ప్రవల్లిక

కథ

సుమలత దేష్పాండె

అవి ఇంజినీరింగ్ చదువుతున్న రోజులు. ఫస్ట్ ఇయర్లో లేట్ గా జాయిన్ అయిందా అమ్మాయి.
చూడగానే ఆకట్టుకునే అందం. బాపుబొమ్మ ఆమె ముందు దిగదుడుపే. ఒక్కసారిగా ఆమె రూపం నా హృదయంలో ముద్రపడిపోయింది.
లెక్చరర్ అడిగిన ప్రశ్నకు, ‘ప్రవల్లిక” అని ఆమె కోయిల కంఠం నా చెవిలో తేనెసోనలు నింపింది. నా పెదవులు మౌనంగా ఆమె పేరును కూడబలుక్కుంటుంటే, ఆ పేరు ఆమె ముగ్ధమనోహర రూపానికి తగినట్లుగా అందంగా ప్రతిధ్వనించింది నాలో.
“నేను చాలా లేట్ గా జాయినయ్యాను. చాలా క్లాసులు మిస్ అయ్యాను. దయచెసి మీ నోట్స్ ఒకసారి ఇస్తారా?” అనుకోని అభ్యర్థన ఆమె నుంచి. ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపు కు మైమరిచి మౌనంగానె నా నోట్స్ అందచేసానామెకు.
“థాంక్స్,” చిరునవ్వు నవ్వింది. “మీరు టాప్ స్టుడెంట్ అని చాలా విన్నాను మీగురించి,” సంభాషణకు నాంది పలికింది.
“అదేం లేదండీ. ఏదో కొంచెం…” మొహమాటంగా అన్నాను. ఆ పరిచయం అలా దినదిన ప్రవర్ధమానమయి మంచి స్నేహితులుగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకో ఏ విషయమయినా నాతో చర్చించేది ఆమె. క్రమంగా ఆమెకున్న అందానికి తోడు, అణకువ, జాలి, కరుణ వున్నాయని తెలిసిపోయింది. కాలేజ్ డిబేట్ లో ఆమె మానవతా వాదం స్పష్టంగా కనిపించేది.

ఒకసారి కాలేజ్ బయట రోడ్డు పక్కన అడుక్కునే బిచ్చగాళ్ళను చూసి విసుక్కున్నాను నేను..
“అంత కోపం ఎందుకు ప్రశాంత్? వాళ్ళలా కావడానికి మన సమాజమే కారణం కదా?” అంది ప్రవల్లిక.
“సమాజం ఏం చేస్తుంది? ఏ పనీ పాటా లేకుండా వాళ్ళలా సోమరిపోతుల్లా తిరుగుతుంటె?. అన్నాను.
“ప్రభుత్వం ఎలాగూ కల్పించుకోదు. సమాజం కల్పించుకుని వీళ్ళను ఎడ్యుకేట్ చేసి ఏవో పనులు కల్పిస్తే తప్పకుండా వీళ్ళ జీవితాలు బాగుపడుతాయి.”

“వీళ్ళు ఇలాంటి జీవితానికి అలవాటుపడి పనులు ఇస్తే మాత్రం చేస్తారా? అదీగాక ఎవరయినా వీళ్ళను నమ్మాలంటే కూడా కష్టం.”

“ఒక పని మంచిదని మనకనిపించినప్పుడు, మోసపోతామేమో అని చేయకుండా ఉన్నదానికంటే, దాని పర్యవసానం ఎలా ఉన్నా సరే అని ముందే మనం సిద్ధపడి చేయడం మంచిదని నా ఉద్దేశ్యం. అలాంటప్పుడే మనం ఎవరికయినా సహాయం చేయగలం. కాకపొతే ఒక్కోసారి అది ఎదురుతిరిగి మనం మోసపోవచ్చు. నష్టం జరగొచ్చు. అయినా సరే కనీసం మనం ఒక మంచిపని చేయడం కోసం ప్రయత్నించాము కదా అనే తృప్తి అయినా మిగులుతుంది.

ఆమె అన్న మాటలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయాను.

