ధనం మూలం ఇదం జగత్

కామేశ్వరి వాడ్రేవు

ఈ ప్రపంచంలోధనమే అన్నిటికీ మూలం అని పై వాక్యానికి అర్థం. ఇది అందరికీ తెలిసిందే. ధనంతో ఏదైనా సాధించవచ్చు అని అనుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. దాన్ని సంపాదించడానికి ఎన్నెన్నో మార్గాలు అన్వేషిస్తారు.అప్పుడప్పుడు పెడదారులు కూడా తొక్కుతారు. కానీ మన పురాణాలు ధర్మంతో కూడిన అర్ధాన్ని పొందాలని ఘోషిస్తున్నాయి. కానీ ఈ విషయానికి “ఫేర్వెల్ “ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు మనిషిని నడిపించే మిషన్ ధనం మాత్రమే. ( మనం ఏటీఎం ద్వారా డబ్బు పొందుతున్నాం. అది వేరే విషయం అనుకోండి) నేటి కాలంలో అందరికీ ఉండే కామన్ ఎమోషన్ డబ్బు సంపాదించడం ఎలా. డబ్బు అనే రెండు అక్షరాలు మనిషి అనే మూడు అక్షరాలను ఆడిస్తుంది, పై చేయి సాధిస్తుంది కూడా. అంబానీ దగ్గర్నుంచి అడుక్కుతినే వాడిదాకా ఉండే” కామన్ ఎమోషన్”డబ్బు మాత్రమే. నేడు మనిషికి” కరెన్సీ ఇస్ ఓన్లీ ది ఎమర్జెన్సీ “అయిపోయింది. పసి పిల్లల దగ్గర నుంచి, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ముదిసలు వరకు డబ్బంటే కాపీనమే.
కానీ డబ్బుకి ఆనందానికి అస్సలు సంబంధం లేదు. డబ్బున్న వాడి కంటే పేదవాడి రేపటి గురించి ఆలోచన లేక సుఖంగా ఉంటాడు. డబ్బున్న వాడికి అన్నీ లింకులే. సరియైన అజమాయిషి చేయకపోతే సంపాదించిన అంతా హుష్ కాకి అయిపోతుంది.ఒక్క నిమిషంలో.బంధాలను, అనుబంధాలను కూడా డబ్బే నిలుపుతుంది, చెడగొడుతుంది కూడా.కానీ మన దగ్గర నాలుగు డబ్బులు ఉన్నప్పుడే మనల్ని ఖతర్ చేసేది. ప్రతి వారికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. పొదుపు 20% ఖర్చు 80% ఉండేలా అలవాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయం. మన పూర్వీకులు ధనాన్ని ఒక పెద్ద విషయంగా చూసేవారు కాదు. గుణాలే ప్రధాన అనేవారు. ధనం ఉన్నవాడిని చూసి అసూయ పడకుండా ” వాడు పెట్టి పుట్టాడు ” అనేవారు. డబ్బున్న వారు ఆ కాలంలో సత్రాలు కట్టించి బాటసారులను ఆదుకునేవారు. దేవాలయాల పునరుద్ధరణకి తోడ్పడేవారు. బీదసాద లకి దానధర్మాలు చేసేవారు. ఆ రోజుల్లో బహుసంతానం కూడా ఉండేది. కానీ వారు ఎప్పుడూ నిరాశ చెందేవారు కాదు. ఒక డబ్బున్న వాడి దగ్గర పదిమంది బతకవచ్చు అనే విశాల హృదయం కలిగి ఉండేవారు. రాజులు కాలం ఉన్నప్పుడు కూడా ప్రజల కట్టిన కప్పాలతో ప్రజల అవసరాలు తీర్చేవారు. ధర్మబద్ధంగా నడుచుకున్న చక్రవర్తులు ఎందరి గురించో మనం విన్నాం.
కాలం మారింది. డబ్బు మనిషిని తన గుప్పిట్లోకి తీసుకుంది. డబ్బున్నవాడే అన్నిటికీ మిన్న అనే రోజులు వచ్చాయి. డబ్బు కావాలని కోరుకోవడం ఒక రకంగా సుగుణం, మరో రకంగా దుర్గుణం కూడా. మన దేశం మీద విదేశీ దండయాత్రలు, బ్రిటిష్ పాలన ఈ సంపద కోసమే కదా. భారతదేశంలో ఉన్న సంపద ఏ దేశంలోనూ లేదు. మన పురాణాల్లోని, చరిత్రల్లోని యుద్ధాలన్నీ సంపత్ ని పొందాలనే కదా జరిగాయి. నేటి కాలంలో సంఘవిద్రోహశక్తులే డ్రగ్స్ అమ్మడం, అమ్మాయిల్న వేశ్య గృహాలకు తరలించడం డబ్బుకు కక్కుర్తి పడే కదా. ఇక రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పనక్కర్లేదు. డబ్బు కోసం గడ్డి గరుస్తారు. జీవనాధారమైన ఆహార విషయంలో కూడా కల్తీలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు.
ధనం అంటే కాగితాలు,నాణ్యాలు కాదు. ఆనందం ధనం, మంచి మర్యాద ధనం, కాలం ధనం, ఆఖరికి చావు కూడా ఒక ధనం. డబ్బుకే కాదు,మంచితనాన్ని కూడా లోకం దాసోహం ఉంటుంది . అందరూ డబ్బుమాయిలో పడి ఆయుష్షుని గుర్తించడం లేదు. మనం సంపాదించిన దానితో మనం సుఖంగా బతికితే చాలు అని ప్రతివారు అనుకోవాలి. తర్వాత ఎవరికి చెందినా మనం చూడము కదా. డబ్బుని విలువగా చూస్తేనే అది మన దగ్గర నిలుస్తుంది. అందుకే ఏ సంపదైనా లక్ష్మితో సమానమని మన పెద్దలు చెప్పేవారు. అందుకే డబ్బులు చాలా పొదుపుగా, గౌరవంతో చూసేవారు, చూడాలి కూడా.” సుగుణాల మూలం ఇదం జగత్ ” అని తెలిసినడుచుకుంటే” ధనం మూలం ఇదం జగత్ ” అనే మాటకు అర్థం, పురుషార్థం కూడాలభిస్తాయి.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎవరి తల్లిదండ్రులయితేనేం…?

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు