మగవాళ్ళు గౌరవంతో ఆడవాళ్లను ఆప్యాయంగా పలకరించాలంటే కూడా కాస్త భయమే.ఎదుటి వాళ్ళను చూసి మాట్లాడాల్సిన దుస్థితి.మంచితనానికి కూడా ఆటంకమే.
అమ్మ అంటే ప్రేమకు మారుపేరు ,ఆప్యాయతకు నిండు దనం.మంచితనానికి సుందరరూపం అనే అర్థం తెలియక ,చక్కగా ప్రేమతో, ప్రేమ కురిపిస్తూ పేరుతో కలిపి సీతమ్మ,రాములమ్మ,శాంతమ్మ,సుమనమ్మ, అని పిలుస్తుంటే పిలుపులో విలువ తెలియని మహిళా మూర్ఖులున్నారు మన సమాజంలో.వయసుతో సంబంధం లేకుండా టీచరమ్మ,పంతులమ్మ అంటాం కదా గౌరవభావంతో.అమ్మఅంటే బూతు పదమా?
మేము ముసలోళ్ళమా,నీకు బిడ్డలమా అని ఎదురు తిరిగి ప్రశ్నించే గొంతుకలను ఏమనాలో..
అమ్మాయిలకు మంచి విలువనిచ్చి ఆప్యాయతతో పలకరిస్తూ బిడ్డలా చూసుకునే వారి మదిని నొప్పించి నీరు కార్చే సంఘటనలు.వయసులో ఒక నలభై యైదు,ఏబది వత్సరాలు దాటిన మహిళలను,అప్పటికే అమ్మమ్మలు అయిన వాళ్ళను ప్రేమతో పిలిస్తే తప్పేంటో తెలియని అతి తెలివిని ప్రదర్శించే మణిరత్నాలు. నాన్న లాంటి మనసుకు కాస్త గాయం.మానవత్వానికే మచ్చ.
చిన్నపిల్లలను కూడా ప్రేమతో రా తల్లి,రావమ్మా అని అనురాగముప్పొంగ పిలుస్తాము కదా వాళ్ళు ముసలోళ్ళా.. ఆ మాత్రం గుర్తించని,అనురాగం,ఆప్యాయత,గౌరవం విలువలు తెలియక పిలుపులో కూడా తప్పును వెదికే కొద్దిమంది మూర్ఖ శిఖామణులను గురించి మాత్రమే.పిలుపులో చెడు అర్థాలు వెతికే వారిని గురించి మాత్రమే.వయసు రాకుండా ఉండదు.ఎప్పుడు షోకులు చేసుకున్నంతమాత్రాన చిన్న పిలల్లయి పోతారా? తెలియని వాళ్లని
పేరుపెట్టి పిలిస్తే ,నువ్వు అంటే బాగుండదని ,పూర్వకాలంలోఊర్లల్లో బిడ్డ,చెల్లి,వదిన,అత్త అంటూ ఏదైనా పిలుపుతో ప్రేమగా, గౌరవంగా చక్కగా పిలిచేవారు.ఇప్పుడు ఆ పిలుపులు తగ్గాయి.అందరూ ఆంటీ,అంకుల్. బ్రో,సిస్టర్.పాల అంకుల్,చెత్త అంకుల్,టైలర్ ఆంటీ,పక్కింటి ఆంటీ.
మారుతున్న సమాజం.కానీ పాతవాళ్ళం కదా కాస్త మనసు చివుక్కుమంటుంది.
ఒక మగాడు ఆడవాళ్ళను మర్యాదగా చెప్పమ్మా,అది కాదమ్మా అంటే కూడా తప్పు పట్టే,వాళ్ళ వయసుకు భంగం కలుగుతుందని భావించే మధ్య వయస్కుల అమ్మమ్మలు ఉన్న నేటి కాలంలో పిలిచే మంచి వాళ్లకు కాస్త ఇబ్బందే.ప్రేమగా ఉన్న వాళ్ళు వున్నారు.
అందరిని మేడం అని పిలువాలేమో..తెలుగు భాషలో మాధుర్యం అమ్మ అనే పిలుపు పనికి రాదు.ఇదీ పరిస్థితి.
ఇది అందరిని ఉద్దేశించి కాదు.