అపాయంలో ఉపాయం కథ

నోయిడా విజయశ్రీ

‌జయలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునే సరికి రాత్రి 8:30 కావస్తున్నది . ఇంటికి వచ్చేటప్పుడు అసలేఆతురత గా ఉంటుంది. వచ్చీ రాగానే వంట చేసుకోవాలి ,మళ్లీ రాగకీర్తి ఏం చేస్తున్నదో… .హోం వర్క్ పూర్తి చేసుకున్నదో లేదో… ముసురుకుంటున్న ఆలోచనలతో బస్సు దిగి ఉస్సురోగోడోమంటూ వస్తున్నది. తనకిది నిత్య కృత్యమే. కానీ ఈరోజు ఇంటిదగ్గర వాతావరణం కొత్తగా కనిపిస్తుంది
‌ ” దొంగ వెధవలు ఎక్కువైపోయారు ,ఎవరిని నమ్మటానికి లేకుండా ఉంది ,ఇద్దరూ ఉద్యోగస్తులయితే కొంచెం ఇబ్బందే”.. అంటున్నది కామేశ్వరి గారు “ఏది ఏమైతే ఏమి లే!! పిల్ల ధైర్యానికి చెప్పుకోవాలి” “అంటున్నారు దుర్గమ్మ గారు .మరే వదినగారు !నిజమే కదా !అంటున్నారు రాధమ్మ గారు. ఏమి ధైర్యమోలే ఏదో ప్రమాదం నుంచి తప్పుకోవడానికి పిల్లకి ఉపాయం తట్టింది, అదృష్టం .ఇదే ఇంకొకరు అయితే బేజారెత్తిపోయి మొత్తం ఇల్లు వాడికి వప్పజెప్పేవాళ్ళు .అట్లాంటి కూతుర్ని కన్న జయలక్ష్మి అదృష్టవంతురాలు సుమా ..ఏమీ అర్థం కాక భయం వేసింది జయలక్ష్మి కి .ఏమయింది అన్న ప్రశ్న, గుండె గుబగుబ.అసలు విషయం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది వెంటనే భయంతో వణికిపోయింది .ఎంత గండం తప్పింది నా బిడ్డకి!! ఒక్కసారిగా కూతుర్ని గుండెలకు హత్తుకుంది అదే మరి!!!! తల్లి ప్రేమ. మరి నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? అన్నది “ఫోన్ చేస్తే ఇంకా కంగారు పడతావు అందుకే నీకు ఫోన్ చేయలేదు” అన్నాడు నరసింహారావు.
‌. *
రాగ కీర్తి జయలక్ష్మి నరసింహారావు లఏకైక ముద్దుబిడ్డ . జయలక్ష్మి ఇంటికి వచ్చేసరికి రోజు ఆలస్యమే అవుతుంది నరసింహారావు నాలుగు గంటలకే వచ్చేస్తాడు వస్తూనే రాగ కీర్తిని స్కూలు నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించుతాడు. నరసింహారావు కి జాగ్రత్త ,భయం రెండూ ఎక్కువే. అందుకే తాను మళ్ళీ బయటకు వెళ్లేటప్పుడు కీర్తిని ఇంట్లో ఉంచి బయట తాళం పెడతాడు .ఒకటి చిన్నపిల్ల, ఒకవేళ తలుపు తీస్తే ఏమి ప్రమాదమో.. అని , తాళం వేసి ఉంటే చిన్నపిల్ల ఒక్కతే ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా ఉంటుంది .ఏమి చేస్తాడు… తను రోజు ఆ సమయంలో బయటకు వెళ్లక తప్పదు .వేరే షాపు నడుపుతాడు ,అందుకే జాగ్రత్త కోసం అట్లా చేస్తాడు.
ఒకరోజు జయలక్ష్మి తన కోలీగ్ తో ఇంటికి వచ్చి తాళం తీసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తిని చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నాడు . ఏమిటి లక్ష్మి గారు?
