అవిఘ్నమస్తు

వినాయక చవితి సందర్భంగా

           కామేశ్వరి

మానవులమై పుట్టిన తరువాత మనందరం మనం చేసే పనులుసఫలంకావాలని,వాటిఫలాలనుమనంఅనుభవించాలని భావిస్తూ ఉంటాం. ఆ బాలగోపాలానికి ఈ కోరిక ఉంటుంది. ఒక పనిలో మనకి సఫలత కలిగినప్పుడే ఉత్సాహంతో ఇంకో పనికి పూనుకుంటాం. ఇది మానవ నైజం కూడా. ఫలితం మాట అలా ఉంచి అసలు పనిచేయాలంటేనే మన బుద్ధి ప్రేరేపితం అవ్వాలి కదా. ఈ బుద్ధి ప్రేరణ కి ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని మన పెద్దలు చెప్తారు. దీనికి సైన్స్ కూడా ఒప్పుకుంది. బుద్ధి కర్మానుశారు అని నానుడి ఉండనేముంది కదా. బుద్ధి ప్రేరేపితమైన అదృశ్య శక్తిని మనం దైవం అంటాం. అంటే శక్తి సంపన్నుడు అన్నమాట. మానవ జీవిత మనుగడకు దైవం అనేది ఒక మానసిక ఆసరా. పెద్దలు దైవాన్ని ఒక ఇంటి పెద్దగా భావించి భయ భక్తులతో మసులుకోవటం నేర్పుతారు. ఇది కూడా ఒక కౌన్సిలింగ్ లాంటిదే. దీనివలన బాల్యం నుండే ఋజుమార్గంలో నడవడానికి బాటలు పడతాయన్నమాట.
ఇలా అదృశ్య శక్తితో కూడిన ఆ చైతన్యానికి మనం మన సులభతరం కోసం ఒక సగుణ రూపాన్ని ఇచ్చి విగ్రహ రూపంలోనూ, పటాల రూపంలోనూ,ఆఖరికి ప్రకృతి రూపంలో కూడా ఆరాధిస్తాం. తొలకరి మొదలవుగానే ఏరువాక పండుగ చేసుకుంటాం పంటలు బాగా పండాలని. వచ్చింది వర్షఋతువుకనుకఅనేకమొక్కలుమొలకెత్తుతాయి. శ్రావణమాసంలో లక్ష్మి పూజలు గౌరీ పూజలు చేసి పాడిపంట సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం. తరువాత వచ్చేది భాద్రపద శుద్ధ చవితి ” వినాయక చవితి” పేరుతో ప్రకృతి పరమైన పండుగగా జరుపుకుంటాం. సిద్ధి,బుద్ధి సహిత వినాయకుడి అని కూడా అంటారు. పైన పేర్కొన్న అదృశ్య శక్తి మన బుద్ధిలో ప్రవేశించి ప్రతి కార్యముందు సిద్ధి కలిగే లాగా చేస్తుందని నమ్ముతారు.ఈ పండుగలు జరుపుకోవడం సంఘంలో సౌబ్రాతృత్వాన్ని పెంచి పోషిస్తుంది ఇచ్చిపుచ్చుకోడాలు అలవాటు అవుతాయి.