“ఏంటి ఆలోచిస్తున్నావు ప్రశాంత్? మా ఇంట్లో ఇప్పుడు పనిచేసే అమ్మాయి ఒకప్పుడు మా ఇంటికి అడుక్కోడానికి వచ్చిన అమ్మాయే తెలుసా?”

“నిజంగా?” నమ్మలేనట్లు చూసాను ఆమె వేపు.

“అవును. నేనే ఆమెను మాటల్లోకి దింపి, అడుక్కోవడం కన్నా పనిచేసుకు బ్రతకడం మంచిది కదా అని ఒప్పించి ఎలాగో మా అమ్మను బ్రతిమాలి పనిలో పెట్టించాను.”

అది విన్నతర్వాత ప్రవల్లిక నా మనసులో ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయింది. నిజం చెప్పాలంటే రోజురోజుకీ నా మనసులో ఆమె పట్ల ఆరాధనా భావం పెరగిపోసాగింది.

మా చనువుని చూసి కొంతమంది మా ఫ్రెండ్స్ ఆమె చాటుగా నన్ను ఆటపట్టిస్తూ, “ఎంతదూరం వచ్చింది మీ ప్రేమాయణం అనేవాళ్ళు. వాళ్ళన్నారని కాకున్నా, ఇన్ని సుగుణాలున్న ఈ అమ్మాయి జీవిత భాగస్వామి అయితే జీవితం ఎలా ఉంటుందో అని ఊహించుకోలేకపోలేదు. కానీ ఆమెతో ఈ ప్రస్తావన తేవడానికి ఎంత ప్రయత్నించినా ధైర్యం చాలలేదు.

నాలుగేళ్ళూ నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి.
ఇద్దరికీ ఇంజినీరింగ్ డిగ్రీ అయిపోయింది. ప్రవల్లిక కు నాకు వెంటనే గూగుల్ లో జాబ్స్ వచ్చేసరికి నా సంతోషానికి అవధుల్లేవు. ఇక ఇంట్లో వాళ్ళకు చెప్పి ఒప్పించడమే తరువాయి. తర్వాత ప్రవల్లిక తో ఎలాగయినా నా మనసులో మాట చెప్పి మా బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరాను.
‘ఇంతకీ ఆ అమ్మాయికి నీపై ఆ ఉద్దేశ్యం ఉందో లేదో?” అంతరాత్మ సందేహించింది.
‘నేనంటే తనకిష్టమన్న సంగతి ఇంకా తెలియలేదా నీకు?” కోప్పడ్డాను అంతరాత్మను.

ముందు అమ్మతో మాట్లాడి చూడాలనుకున్నాను.
“వాళ్ళు మనకన్నా ఉన్నవాళ్ళున్నట్లున్నారు. ఆ అమ్మాయి మనింట్లో ఇముడుతుందంటావా?” కాస్త కలవరపడింది అమ్మ.
“కానీ ప్రవల్లిక అలాంటిది కాదమ్మా,” అంటూ వివరించాను అమ్మకు.
‘నీ ఇష్టం నాన్నా నీకు నచ్చిన అమ్మాయి నాకూ నచ్చుతుంది.” అని హామీ ఇచ్చింది.
ఇక నా ఆనందానికి అవధులు లేవు.

వెంటనే ప్రవల్లికకు ఫోన్ చేసాను. బహుశా ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో జవాబు రాలేదు. ఇక ఆలస్యమెందుకని వాళ్ళ ఇంటి నంబర్ కి డయల్ చేసాను.
“హలో,” వాళ్ళ అమ్మగారు కాబోలు.
“ప్రవల్లిక ఉందా అండి?”
“లేదు. మీరెవరు?”
“నేను… ప్రశాంత్.”
“ఓ ప్రశాంత్. మా అమ్మాయి నీగురించి ఎప్పుడూ చెపుతూనే ఉంటుంది.”
“ఒకసారి మాట్లాడొచ్చా అండి?”
“ఇంట్లో లేదు బాబూ, కిరణ్ తో సినిమాకెళ్ళింది.”
“కిరణ్? కిరణ్ ఎవరండి?”
“ప్రవల్లిక ఫ్రెండ్.”

