” పదుగురాడు మాట పాడి యై ధర జెల్లు” అన్నాడో కవి. పాడి అంటె న్యాయం. ధర అంటే భూమి. ఈ భూ ప్రపంచంలో ఎవరి మాటకు విలువ ఉన్నది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ పదిమంది లో మనమూ ఉంటాం కదా అని తప్పకుండా ఆలోచించాలి. మంచిని మంచనీ చెడు ను చెడు అనీ చెప్పలేని మొహమాట దరిద్రత్వంతో మసిలే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో! మరి నేనో? అనే స్పృహ రావాలి. వస్తుంది అయినా కూడా బాహాటంగా, ధైర్యం గా చెప్పలేని తచ్చాట లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థనుంచి కష్టాలపాలయ్యే స్త్రీల పరిస్థితి అని చెప్పనక్కర్లేదు. కానీ,
గతంలో చెప్పుకున్నాం ఈ ‘ కాని‘ చాలా శక్తివంతమైన పదం అని. కానీ ఈ ‘కాని‘ ను పక్కన పెట్టలేని ఓ అనివార్యతలోనే ఉన్నామా? సరే ఎవరెక్కడనైన పోనీ ఎవరేమైనా చేయనీ ‘ మనం‘ మాట మీద నిలబడే ఉందాం అని ఎవరికివాళ్ళం మనస్సులలో ప్రతిజ్ఞ చేసుకుని ఆత్మసాక్షిగా నడుచుకోవాలి. ఇదే ‘మనమాట‘.
దీన్నే నడత అంటాం. ఈ నడతనే దిశానిర్దేశం చేసే జీవన ప్రయాణం. ఇది ‘మనబాట‘.
ఒక దృక్పథం తో మాట్లాడడం, ఒక దృష్ఠితో కలుపుకుపోవడం అనేవి ఈ నడత కు బలాన్నిస్తాయి.
ఉదాహరణ కు ప్రతి ఇల్లూ సస్యశ్యామలమైన పంట చేను వంటిదే. సహజసిద్ధమైన సూర్యరశ్మి, వాయువు, సారవంతమైన నేల పంట చేను కు దక్కే త్రివిధ సౌకర్యాలు. ఎండ లేని చోట పంట పెరగదు, గాలి అందనప్పుడు పంట ఒళ్ళిపోతుంది, మట్టి లో రాళ్ళు రప్పలే ఉంటే పంట వేయలేని స్థితి. అయితే ఈ మూడు సరిగ్గా ఉన్నా అదనంగా కిరణజన్య సంయోగ క్రియ జరిగి పచ్చందనం కనిపించాలంటే సరిపడా నీరు ఉండాలి. ఇది బతుకు పచ్చదనానికీ ఆపాదించి చూడాలి.
మాట మనుగడకు మూలం. ” నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది” అని ఊరికే అనలేదు మన పెద్దలు. ఊరంటే? ఊరంటే మనమే! మనమే ఊరు. ఊరిలోని ఒక జీవి. కొన్ని జీవితాలు కలిస్తేనే సమూహం. జీవితాలు మనుషులవి. మనుషులు మధ్య ఎన్నో తారతమ్యాలతో ఊళ్లు ఉంటాయి. ఊళ్ళ విషయం లాగానే ఇంటి విషయం. ప్రేమ ఆప్యాయత లు గాలి నీరు లా సరిగ్గా అందితేనే ఇంటి పంట సమృద్ధిగా ఉంటుంది. ఇల్లు అనురాగాల పునాదుల మీద నిర్మించిన ఇల్లైతే ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కుచెదరలేదు. మాట కు బాట కూ ఉన్న అవినాభావ సంబంధం తెలుసుకుంటే ” ఎల్లలోకం ఒక్క ఇల్లై” అన్నట్టు ఇంట్లోని వారు” సమస్త హృదయాలు కలిస్తే ఒక్క గృహం ” అవుతుంది. గృహమే కదా స్వర్గసీమ! స్వర్గమంటే? స్వర్గం, నరకం అనేవి మనిషి మరణం తర్వాత కలిగే భావ పరంరలుకదా!
కాదు!స్వర్గం అంటే సుఖసంతోషాలకూ మంచికీ , నరకమంటే కష్టనష్టాలకు చెడుకూ పోలికగా, ఉదాహరణ గా చెప్తుంటారు. ఇది మన దేశంలో నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంతే!
వీటన్నింటికీ మాట మంచిదైతే బాట మంచిదవుతుంది. ముఖ్యంగా కుటుంబం అనే పంటకు నేలలా నమ్మకం సూర్యరశ్మి లా సంసార బంధం, నీరులా బాధ్యత, ఎరువులా ప్రేమపూరితమైన సంభాషణలు. అన్నీ సజావుగా సాగేందుకు వీలుగా బుద్ధి, జ్ఞానం ఉపయోగిస్తే ఎవ్వరికైనా అర్థం అయ్యేదేంటంటే ఇంటి వాళ్ళ తోనే సఖ్యతగా , గౌరవం గా ఉండలేని వాళ్ళు సమాజాన్ని ఏం గౌరవిస్తారు? వీళ్ళ తో ప్రత్యక్షంగా నో పరోక్షంగా నో చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరగకుండా వాళ్ళ కు తెలియకుండానే నష్టం చేస్తారు