కర్ణాటక టూర్

గిరిజ పైడిమర్రి

భారతదేశంలో ప్రకృతి నుండి వేరు చేసి ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడలేము. రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. అటు ప్రకృతి ప్రేమికులు ఆనందించ వచ్చు. ఇటు భక్తులు ముక్తి మార్గాన్ని అన్వేషించ వచ్చు. ఈనెల 17 న 11 మంది బృందం కర్ణాటక టూర్ కు బయలుదేరాము. 12 మంది కూర్చోవడానికి వీలుగా ఉండే ట్రావెల్ టెంపో మా వాహనం. హైదరాబాదు నుంచి శృంగేరి దాదాపు 750 కిమీ లు. సాయంత్రం ఇక్కడ బయలుదేరి ఉదయం తొమ్మిదిగంటలకల్లా చేరుకున్నాము.

శృంగేరి కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మగళూర్ జిల్లాలో తుంగానది ఒడ్డున ఉన్నది. ఈ పేరు రుష్యశృంగ గిరి నుంచి వచ్చిందని చెపుతారు. రామాయణం బాలకాండ లోని ఒక పురాణ కథ ఇక్కడ ప్రచారంలో ఉన్నది. విభాండక మహర్షి కుమారుడైన రుష్యశృంగుడు రోమపాదుడు పరిపాలిస్తున్న అంగరాజ్యంలోనికి ప్రవేశించి అక్కడ వర్షాలు కురిపించి కరువును పోగొట్టాడని  స్థలపురాణం. అద్వైతాన్ని ప్రచారం చేయడానికి శంకరాచార్యుడు స్థాపించిన శృంగేరి మఠం ప్రసిద్ధి పొందింది. శృంగేరి శారదాపీఠం, విద్యాశంకర దేవాలయం, ఆదిశంకరుల దేవాలయం, నరసింహ వనం, తుంగానది ఇక్కడ చూడవలసిన ప్రధాన ప్రదేశాలు.

శారదాంబ దేవాలయం ఆదిశంకరాచార్యుల కాలం నుంచి ఉన్నదని … మొదట చందన విగ్రహం ఉండేది. తరువాతి కాలంలో బంగారు విగ్రహం ప్రతిష్ఠించారట. ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్లలో అగ్నిప్రమాదం జరిగిన స్థానంలోనే దేవాలయ పునర్నిర్మాణం చేసారు. ప్రస్తుతం ఉన్న ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నది. విద్యాశంకర దేవాలయం ప్రాచీనకట్టడం. చక్కటి వాస్తుకళతో చూడటానికి అందంగా ఉంటుంది. ఈ రెండూ చూసుకొని మేము తుంగానది ఆవల వైపున ఉన్న నరసింహ వనానికి బయలుదేరాము. ఈ వంతెన పైనుంచి వెళుతుంటే ….. మరికొద్ది దూరంలో వేలాడే వంతెన ఒకటి కనిపించింది. పక్క పక్కనే రెండు వంతెనల అవసరం ఏమిటని వాకబు చేయగా …… అవతలి ఒడ్డున ఉన్న ప్రజలు వాళ్ల అవసరాల నిమిత్తం చెప్పులతో ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించవలసి వచ్చేదని, దానిని నివారించడానికి ఆలయప్రాంగణానికి దూరంగా వారి ప్రయోజనం కొరకు వేలాడే వంతెనను నిర్మించినట్లు తెలిసింది. నేను, శివ ఆ వంతెనపైనుంచి వెళ్లి ఆవలి గ్రామాన్ని చూసి వచ్చాము.

ప్రస్తుతం ఉన్న శంకరమఠం కొత్తగా నిర్మించింది. చాలా విశాలంగా ఉన్నది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పాత శంకరాచార్యుల మఠంలో పూర్వ పీఠాధిపతుల సమాధులున్నాయి. నరసింహ వనంలో నన్ను బాగా ఆకర్మించింది అంజీరా ఫలవృక్షం. అంత పెద్ద వృక్షాన్ని నేను ఇంతకు మునుపు ఎక్కడా చూడలేదు.

