
మింట మంట పెట్టి- నీళ్ళు మసలబెట్టి,
కర్వరిమీద…కుమ్మరించె!

ఆలిమీద మగడు అరచినట్టు,
అడవి మీద అంగారాలే ఆరబోసె!
అమ్మ-అయ్య పంచాయితీ పెట్టుకుంటే
పోరగాండ్లు బొంతల -దూరినట్టు;

పుట్టల్ల మంట బుట్టంగ -పాములన్ని పొదల దూరిపోయె!

ఇంటోడి కోపం ఇంగిలీకమోలె
భగ్గుమంటే – సంతు సదురుకున్నట్టు..

ప్రకృతి అంత వాడిపోయి ముడుచుకొనె!

ఇది అది అని చెప్ప నలవి కాదు!
గ్రీష్మ తాపమింతింత కాదయా!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆదర్శం

శృతి నీవు గతి నీవు – పాట విశ్లేషణ