శ్రీ మాత్రే నమ : - వినాయక పూజలో పత్రి ఎందుకు? పత్రి లో రకాలు ఎన్ని?? చదివి షేర్ చెయ్యండి తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ ...వినాయక చవితి నాడు ఇల్లువా కళ్ళను శుభ్రం చేసుకోవడంతో పాటు ఇంటిని మామిడాకులతో, సువాసన నిండిన పువ్వులతో అలంకరించి శోభాయమానంగాచేస్తారు. గడపలకి పసుపు రాస్తారు. ఇంటి ముంగిట బియ్యప్పిండితో రంగవల్లులు అద్దుతారు. ఇవన్నీ ఒక రకంగా ఆరోగ్యపరమైన అలవాట్లుకూడా. వర్షాకాలం కనక గడపకు రాసిన పసుపు క్రిమికీటకాలుఇంట్లోకిరాకుండాఅడ్డుకుంటాయి.,మామిడాకులు చక్కని ఆక్సిజన్ అందిస్తాయి.
మన సంస్కృతిలో ఏ పండుగనైనా గ్యాలక్సీ లోని ( అంతరిక్షం ) నక్షత్రాల నడకని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికి పూర్వం తూర్పున ఏనుగు తొండము, లంబోదరము, ఎలుక వాహనంతో కూడిన నక్షత్రాల స్వరూపంలో విఘ్నరాజు ఉత్తరాకాశాన కనిపిస్తారని మన ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనాలు వేసి చెప్పారు. ఆ లెక్క ప్రకారమే పంచాంగాలు వినాయక చవితి పండుగను నిర్ణయిస్తాయి.
వినాయక చవితి జరుపుకోవడానికి మన పురాణాలలో కథా రూపంలో కూడా వివరించబడి ఉంది. పార్వతీ పరమేశ్వరుల వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితి గా జరుపుకుంటారు ఈ వ్రతానికి సంబంధించిన పౌరాణిక కథలు అందరికీ తెలిసినవే . ఈ పండుగలో పూజ చేసే వినాయక ప్రతిమి నుండి పత్రి(21 రకాల ఔషధ ఆకులు ) వరకు ప్రకృతి నుండి ప్రాప్తించేవే.. ఒక్కొక్క ఆకు ఒక రకమైన రుగ్మతను పోగొడతాయని చెప్తారు.ప్రతిమను గంధ తత్వమైన మట్టితో చేస్తాం.ఇక పూజా కూడా ఎవరి ఆచారాన్ని బట్టి వారు జరుపుకుంటారు. మహారాష్ట్రలో చాలా ఘనంగా ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుతారు. ఆఖరి రోజున మట్టి వినాయకుని జలాశయాలలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజులలో పండుగలు ఘనంగా జరుపుతున్నారు.పేదరిక నిర్మూలన కూడా కొద్దిగా జరిగి ఉండవచ్చు. పండుగల వల్ల ప్రజలలో మైత్రి భావం పెరిగి మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. “దేవుడి కార్యానికి అందరూ పెద్దలే'” అన్నట్లు చేదోడు వాదోడుగా కలసి జరుపుకుంటారు. ఈ పూజకు విగ్రహాలు మట్టితో చేయడమే శుభకరం. కెమికల్ రంగులు వేయని విగ్రహాలు ప్రశస్తం. పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. విగ్రహాలు ముఖ్యం కాదు మనసే ముఖ్యంఅక్కడ. సుగుణాలే అక్కడ విగ్రహా రూపంలో పోతపాసి ఉంటాయి అని భావించాలి . వాటిని అందుకోవడానికి ప్రయత్నించాలి. మట్టితో చేసిన విగ్రహాన్ని మట్టి నుండి పొంది పూజ చేసి మరల మట్టిలో కలపడం మనం భూదేవికి అభినందనలు చెప్పినట్లు అవుతుంది.  ఔషధాలతో కూడిన ఆకులను( పత్రి, పువ్వులు) జలాశయాల్లో కలపడం వలన వర్షాకాలకు నీరు శుద్ధి కూడా అవుతుంది. ఇదే నిమజ్జనానికి అర్థం. ఆ రోజులలో నీరు శుద్ధి చేయడానికి ఇప్పటి వలే యంత్రాలు, రసాయనాలు లేవు కదా. అందుకే ఆనాటి ఆచారాలలో ఎంతో ముందు చూపు విజ్ఞత కూడా కనిపిస్తుంది. కుడుములు, ఉండ్రాళ్ళు రూపంలో పెట్టే నైవేద్యం కూడా ఆవిరి మీద ఉడికిన సాత్విక ఆహారమే. ఈ యాంత్రిక, ఇంటర్నెట్ యుగంలో పంచభూతాలు అన్నీ కూడా కలుషితమై పోతున్నాయి.రుతువులన్నీతారుమారవుతున్నాయి . దాని పర్యవసానమే నేడు కనబడుతోంది. అందుకే అందరం కలిసి నడుం బిగిద్దాం….. కాలుష్య రహితంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఏడ్పు ఎందుకు?