‘ఫ్రెండ్…కిరణ్…’ అప్రయత్నంగా నా చేతిలో ఫోన్ జారిపోయింది. నాకు తెలియని ఈ ఫ్రెండ్ ఎవరబ్బా? కిరణ్ ఎవరు? మా క్లాస్ లో ఆపేరు గలవాళ్ళెవరూ లేరే?’ అలోచిస్తూ కూర్చున్నాను. ఎందుకో మనసులో ఒక్కసారిగా ఉప్పొంగిన నిరాశ.
అన్ని విషయాలూ నాతో పంచుకునే ప్రవల్లిక ఈ కిరణ్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు?
అతను ఎవరయి ఉంటారు? ఇద్దరూ సినిమాకి వెళ్ళారంటే, ప్రవల్లిక కొంపతీసి అతన్ని ప్రేమించడం లేదుకదా?’

పెరిగి పెరిగి వటుడింతై అంతై అన్నట్టు, నా మనసులో కిరణ్ గురించిన ఆలోచనలు, అనుమానాలు భూతద్దంలో కనిపించి ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. ఇక ఇంట్లో ఉండలేక గోదావరి ఒడ్డు వేపు అడుగులు వేసాను. అలలపైనుండి తేలి వచ్చే చల్లటి పిల్ల తెమ్మెర ఎప్పటిలా ఆహ్లాదాన్ని కలిగించలేదు సరికదా చికాకు తెప్పించింది. ఆమె నవ్వును తలపించే గోదారి గలగల సవ్వడికి నా మనసు ఉప్పొంగే బదులు ఏదో అలజడి చెలరేగింది.

కిరణ్ గురించి ఎలా అనుకోవాలో తెలియడం లేదు.కిరణ్ మామూలు ఫ్రెండ్ మాత్రమే అయుంటాడా? అశాంతితో కళ్ళు మూసుకుని ఆ ఇసుక తిన్నెల పై ఒరిగిపోయాను.

అసలు ఈ బాధంతా దేనికి? ఈ తర్జనభర్జన ఎందుకు? సూటిగా ప్రవల్లిక నే అడిగితే సరిపోతుంది కదా! ఫర్వాలేదు ఆమె ఇంటికే వెళ్ళి ఏదోవొకటి ఈరోజే తేల్చుకుంటాను. ధృఢ నిశ్చయంతో బయల్దేరాను.

నేను వెళ్ళేసరికి ముందు హాల్లో ఎవరో ఒక మోడ్రన్ డ్రెస్ లో ఉన్న అమ్మాయితో కబుర్లు చెపుతూ కూర్చుని ఉంది ప్రవల్లిక.
నన్ను చూడగానే లేచి నిలబడి, ’ఓ ప్రశాంత్. రారా. ఇందాకే అమ్మ చెప్పింది నువ్వు ఫోన్ చేసావని.” అంటూ ఆహ్వానించింది.
ఇంతలో “ఇక నేను వెళ్తాను ప్రవల్లికా,” అంటూ లేచింది ఆ అమ్మాయి.
“అయ్యో సారీ అండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నేను తర్వాత కలుస్తాలెండి,” అంటూ వెనక్కి తిరగబోయాను.
“ఫర్వాలేదండీ నాకూ ఎలాగూ పనిఉంది వెళ్ళాలి అంటూ ప్రవల్లిక కు చెయ్యూపి మెట్లు దిగి వెళ్ళిపోయిందా అమ్మాయి.
“కూర్చో ప్రశాంత్. ఏంటి కబుర్లు?” అడిగింది ప్రవల్లిక.
“నీతో మాట్లాడాలి ప్రవల్లికా,” ఎలాగో ధైర్యం చేసాను.
“చెప్పు ప్రశాంత్,” అంది ఆమె తనూ కూర్చుంటూ.
“కాస్త పర్సనల్ విషయం…” లోపలికి చూస్తూ అన్నాను.
“ఫర్వాలేదు చెప్పు. ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ గుడికి వెళ్ళింది. నాన్నగారు ఇప్పుడే రారు.”

