వర్షించని మేఘం

కథ

జ్యోత్స్న తాతిరాజు

ఆఫీసు నుంచి వచ్చి కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది యామిని. సాయంత్రం ఐదు గంటలవుతోంది.ఊరికి కొంచెం దూరంగా కొత్తగా రూపుదిద్దుకుంటున్న కాలనీలో అక్కడక్కడ మాత్రమే ఇళ్లు కనిపిస్తున్నాయి.కూలి పనికి వచ్చిన జనం వేసుకున్న పూరి గుడిసెలే ఎక్కువగా ఉన్నాయి.కాఫీ త్రాగడం అయిపోయింది, గ్లాసు పక్కన పెట్టింది.ఎందుకో ఆమెకు లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు.
దూరంగా ఖాళీ స్థలంలో పూరి గుడిసెల ముందు ఆడుకుంటున్న పిల్లల కేరింతలు గాలిలో తేలివస్తూ యామిని చెవులను తాకుతున్నాయి. ఏ చీకు చింతా లేకుండా ఆడుకుంటున్న వాళ్లను చూస్తుంటే ఆమెకు తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. ఎంత మధురమైనది ఆ బాల్యం! ఆమె మనస్సు గతంలోకి పరుగు తీసింది.
పసితనంలో తన చిన్న మనసులో ఎన్నో ఊహలు! అనంతాంబరాన్ని అందుకోవాలని,పక్షిలా హాయిగా నీలాల నింగిలో ఎగరాలని, వెండి మబ్బుల పరుపుపై పవళించాలని,చందమామతో దోబూచులాడాలని, చుక్కలతో ఊసులాడాలని ఎన్నెన్నో ఆశలు.అవన్నీ అమ్మతో చెపితే తన బుగ్గ మీద చిటికె వేసి మురిపెంగా నవ్వేది.
అమ్మ ఒడిలాంటి ఆ పల్లెలో,ఆ కొబ్బరితోటల్లో ఏటి గట్ల మీద,కోవెల మెట్ల మీద రామయ్య మాష్టారు చెప్పే పాఠాలు వింటూ, ప్రియనేస్తాలతో
ముచ్చట్లు, ఆటపాటలతో తనకి ఎలా గడిచాయో పద్దెనిమిదేళ్ళు తెలియనే తెలియదు.
“పద్దెనిమిదేళ్ళు నిండాయి.ఆడపిల్లకు పెళ్ళి చేయకుండా ఇంకా ఎంతదాకా చదివిస్తావు?”అని నాయనమ్మ సణుగుతూ ఉండటంతో నాన్నకి తన పెళ్లి తలపెట్టక తప్పింది కాదు. తనకి బాగా గుర్తు! అప్పుడే పెళ్ళి వద్దని,ఇంకా చదువుకుంటానని ఏడ్చింది తాను.”ఊరుకో మిన్నూ, మా అమ్మవు కదా, పెళ్ళయ్యాక కూడా చదువుకుంటానన్నావని అబ్బాయితో నేను చెబుతాలే.అతనికి కూడా చదువంటే ఇష్టమే,కాదనడు” అని నాన్న తనకు నచ్చచెప్పారు. నాన్నకి తనంటే చాలా ఇష్టం. తనని ,ఆయన ముద్దుగా మిన్నూ అని పిలిచేవారు. నాన్న మాట కాదనలేకపోయింది తాను.
దాంతో సుధాకర్ తో తన పెళ్లి జరిగి పోయింది.అతను ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ
