మేడారం జాతరకు
తరలి వస్తున్నారు సాగరం లా జనం.
ముడుపు లు చెల్లించేందుకు
సమ తూకం బంగారం బెల్లం దిమ్మెలు
తలకెత్తుకున్నారు,
భక్తి పాటల సంబురాలతో
సంతోషం పంచుకున్నారు.
గిరి ఝరుల అందాలకు
పరమార్థ జ్ఞానం కలిగినట్లు
చింతలన్ని మరచారు.
ఆదివాసులకు శ్రమ సేద్యం ,
వేట వృత్తి జీవనం.
కోయ దొరకు పుట్ట వద్ద కనిపించిదొక శిశువు.
పులులు, సింహాలు, కాపలా, చుట్టూ.
దైవాంశమున్న పాపను గూడానికి తెచ్చాడు.
సమ్మక్క అని పిలిచి ఒడిని చేర్చాడు.
అయోనిజ ఆ బిడ్డ చూపింది మహిమ.
గిరి జనుల రుజలన్నింటికి
ఆకు పసరు లిచ్చింది.
కష్టాలను తీర్చింది.
యుక్త వయసున పగిడిద్ద రాజును పెండ్లి యాడింది.
కన్న బిడ్డలకు తల్లిగా మన్ననలను పొందింది
సమ్మక్క సారలక్కలు,
తల్లీ కూతుళ్ళు వాళ్ళు
దివ్య కాంతలు, ధీర వనితలు
స్త్రీల ఆత్మ గౌరవానికి
సాక్షి ప్రమాణాలు.
మట్టి జనుల స్వేచ్ఛకు గాను
గట్టిగ పోరాడారు.
ప్రాణాలకు తెగించారు.
వన దేవతలు వారు
ప్రకృతి రక్షణకు
మనుగడల రూపమెత్తారు.
గిరి జనుల సంస్కృతిలో
జాతర జాతి సమైక్యతకు మూలం
సమ్మక్క ధైర్యం చరిత్ర లో అతి ఘనం.
దేవతా తరుణి ఆమె
రక్తం పడకూడదు నేల మీద
వెన్ను పోటు బల్లెం దిగిన గాయానికి
కట్టు కట్టుకుని పోరాడింది.
శత్రువులను చెండాడింది.
తూరుపు చిలుకల గుట్ట వంకకు మరలి
కంటికి కనుపించక ఎవ్వరికి
నెమలి నారచెట్టు కింద
నిండు పసుపు” కుంకుమ బరిణ” గా మెరిసింది.
మాఘ శుద్ధ పున్నమి నాటికి
గద్దె మీద కొలువుకొచ్చిన
సమ్మక్క సారలక్కలు
హారతులందే వేళకు
డప్పుల చప్పుళ్ళు, , శివసత్తులు పూనకాలు
మేళాలు తాళాలు,
ఇప్పుడు మొదలయ్యాయి
గిర్రున దిగి వచ్చే హెలికాఫ్టర్ ఏర్పాట్లు,
సంప్రదాయాలకు
శాస్త్ర విజ్ఞానం తోడు,
భక్తుల కందరికి ఫలించాలికోరికలు. —రాజేశ్వరీ దివాకర్ల