గురుదేవోభవః అని మన ఆర్యోక్తి.
గురువును దైవంతో సమానంగా పూజించడం మన సంప్రదాయం. ప్రాచీన గురుకులాలు తరతరాలు వర్ధిల్లాయి. శివుణ్ణి ఆది గురువుగా, శ్రీ కృష్ణుణ్ణి జగద్గురువుగా మన పురాణాలు పేర్కొన్నాయి. ఆషాడశుద్ధ పౌర్ణమి రోజు మహాదేవుడు ఆది గురువుగా ఆవిర్భవించిన సందర్భంగా ‘గురు పౌర్ణమి’ జరపడం యోగ సాంప్రదాయం.
యుగాలు ఎన్ని మారినా నేటి ఆధునిక యుగం వరకు మానవ జీవన వికాసానికి ముఖ్యకారకుడు గురువేనని మనం అంగీకరించాలి. గురువుల ఎంతో మంది ఉండొచ్చు కానీ సద్గురువు మాత్రమే సదా పూజనీయుడు. సదాచారాలు, ఉన్నత జీవన ప్రమాణాలు కలిగి తన మేధాసంపత్తితో శిష్యులను తీర్చిదిద్ది సమాజానికి సత్పౌరుల్ని అందించే ఓ దిక్సూచి . గురువును గౌరవించడం మన కనీస ధర్మం.
గురువు , దేవుడు ఇద్దర్నీ పక్కన ఉంచితే తన మొదటి నమస్కారం గురువుకే అని సంత్ కబీర్దాసు వ్యాఖ్యానించారు.’ గు ‘అంటే చీకటి ‘రు ‘అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనిషిలోని అజ్ఞానాంధకారాలను తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవారు గురువు కనుక గురువు దైవంతో సమానమని భావించి గౌరవించడం మన సంస్కృతిలో ఒక భాగంగా మారింది .
‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అంటూ గురు స్మరణ చేయడం అధర్వణ వేద సంప్రదాయం. సద్గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్ఠీకరించింది. ‘స్కాంద పురాణం’లో శివుడు పార్వతీదేవికి గురు శిష్యులు లక్షణాలను వివరించడం జరిగింది. శాంత స్వభావము, ఉచిత వేషధారణ, సదాచార సంపన్నత, విషయపరిజ్ఞానం, బోధనాసామర్ధ్యం సమపాళ్లలో కలిగి ఉండడం మొదలైనవి.
‘మహాభారతం’లో యక్ష ప్రశ్నలకు బదులిస్తూ ‘మనిషి మనీషి అవ్వాలంటే ‘అధ్యయనం మరియు గురుసాంగత్యంతో మాత్రమే సాధ్యమని తెలియజేశాడు ధర్మరాజు.
సమాజానికి చక్కని వ్యక్తులను అందించే గొప్ప బాధ్యత గురువుది. అలాంటి గురువు సదా వందనీయుడే .ఇంతటి ఉన్నతమైన వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు, మేధావి , భారత రెండవ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన జయంతికి గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం సెప్టెంబర్ ,5 న ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించి, ప్రతి సంవత్సరం గురువులను గౌరవించే సత్కార్యక్రమం ఆరంభించింది. డాక్టర్ సర్వేపల్లి గారు భారత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం రోజున అభినందించడానికి వచ్చిన అభిమానులతో నన్ను అభినందించే కంటే ఉపాధ్యాయులను గౌరవిస్తే నేను ఎక్కువ సంతోషిస్తాను అనడంతో, సెప్టెంబర్ 5 న, ఉపాధ్యాయ దినోత్సవం
జరపడం మొదలైంది .మాజీ రాష్ట్రపతి, శ్రీ కలాం గారు కూడా ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. పదవీవిరమణ అనంతరం, వారు మళ్ళీ గురువుగా ఎన్నో విషయాల్ని వివరిస్తూ, తమ ప్రసంగాలతో విద్యార్థులను ఉత్తేజితుల్ని చేస్తూ, ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.
సద్గురువు గొప్పదనం శిష్యుడి పురోగతి ద్వారా మరింత ప్రకాశమానమౌతుందనేది జగమెరిగిన సత్యం. రామకృష్ణుల వారు సానబెట్టి మనకందించిన ఆధ్యాత్మిక మేలిమి వజ్రంగా వివేకానందులవారు మనకు చక్కని దృష్టాంతం. అలాంటి గురువులను స్మరించడం, గౌరవించడం మన విద్యుక్త ధర్మం.సద్గురవే నమః