నవ్వు

కథ

లక్ష్మీమదన్

సింధూర చాలా అందమైనది తెలివైనది కూడా.. కానీ మొహమాటస్తురాలు భయం కలది..

వీటి వలన మొహం ఎప్పుడు పొగరుగా ఉన్నట్లు కనిపించేది.. ఎవరైనా పలకరిస్తే మొహమాటం కొద్ది ఏమి సమాధానం చెప్పేది కాదు అది చూసి అందరూ గర్వం అనుకునేవారు ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి సింధూర పెరిగి పెద్దదవుతుంది…

ఒకసారి సింధూర అక్కతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.. వాళ్ళందరూ చిన్నప్పటినుండి తెలిసిన వాళ్లే కాబట్టి వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది.. వాళ్లు సింధూరం చూసి నవ్వలేదు వాళ్ళ అక్క మంజీరను చూసి అందరూ పలకరించారు . ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు..

” ఏంటి నేను వాళ్లను పలకరించాను కదా అయినా వాళ్ళు నాతో మాట్లాడటం లేదు ఏంటి” అని బాధపడిపోయింది సింధూర.

ఆ చుట్టాల వాళ్ళింట్లో చాలామంది ఉన్నారు..ప్రతి ఒక్కరూ మంజీరను పలకరిస్తున్నారు.. మంజీర కూడా గలగలా వాళ్ళతో మాట్లాడుతుంది ..చూడని వాళ్ళని కూడా పిలిచి మరీ పలకరిస్తుంది కానీ సింధూరకు అలా చేతకాదు.. ఒక మూల అలాగే కూర్చుంది విసుగు రాసాగింది….

ఆ తర్వాత వాళ్లు వాళ్ల ఊరికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి…

” అమ్మా! అందరూ అక్కనే పలకరిస్తున్నారు అక్కతోనే మాట్లాడుతున్నారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాతో ఎవరూ మాట్లాడటం లేదు నేను వాళ్ళను చూసి నవ్వాను కూడా అయినా కూడా నన్ను చూసి వాళ్లు ఏ మాత్రం స్పందించలేదు” అని ఏడ్చింది సింధూర.

వాళ్ళ అమ్మ సింధూరను దగ్గరికి తీసుకొని..

” వాళ్లకు నువ్వైనా అక్కయినా ఒకటే కానీ అక్క అందరిని చూసి నవ్వుతుంది పలకరిస్తుంది అందుకనే వాళ్లందరూ అక్కతో మాట్లాడతారు” అన్నది సింధూర వాళ్ళ అమ్మ.

” నేను కూడా వాళ్లను చూసి పలకరింపుగా నవ్వాను అయినా వాళ్ళు నన్ను చూసి మాట్లాడలేదు” అన్నది సింధూర.

” నువ్వు నవ్వాను అనుకున్నావు కానీ నవ్వలేదు ఎప్పుడు మొహం చిటపటలాడినట్లే పెట్టుకుంటావు అందుకనే ఎవ్వరు నిన్ను మాట్లాడించడానికి జంకుతారు నిన్ను చూసి నీకు గర్వం అనుకుంటారు” అన్నది సింధూర వాళ్ళ అమ్మ.

కొంచెం ఆలోచనలో పడింది సింధూర.. అలా తిరుగుతున్న కొద్ది అక్కను పలకరించేవాడు కానీ తనతో మాట్లాడే వాళ్ళు తక్కువ అయ్యారు..

స్కూలుకు వెళ్లిన తర్వాత కొంచెం తనకు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో హ్యాపీగానే మాట్లాడేది కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మొహం చెల్లేది కాదు.. గదిలోపలికి వెళ్లి కూర్చునేది.

స్నేహితులు మాత్రం సింధూరతో బాగా చదువుగానే ఉండేవాడు “నువ్వు ఎంతో అందంగా ఉన్నావే “అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు.

కానీ నేను బంధువులకి ఎందుకు నచ్చడం లేదు వాళ్ళు ఎవరూ నన్ను నువ్వు బాగున్నావు అని ఎప్పుడూ అనరు అన్నిట్లో అక్కనే మెచ్చుకుంటారు అని బాధపడేది.

కొన్నాళ్ళకు పదవ తరగతి లోకి వచ్చింది. సింధూరను చూసిన వాళ్ళు ఆమెతో నేరుగా మాట్లాడటానికి జంకె వాళ్లు మగ పిల్లలైతే చాలా భయపడేవాళ్లు అది ఆమెకు ఒక విధంగా మంచిదే అయింది కానీ పరోక్షంగా పేరు లేకుండా ఉత్తరాలు రాసేవాళ్ళు. అది ఇంకా చిరాకు వచ్చేది సింధూరకి.

ఇవన్నీటిని దాటుకుని సింధూర కాలేజీకి వచ్చింది అప్పుడు తాను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది.. కూపస్త మండుకంలా ఉండే సింధూర కొంచెం బయట ప్రపంచంలోకి వచ్చింది. కొత్త మనుషులు కనపడసాగారు.