మళ్ళీ నాలో ఏదో బెరుకు. కిరణ్ ఎవరు అని అడగడానికి ఎందుకో మనసు రాలేదు.
ఇదివరకు ఎన్నోసార్లు రిహార్సల్ చేసుకున్న మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు. ఎలాగోలా చివరికి గొంతు సవరించుకుని, ‘ప్రవల్లికా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీకిష్టమయితె నిన్ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను,” ఎవరో తరుముకొస్తున్నట్లు గబగబగా చెప్పేసాను.

“ఓ ప్రశాంత్…,” అంటూ నావేపు చూసింది ప్రవల్లిక.
ఆమె కళ్ళల్లో ఆశ్చర్యమో ఆనందమో, మరేదో తెలియని ఏదో భావం.
“ప్రవల్లికా,” ఆమె సుతిమెత్తని చేయి నా చేతిలోకి తీసుకున్నాను.
ఆమె కళ్ళల్లో నీళ్ళు .
బహుశా ఆనందభాష్పాలేమో?
“ప్రశాంత్…,” ఆమె స్వరంలో వణుకు.
ఒక్కసారే నేను చెప్పేసరికి ఎమోషనల్ అయిపోయినట్లుంది.
“ఫర్వాలేదు ప్రవల్లికా ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. టైం తీసుకుని ఆలోచించుకునే చెప్పు. ఎదురుచూస్తుంటాను. నీవు ఒప్పుకుంటే నా అంతటి అదృష్టవంతుడు ఈ లోకంలోనే ఉండడనుకుంటా.

నా వేపు చూసిన ఆమె చూపులో మరేదో అంతులేని ఆర్ధ్రత. ఎన్నెన్నో ఊహించుకుంటూ, ఆమె చూపుల్లో నా ఎడల కనిపించిన అభిమానాన్ని నెమరువేసుకుంటూ అఘమేఘాల మీద తేలుతూ ఇంటికి వచ్చాను.

మధ్య మధ్యలో జొరబడే కిరణ్ పేరును కసురుకుని పక్కకు నెట్టి, అనుమానపడే మనసును అర్థంలేకుండా అపోహపడకు, అంటూ కోప్పడి, ఆరాత్రంతా తీయని కలల్లో తేలిపోయాను.

ఉదయం లేచి, ఆ సాయంత్రం ప్రవల్లికను కల్సుకోబోతున్నాననే ఉత్సాహంతో ఈల వేస్తూ, ఆమె చెప్పబోయే శుభవార్తను ఊహించుకుంటూ, ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను.
‘సార్,” అనే కేక నా ఆలోచనలకు అంతరాయం కలిగించింది.
‘ఎవరూ?’ అంటూ ముందు రూంలోకొచ్చాను.
“ఎవరో అమ్మాయి ఇది మీకిమ్మంది సార్,” అంటూ ఏదో కవర్ నా చేతిలో పెట్టి, పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగెత్తాడా అబ్బాయి.

‘టు
ప్రశాంత్’
కవర్ పై ప్రవల్లిక చేతివ్రాత ముత్యాల సరాల్లా.

ఓహో, మాటలతో తెలియ జేయలేని మధురభావాలను ప్రేమలేఖ ద్వారా తెలియపరుస్తూందా? ఈల వేస్తూ కవర్ విప్పాను.

