నేను అవుననే అంటాను…
మరి మీరేమంటారు??
జీవితంలో జరిగే ప్రతీ సంఘటన నుంచి ఏదో ఒక కొత్త అనుభవాన్ని పొందుతూ వుంటాం. ఒక మాటలో చెప్పాలంటే మంచిచెడుల మధ్య తారతమ్యం అవగాహనలోకి వచ్చేది ఈ అనుభవాల వల్లే. ఈ మధ్య నాకు ఎదురైన ఓ అనుభవం
నన్నో కొత్తకోణంలో ఆలోచింపజేసింది. నేను పని చేసేది వైద్య రంగంలో నిత్యం వందల మంది పేషెంట్లను చూస్తూ ఉంటాను. వారి సమస్యలను వినడంతో పాటు, తెలివి మీర నాకున్న జ్ఞానాన్ని పంచుతూ వారికి ఉపయోగపడే సలహాలను సూచనలను అందిస్తూ ఉంటాను అంతా బాగానే ఉంది కదూ…అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ప్రశ్నలు తలెత్తే అవకాశమే లేదు. ఏదో ఒక విపత్తు జరిగినప్పుడే ప్రశ్న సమాధానాన్ని కోరేది. సరే…సరే మిమ్మల్ని ఇక విసిగించనుగానీ సూటిగా విషయంలోకి వచ్చేస్తాను.
నేను నా డ్యూటీలో భాగంగా ఓ రోజు prescription auditing చేయడానికి ఫార్మసికి వెళ్లాను. అక్కడికి నేను వెళ్ళిన కొద్ది సేపటికే ఓ వ్యక్తి చూడడానికి బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నాడు చాలా కోపంగా వచ్చి అక్కడ ఉన్న ఇన్చార్జిని నిలదీస్తున్నాడు. మొదట నాకేమీ అర్థం కాలేదు విషయం ఏమిటో తెలుసుకోవాలని ముందుకు వెళ్లాను. అప్పుడు అతను “చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా” ? అని ప్రశ్నిస్తున్నాడు. సారీ సార్ అసలు ఏం జరిగింది కాస్త వివరంగా చెప్పగలరా అని అడిగితే… ఇలా అన్నాడు…మా బాబుకి 8 సంవత్సరాలు వాడికి 2 రోజుల నుంచి దగ్గు, జలుబు, ఫీవర్ అందుకే నిన్న వచ్చి పిడియాట్రిక్స్ డాక్టర్ ను కన్సల్ట్ అయ్యాం. మేడం మాకు కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చారు అవి ఇక్కడే తీసుకుని ఇంటికి వెళ్లిపోయాం.
ఇంటికి వెళ్ళాక మధ్యాహ్నం మా అమ్మ గారే సిరప్ (syrup) తాగించింది, రాత్రి వేయాల్సిన టాబ్లెట్లను కూడా వేసింది.
మేము మా మా పనుల్లో బిజీగా ఉంటాం అందుకే వాడి బాగోగులను మా అమ్మ గారే చూసుకుంటారు. ఈ రోజు మార్నింగ్ మా బాబు నిద్ర లేవలేదు. సరే హెల్త్ బాగోలేదు కదా నిద్రపోతే మంచిదేలే అని ఊరుకున్నాము. తర్వాత ఇప్పుడు 9 కి లేపి టిఫిన్ తినిపిస్తుంటే వాడు చాలా మత్తుగా ఉన్నాడు, వాలిపోతున్నాడు. భయమేసి
Prescription చూశాము. ఒకటి అని మీరు రాయడం వల్ల హాఫ్ వేయాల్సిన టాబ్లెట్ కాస్త మా అమ్మ ఫుల్ వేసేసింది అని జరిగిందంతా చెప్పి, తను ఎంత కంగారు పడ్డాడో కూడా మాకు వివరించాడు. మీ పిల్లలైతే ఇలా చేస్తారా అని నిలదీశాడు. మరేం పర్వాలేదు డోస్ ఎక్కువ అవడం వల్ల అలా మత్తుగా ఉన్నాడు, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ సజెషన్ ఇచ్చాక కాస్త శాంతించి జరిగిన దానికి సారీ చెప్పేసరికి తిరిగి వెళ్ళిపోయాడు. పిల్లవాడికి ఏం జరగలేదు కాబట్టి అందరూ హాయిగా గాలి పీల్చుకోగలిగారు. తప్పులను కప్పి పుచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు, వర్క్ ప్లేస్ లో ఇలాంటి అనుభవాలు చాలానే జరిగాయి, జరుగుతూనే వుంటాయి అందుకు కారణాలు అనేకం. యాస్ ఏ ఆడిటర్ గా మళ్లీ ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకూడదని అక్కడ స్టాఫ్ ని కౌన్సిల్ చేసి, గట్టిగా హెచ్చరించి వచ్చేసాను. విధిని పక్కన పెట్టి వాస్తవాలను కాసేపు తనిఖీ చేద్దాం…
ఎంతో కష్టపడి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి మంచి స్థాయిలో స్థిరపడి సుఖంగా జీవిస్తూ ఉంటాం. చదువుకోని వాడు, అక్షరం ముక్క తెలియనివాడు అనాగరికుడని ఏద్దేవా చేస్తూ వుంటాం.
మరి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా బాధ్యతలను విస్మరిస్తున్న వారికి ఏమని పేరు పెట్టాలి?
ముందు నేను ఉదాహరించిన సంఘటనలో ఆ పసివాడి తల్లితండ్రులు ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళే, అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళే అయినా తమ కొడుకు బాధ్యతను
వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకి అప్పజెప్పి తమ తమ పనులలో బిజీగా గడుపుతున్నారు. డబ్బులు సంపాదించేది పిల్లల భవిష్యత్తుకే కదా అని ఎదురు ప్రశ్నించేవారు లేకపోలేదు.. అయినా నేను ఉద్యోగం చేయడాన్ని, ఆస్తులు కూడబెట్టి తరాల బాగు కోరే వారిని వ్యతిరేకించడం లేదు. ఇక్కడ సమస్య ఒక్కటే అదే బాధ్యత.
బాధ్యత అంటే నాకు మా గురువు గారు చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తుంది. అభం శుభం తెలియని పసిపిల్లలను చదువు పేరుతో హాస్టళ్లకు పంపేస్తుంటే ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఆత్మీయత అభిమానం ఎలా వృద్ధి చెందుతుంది. అందుకే వాళ్లు తల్లిదండ్రులను పరాయి వాళ్ళలా భావించి వయసు పెరిగాక వృద్ధాశ్రమాలకి పంపేస్తున్నారు అని. అప్పుడు వాళ్లని హాస్టల్లోకి పంపితే లేని తప్పు ఇప్పుడు వృద్ధాశ్రమాలకు పంపితే వచ్చిందా? మనల్ని మన తల్లిదండ్రులు బాధ్యతగా పెంచి పెద్ద చేశారు మనం ఈ స్థాయిలో నిల్చుని ఉన్నాం. అంత బాధ్యతగా వాళ్లు వ్యవహరించబట్టే మనకు కొద్దో గొప్పో సంస్కారం వంట పట్టింది. మనల్ని పెంచి పెద్ద చేసిన అదే తల్లిదండ్రులకి మరల మన వారసుల బాధ్యత కూడా అప్పగిస్తే?
అది బాధ్యతను విస్మరించినట్లు కాదా?
ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి….!
మీకే అర్థమవుతుంది…