చదివించి,పరీక్షలు వ్రాయించాడు. తనలో ఏ మూలో ఉన్న అసంతృప్తి కాస్తా తొలగిపోయింది. ‘చదువు అయిపోయింది కదా, కొంతకాలం సరదాగా ఎక్కడైనా తిరిగి రండి’ అని నాన్న అంటే,
“మామయ్యా, ఈ పల్లె కంటే వేరే స్వర్గం ఎక్కడుంటుంది? చెప్పండి” అన్నాడు సుధాకర్.
పిల్లతెమ్మరలు వీస్తుంటే, ఎలమావి గుబురులో నుండి కోయిల కూస్తుంటే వింటూ, సాయంత్రం వేళ ఏటిగట్టు మీద కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు చిటపటమంటూ వాన చినుకులు, నింగిలోని నీలిమబ్బు తునకలు తమని పలకరించి వెళుతూ ఉండేవి.గాలిలో తేలివచ్చే పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,
” తేటనీటి ఈ ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట” అంటూ కృష్ణశాస్త్రిలా కవిత్వం చెప్పాలనుందోయ్” అనేవాడు ఉద్వేగంగా సుధాకర్ తనతో. సుధాకర్ సాహితీప్రియుడు. తమ మధ్య సాహిత్య సంబంధమైన చర్చలు కూడా తరుచూ జరిగేవి. తన గొంతు బాగుంటుందని అప్పుడప్పుడు అతనికి ఇష్టమైన “ఏటి దాపుల, తోట లోపల,తేట తేనియలొలుకు పలుకుల ఎవరినే పిలిచేవు కోయిల,ఎవరినే?” అనే పాట పాడించుకునేవాడు. సుధాకర్ అధికారం చెలాయించే భర్తలా కాక ఒక మంచి స్నేహితుడిలా ఉండేవాడు.తన అభిప్రాయాలకు ఎంతో విలువ ఇచ్చేవాడు.
ఆ రోజు తన పుట్టినరోజు.” మిన్నూ, నీ కోసం ఏం తెచ్చానో చూడు” అంటూ ఒక గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో ఉంచి,బల్ల మీద పెట్టి జాగ్రత్తగా తీయమన్నాడు.చాలా ఆతురతగా ఆ ప్యాకింగ్ విప్పింది తాను.అది పాలరాతితో చేసిన అందమైన రాధాకృష్ణుల విగ్రహం.కన్నులు మూసుకుని తన్మయత్వంతో మురళి వాయిస్తున్న కృష్ణుడు, అతని భుజం మీద తలవాల్చి అరమోడ్పు కన్నులతో ఆ వేణుగానం వింటూ పరవశమవుతున్న రాధ. వాళ్ల ప్రేమంత స్వచ్ఛంగా ఎంతో బాగుంది. ఆ విగ్రహం క్రింద చెక్క మీద,
నా జీవనవనిలో
అడుగిడిన ఆమని
నా ప్రియభామిని
యామినికి,
– ప్రేమతో సుధాకర్.
అది చూసిన తాను ఆ రోజు పురి విప్పిన మయూరమే అయింది. ‘మిన్నూ,నీ పేరుకు అర్థమేమిటో తెలుసా నీకు?’అని అడిగాడు ఒకసారి సుధాకర్.’యామిని’ అంటే ‘రాత్రి’ అనే కదా అర్థం, అయితేనేం? ఆ రాత్రిలో వెన్నెలలు కురిపించే
సుధాకరుడు మీరున్నారు కదా! అంది తాను.’అబ్బో,
