మనసుకవి ఆచార్య ఆత్రేయ…ఆ పేరు వింటేనే మన హృదయాలలో సరాగాలను మీటుతూ ఎన్నో పాటలు అలా అలా అప్రయత్నంగా గొంతులోనుంచి అలవోకగా జాలువారుతుంటాయి. మనసులను చక్కిలిగిలి పెట్టడం, పిండేయడం, ఓదార్చడం, ప్రేమించడం, హత్తుకోవడం, అలజడి రేపడం…ఇలాంటివన్నీ ఈయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియవంటే అతిశయోక్తి లేదేమో!! అందుకే మనుషులను చదివిన ఆచార్యుడై, మనసున్న కవిగా మనలను దోచుకున్నాడు.
ఆయన రచించిన అనేకమైన పాటల్లో ఆనాడు ప్రేమికుల విరహగీతమై, ఈనాటికీ హృదయపు లోతుల్లో తడి తడిగా తగిలే అద్భుత భావగీతం “మంచిమనసులు” సినిమాలోని “జాబిల్లి కోసం ఆకాశమల్లే” అనే పాట విన్నప్పుడల్లా ఎంతటివారినైనా ఎదను కోస్తూ కన్నీరు తెప్పించకమానదు.
మొదట పల్లవిలో “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై” అనే వాక్యంలోనే చంద్రుడు రావడం వల్ల ఆకాశంలో వెన్నెల వెలుగు కురుస్తుంది. ఆ ఉపమానంతో ప్రేయసి కోసం ఎదురుచూస్తున్న ప్రియుడు తాను ఆమె కోసం అంతలా ఎదురుచూస్తున్నట్టు చెప్తాడు. “నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై” ఆమె తనకు కనిపించకపోయేటప్పటికి మనసు తట్టుకోలేక తానే ఒక పాటగా మారి పాడాను అని ప్రియునిచేత పలికిస్తాడు..
మొదటి చరణం లో “నువ్వక్కడ, నేనిక్కడ/ పాటిక్కడ, పలుకక్కడ/ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా”..ఆమె అతనికి అందనంత దూరంలో ఉంది. కానీ ఒక్కటైన మనసులు చివరి ఊపిరి వరకు విడిపోవు అనే భావాన్ని ఇక్కడ వర్ణిస్తాడు. “ఈ పువ్వులనే నీ నవ్వులుగా/ఈ చుక్కలనే నీ కన్నులుగా/ నునునిగ్గుల ఈమొగ్గలు నీబుగ్గలుగా/ ఊహల్లో తేలి ఉర్రూతలూగి” ఈ పంక్తుల్లో… తన ప్రేయసి జీవించిలేదు. కానీ ప్రకృతిలోని ప్రతీచోట ఆమె అతని జ్ఞాపకమై మెరుస్తోంది..పువ్వుల్లో ఆమె నవ్వును, చుక్కల్లో ఆమె కళ్ళను, వికసించబోయే మొగ్గల్లో ఆమె బుగ్గల సిగ్గెరుపులను చూస్తున్నాడతను…. అంతటితో ఆగకుండా “మేఘాలతోటి రాగాల లేఖ/ నీకంపినాను రావా దేవి”…అని అభ్యర్ధిస్తున్నాడు…ఎందుకు మేఘాలతో పంపుతానన్నాడు? ఆమె మరోలోకంలో ఉంది. ఆమె రావడం అసాధ్యం అని అతనికి తెలుసు. కానీ ఆమె పట్ల ఉన్న ప్రేమతో పిచ్చివాడిగా మారుతున్నాడు. మేఘసందేశం పంపుతేనైనా వస్తుందేమోనన్న ఆశను వ్యక్తం చేస్తున్నాడు…ఎంతటి భావుకత ఇది..మరెంతటి ప్రకృతి పారవశ్యం? రాముని అంతటివాడు కూడా సీతా వియోగంలో ప్రతీ చెట్టూపుట్టను అడుగుతాడు తన సీత ఎక్కడుందని???మానవ మాత్రులం మనం ఎంత?? కాళిదాసు మేఘసందేశం, పుట్టపర్తి నారాయణాచార్యుల మేఘదూతం ఇలాంటి భావనతో వచ్చినవే అయ్యుండొచ్చేమో!!
ఇక రెండవ చరణంలో “నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది/ నీధ్యానమె వరమైనది ఎన్నాళ్లయినా”…ఆమె ఎడబాటు అతని హృదంతరాళాన్ని ఒంటరితనంతో కప్పేసింది. అందుకే ఆమె పేరును జపంగా, ఆమె ప్రేమను తపంగా, ఆమె ధ్యానాన్ని వరంగా భావిస్తూ దాంట్లోనే తన్మయుడవుతున్నాడు… ఆ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాడు. ” ఉండీ లేకా ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే/ నా రేపటి అడియాసల రూపం నీవే”
ఇక్కడ కవి విషాదపు కొండను భళ్ళున పగులగొట్టి సముద్రమంత దుఃఖాన్ని పొంగిస్తాడు. కన్నీటి వరదలు కట్టిస్తాడు. ఆమె అతని జ్ఞాపకాల్లో ఉంది. కానీ తనతో లేదు..అతను శారీరకంగా ఇక్కడ వున్నా మనసు తనలో లేదు. ఎప్పుడో ఆమె దగ్గరికి చేరిపోయింది. ఆమెతో అల్లుకున్న ఆశలన్నీ ఆడియాసలు అయ్యాయి. అవి ఇక నెరవేరే అదృష్టమే లేదు. అందుకే నా రేపటి అడియాసలకు రూపమే ఆమె అని ప్రియునిచేత అనిపిస్తాడు …”దూరాన ఉన్నా నా తోడు నీవే/ నీ దగ్గరున్నా నీ నీడ నాదే/ నాదన్నదంతా నీవే నీవే”…
ఆమె లేని లోకం అతనికి శూన్యం. అందుకే ఎక్కడో ఉన్న ఆమె తలపులే ఇక తనకు తోడని చెప్తూ ఆమె పక్కన ఉండే నీడ నేనే అంటూ బాధను ఒలకబోస్తాడు….ఇక చివరగా ఈ లోకంలో నాది అనేది ఏదున్నా అది నీవే అని విరహాగ్నిలో తపించిపోతాడు….
ప్రేమికులిద్దరిలో ఎవరు ఎవరికి దూరమైనా ఆ బాధ ఏ భాషకూ అందనిది. దాన్నికూడా అంతటి స్థాయిలో అందించడం ఆత్రేయగారికే సాధ్యం.. అటువంటి కవి మన తెలుగువాడిగా పుట్టడం, మనం ఆ పాటలను వినగలగడం మనం చేసుకున్న అదృష్టం…ఆయనకు శతకోటి వందనాలు