మౌనలోకం

కథ

డా . వరిగొండ సత్య సురేఖ

సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ  మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.

ఊరికి వెళ్ళక రెండు  సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.

                                       ***************************

“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.

“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.

అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.

మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .

“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”

“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.

                        *************************************

“ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే”

“సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను.

“అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.

                    **********************************

సుహృత్ కి Intellectualdisability ( ఇంటెలెక్చువల్డిసబిలిటి)ఉందన్న విషయం  వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.

 “మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.

అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.

ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదేసుహృత్ జీవితo యొక్క కఠ‌‍‌‍న వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.

లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు.ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది.రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .

వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.

                       **************************

“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…”  వెనక వైపు  వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది. 

“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.

నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా  జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీపోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా  ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.

“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా  మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు.  కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు.  ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”

నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.

“మనిషి ఎదిగేకొద్దీ  వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.

“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు.నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన  నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను.ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.

ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు  తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.

నాన్నమ్మ పాదాలనoటిచెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”

“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.

“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను…..                                             

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రాధ మాధవం

దొరసాని