” ఒక్కతే ఇంట్లో ఉంటే ఏ అవసరం వచ్చినా .. ఎంత ఇబ్బంది ఎప్పుడూ ఇట్లా చేయకండి .ఇంట్లో గ్యాస్ కరెంటు అన్ని ఉంటాయి ఏమైనా చాలా కష్టం పాపకు ధైర్యం నేర్పాలి కానీ ఇట్లా పిరికితనంగా తయారు చేస్తారా” అంటూ జయలక్ష్మి కి క్లాస్ పీకాడు .అయినా తల్లిదండ్రులగా వాళ్ళ భయం వాళ్ళది .మళ్ళీ యధాప్రకారమే…
*
రాత్రి 7:30 రాగ కీర్తి చదువు కుంటున్నది తెల్లవారి క్వార్టర్లీ పరీక్షలు. ఠక్కున కరెంటు పోయింది . అగ్గిపెట్టె నింబుకు పోయింది , వెలగలేదు , ఏవో చప్పుళ్ళు
రాగ కీర్తికి చాలా భయమేసింది ఆ…న్టీ…ఆన్టీ… అంటూ పిలిచింది . ఎవరైనా ఉన్నారో. … లేరో… కూడా అర్థం కావడం లేదు . బయట తాళం ఉంటే .. లోపల నేను ఉన్నానని, ఎవరు ఊహిస్తారు? అనుకుని, భయానికి బాగా ఏడ్చింది. కొంతసేపటికి ఏవో శబ్దాలు అవుతున్నాయి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనుకుని వహీదా ఆంటీ కి అనుమానం వచ్చింది కిటికీలోనుంచి చూసింది తాళం ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు ! వాళ్ళ నాన్న నరసింహారావు కి ఫోన్ చేసింది వహీదా. పాపం పరుగు పరుగున వచ్చాడు. కరెంటు కూడా వచ్చింది అప్పటికే చాలా సేపు అవ్వటంతో. రాగకీర్తి డస్సి పోయింది. రేపటి నుంచి తాళం పెట్టొద్దు అంటూ మారాం చేసి, పోట్లాడింది. పక్క వాళ్ళందరూ. దుయ్య‌ బట్టారు. పిల్లను అట్లా చెరసాలలో పెట్టినట్లు ఇంట్లో పెట్టిపోతారా!! సహజంగా వాళ్లకు తెలివితేటలు పెరగాలి. జాగ్రత్తగా ఉండాలి కాకపోతే కాస్తంత ఎవరికైనా చెప్పి పోవాలి అంటూ దీర్ఘాలు తీశారు.
మర్నాటి నుంచి ఇంటి దగ్గర దించి లోపల తలుపు వేసుకోమని, జాగ్రత్తలు చెప్పి వెడుతున్నాడు. అమ్మ కానీ , నాన్న గాని వస్తేనే తలుపు తీస్తుంది రాగ కీర్తి. జాగ్రత్త అంతకుమించి ఆలోచన . ఇట్లా రోజూ అలవాటైపోయింది . ‌ఐదవ తరగతి అయిపోయి ఆరవ తరగతి లో చేరింది రాగకీర్తి . ఇప్పుడు కూడా నరసింహారావు రోజూ స్కూల్ కి వెళ్లి దింపుతాడు . మళ్ళీ టైం కి వెళ్లి ఇంటికి తీసుకు వస్తాడు ఆడపిల్ల అని అతి జాగ్రత్త .”పది సంవత్సరాలకే ఆడపిల్ల అంటే ఇంత భయమా!! పెద్దైతే ఇంకా ఎంత జాగ్రత్తగా చూస్తాడో నరసింహారావు” అనుకుంటూ ఉంటారు అందరూ . పక్కింటి వహీదా మాత్రం మీరు మరీ భయపడుతున్నారు, పిల్లలకు ధైర్యం రావాలి వాళ్ల వ్యక్తిత్వం వాళ్లకి ఉండాలని అనుకోవాలి లేకుంటే ఎప్పుడూ. వాళ్ళ వెనకాల ఉంటామా అంటూ ఉంటుంది.
* **
సాయంకాలం ఐదు గంటలు రాగ కీర్తి ఎప్పటిలాగే తలుపు లోపల పెట్టుకుని నోట్సు రాసుకుంటోంది . ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయింది
ఎప్పుడైనా సరే వెంటనే తలుపు తీయదు .ముందు కిటికీ తలుపు తీసి ఎవరు వచ్చారో చూస్తుంది .అమ్మానాన్న. అయితేనే తీస్తుంది. అమ్మానాన్న కాదు పిన్ని అత్తయ్య కూడా కాదు. ఎవరో కొత్త మనిషి. అందుకే తలుపు తీయలేదు . ఎవరు మీరు ఏం కావాలి ?అన్నది తన చక్రాల్లాంటి కళ్ళు పెద్దవి చేస్తూ .”నేను మీ నాన్నగారి
దగ్గరే పని చేస్తాను. ఒకసారి తలుపు తియ్యి “అన్నాడు తీయలేదు మళ్లీ అడిగాడు .మీరు ఎవరో నాకు తెలియదు, మా నాన్న వచ్చాక ‌రండి “. అన్నది బెదరకుండా .అమ్మా!!! పిట్ట కొంచెం అయినా కూత ఘనమే అనుకున్నాడు ఆ ఆగంతకుడు .
మళ్లీ “లేదమ్మా ! మీ నాన్నగారు చాలా పని ఒత్తిడిలో ఉన్నారు అందుకే నన్నే పంపించారు “.నాన్న తాళం వేసి వెళ్లారు “అని చెప్పింది బయటకి వెడుతూ లోపల తాళం ఎట్లా వేస్తారు ?అని బెదిరింపుగా రెట్టించాడు
అప్పటికే రాగకీర్తి కి అనుమానం, కొంచెం భయం కలిగినాయి. అయినా పైకి ధైర్యం ప్రదర్శిస్తూ .. “లేదు లోపల నన్నే తాళం వేసుకోమన్నారు ”
“అయితే మరి ఇంకేం తాళం నువ్వే తీయవచ్చుగా !! ….తియ్యి అన్నాడు.. ” నా దగ్గర లేదు తాళం చెవి మా నాన్న తీసుకెళ్లారు అన్నది” తడుముకోకుండ. “లోపల నువ్వు తాళం వేసుకుంటే మీ నాన్న దగ్గర ఎందుకు ఉంటుంది తీయి అన్నాడు గద్దిస్తూ..”
కిటికీలోనుంచి మా నాన్నకి ఇచ్చాను అంది. హమ్మ పిల్ల రాక్షసి!!… అని పళ్ళు పటపటలాడించాడు లో లోపలే.
వాడికి తలుపు పగలు కొట్టే అవకాశం , ధైర్యం లేవు ఎందుకంటే పట్టపగలు శబ్దం అయితే వాడి గుట్టు బట్టబయలు అవుతుంది అందుకే గుట్టు చప్పుడు కాకుండా గుంజుకోవాలి అనుకున్నాడు . కొన్ని రోజులుగా ఇంటి పరిస్థితిని గమనిస్తున్నాడు అందుకే ఈ పదేళ్ల పిల్ల నన్ను ఏం చేస్తుంది ..అమాయకంగా అడగగానే తలుపు తీస్తే తాను అనుకున్నది సాధించుకోవచ్చు పక్కింటి తలుపు కూడా వేసి ఉన్నది అందుకే ఎవరు రాకముందే తృణమో..ఫణమో…అన్నట్లు ఆలోచించుకున్నాడు ఉపాయంతో పని చేసుకోవాలి .మీ నాన్నగారు మీ చెవి రింగులు తెమ్మన్నారు అవి తీసివ్వు అన్నాడు . నాకు తీయటం రాదు పెట్టుకోవడం మాత్రం వచ్చా !!!! అన్నాడు కళ్ళెర్ర జేస్తూ..మా నాన్నని తీసుకురా నాన్నే తీస్తాడు అన్నది కీర్తి .అఁమ్ఁ పిల్ల దెయ్యమా !!ఇది పిల్ల కాదురా నాయనోయ్ !!! మీ నాన్న రావడం కుదరదు నన్నే తెమ్మన్నాడు అన్నాడు .లోపల రాగ కీర్తికి భయంగా ఉన్న ఈ ప్రమాదం నుంచి ఎట్లాగో అట్లా తనను తాను కాపాడుకోవాలి నాన్న వస్తే బాగుండు ఏం చేయాలి రా దేవుడా నువ్వే నన్ను కాపాడవా అంటూ మనసులోనే దండం పెట్టుకుంది ,గోడ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోవైపు చూపు తిప్పుకున్నది . చామనఛాయ విశాలమైన నుదురు
పెద్ద పెద్ద కళ్ళు ఆకర్షణీయంగా ఉంటుంది కీర్తి .
