తెల్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీర వనిత – వీర గున్నమ్మ

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం గడగడలాడించిన అతి సామాన్యులను కూడా మనం చరిత్రలో చూడవచ్చు. సామాన్యుల్లోనే మాన్యులు దాగి ఉంటారనీ , గదిలో పెట్టి హింసిస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందనీ , తుపాకీ పట్టిన తూనీగలుంటాయనీ ఇలా ఎన్నో విషయాలను మనం ఎన్నో సందర్భాల్లో రచయితల ద్వారాగానీ అనుభవజ్ఞుల ద్వారాగాని ఎన్నోసార్లు తెలుసుకున్నాము . అలా నిస్సహాయత నుండి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసిన తారాజువ్వే వీర గున్నమ్మ.

శ్రీకాకుళం జిల్లాలోని గుడారి రాజమణిపురం అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు . వీ రు పుట్టిన సంవత్సరంపై సరైన ఆధారాలు లేకపోయినా స్థానికుల అభిప్రాయం ప్రకారం 1914 వ. సంవత్సరంలో జన్మించినట్లుగా తెలుస్తుంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు చరిత్రలో ఎన్నో రైతు పోరాటాలు జరిగాయి . వీటిలో కొందరు రైతులు ఆంగ్లేయులపై , మరికొందరు జమీందారులపై , కొందరు ఇద్దరిపై పోరాడిన సందర్భాలను మనం గమనించవచ్చు. ఆ విధంగా అటు బ్రిటిష్ వాళ్లనీ , ఇటు జమీందారులనీ ఎదిరించి ఒక సామాన్య మహిళ ఉత్తరాంధ్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటవీ సంపదపై జమీందారుల హక్కును ప్రశ్నించి , రైతుల పక్షాన పోరాడి , పోలీసు తూటాకు బలైన నిండు చూలాలు.

ఆనాటి మందస ప్రాంత ఆచారాల ప్రకారం దాదాపు పది సంవత్సరాల వయసులో ఉండగానే ఈమెకు మాధవయ్య అనే వ్యక్తితో వివాహం జరిపించారు . వివాహమైన కొంతకాలానికి ఈమె భర్త ఉపాధి నిమిత్తం రంగూన్ వెళ్లి , కొంతకాలం అక్కడ ఉండి తిరిగి స్వగ్రామం వచ్చారు . అయితే ఆ సమయంలో తీవ్రమైన కరువు కాటకాలు ఉండడంతో తిరిగి రంగూన్ వెళ్లాల్సిన అవసరాన్ని గమనించి వెళ్లడం, ఆ సమయానికి గున్నమ్మ మూడు నెలల గర్భవతిగా ఉండడం , రంగూన్ వెళ్ళిన కొంతకాలానికే అతను అక్కడ మరణించడం జరిగింది.

అటు భర్తను కోల్పోయి, ఇటు కడుపులో బిడ్డను మోస్తూ జీవితం ఆగమ్యగోచరంగా ఉన్నప్పటికీ , తనను తాను సంభాళించుకుని , భరతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి తనవంతు కర్తవ్యం గా పోరాడాలని నిర్ణయించుకొని, రైతులకు బాసటగా నిలుస్తూ, జమీందారులు , బ్రిటీషర్లను ఎదిరించిన ధీశాలి. ఆమె పోరాటాన్ని మేధావులు , పోరాట యోధులు స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించడానికి కారణం, దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలంటే ముందు వారికి తొత్తులుగా మారిన జమీందారులను ఎదిరించాలని భావించి తిరుగుబాటు చేయడమే అని చాలామంది అభిప్రాయం.

రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని పన్ను రూపంలో జమీందారులు తీసుకొని ఆంగ్లేయులకు చెల్లిస్తూ ఉండేవారు . కరువుతో అల్లాడుతున్న సమయంలో అడవి నుండి ఎండుపుల్లలు , కలప , ఇతర ఏ విధమైన అటవీ ఉత్పత్తులు తెచ్చుకు న్నా వాటికి కూడా పన్ను కట్టమంటూ వేధించేవారు . ఆ పన్నుల భారం తగ్గించాలని రైతులు జమీందారులను అడిగినా ఫలితం ఉండేది కాదు . ఈ పరిస్థితులను గమనించిన వీరగున్నమ్మ రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ, వాళ్లలో చైతన్యాన్ని కలిగించడానికి తీవ్రంగా ప్రయత్నించేవారు . ఈవిడ చేస్తున్న ప్రయత్నాలు అటు రైతులకు , ఇటు ఆంగ్లేయ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదాలకు, ఘర్షణలకు దారి తీసేవి. శ్రీకాకుళం జిల్లా మందస ఎస్టేట్ జమీందారుకు వ్యతిరేకంగా సాగిన రైతుల పోరాటాలకు , కూలి నాలి జనం పోరుకు బాసటగా గున్నమ్మ చూపిన తెగువ భారత స్వాతంత్ర పోరాటానికి , కిసాన్ ఉద్యమాలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. తాడిత ,పీడిత వర్గాలకు, కొండకోనల్లోని జనాలకు, రైతుకూలీలకు ఒక విప్లవ మార్గాన్ని అందించింది.

