బెల్లం చపాతీ ఎప్పుడైనా తిన్నారా?చాలా బాగుంటుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్టు కి దగ్గర చుట్టం అనుకోండి.
ఇంటికి సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు, స్వీట్ సర్వ్ చేయాలంటే, రెగ్యులర్ గా చేసే సేమియా అవీ కాకుండా కాస్త డిఫరెంట్ అండ్ టేస్టీ గా ఈ బెల్లం చపాతీ చేసిపెట్టండి.
బొబ్బట్టు చేసేందుకు శ్రమ ఎక్కువ. పైగా మైదా ఈరోజుల్లో చాలామంది ఇష్టపడటం లేదు. కానీ ఈ బెల్లం చపాతీ ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచీ కూడా.
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి
బెల్లం (బెల్లం పొడి)
ఇలాచీ
నెయ్యి
తయారీ విధానం :
మీకు కావలసినంత గోధుమపిండి (తినేవారి సంఖ్య ను బట్టి) ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం ఉప్పు కలిపి, నీరు పోస్తూ గట్టిగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కాస్త నూనె కానీ, నెయ్యి కానీ వేసి కలిపి పక్కన పెట్టండి. ఎక్కువ సేపు నానవలసిన అవసరం లేదు.
బెల్లం తురుముకోవాలి.బెల్లం తురుములో కొంచెం ఇలాచీ పొడి కలిపితే రుచిగా ఉంటుంది.
Note: ఇప్పుడు బెల్లం తురుము రెడీమేడ్ కూడా లభ్యం అవుతుంది.
చపాతీ పిండి కొంచెం పెద్ద సైజు లో తీసుకుని, ముందుగా పూరీ సైజు లో ఒత్తుకోవాలి.ఇప్పుడు అందులో కొంచెం బెల్లం తురుము వేసి, బంతి లా చుట్టండి. తర్వాత మామూలు చపాతీ ఒత్తినట్లు ఒత్తుకోవాలి.
పెనం పై నెయ్యి రాసి, ఈ బెల్లం చపాతీ కాల్చుకోవాలి. చాలా రుచిగా ఉండటమే కాక ఆరోగ్యం కూడా.
(ఆవకాయ నంచుకుని తింటే ఇంకా రుచిగా ఉంటాయి ఈ బెల్లం చపాతీ)
బెల్లం ఇష్టపడని వారు, లేదా సమయానికి బెల్లం తురుము అందుబాటులో లేని వారు, పంచదార తో కూడా ఈ చపాతీ చేసుకోవచ్చు. బెల్లం చపాతీ అంత రుచిగా లేకపోయినా, బాగానే ఉంటాయి.