వేకువ నాదం నవ రాగాల పల్లకిలో
భారతీయుల ఆశలూ ఆశయాలు
విజయోత్సవ గా
మోసుకొచ్చింది
నడి రాత్రి తొలి వెలుగు లు
గత చీకటిని పారద్రోలి
ఈ ఆనందోత్సాహాలకు నాంది గీతాలు పాడింది
గుర్తుతెచ్చుకుందామా నేస్తం?
పరతంత్ర్యపు నిబిడాంధకారాన్ని
బానిస సంకెలల
భయంకర బాధల్ని
ఒక్క సారి గుండె తెరపై దర్శించుకుందామా మిత్రమా?
కాలే కడుపు కు కూడు కాదు
మండే మనసులెట్ల తెలుస్తాయని
ఊసులెవరు చెప్పాలి?
ఊతమెవరు ఇవ్వాలి?
నీ బాటనెవరు చూపాలి?
బంధమెవరు వేయాలి?
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే
రోషమెవరు నేర్పాలి?
దోషాలెవరు దిద్దాలి ?
అహింస సత్య సంధత
క్షమ ధర్మ సిద్దాంతాలు
దద్దరిల్లిన భారత స్వాతంత్ర్య సమరం గుర్తుకెవరు తేవాలి ?
నీ గుండె నెవరు తడమాలి?
కులమతాల ఉచ్చులలో
కుత్సితాల రొచ్చులలో
చిక్కుకుపోకని
చీకిపోబోకని
ఎవరు నీకు చెప్పాలి?
అస్తిత్వపు వ్యక్తిత్వం గా
నీవే ఓ స్వచ్ఛ పతాకమై
హృదయ పీఠం పైన ఎగరాలి
స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షల వెల్లువలో
తేటతెల్లమైన అక్షర దీప్తుల లో
నీవే భావ వ్యక్తీకరణ తేజస్సువు కావాలి!
మన జెండా వందనం
అందరి స్ఫూర్తి చిహ్నం!
_**_
తరుణి పత్రిక రచయిత్రులకూ,కవి మిత్రులకూ
పాఠకులకు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాను .
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకులు