తప్పంతా వారిదేనా…?!
అన్ని ఆంక్షలు వారికేనా…?!
కట్టేసినట్టు కట్టు బొట్టు
గుండెమాటు గుట్టు మట్టు
మేలిముసుగులు
మేని తొడుగులు
నల్లనివంటూ
తెల్లనివంటూ
వస్త్ర వర్ణాలపైనా
అధికారాలు, అజమాయిషీలు
అన్నీ షి ల పైనే!
అపనిందలు, అభాండాలు వారిపైనే!
పక్కన చేరి చేసేవన్నీ చేసి
పక్క దులుపుకు పారిపోయే
ప్రబుద్ధులపై లేవెందుకు
నిషిద్ధాలు,నిబంధనలు?!
మనసులోని మాటలు సైతం
పొంగిపొరలే సంతోషాలు సైతం
పెల్లుబకకుండా,పెదవి దాటకుండా అణచివేసిన యుగాల నాటి ధర్మాలు…
రక్తంలో ఇంకింపజేసిన
రాయని శాసనాలు
అన్నీ అతివలకేనా?!
మరుగున చేయాల్సిన పనులను పురుషులు బాహాటంగా చేసినా…
అలవాటుగా అలా చూస్తూ పోతారందరూ…
అదేవిటో?!
ఆహార విహారాలు
ఆనంద ప్రమోదాలు
అన్నింట్లో ఆంక్షలేనా?!
పెదవి దాటని మాటలు
సవ్వడి రాని నవ్వులు
సడి చేయని అడుగులు
తలవంచిన నడకలు…
ప్రశ్నించని మెదళ్లు
ఉరకలెత్తని హృదయాలు
గాయాలకు మొద్దుబారిన మేనులు
మేకుల్లా గుచ్చే మాటలకు
తూట్లు పడని మనసులు
పడతులవా?!
ఆడవారంటే…
ఆకు చాటు పిందెలుగా
అణగిమణగి ఉండాల్సిందేనా?!
వీర విశృంఖల విహారానికి
మగవారు పట్టాదారులా?!
నేరం చేసినా సరే
వారికి పట్టాభిషేకాలా?! ఎందుకని?!
అందలాలు వారికేనా?!
అందని ఫలాలు వీరికేనా?!
పెంపకం నుంచే వివక్షలు మానాలి
స్త్రీలంటే మర్యాద, మన్ననలు నేర్పాలి
చులకన భావం తొలగించాలి
శీలమంటే ఇరువురికీ ముఖ్యమేనని తెలపాలి
ఋజుప్రవర్తనలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవాలి
నైతిక విలువలు పిల్లలలో నాటాలి!
**************