1940 మార్చి 27న అఖిలభారత రైతు మహాసభలు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగాయి. దానికి దేశవ్యాప్తంగా పలువురు జాతీయ నేతలు , స్వాతంత్ర్య సమరాన చురుకుగా పాల్గొంటున్న ప్రముఖులు హాజరవడం జరిగింది. స్వామి సహజానంద సరస్వతి , బంకించంద్ర ముఖర్జీ , హిందులాల్ యాగ్నిక్ ,సోహన్ సింగ్ , ఆచార్య ఎన్జీరంగా వంటి కిసాన్ నేతలు ఇచ్చిన సందేశాలకు స్ఫూర్తి చెందిన మందస ఎస్టేట్ ప్రాంత రైతులు జమీందారుపై తిరుగుబాటు ప్రకటించారు . తమ అడవిని , తమ పంటను తామే అనుభవించాలని తలచి ఏకంగా దండయాత్ర జరిపారు. దీనికి భయకంపితుడైన జమిందారు తెల్లదొరలను ఆశ్రయించడంతో పెద్ద ఎత్తున బ్రిటిష్ పోలీసులు డబారు , గుడారి , రాజమణిపురం గ్రామ సరిహద్దులకు చేరుకున్నారు . అయితే వారి బెదిరింపులకు అదరని అక్కడి రైతులు మార్చి 31 అర్ధరాత్రి గ్రామ పొలిమేరలో కిసాన్ సభ జరిపారు .దీంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ మానిలాల్ సూచనల మేరకు ఏప్రిల్ 1న మందస ఎస్టేట్ పరిసర గ్రామాల్లో రైతులను టెక్కలి ఠానాకు తరలించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు . రైతుకూలీల చేతులకు బేడీలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులకు , రైతులకు జరిగిన తీవ్ర వాగ్వివాదం కాస్తా పెనుగులాటకు దారితీసి రక్తసిక్త రణక్షేత్రంగా మారింది. గ్రామస్తులు , స్థానిక రైతులు కూడా బ్రిటిష్ పోలీసులకు ఎదురు తిరిగారు. కర్రలు ఆయుధాలతో ఎదురుదాడికి దిగారు. సభలు, సమావేశాలు నిర్వహించి అందరిలో చైతన్యం నింపిన గున్నమ్మ సైతం పోలీసులపై ఎదురు దాడి చేసింది. బ్రిటిష్ పోలీసులకు ఎదురు నిలిచి “రైతులకు బేడీలు వేయడానికి ఎంత ధైర్యం ? “అంటూ సివంగిలా గర్జించింది . వాహనం కదలకుండా అడ్డుపడింది . అడ్డు తొలగకపోతే కాల్చేస్తా మంటూ పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకీకె దురునిలిచి దమ్ముంటే కాల్చమని సవాలు విసిరింది .ఆమె తెగువకు క్షణకాలం ఆశ్చర్యపోయిన పోలీసులు గర్భిణీ అన్న కనికరం కూడా చూపకుండా తూటాల వర్షం కురిపించడంతో గున్నమ్మ అక్కడికక్కడే నేల కొరిగారు.

ఇంత వీరనారి చరిత్ర వెలుగులోకి రాలేదన్న కారణంగా చాలామంది చలనచిత్ర , రాజకీయ , పత్రికా రంగంలోని ప్రముఖులు ఎంతోమంది వీరి చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు .

స్వాతంత్ర్య సమరాన తెలుగు నేలలోనూ , ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన ఈ పోరు తర్వాత కాలంలో భారతదేశానికి పోరుబాటను చూపింది . పలాస కొండల్లో పుట్టిన సాయుధ పోరాటం , గిరిజన ఉద్యమం , జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, వీల , సోంపేట , కాకరపల్లి ఉద్యమాలు గుండమ్మ పుట్టిన ప్రాంతానికి అతి సమీపంలోనివి. వీరనారి గున్నమ్మ సాగించిన పోరాట పటిమకు, ఉద్యమానికి స్మారకార్థంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టిన గ్రామమైన గుడారి రాజమణిపురాన్ని ‘ వీర గున్న మ్మపురం ‘ గా మార్చింది . అక్కడ నిర్మించిన స్మారక స్థూ పాన్ని ఉమ్మడి ఏ. పీ . గవర్నర్ కుముద్బెన్ జోషి 1988 సెప్టెంబర్ 10న ప్రారంభించారు.

అప్పటినుండి ఆమె ధైర్య సాహసాలు వర్ణిస్తూ , ఆ ప్రాంతంలోని గంగిరెద్దులవారు , మాలదాసరులు ఆ

మె కథను ‘ వీరగున్నమ్మకథ’ గా గానం చేయడం ప్రారంభించారు . అలా ఆమె పేరు కథారూపంలో ప్రచారంలోనికి వచ్చింది. అలా పాటల రూపంలోని ఆమె వీరోచిత గాధలను చరిత్రకారు లు శ్రీ బద్రికూర్మారావు గారు తన ‘ కళింగాంధ్ర జానపద గేయా

లు ‘ అనే పుస్తకంలో వీర గున్నమ్మ పాట శీర్షికన ప్రచురించారు . శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి ధర్మారావు గారు ‘ కళింగ సివంగి’ అనే నవలను రచించారు.

పెద్దగా చదువుసందెలు లేకపోయినా , యుక్తవయసులో భర్తను కోల్పోయి, కడుపులో బిడ్డను మోస్తూ ఉన్నప్పటికీ కూడా భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి తన వంతు కర్తవ్యంగా ఇటు జమీందారులను , అటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించి నేలకొరిగిన నిండు గర్భిణీ వీరగున్నమ్మను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత . ధైర్య సాహసాలతో తమ జీవితాలను ఫణంగా పెట్టి స్వాతంత్ర ఫలాలను భావితరాలకు అందజేసిన ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులకు మరియు లింగభేదాన్ని కూడా ఎదిరించి ఆ పోరాటంలో మేము సైతం అంటూ పోరాడిన వీరవనిత లందరికీ పేరుపేరునా అంజలి ఘటిస్తూ ఈ వ్యాసం అంకితం.

 

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురద

జీవితానుభవాలే రచనలుగా…