మాటలు బాగానే నేర్చావే’ అన్నా, ఆ మాటకి ఎంత సంతోషించాడో అతని ముఖం చూస్తుంటే తనకి అర్థమైంది.
తాను బి.ఎ. ఫస్ట్ క్లాసులో ప్యాసయ్యానని తెలిసినప్పుడు తన కంటె ఎక్కువగా అతనే సంతోషించాడు.మరునాడు ‘యామినీ సుధాకర్ బి.ఎ.’ అని వ్రాయించిన నేమ్ ప్లేట్ పట్టుకుని వచ్చాడు. అది చూసి తాను ఎంతో మురిసిపోయింది.పెళ్ళయిన రెండేళ్ళకు పాప పుట్టింది.పాపకు ‘ సౌదామిని’ అనే పేరును అతనే పెట్టాడు.అంతేకాదు,”యామినిని వెన్నెల వెలుగులతో నింపే సుధాకరుడే కాదు,మెరుపుల జిలుగులతో మురిపించే సౌదామిని కూడా వచ్చిందోయ్” అన్నాడు హాస్యంగా. పాపాయి బోసినవ్వులతో,ముద్దుమాటలతో,తప్పటడుగులతో ఒక ఏడాది ఇట్టే గిర్రున తిరిగింది. తన జీవితంలో ఆ మూడేళ్లు ఎంతో అమూల్యమైనవి. తన జీవితాంతం ఇక వెన్నెల వెలుగులు,మెరుపుల జిలుగులే అని మురిసిపోతున్న తనకు, వాటిని కబళించటానికి రాహువు మృత్యురూపంలో వస్తోందని తెలియదు.
ఆ రోజు తన జీవితంలో చాలా భయంకరమైన రోజు. శాంతి, సుఖం, ఆనందం, నిశ్చింత అనే పదాలు తన జీవిత నిఘంటువులో నుండి చెరిగిపోయిన రోజు.తలుపు చప్పుడైతే గబగబ వెళ్లి తీసిన తనకు కనిపించిన దృశ్యం చాలా దారుణమైనది. నలుగురు మనుషుల చేతుల్లో రక్తసిక్తమైన దేహంతో నిర్జీవంగా సుధాకర్.
వాళ్ళేదో చెబుతున్నారు.ఇంకేదో అడుగుతున్నారు.అవేవీ తనకు వినిపించటంలేదు, కొయ్యబారిపోయినట్లు అయిపోయింది. కబురు తెలిసిన వెంటనే అమ్మానాన్నలు ఊరి నుండి వచ్చేసారు.గుండెలు అవిసేలా ఏడ్చారు.
తనలో చలనం లేదు. కళ్ళ వెంట నీళ్ళు కూడా రావటం లేదు.’వీళ్ళంతా ఇలా ఏడుస్తున్నారేమిటి? సుధాకర్ చనిపోయాడని అంటారేమిటి?’ ఆ నిజాన్ని తన మనసు నమ్మడం లేదు. బంధువులు అది చూసి ” అమ్మాయి బాగా షాక్ తిన్నట్లుంది. ఇలాగే ఉంటే ప్రమాదం.ఒక్కసారి ఏడిస్తే బాధ తగ్గుతుంది.
ఎలాగైనా ఏడ్చేటట్లు చేయండి.”అని సలహా ఇచ్చారు.తన కళ్ళల్లో నలక పడి నీళ్ళు వస్తేనే చూసి భరించలేని అమ్మానాన్నలు తనను ఏడ్పించటం కోసం నరకయాతన పడ్డారు. చివరకు తనను,పాపను ఊరికి తీసుకుని వచ్చేసారు.
ఆ పల్లె వాతావరణం తనకి సుధాకర్ ను ఎంతగానో గుర్తుకు తెచ్చేది. ఏటిగట్టు మీద కూర్చుని సుధాకర్ ఇంకా కబుర్లు చెబుతున్నట్లుగానే ఉండేది.

