మన మహిళా స్ఫూర్తిప్రదాతలు

శ్రీమతి మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర వీరిది. తుపాకీ చేతబూని సమరం చేసిన తొలి తెలంగాణా మహిళ . వీరు 1931 లో కొత్తగూడెం గ్రామం, తుంగతుర్తి మండలం ,సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ భీమిరెడ్డి రామిరెడ్డి ,చుక్కమ్మ గార్లు .
1945 – 46 లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కర్రచేతబట్టి నైజాం సర్కారును గడగడలాడించి, పెత్తందారీ వ్యవస్థ పై పిడికిలి బిగించిన ధీశాలి. ప్రజా చైతన్యం రగిలించిన తెలంగాణ ప్రియతమ ఆడబిడ్డ .

          మల్లు స్వరాజ్యం

ఉన్నత కుటుంబంలో జన్మించిన వీరి విద్యాభ్యాసం చిన్నతనంలో ఇంటి వద్ద నుండి కొనసాగింది.మాక్సింగోర్కీ నవల
‘ అమ్మ’ చదివి స్ఫూర్తి పొంది సమాజాన్ని అర్థంచేసుకోగలిగారు.’ఆంధ్ర మహిళా సభ ‘పిలుపుతో ప్రేరేపితురాలై న ఈమె స్త్రీ గడప దాటడమే కష్టమైన ఆ రోజుల్లో 11 సం. ల వయస్సు లో కుటుంబ సభ్యులని ఒప్పించి సభకు హాజరైనారు. 13సం.ల వయస్సులోనే సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి తో కలిసి పేదల పక్షాన పోరాటం చేసారు.గుర్రపు స్వారీ పై ఇష్టంతో నేర్చుకొని ‘రాజక్క’ పేరుతో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.తన జానపద గేయాలతో ప్రజల్ని అనునిత్యం ఉత్తేజితుల్ని చేసేవారు. తన ఉద్యమ సహచరుడు శ్రీ మల్లు వెంకట నర్సింహారెడ్డి గారిని 1954 లో హైదరాబాద్ లోని ఓల్డ్ M.L.A. క్వార్టర్సు వద్ద వివాహం చేసుకున్నారు.. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా 1945 – 46 లో జరిగిన పోరాటంలో అప్పటి పాలకులు ఆమెను పట్టిస్తే  10,000రూ.లు రివార్డు ప్రకటించారట. పెత్తందారీవ్యవస్థపై తిరుగుబాటులో భాగంగా స్వంత చిన్నాన్ననే ఎదిరించారట. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పనిచేసి దొరల దురహంకారంపై . పాటల రూపంలో అచ్చటి ప్రజలను చైతన్యపరిచారు. .’ఆంధ్ర మహిళా సభ ‘పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని దళితులకు వితరణ చేశారు. 1978 నుండి 84 వరకు తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికై ప్రజాసేవ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదే శ్ మద్యపాన వ్యతిరేక పోరాటంలో వీరిది ప్రముఖ పాత్ర .అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం’ ఐద్వా’ రాష్ట్ర ,జాతీయ స్థాయిలో వీరు నాయకత్వం వహించి సేవలందించారు .. జీవిత భాగస్వామి మల్లు వెంకట నరసింహారెడ్డి గారు సి .పి.యం.కేంద్ర కమిటీ సభ్యులుగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. స్వరాజ్యం దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు సంతానం. తెలంగాణ యోధుడు ,సోదరుడు అయిన భీమిరెడ్డి నరసింహారెడ్డి తో కలిసి ‘చైతన్య మానవి ‘అనే పత్రికను నిర్వహించారు .మార్చి 2 ,2022 తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాదులో మరణించారు. అనుక్షణం ప్రజా చైతన్యం, సంక్షేమమే ధ్యేయంగా నిర్విరామకృషి సల్పిన ధీర వనితయైన వీరి సేవలు మరువలేనివి.ఇంతటి త్యాగధనురాలిని స్మరిస్తూ అంజలి ఘటించడం మన విద్యుక్త ధర్మం.

రాధిక సూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు part-15

గజల్