ఏడ్పు ఎందుకు?

కథానిక

ఎం. వి. ఉమాదేవి

రజిత,విజిత అక్క చెల్లెళ్ళు. ఇద్దరికీ ఏడేళ్ల వయసు తేడా ఉంది. వేసవిలో రజితకి పెళ్లయింది. అప్పగింతలు జరుగుతుంటే ఇంట్లో ఇంకా ఉన్న దగ్గరిబంధువులు అంతా కన్నీరు పెట్టుకోవడం మొదలై, బామ్మలు పెద్దగా ఏడవడం మొదలెట్టారు.రజితకి అంతా కొత్తగా ఉంది. కొత్త వ్యక్తి తో అంత క్రితం తెలియని ఊర్లో జీవితం ఎలా ఉంటుందో అని మనసులో ఒకటే కంగారు. దాంతో పాలలో ముంచిన ఆరిచేతులు అత్తవారి తరఫువారిచేతుల్లో పెడుతున్నా మౌనంగా కన్నీరు పెట్టుకోవడం తప్ప ఎక్కువ స్పందన చూపించలేదు. అదీగాక పదిమంది పైన ఉన్న పుట్టింట్లో శక్తిని మించే పని తప్పుతుంది అనిపించింది.

అప్పగింతలయ్యాక ఓసారి అత్తవారి ఊరులో కొన్నాళ్ళు ఉండివచ్చింది రజిత. వంటయ్యాక పెరట్లో సపోటా చెట్టు కింద మంచం వేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నపుడు విజిత అడిగింది.

” అదేంటే?నీ పెళ్లి లో అప్పగింతలకి నువ్వసలు సరిగ్గా ఏడవనేలేదు. నాయుడు గారి అమ్మాయి ఉషారాణి పెళ్లికి నేను వెళ్ళా కదా. అప్పుడు అప్పగింతలకి ఉష ఎంత ఏడ్చిందో? వాళ్ళమ్మ నాన్న లని పట్టుకొని ఏడ్చింది. తమ్ముడ్ని, అక్క, బావనీ పట్టుకొని ఏడ్చింది. పక్కింట్లో వాళ్ళనీ వదలలేదు… నువ్వేమో గమ్మున ఉన్నావు.,,?! అసలు సుగాలి ల్లో అయితే పెళ్లి తర్వాత ఏడుపు కోసం ప్రాక్టీస్ కూడా చేస్తారట. అంత వరకు ఉన్న బాబుల్ కా ఘర్ వదిలి వెళ్ళేటప్పుడు అక్కడ పెరిగిన తీరు, ప్రేమ ఆప్యాయత గురించి రక రకాలుగా డావలో అనే పాటలు కూడా పాడుతారట.! నా ఫ్రెండ్ అనూజ కూడా నలుగుపెట్టి నపుడు కూడా పెద్దగా ఏడ్చింది ” అన్నది ఆరిందాలా విజిత.

” ఏమోనే కంగారు అనిపించింది.”అంది రజిత.. అప్పటికే పుట్టిల్లు, అత్తిల్లు మధ్య అంతరం అనుభవం లోకి వచ్చింది. పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం, వ్యక్తులు!ఎలాగో పెద్ద పిల్లని పంపేయాలి అని తప్ప, అక్కడ ఈ అమాయకురాలు ఇమడగలదా అని కనీసం తల్లి అయినా ఆలోచన చేయక పోవడం వింత అనిపించింది రజితకి. పైగా ఎప్పుడో ఓ సారి చుట్టం చూపుగా వచ్చినపుడు తమ ఇంట్లో ఉన్న విధంగా వంటలూ, పద్ధతి ఇక్కడ లేదని ఇబ్బందిగా ఫీల్ కావడం, బాహాటంగా అనడం, తాము పుట్టింటికి వెళ్లినపుడు కూడా మరోసారి గుర్తు చేసి చిన్న చూపు చూడటం మనసు మెలిపెట్టింది రజితకి!