భయంతో నుదుటన పట్టే చమటను పైకి కనపడనీయకుండా తన పొట్టి పొట్టి గౌను తో తుడుచుకుంది మరో ఉపాయం కోసం
మళ్లీ ఆ గొంతు.. ఒక పని చెయ్యి ఇక్కడికి రా !!
అన్నది ..కి టికీ దగ్గర చెయ్యి పెట్టి . ఎందుకు ? అన్నది.
“కిటికీ దగ్గర చెవి పెట్టు , నీ రింగులు నేను తీస్తాను మీ నాన్నగారికి పట్టుకెళ్ళి ఇస్తాను నేను పట్టుకు వెళ్ళకపోతే మీ నాన్న నన్ను కోప్పడతారు “అన్నాడు “కిటికీలో చెవి ఎట్లా పెట్టాలో నాకు తెలియదు ముందు నువ్వు పెట్టి చూపించు. తర్వాత నేను పెడతాను ” అన్నది పక్కవాళ్ళు ఎవరైనా వస్తే ఆ మాత్రం కూడా దక్కదు అనుకుని కిటికీలో చెవి పెట్టాడు. ఇదిగో …ఇ…ట్లా ….అంటూ …అంతే పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఒక్క పోటు పొడిచింది చెవిలో .వాడు. ఒక్కసారిగా కెవ్వున కేక పెట్టాడు. తల ఇటు తిప్పేసరి కల్లా డైనింగ్ టేబుల్ పైన ఉన్న కారం తీసి వాడి ముఖానికి కొట్టింది.చెవి నొప్పి కళ్ళు మంట ఓసిని అంటూ అనాలోచితంగా పెద్దగా అరిచేసాడు ..!!!అంతే ఈ అరుపులకి చుట్టుపక్కల వాళ్లంతా తలెత్తి చూసారు ఏమైంది అంటూ వాడిని పట్టుకున్నారు .ఎవరు నువ్వు అన్నా….వాడు ఏమి చెప్పటం లేదు ఇంతలోనే ఏడుస్తూ “అంకుల్ చాలా సేపటి నుంచి తలుపులు తీయమని ,నా రింగులు ఇవ్వమని నన్ను భయపెడుతున్నాడు”. అని చెప్పింది అందరూ కలిసి వాడిని చితకబాది పోలీసులకి ఫోన్ చేశారు. పట్టపగలు చిన్నపిల్లను మోసం చేసి దొంగతనానికి పాల్పడిన నేరంపై పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు.వెంటనే ఎదురింటి క్రిష్ణమూర్తి గారు
నరసింహారావు కి ఫోన్ చేశారు.
రజిత టీవీ వారు వెంటనే రంగంలోకి దిగారు నీకేమీ భయం లేదు తలుపు తీయమన్నారు . అసలు ఏమి జరిగింది అని అడుగుతున్నారు . కొంచెం కంగారు పడుతున్న రాగ కీర్తి నిబుజ్జగించి, కాసేపు రిలాక్స్ అయినాక చెప్పమన్నారు జరిగిందంతా చెప్పింది వింటున్న అందరికీ ,ఇంత చిన్న వయసులో ఎంత ఆలోచన ఎంత ఉపాయం …. లేత ముఖంలో చురుకుదనంతో కూడుకున్న అమాయకత్వం అందరి మనసుల్ని ఆకర్షించింది ఉపాయంతో అపాయాన్ని జయించిన సాహస బాలిక చిన్నారి రాగకీర్తితో మఖాముఖి అంటూ ప్రచారం చేశారు రజిత టీవీ వారు.
**
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ గారు. సంతోషం తో ఉప్పొంగి పోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు . రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలిక బిరుదు అందుకున్నది రాగకీర్తి

కెమెరాలన్నీ ఒక్కసారి గా క్లిక్ మన్నాయి.తన కూతుర్ని తక్కువగా అంచనా వేసుకుని గుప్పెట్లో పెట్టుకునే అభిప్రాయానికి స్వస్తి చెప్పి కళ్ళు చమర్చుకున్నాడు నరసింహారావు జయలక్ష్మి మరొకసారి కూతుర్ని మనసారా ముద్దాడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వ్యాకరణం – జీవన వ్యాపారం

వ్యాపారం – జీవన వ్యాకరణం