అమితమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అలుపెరుగని ఓర్పు అమ్మ
అద్భుతమైన కావ్యం అమ్మ
అత్యంత అందమైన రూపం అమ్మ.
అమ్మ గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు.
“అమ్మా నాకు కడుపులో నొప్పి బడికి వెళ్లను ఇవాళ.” “సరే అయితే ఈ వాము తిని పడుకో. ఈరోజు నీకు ఇష్టమని చామదుంపల పులుసు, అరటికాయ వేపుడు చేశాను. పోన్లే, కడుపు నొప్పి అన్నావు కదా! నువ్వు పెరుగన్నం తినేద్దువుగానీ ఈ పూటకి.”
” అరే వాము తినగానే తగ్గిపోయింది అమ్మా నొప్పి, నేను వెళ్తున్నాను బడికి.మధ్యాహ్నం నాకు బోల్డంత వేపుడు వేయాలి మరి.” ఇలా నేను
బడికి వెళ్ళనని అన్నప్పుడల్లా మా అమ్మ ఏదో ఒక ఆశ చూపించి భలేగా పంపించేసేది.
ఎందుకంటే తనకు చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఊరి పాఠశాలలో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండేదిట. ఆడపిల్లలను వేరే ఊరికి పంపించి చదివించేంత అవకాశం ఆ రోజులలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే లేదనే చెప్పవచ్చు.
చదువు మీద తనకు ఉన్న ఇష్టం చూసి మా తాతగారు పెద్దబాలశిక్ష, ఇంకా వివిధ వార, మాసపత్రిక లు అన్నీ తెప్పించి ఇచ్చేవారట.
మా నాన్నగారు కూడా అలాగే తెప్పించేవారు తనకోసం.ఎంత శ్రద్ధ గా చదివేదో అమ్మ. మాకు కాస్తైనా ఇలా సాహిత్యం మీద మక్కువ కలిగింది అంటే అది మా అమ్మే పుణ్యమే.
“రోజా దినపత్రిక ఎందుకమ్మా రేపు పరీక్ష రాసే విద్యార్థి లాగా ఆమూలాగ్రం చదువుతావు? వీధిలో మిగతా ఆడవారు ఎంచక్కా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు గదా?”
” ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టూ (ప్రపంచంలో )ఏమి జరుగుతోందో తెలుసుకుంటూ ఉండాలి. లోకజ్ఞానం పెంపొందించుకోవాలి.నా ఖాళీ సమయాన్ని నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను. అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు.
దానివల్ల ఎవరికి ఉపయోగం?
వీలైనంత వరకు మన సమయాన్ని మంచి పనులకే వినియోగించాలి.” ఇది అమ్మ జవాబు.
ఎంత గొప్పగా మా అమ్మ ఆలోచిస్తుందని అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. పైగా కోపగించుకునే వాళ్ళం. ఎందుకంటే వీధిలో మిగతా ఆడవాళ్ళు మాతో,” మీ అమ్మ ఎవరితో కలవదు, కబుర్లు చెప్పడానికి రాదు,” అంటూ ఉండేవారు మరి.
” అమ్మా మన ఇంటికే ఎందుకు ఎప్పుడూ చుట్టాలు వస్తారు? మన ఐదుగురమే హాయిగా ఉండొచ్చు కదా! అస్తమాను ఎవరో ఒకరు ఉంటారు, నువ్వేమో వంటగదిలో వండుతూనే ఉంటావు .నాకేం బాగోలేదు ఇలాగ.”
” చాల్లే మాట్లాడకు, వారి ఇంట్లో వాళ్లకు భోజనం లేక మన ఇంటికి రారు. ఇంటికి వచ్చిన బంధువులను ప్రేమగా చూడాలి. మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా వండి పెట్టాలి. ఎప్పుడూ వారిని తక్కువగా చూడకూడదు. అది చాలా తప్పు.”
మా అమ్మ మాకు ఎప్పుడూ మంచి చెడుల గురించి ప్రత్యేకించి ఉపన్యాసాలు ఇచ్చేది కాదు. నిత్య సంభాషణలలోనే జీవిత సత్యాలు, మంచి చెడుల తారతమ్యాలు అన్నీ రంగరించి చెప్పేది.