ఒకటి రెండు రోజులు ఓర్చుకోవడం వీరికి ఇబ్బంది అయితే, జీవితం అంతా తాను ఎలా భరించగలదు అనుకున్నారు వీళ్ళు??ఇ క్కడ అడ్జెస్ట్ కావడం ఇంకా ఇంకా నేర్చుకోవాలి తప్పదు ఇలాంటి సిల్లీ ప్రశ్నలకి అర్ధం లేదు అనుకుంటూ!!

” సరేలేవే! రేపు నీ పెళ్లయ్యాక చూద్దాం!”అంది నవ్వుతూ.

అయిదేళ్ల తర్వాత విజిత పెళ్లి జరిగింది.అప్పగింతలప్పుడు, అ పెళ్లి కొడుకు కాస్త విచారంగా ముఖం పెట్టాడు గానీ, విజిత అసలు కనీసం కంటి చెమ్మ లేదు. రజిత ఆశ్చర్యపోయింది. ఓ సారి అత్త గారింట్లో నాలుగు రోజులు ఉండొచ్చిన విజిత, ఇక కాపురానికి పోకుండా, భర్త ని కూడా అమ్మ గారిఇంట్లో నే ఇల్లరికం ఉంచినప్పుడు, తల్లిదండ్రులు ఏమి అనలేదు. తల్లికి అందరు సమానమే అనేది శుద్ధ అబద్ధం అని ఋజువయింది. ఆసరా అవసరమైన రజితను దూరంగా పంపేసారు. నోరున్న విజితనే ఇంట్లో పెట్టుకోని ఏళ్ళ తరబడి సేవ చేసి తరించారు ఆ తల్లిదండ్రులు.

దశాబ్దాల తర్వాత ఓ సందర్బంగా తన ఊరికి వచ్చి కొన్నాళ్ళున్న తల్లి తన సంసారం సమస్యలు, తన కష్టం, భర్త మొండితనం, కాఠిన్యం దగ్గరగా చూసినతర్వాత మాత్రమే… “రజితా!ఎలా చేశావే ఈ సంసారం ఇన్ని రోజులూ!?” అని సానుభూతి నటించడం రజితకి మరింత బాధ, విరక్తి కలిగాయి!

అల్లుడు తమ మాట వింటే, తమ గొప్ప నిలుస్తుంది అని ఒక బిడ్డ విషయంలోనూ…,చిన్న కూతురుకి అల్లుడుకి బానిసల్లా చాకిరీ చేస్తూ శక్తిని, ధనాన్ని ధారబోసి వృద్ధాప్యంలో కన్నీళ్లు కార్చడం ఇంకో బిడ్డ విషయం లో ప్రవర్తనగా ఉంటే వాళ్ళ పూజలు, సంప్రదాయం ధర్మం ఎలా అవుతుంది? తల్లిదండ్రులు ఇది ఆలోచన చేయాలి!!

కుటుంబంలో అయినా, సమాజంలో అయినా బలవంతుడు గెలుస్తాడు. బలహీనులు దిగువస్థాయిలోనే ఉండి పోతారు. ప్రశ్నించే హక్కులు వాళ్ళు తీసుకోవడం కూడా సాగనీయరు. అందుకే ఎందరో కవులు, కళాకారులు ప్రతిభ వున్నా తగిన ప్రోత్సాహం కూడా లేకుండా ఉండిపోయారు.

” కష్టపడే వాళ్ళకి ఏడ్చే సమయం, శక్తి కూడా ఉండదు. సుఖం గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళని విమర్శలు చేస్తారు! అనుభవం ఉన్న పెద్దలకే ఇంత పక్షపాతం అయితే బైట వాళ్ళు మేలు కదా!” అనుకున్నది రజిత వేదాంతిలా!!

Written by Mv Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అవిఘ్నమస్తు

ఒకే తాను ముక్కలు