ప్రశాంత్, ఈ విషయం నీకు మనసు విప్పి చెప్పాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతానేమో అన్న భయం. చాలా ఏళ్ళుగా నన్ను నేను తెలుసుకోలేని ఒక అయోమయ స్తితిలో మునిగి ఉన్నాను. అసలు నేనేమిటొ నా ఫీలింగ్స్ ఏమిటో నాకే వింతగా ఉండి భయం కూడా వేసేది. మన స్నేహం పెరిగినకొద్దీ, నీలో నాపై కలిగె అనురాగం నాకు చాలా భయం కలిగించేది. అన్ని విషయాలూ విడమరిచి నీతో చెప్పాలని ఎన్ని సార్లో అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు నాలో ఏదో అశక్తత నన్ను చెప్పనీయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. నా అశ్రద్ధ ఇంతదూరం తెచ్చింది. నాకు తెలుసు నేను చెప్పబోయె విషయం నీ హృదయాన్ని బ్రద్దలు చేస్తూందని కానీ చెప్పక తప్పదు. ఇప్పటీకే చాలా ఆలస్యమయిపోయింది. నన్ను క్షమించు ప్రశాంత్.
రెండేళ్ళ క్రితం అనుకోకుండా మా పక్కవాళ్ళింట్లో అద్దెకు దిగిన కిరణ్ తో పరిచయం ఎర్పడింది.
ఎందుకో మొదటి చూపులోనే ఏదో అవినాభావ సంబంధం ఉంది మా ఇద్దరిమధ్యా అనిపించింది. త్వరలోనే మనసు విప్పి మాట్లాడుకునేంత సన్నిహితులం అయ్యాము. ఏదొ తెలియని అనుభూతి కిరణ్ సమక్షంలో. ఏదో తెలియని మైకం ఆ స్పర్షలో. ఎన్నో జన్మల బంధమే..ఈ అనుబంధం అని మాఇద్దరికీ అనిపించింది. ఇప్పుడది ఒక విడదీయరాని బంధంగా మారింది. ఒకరిని విడిచి మరొకరం బ్రతకలేము అన్నంత స్థాయికి ఎదిగింది. ఇప్పటికి నీకు అర్థమయింది కదూ. నువ్వు చూసావు కిరణ్ని అదే కిరణ్మయిని మొన్న మా ఇంట్లొ. అదే ఆ జీన్స్ వేసుకున్న పొట్టి జుట్టు అమ్మాయి. ఆశ్చర్యపోతున్నావు కదూ! కాని ఇది నిజం.

మాకు తెలుసు మా సంబంధాన్ని ఈ సమాజం ఆదరించలేదని, ఆమోదించలేదని. మా అంతర్మధనాన్ని, ఆకాంక్షలను అర్థం చేసుకోలేని ఈ సమాజం మామీద రాళ్ళు రువ్వొచ్చు.
అన్నీ ఆలోచించుకుని, అన్నిటికీ తట్టుకునె ధైర్యాన్ని మాకివ్వమని, ఉన్నాడో లేడో తెలియని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇద్దరం కలిసి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాం. మా అమ్మానాన్నలకు చెప్పే ధైర్యం లేక వాళ్ళకు ఉత్తరంలో అన్నీ రాసి పోస్ట్ చేసాను. పిరికి వాళ్ళలా పారిపోతున్నాము . మా ఇద్దరికీ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే చదువు ఉంది కాబట్టి ఎలాగో ఒకలాగ బ్రతకలేకపోము.

ఒక్కోసారి నువ్వు అనేవాడివి గుర్తుందా, “నీ గురించి అన్నీ తెలిసినా సరే కొన్ని సార్లు నువ్వు అర్థంకాని ప్రశ్నలా ఉంటావు ప్రవల్లికా” అని. ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాను కదూ! ప్రశాంత్, తెలిసో తెలియకో నీలో నేను ఆశలు రేపి చేయరాని అన్యాయం చేసిఉంటాను. నన్ను క్షమించు. నాకు తెలుసు, నీ మనసెంత మంచిదో. నువ్వు సహృదయంతో నన్ను క్షమిస్తావని చాలా ఆశ పడుతున్నాను. దయచేసి నన్నొక పీడకలగా మర్చిపోయి, మరో మంచి, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని, నువ్వు సుఖసంతోశాలతో నిండనూరేళ్ళు వర్ధిల్లాలని కోరుతూ, మరోసారి మనసారా నన్ను మన్నించమని వేడుకుంటూ…
నీది కాలేని, నీ ప్రవల్లిక.

అంతే షాక్ తగిలి తల గిర్రున తిరిగింది. ఒక్కసారిగా కళ్లముందు చీకటి తెరలు పరుచుకున్నాయి. శూన్యంలోకి అలాగే చూస్తూ ఉండిపోయాను. నా చేతిలోని కాగితాలు గాలికి చెల్లాచెదురయి పోయాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

33% ముందడుగు – A step to sucsess

మన మహిళామణులు