ఒక్కసారి నాకోసం,
మళ్లీ ఒక్కసారి
జీవించి తిరిగిరా ప్రియతమా !
ఏటిగట్టూ,మావిచెట్టూ
కోయిల పాట,వెన్నెల తేట
నీలిమబ్బు తునక, తొలకరి చినుకు
మళ్లీ మనలను
జంటగా చూడాలని
నిరీక్షిస్తున్నాయి
అందుకే మళ్లీ ఒక్కసారి
నా కోసం తిరిగిరా!

అని తన మనసు మూగగా రోదించేది.
“నాన్నాలు ఎప్పుడొస్తాలు? అని ముద్దు ముద్దుగా అడిగే సౌదాకి ఏమని చెప్పాలో తెలియక గుండె నీరయ్యేది. ఒక్కగానొక్క కూతురి బ్రతుకు పాతికేళ్ళన్నా నిండకుండానే ఇలా అయిపోయిందే అనే దిగులుతో కృశించి అమ్మానాన్నలు ఒకరి తరువాత ఒకరుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంక ఆ పల్లెలో ఉండలేక గుండె రాయి చేసుకుని,సౌదాను తీసుకుని పట్టణానికి వచ్చేసింది తాను. డ్యూటీలో ఉండగా పోవటంతో సుధాకర్ ఉద్యోగం తనకి వచ్చింది. అప్పటి నుండి సౌదానుపెట్టుకుని ఇలా ఒంటరిగా తాను.
గతాన్ని తలచుకుంటూ అలా ఎంతసేపు నిలబడిందో యామిని! దట్టమైన మబ్బులు ముసురుకొని ఆకాశం నల్లగా అవుతోంది. సాయంత్రం రాత్రిగా మారుతున్న వేళ. ఎందుకో ఆమె మనసంతా దిగులు ఆవరించింది. ఒంటరితనం అనే నల్లటి రాక్షసి తనను మింగటానికి వస్తున్నట్లుగా అన్పించింది ఆమెకు.మనసంతా భయం,నరనరాన నిస్సత్తువ. ఈ ఒంటరితనంతో పాతికేళ్ళ నుండి ఆమె పోరాటం చేస్తూనే ఉంది.
ఆఫీసులో లేని పనులన్నీ కల్పించుకుని,ఎంతగా నలుగురితో కలిసి తిరిగినా, ఇంటికి వచ్చాక ఒంటరితనం పీడిస్తూనే ఉంటుంది. “చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము” అని శ్రీశ్రీ ఇందుకే వ్రాసాడేమో!ఇంకా ఎన్నాళ్ళు ఇలా నిస్సారంగా ఈ జీవితాన్ని గడపాలి?
ఇంతటితో చాలిస్తే?ఇక్కడ నుండి దూకేస్తే?
‘అమ్మా,నాకు ఉద్యోగం వచ్చేసింది,” ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుండగా,చేతిలో అప్పాయింటుమెంట్ లెటర్ పట్టుకుని వచ్చిన సౌదాను చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడింది యామిని.సంబరంగా యామిని చేతులు పట్టుకుని ఆ వివరాలన్నీ చెబుతోంది సౌదామిని.యామినికి అదేమి వినిపించటంలేదు. ఆమె కళ్ళల్లో వెలుగే కనిపిస్తోంది. ఒక్క క్షణం క్రితం తనకెంత భయంకరమైన ఆలోచన వచ్చింది? ఇంకో రెండు క్షణాలు సౌదా రావటం ఆలస్యమైతే?తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచింది యామినికి. అప్పుడు అమ్మ కూడా లేకుండా అనాథ లాగ తన చిట్టితల్లి సౌదా ఎలా జీవిస్తుంది?జీవితమంటే ఎంత విరక్తి కలిగినా సౌదా కళ్ళల్లో ఈ వెలుగు చూడాలంటే తను బ్రతికితీరాలి. సౌదాకి అండదండగా ఉండాలి అనుకుంటూ ఆకాశం వైపుకు
చూసిన యామినికి వర్షించకుండానే దూరంగా వెళ్ళిపోతున్న నల్లని మేఘం కన్పించింది.”ఆ వర్షించని మేఘం తానైతే, సుధాకర్ చెప్పినట్లు తన దుఃఖమనే చీకటిని చీల్చివేసే మెరుపుతీగ సౌదామిని” అనుకుంది ఆమె ఊరట పొందిన మనసుతో.

Written by Jyotsna Tatiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భావాల స్పర్శ

కేయూర కొండపల్లి మాట