తన పాఠశాల విద్య ఐదో తరగతి వరకే అయినా తను చదివిన పుస్తకాలు ఎన్నో. మన పురాణాలు ఎంత ఇష్టంగా చదివేదో, అంతే ఇష్టంగా చలం, రంగనాయకమ్మల పుస్తకాలు చదివేది.
“ఇవి చదివి ఆనందించేందుకే తప్ప నిజ జీవితంలో ఆచరణీయాలు కావు,” అని చెప్పేది.
మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. మా బంధువులు అందరిలోనూ కూడా తనకు ఈ విషయంలో చాలా పేరు.
“మణీ నీ చేతితో ఏదో మహత్యం ఉంది. నువ్వు ఉత్తి చారు పెట్టినా చాలా అద్భుతంగా ఉంటుంది,” అనే వారందరూ.
ఇప్పటికీ ఆ చేతి రుచి అంతే బ్రహ్మాండంగా ఉందంటే నమ్మండి.
” అమ్మాయ్ ఇంకొక కప్పు తేనీరు(టీ) ఇస్తావా?”
“నా తుండు (టవల్) కనిపించట్లేదు.’
“ఈరోజు ఫలహారం (టిఫిన్ )ఏంటి?”
“నా గడియారం, కలం ఎక్కడ?” ఇవి మా నాన్న గారి మాటలు.
ఈ మధ్యలో, “అమ్మా నా మేజోళ్ళు ఏవి?”
“సాయంత్రం చిరుతిండి కోసం పకోడీ చేస్తావా ఈరోజు?” ఇది మేము.
“మణమ్మా నోరు చచ్చిపోయింది, కాస్త పులిహోర చేసి పెడతావా ఈరోజు?” మా తాతగారు.
పాపం మా అమ్మ. అందరికీ అన్నీ చిరునవ్వుతో చేసి పెట్టేది. ఏనాడూ తన మొహంలో విసుగు, కోపం చూసిన జ్ఞాపకం లేదు నాకు.
కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న పలుకులకు నిలువెత్తు రూపం మా అమ్మ. తన 15 వ యేట
18 సంవత్సరాల వయసున్న మా నాన్నగారి జీవితంలోకి వివాహ బంధంతో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి అడుగులో అడుగై నిలిచింది, నడిచింది.
జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను కష్టసుఖాలను కలిసి పంచుకుంటూ ఆదర్శమైన జంటగా నిలచిన వారిద్దరూ భావితరాలకు మార్గదర్శకులు.
మా ముగ్గురినీ ఎంత ప్రేమగా పెంచిందో అంతకన్నా ఎక్కువ ప్రేమగా, ఆప్యాయంగా, అపురూపంగా మా పిల్లలు ఆరుగురినీ పెంచింది.ఆ ఆరుగురికీ అమ్మమ్మ (బామ్మ అంటే వల్లమాలిన అభిమానం.
తన అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు, కుటుంబంలోని వారందరికీ తలలో నాలికలా ఉంటుంది మా అమ్మ.
ఎవరికి ఏ అవసరం, ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తుంది.
“మరు జన్మంటూ ఉంటే మళ్ళీ నువ్వే మాకు అక్కగా పుట్టాలి,” అని తన తోబుట్టువులు అంటుంటే, “చాల్లే ఊరుకో'” అంటూ నవ్వేస్తుంది.
పొగడ్తలకు పొంగిపోదు, విమర్శలకి క్రుంగి పోదు. నిండు కుండ లాంటి వ్యక్తిత్వం మా అమ్మ సొంతం.
నాకు సంబంధించి మా అమ్మ ఒక గొప్ప తల్లి, స్నేహితురాలు, గురువు, మార్గదర్శి, తత్వవేత్త ఇంకా ఎన్నో.
తన ఒడిలో పడుకుంటే ఎటువంటి బాధనైన కష్టాన్నయినా మరిచిపోగలను. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నిశ్శబ్దంగా నే నూరిపోస్తుంది అమ్మ.
72 వసంతాల వయసులోనూ పచ్చని పసిమి ఛాయ తో ఎంతో అందంగా ఉంటుంది మా అమ్మ.తన అందం మా ముగ్గురిలో ఎవరికీ రాలేదు.
మా అమ్మానాన్నలు నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో ఆనందంగా జీవించాలని మనసా వాచా కోరుకుంటూ ఉంటాను సర్వదా