“అమ్మా,ఈరోజు నైట్ నేనూ, శిల్పా చెన్నై వెళ్తున్నాం,” తల్లితో చెప్పాడు కొడుకు తేజస్.
“ఇప్పుడేం సెలవు లేదు కదరా?ఇప్పుడు దేనికి?”అడిగింది రాధ కొడుకుని.
“అదేంటమ్మా, రేపు చెన్నైలో శిల్ప ది పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది, చెప్పింది కదా? మర్చిపోయావా?” అడిగాడు తేజ.
“ఔను లే చెప్పింది, కానీ నీకు సెలవు ఉండదు కదా, అందుకని తనే వెళుతుందేమో అనుకున్నాను,” అంది రాధ.
“అదేంటమ్మా, నా భార్య పెయింటింగ్ టాలెంట్ అందరూ పొగుడుతుంటే వినాలని నాకూ ఉంటుంది కదా! అందుకే మా బాస్ తో దెబ్బలాడి మరీ సెలవు తీసుకున్నాను. ఇద్దరం వెళ్తాం.రెండు రోజులు ఎగ్జిబిషన్ అయ్యాక వస్తాం,” అంటున్న కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రాధ.
“మా తరానికీ, ఇప్పటికీ ఎంత మార్పు?” అనుకుంది ఆమె మనసులో.
రాధకు ఒక్కడే కొడుకు తేజస్. ఆమె భర్త బ్యాంకు ఉద్యోగి.ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్.
కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మూడు నెలల క్రితమే అతను ఇష్టపడిన శిల్పతో పెళ్లి జరిగింది.
ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంది .ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఆ అమ్మాయిని చూశాడట. ఆమె పెయింటింగ్స్ ,ఆమె బాగా నచ్చడంతో తనే వెంటపడి ఆ అమ్మాయిని ఒప్పించి,ఆ తర్వాత ఇరువైపులా పెద్ద వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఆ అమ్మాయి గురించి తేజస్ చెప్పినప్పుడుతను ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయికి చిన్నప్పటినుంచి పెయింటింగ్ అంటే ఇష్టం అట .అందుకే దాన్నే కెరియర్‌గా సెలెక్ట్ చేసుకుంది. ప్రొఫెషనల్ చదువుల జోలికి వెళ్లకుండా బిఏ ఫైన్ ఆర్ట్స్ చేసిందట.
ఇలా పెయింటింగ్స్ వేయటం, వాటి ఎగ్జిబిషన్ పెట్టడం. అది ఏంటో మోడరన్ ఆర్ట్ అట. ఆ అమ్మాయి పెయింటింగ్స్ కి బోల్డు డిమాండ్ ఉందిట.నిజం చెప్పాలంటే తన కన్నా శిల్పాయే ఎక్కువ సంపాదిస్తుందని తేజస్ చెప్పినప్పుడు విని ఆశ్చర్యపోయింది రాధ.
దీనికి భర్త ప్రోత్సహించడమే కాక దగ్గరుండి వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లడమా?ఒక్క తరంలో ఎంత మార్పు అనుకోకుండా ఉండలేకపోయింది రాధ. అలా అనుకోగానే గతంలోకి జారిపోయింది.
తనకి నాట్యం అంటే చాలా ఇష్టం.”అమ్మా నేను నాట్యం నేర్చుకుంటాను,” అని చెప్పింది తల్లితో.
“చాల్లే నాతో అంటే అన్నావు కానీ, ఇంకెవరితో అనకు. అలా నాట్యం అంటూ నలుగురిలో తైతక్కలాడుతావా? చదువు చెప్పేస్తున్నారు మీ నాన్న. అదే గొప్ప విషయం.మా తరంలో మాకు ఆ అదృష్టం కూడా లేదు. బుద్ధిగా చదువుకుని ఏదో ఉద్యోగం సంపాదించుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అర్థం అవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు,” నోరు నొక్కేసింది తల్లి.
సరే, తనంటే నాట్యం అంది. తన చెల్లెలు పాపం సంగీతం నేర్చుకుంటానంటే, దాన్ని కూడా ఒప్పుకోలేదు.
డిగ్రీ వరకు చదువుకొని టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి గవర్నమెంట్ టీచర్ పోస్టింగ్ తెచ్చుకున్న తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అమ్మా నాన్న.అందులో తన ప్రమేయం ఏమీ లేదు, నాన్నకు మంచిది అనిపించడం మినహా.
పెళ్లయిన తర్వాత భర్తతో చెప్పింది,”నాకు నాట్యం అంటే ఇష్టం,” అని.
“ఇష్టమైతే టీవీలో ఆ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు చూడు. అంతకుమించి మరేం కోరుకోకు. నువ్వే నాట్యం చేస్తానని మాత్రం చెప్పకు,” తన ఇష్టం పై ఒక జోక్ వేసి వదిలేసాడు భర్త.
అలా తనకు ఉన్న ఇష్టం తనలోనే ఉండిపోయింది, ఏ వైపు నుంచి ప్రోత్సాహం లభించక.
“పోనీలే, ఇప్పుడు నా కోడలికైనా ఆ అదృష్టం దక్కింది. తనలో ఉన్న కళని ప్రోత్సహించడం నా కొడుకే కాదు, నేను కూడా చేయవలసిన పని. మార్పు మంచిదే,” అనకుంది రాధ.