అయినా కూడా బంధువుల ఇంట్లో ఒక మూల కూర్చునేది మాట్లాడకుండా..

అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మహిళ వరసకు పిన్ని అవుతుంది ..

” అక్కడ ఒక్కదానివి ఎందుకు కూర్చుంటావు ఇలా రా నాతో మాట్లాడుదువు గాని “అని వంటింట్లోకి పిలిచేది

వాళ్ళ ఇంట్లో కూడా వచ్చి పోయే బంధువులకు తక్కువేమీ కాదు. ఇంకా అందరి చూస్తే మొహమాటంగా భయంగా ఉండేది.. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పిన్నితో మాత్రం మొహమాటం పోయి చాలా చనువుతో మెలగసాగింది… ఆమె కూడా ఎన్నో విషయాలు సింధూరతో పంచుకునేది వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది కానీ మళ్ళీ కొత్తవారితో అదే బెరకు.

తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో వేరే ఇంట్లో ఉండసాగింది అమ్మ ఎక్కువగా ఊరికి వెళ్లేది కానీ నాన్న ఉండేవారు అక్కడ. ఆ పక్కనున్న వాళ్ళు చాలా బాగా మాట్లాడించేవారు..

” ఎంతో బాగుంటావ్ సింధూర నువ్వు” అనేవాళ్ళు.

అప్పుడు సింధూరపు వాళ్లు తనని ఎగతాళి చేస్తున్నారేమో నేను బాగుండడం ఏంటి! చిన్నప్పుడు బంధువులలో ఎవరు నన్నుఇలా అనేవాళ్ళు కాదు అని ఆలోచించేది.

తర్వాత పక్కన ఒక కుటుంబంతో స్నేహం ఏర్పడింది ఆమె పేరు వసంత ఆమెను అక్కా అని పిలుస్తూ ఎంతో చనువుగా ఉండేది సింధూర..

వాళ్ళ ఇంటి ముందు ఎవరైనా వెళుతుంటే “అక్కా! ఆ అమ్మాయి ఎంత బాగుందో కదా “అనేది.

అప్పుడు వసంత సింధూరతో అనేది..

” సింధూరా! నువ్వు ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అంటావు కదా నువ్వు ఎంత బాగుంటావో నీకు తెలుసా” అని అన్నది.

” నిజమా అక్కా! నేను బాగుంటానా! అందరూ అంటుంటే ఈ మధ్య ఎగతాళి చేస్తున్నారేమో అనుకున్నా” అన్నది సింధూర.

” నువ్వు అందంగా ఉంటావు తెలివిగల దానివి కానీ ఒక్కటే తక్కువ అది ఏంటంటే నీ మొహంలో నవ్వు కొత్తవారిని చూడగానే బిగుసుకొని పోతావు.. దగ్గర వాళ్లతో చాలా బాగుంటావు చూడు ఇప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావ్ ఎంత బాగా అనిపిస్తున్నావో” అన్నది వసంత.

” అచ్చం మా అమ్మ కూడా నీలాగే చెప్పింది అక్కా!” అన్నది సింధూర.

అప్పటినుండి ఎవరైనా కనిపిస్తే నవ్వడం నేర్చుకుంది పలకరించడం కూడా అలవాటు చేసుకుంది అప్పటినుండి ఆమె మొహం తీరే మారిపోయింది ఎంతోమంది ఎంత బాగా నవ్వుతావు నీ మొహం లో ఎంత కళ ఉంది అనే వాళ్ళు.. అప్పటినుండి అనుకుంది “ఒక నవ్వు లేకుంటే మనిషి మొహం మాడిపోయినట్లే ఉంటుంది కదా “అని..

ఆ తర్వాత పెళ్లి అయ్యి బాధ్యతలు లోబందీ అయిపోయింది అప్పుడు కూడా తన నవ్వు మాత్రం చెరగనీయలేదు.. ఎన్ని సమస్యలు వచ్చినా అందరితో మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండడం నేర్చుకుంది ఆమె అందం ద్విగుణకృతమైంది..

అలా వయసు పెరుగుతూనే ఉంది వృద్ధాప్యం కూడా వచ్చింది కానీ అందరూ ఈ “వయసులో కూడా ఇంత బాగా ఎలా ఉన్నావ్” అని అడుగుతుంటే తనకు తనే ఆశ్చర్యం అనిపించేది చిన్నప్పుడు తనను ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఈయలేదు ..వయసు పెరిగిన కొద్దీ బాగున్నావు అని అంటున్నారు అంటే అది తన ముఖంలోని చిరునవ్వు మాత్రమే కారణం.

మనిషి ఎంత అందంగా ఉన్నా ముఖంలో స్వచ్ఛమైన నవ్వు లేకపోతే వెలవెలబోతుంది కళాహీనంగా ఉంటుంది అది తెలుసుకున్న సింధూర ఆ నవ్వును తన నుండి దూరం చేసుకోలేదు.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

పరివర్తన