తొలి మహిళా కార్టూనిస్టు

రాగతి పండరి ( కార్టూనిస్ట్)

తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్ర కళాకారిణి ) ఐన వీరు జూలై 22,1965 లో విశాఖపట్నంలో జన్మించారు. పూర్తి పేరు ‘రాగతి పండరీబాయి’. శాంతకుమారి, గోవిందరావు గార్లు వీరి తల్లిదండ్రులు. పోలియో వల్ల శారీరక లోపంతో బాల్యంలో చదవు ఇంటి వద్దనే కొనసాగినా ఇంటర్మీడియట్ తో చదువుకు స్వస్తి చెప్పారు . ఆత్మవిశ్వాసం, పట్టుదల సడలనీయకుండా తన 8వ ఏట నుండే కార్టూన్లు గీయడం మొదలుపెట్టారు. అంటే 1973 నుండి చిత్రాలు గీయగా అన్ని పత్రికలలో ప్రచురితమై అత్యంత ప్రజాదరణ పొందాయి. వీరి కార్టూన్లు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి.

కార్టూన్లు మేధస్సుకు పదును పెడతాయి, నవ్విస్తాయి. మాన్యులైనా, సామాన్యులైనా స్పందించి హాయిగా నవ్వి ప్రభావితమయ్యే గొప్ప కళ .తెలుగు కార్టూన్లు 8 దశాబ్దాలుగా విరాజిల్లుతున్నాయి .ప్రతివ్యక్తిలో కొంత ప్రతిభ దాగి ఉంటుంది, ఏదో ఒక సమయంలో బయటికి వస్తుంది. ఆనంద విషాదాలు అతి సహజమైనది మానవ జీవితం. బాల్యంలోనే పోలియో సోకినా విషాదపు చట్రంలో బందీ కాకుండా ఎంతో స్ఫూర్తితో దశాబ్దాలపాటు కార్టూన్లు గీస్తూ జనాన్ని నవ్వుల ప్రపంచం లోకి తీసుకెళ్లిన ధీశాలి. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు శ్రీ సి. కనకాంబర రాజు గారి ప్రోత్సాహంతో మొదలైన వీరి ప్రస్థానం నిరాఘాటంగా సాగుతూ సుమారు పదమూడు వేలకు పైగా కార్టూన్లు గీసి తెలుగు కార్టూన్ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిగా ఖ్యాతినొందారు.

సాధారణంగా కార్టూనిస్టులు ఇండియన్ ఇంక్ లో క్రొక్వెల్ కలాన్ని ముంచి కార్టూన్లు గీస్తారట. కానీ రాగతి గారు ఆలోచన వచ్చిందే తడవుగా పెన్సిల్ తో కార్టూన్స్ వేసేవారట. స్వల్ప వ్యవధిలోనే కార్టూన్లు వేస్తూ, గయ్యాళి స్త్రీ పాత్రలకే పరిమితమైన వ్యంగ్య చిత్రాలు గీసే మూస పద్ధతిని అధిగమించి చక్కటి తెలుగులో, అందమైన లిపితో గీయడం వీరి ప్రత్యేకత .రాగతి గారి రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో నిజమైన నాయకుల చిత్రాలు కాకుండా ఊహాజనితమైనవి గీసేవారు. సమాజంలోని సంఘటనల ఆధారంగా వివిధ వృత్తులు- ప్రవృత్తులు ,సాంఘీకఅసమానతలుదురాచారాలు మొదలైన అంశాలతో కూడిన వీరి చిత్రాలు విమర్శనాత్మకంగా, ఆలోచనాపరంగా ,హాస్య ప్రధానమై,ఆకర్షణీయంగా ఉంటూ పాఠకుల్ని నవ్విస్తూ ఆదరణ పొందాయి. వీరు తమ ప్రతిభకు గాను పొందిన అవార్డులు ఎన్నో!

1991 : రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి అందుకున్నారు.
2001 : లో ఉగాది పురస్కారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ రంగరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు.
2011 : లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డుతో సత్కరించింది. (ఈ అవార్డు ఏర్పాటు చేసిన తొలి సంవత్సరమే అందుకున్న మొదటి కళాకారిణిగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు).
“నా గురించి నేను” అనే ఆత్మకథని రచించారు. విశాఖపట్నంలో దీన్ని ఆవిష్కరించారు. వీరి కార్టూన్ చిత్రాల్లో రాజకీయ చదరంగం, కవయిత్రి, ఇద్దరమ్మాయిలు అత్యంత ఆదరణ పొందాయి.
అంగవైకల్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎంతో మందికి స్ఫూర్తి కలిగేలా తన కార్టూన్ల తో సందేశాలు అందిస్తూ మహిళా కార్టూనిస్టులకు సైతం చక్కని బాటలు వేశారు. బాపు ,జయదేవ్, బాబు గార్ల సరసన నిలబడే స్థాయికి చేరుకున్న వీరు, తమ గురువుగా జయదేవ్ గారిని ప్రత్యేకంగా పేర్కొంటారు. మొక్కవోని ధైర్యంతో కళాశిఖరాన్ని అధిరోహించి చరిత్రపుటలో నిలిచిన కుమారి. రాగతి పండరి గారు అనారోగ్యంతో ఫిబ్రవరి 19, 2015 లో స్వర్గస్తులైనారు. అంతటి ప్రతిభాశాలికి అక్షర సుమాలతో అంజలి ఘటించడం ఒక గొప్ప అనుభూతి.

రాధికా సూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అదృశ్యం

ఎవరి తల్లిదండ్రులయితేనేం…?