నవ్వుల ప్రపంచం- కొంతమంది అదృష్టవంతులకు అది పుట్టుక తో లభిస్తుంది. కొంతమంది దురదృష్టవశాత్తు జీవితకాలం మొత్తం దానిని పొందలేరు.
కానీ అనిలా జ్యోతిరెడ్డి వంటి మరి కొందరు తమకు తామే దానిని సృష్టించుకొని, అది తమ లాంటి మరికొందరు కూడా పొందేందుకు దోహదం చేస్తారు.
జ్యోతి రెడ్డి అనే ఒక హీరో గురించి ఎంతమందికి తెలుసు? నాకైతే నిన్నటి వరకు తెలియదు అని చెప్పటానికి సిగ్గు పడుతున్నాను. మన మీడియా ఎందుకు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన గాధలు ప్రచారం చేయదో?
నా స్నేహితురాలు గీత కు ఈ సందర్భంగా ధన్యవాదాలు.
జీరో నుంచి హీరోగా ఎదిగిన కొద్ది మంది మహిళల్లో
శ్రీమతి జ్యోతి రెడ్డి గారు ఒకరు.ఆమె జీవితగాధ వింటే నిజంగా ఇది సాధ్యమేనా అనిపించింది.
జ్యోతిరెడ్డి 1970లో భారతదేశం,తెలంగాణ రాష్ట్రం, వరంగల్ సమీపంలోని నర్సిములగూడెంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు.
ఇంట్లో చదివించడానికి కాదు కదా, పోషించేందుకు కూడా స్తోమత లేనందున ఆమెను, ఆమె చెల్లిని తల్లి చనిపోయింది అని అబద్ధం చెప్పి,ఒక సెమీ ఆర్ఫన్ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి.
కొంతకాలం అక్కడే ఉన్నా ఆ ఆర్ఫన్ స్కూల్ లో ఉండలేక జ్యోతిరెడ్డి వాళ్ల చెల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.
కానీ తండ్రి అంటే భయం తో పాటు, తాను తిరిగి వెడితే, తల్లిని దండిస్తాడని తెలిసిన జ్యోతి ఎలాగోలా పదవతరగతి పూర్తి చేశారు. అప్పుడు తనకు చదువు విలువ తెలియడంతో, చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా తండ్రి వినలేదు.
ఇంటర్మీడియెట్ జాయిన్ అయినా పట్టించుకోకుండా పెళ్ళి చేసేసారు.
భర్త కుటుంబం కూడా అంతంత మాత్రమే.తనకన్నా పది సంవత్సరాలు పెద్ద వాడు.జీవితమంటే ఏమిటో తెలియకుండానే 18 సంవత్సరాల వయస్సు కల్లా ఇద్దరు ఆడపిల్లలు.
ఉమ్మడి కుటుంబానికి తోడైన పేదరికం. ఈ పరిస్థితుల్లో రోజూ వ్యవసాయం పనులకోసం పొలానికి వెళ్లడమే జ్యోతిరెడ్డి దినచర్య.
సాయంకాలానికి ఇంటికి చేరి పిల్లలతో గడపడమే తెలుసు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వేరుపడింది.
భర్త ఇంటి బాధ్యతల నుండి తప్పుకున్న కారణంగా ఆమె చంటి పిల్లలతో ఇంటి బాధ్యత ఎత్తుకోవలసి వచ్చింది.
అప్పుడే నెహ్రూ యువ కేంద్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దారి కనపడింది. ఆ సంస్థ పల్లెల్లో నైట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. దాంట్లో టీచర్ గా అవకాశం వచ్చింది జ్యోతికి.
అప్పుడు ఆమె జీతం నెలకి 120 రూపాయలు. ఆ తర్వాత అదే సంస్థలో ప్రమోషన్ వల్ల ఉన్న ఊరు మారాల్సి వచ్చింది.
జ్యోతిరెడ్డి కుటుంబం హన్మకొండకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఈ మార్పుకి ఆమె భర్త ఒప్పుకోలేదు.తాను ఊరు విడిచి రానని చెప్పాడు.
కానీ పిల్లలను పోషించడం కోసం జ్యోతి రెడ్డి ధైర్యం చేసి ఒంటరిగానే, ఇద్దరు చిన్న పిల్లలతో హన్మకొండ చేరింది.
హన్మకొండ నుంచి వేరు వేరు ఊళ్లకు ఉద్యోగ రీత్యా ప్రయాణించాల్సి ఉంటుంది.అందువలన 10 సంవత్సరాల వయస్సు గల తన చిన్న తమ్ముడిని సాయం తెచ్చుకుని తన జీవిత ప్రయాణం వెతుక్కున్నారు జ్యోతి. ఉద్యోగం చేస్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యారు. ఒకేషనల్ కోర్సు పూర్తి చేసారు.
ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. జీవితంలో పెద్ద మార్పంటూ వచ్చింది అక్కడే. 1992లో వరంగల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమీన్ పేటలో పద్దెనిమిది మాసాల కాల పరిమితితో కూడిన స్పెషల్ టీచర్ ఉద్యోగం తనకు దక్కిందని, చివరకు 1994లో రూ.2,750 వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగం లభించిందని జ్యోతి రెడ్డి చెప్పారు.
ఈలోగా భర్త కూడా వరంగల్ వచ్చి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డారు. సాధారణంగా ఎవరైనా ఇక ఇక్కడితో సంతృప్తి చెందుతారు.కానీ అసామాన్యురాలైన జ్యోతి రెడ్డి గారు అలా ఆగిపోలేదు.
మరో నాలుగేళ్ళ తర్వాత అమెరికా నుంచి వచ్చిన తన భర్త బంధువును చూసి ఆశ్చర్య పోయింది.ఆమె హుందా, దర్జా చూసి తానూ అలా కావాలనుకున్నారు.అనుకున్నదే తడవుగా సాఫ్ట్ వేర్ నైపుణ్యం వైపు దృష్టి సారించారు.
అందుకోసం హైదరాబాద్లోని విసిఎల్ కంప్యూటర్స్ లో చేరి సాఫ్ట్ వేర్ శిక్షణ పొందారు.
అందుకోసం దీర్ఘకాలిక సెలవు పెట్టారు.2000 సంవత్సరంలో పాస్ పోర్టు, హెచ్1 వీసా లభించటంతో అమెరికా వెళ్ళారు.
అక్కడ పని చేసే తన భర్త బంధువు సహాయంతో ఒక దుకాణంలో ఉద్యోగం సంపాదించి పన్నెండు గంటలకు 60 డాలర్ల వేతనం పొందారు.
అమెరికా వెళ్ళేందుకు వీలుగా తన ఇద్దరు పిల్లలనూ ఒక మిషనరీ స్కూల్లో చేర్చేశారు.అమెరికాలో ఒక గుజరాతీ కుటుంబానికి పేయింగ్ గెస్ట్ గా ఉన్నారు.
షాప్ కి వచ్చిన ఓ వరంగల్ ఎన్నారై ఆమెను చూసి మీరు టీచర్ కదా అని అడిగారు.మీరిక్కడ ఏం చేస్తున్నారు?
మీ స్కిల్ కి ఇది తగిన ఉద్యోగం కాదని చెప్పేసి వెళ్లిపోయారు.
కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి జ్యోతిరెడ్డికి ఫోన్ చేసి సాఫ్ట్వేర్ రిక్రూటర్ ఉద్యోగం యిప్పించాడు.
సాఫీగా సాగుతున్న ఉద్యోగం.ఇంతలో 5 వేల డాలర్ల ఆఫర్ వచ్చింది.
మంచి స్థితిలో ఉన్న సమయంలో
ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో 50 శాతం షేర్ ఇస్తామన్నారు.ఎలాంటి ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడకి వెళ్లిపోయారు జ్యోతి.
కానీ ఆ ఉద్యోగంలో చేరాక. తెలిసింది. ఆ కంపెనీ వాళ్లు లాభాల్లో యాభై శాతం అన్నారు.
దీంతో డీల్ వర్కవుట్ కాలేదుఅప్పటికి వర్జీనియాలో నెలకి 5వేల డాలర్ల ఉద్యోగం పోయి, ఇటు డీల్ కుదరక ఏం చేయాలో పాలుపోలేదట ఆమెకు . ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు.
జీవితం ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోయింది.కానీ ఏ మాత్రం అధైర్యపడలేదు ఆవిడ.
అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగి అతి త్వరలోనే జ్యోతి రెడ్డి స్వంత సంస్థను స్థాపించుకోగలిగారు.కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థకు అధిపతి ఆమె ఇప్పుడు. ఆమె పిల్లలు కూడా అమెరికా వచ్చేశారు.
50 సంవత్సరాల ఆవిడ జీవిత కథను ఎమెస్కో బుక్స్ వారు “ఐనా నేను ఓడిపోలేదు”అనే పేరుతో ప్రచురించారు. వివిధ భాషల్లో 2 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి.
తాను సమాజానికి ఏదో ఒక మంచి. చేయాలని సంకల్పించారు జ్యోతి రెడ్డి.LKG నుంచి పిజి దాకా 1,000 మందికి చదువు చెప్పాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేయటం ప్రారంభించారు.సాఫ్ట్ వేర్ శిక్షణ ఆ సంస్థ ప్రత్యేకత.
పుట్టిన రోజు నాడు వరంగల్లోని అనాథాశ్రమంలో ఆమె గడుపుతారు.మానసిక వికలాంగులైన పిల్లల ఆలనా పాలనా చూస్తారు.
ఈ క్రమంలో తన ఆలోచనా ధోరణితో LEARN TO LIVE FOUNDATION ను స్థాపించారు.అది విజయవంతంగా నడుస్తోంది.
ఇదీ మన తెలుగుబిడ్డ జ్యోతి రెడ్డి కథ.
పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందగలరు .www.jyothireddy.com
సున్నా నుంచి ఎదిగి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అబ్దుల్ కలాం గారు తనకు ఆదర్శం అని, ఆయన లాగానే తాను సమాజానికి మేలు చేయగలిగితే చాలు అని చెప్పారు జ్యోతి రెడ్డి గారు తన ఇంటర్వ్యూ లో.
ప్రతీ సంవత్సరం అమెరికా నుంచి తన సొంత డబ్బుతో ఇండియా వచ్చి, వివిధ ప్రాంతాల కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన స్పీచ్ లు ఇస్తున్నారు.తన జీవితం నుంచి,తన మాటలద్వారా ,కనీసం పది మందికి స్పూర్తినివ్వగలిగితే చాలు అంటారు.
హాట్సాఫ్ జ్యోతి రెడ్డి గారు.
ఈవిడ ఇంటర్వ్యూలు యూ ట్యూబ్ లో లభ్యం.