తెల్లవారి ఉదయం ఏడు గంటలకు హోర్నాడు బయలుదేరాము. శృంగేరి నుంచి 43 కిమీ ల దూరంలో ఉన్నది. అటవీ ప్రాంతం కావడం వలన అక్కడికి చేరడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. కర్ణాటకలోని పశ్చిమకనుమలలోని దట్టమైన అటవీప్రాంతంలో ఈ ఆలయం ఉన్నది. అన్నపూర్ణాదేవి బంగారు కాంతులతో అల్లంత దూరం నుంచే భక్తులకు దర్శనమిస్తుంది. ఆద్యాత్మిక భావనే కాకుండా చుట్టూ కొండలతో పచ్చని ప్రకృతి కూడా మనలను కట్టిపడేస్తుంది.

బలవంతంగా మమ్మల్ని మేము నెట్టుకొని అక్కడినుంచి ధర్మస్థలికి బయ లుదేరాము. 88 కిమీల దూరం. దాదాపు మూడుగంటల ప్రయాణం. భయంకరమైన కొండమలపులలో ఉయ్యాలలూగుతూ బస్సు నెమ్మదిగా వెళుతోంది. హరితవర్ణంతో జలపాతాలతో ప్రకృతి కనువిందు చేసింది. మేఘాలలో విహరిస్తున్న అనుభూతి … … మాటలకందని మైమరపు …… ధర్మస్థలిలో బస్సు ఆగడంతో ఇహలోకంలోకి పచ్చాను. ధర్మాన్ని స్థాపించడానికి దేవతలే స్వయంగా ఈ స్థలాన్ని ఎన్నుకున్నారని అందుకే ఆ ప్రదేశానికి ధర్మస్థలి అనే పేరు వచ్చిందని స్థల పురాణం. మంజునాథ ( ఈశ్వరుడు ) ప్రధాన దైవం. శివాలయంలో మధ్య బ్రాహ్మణులు పూజారులుగా ఉండడం విశేషం. భోజనాలు ముగించుకొని సౌత్అడ్క గణపతి దేవాలయానికి బయలుదేరాము. 28 కి.మీ.లు ప్రయాణం.

                        

 

ప్రశాంతమైన అడవి మధ్యలో ఆకాశం కింద గణపతి విగ్రహం చూసి ఆశ్చర్యపోయాను. గర్భగుడి, ఆలయం, ధ్వజస్తంభం వంటివి ఏవీ లేకపోవడం ఇక్కడి విశేషం. ధర్మకర్తలు ఏర్పాటు చేసిన ఆర్చి నుంచి విగ్రహం దాకా వందలాది గంటలు ఉన్నాయి. గంటలు మోగిస్తూ ఏ కోరిక  కోరుకున్న మూడు నెలలలో ఫలిస్తుందని తరువాత వారు వచ్చి గంటికట్టి మొక్కు తీర్చుకుంటారని అక్కడి వాళ్లు చెప్పారు. తరువాత మేము దాదాపు 65 కి. మీ. లు ప్రయాణం చేసి కుక్కి చేరుకున్నాము. ఈక్షేత్రం దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రమణ్య అనే గ్రామంలో ఉన్నది. గరుడుడికి భయపడి వాసుకి మరియు ఇతర సర్పాలు సుబ్రమణ్యస్వామి శరణు పొందాయని స్థలపురాణం చెపుతుంది. అన్ని దేవాలయంలోపలికి ముఖద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. ఇక్కడ మాత్రం వెనక ద్వారం గుండా లోపలికి వెళ్లాలి. గర్భగుడిలో సుబ్రమణ్యస్వామి విగ్రహం, వెండి నాగుపాముల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఒక రాత్రి నిద్రిస్తే తమ కోరికలు తీరుతాయి అనే నమ్మకం బలంగా ఉండడం వలన రద్దీ చాలా వున్నది.  ఆశ్లేషబలి పూజ ఇక్కడ ప్రధానమైంది. మా బృందంలో కొందరు ఈ ప్రత్యేకమైన పూజను చేయించారు. తెల్లవారి అల్పాహారం ముగించుకొని ఉడిపికి బయలుదేరాము. సుమారు 158 కిమీ ల దూరం. ఘాట్ రోడ్డు కాదు కాబట్టి 4,5 గంటలలో మధ్యాహ్నం వరకు ఉడిపి చేరుకున్నాము. మూడు రోజులుగా వెంబడిస్తున్న వర్షం కూడా ఆరోజు లేదు. ఇది కృష్ణుడి దేవాలయం. బాలకృష్ణుడు ఉండడం విశేషం. దీనికి ఒక పురాణ కథ చలామణిలో ఉన్నది. తల్లి దేవకి కృష్ణుడి బాల్యంలోని ముద్దు మురిపాలు చూడాలని కోరగా తల్లి కోరిక మేరకు మళ్లీ బాల కృష్ణుడిగా మారిపోయాడట. అన్ని దేవాలయాల మాదిరి దర్శనం నేరుగా చేసుకోవడానికి వీలు లేదు.

కిటికీలోనుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి. దీనికి కారణం తెలియదు. ఉడిపి హోటల్లో భోజనం చేయాలని ప్రయత్నించాను కానీ ఉడిపిలో ఉడిపి హాటలు లేకపోవడం నాకు నిరాశ, బాధ మిగిల్చాయి. ప్రభుత్వ నిషేధం అమలులో ఉన్న కారణంగా ఉడిపికి దగ్గరలో ఉన్న అందమైన సముద్ర తీరాలు చూడలేక పోయాను. అక్కడి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్ కు సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నాము. పద్దెనిమిది అంతస్తుల గోపురం దూరం నుంచే ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను శివ వెంటనే టికెట్ తీసుకొని లిఫ్ట్ లో పద్దెనిమిదో అంతస్తుకు వెళ్లిపోయాము. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. చల్లని సాయంత్రం ….. చుట్టూ కనుచూపుమేర సముద్రం ….. తన అలల చేతులు చాచి నన్ను రా రమ్మని పిలుస్తున్న అనుభూతి……. అక్కడి నుంచి అల్లంత దూరంలో కనిపిస్తున్న పరమశివుణ్ణి చేరుకోవాలనే తపన……..

ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహాలలో ఇది రెండోది. ఇక్కడికి చేరుకోవడానికి గోపుర ప్రాంగణం లో నుంచి దారి లేదు. బయటనుంచి వెనకవైపునుంచి మెట్లదారి గుండా పైకి వెళ్ళాలి. పైకి వెళ్లగానే ఎత్తైన నంది విగ్రహం సాక్షాత్కరిస్తుంది. దానికి వెనక వైపు రావణుడికి తన ఆత్మలింగాన్ని అందజేస్తున్న శివుడి విగ్రహం ఉంటుంది. నందికి ముందువైపు అద్భుతమైన శిల్పకళతో అలరారే ఎత్తైన శివుడి విగ్రహం. చీకటి పడేకొద్దీ అటు గోపురం ఇటు శివుడు విద్యుద్దీపాల కాంతిలో మరింత శోభను సంతరించుకున్నాయి. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో రాత్రి ఎనిమిది గంటలదాకా గడిపి గదికి చేరుకున్నాము. తెల్లవారి ఉదయమే బయలుదేరి సుమారు 78కి. మీ. ల దూరంలో ఉన్న గోకర్ణం చేరుకున్నాము. ఇది ఉత్తరకన్నడ జిల్లాలోని గోకర్ణ గ్రామంలో అరేబియా సముద్రతీరంలో ఉన్నది. గోకర్ణంకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి . అతి పురాతనమైన మహాబలేశ్వరాలయం ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ శివుడు ఆత్మలింగంగా ప్రసిద్ధి. శివలింగం పైకి కాకుండా లోపలికి ఉండడం ప్రత్యేకత. రావణుడి తపస్సుకు మెచ్చి శివుడు తన ఆత్మ లింగాన్ని ప్రసాదిస్తాడు. దానిని భూమి పై ఉంచితే తిరిగి పొందడం అసాధ్యం. దీని వల్ల జరుగబోయే ప్రమాదాన్ని గుర్తించిన విష్ణువు తన చక్రాన్ని సూర్యునికి అడ్డం పెడతాడు. నిష్ఠాగరిష్టుడు అయిన రావణుడు సంధ్యాసమయం అయిందని భ్రమిస్తాడు. తాను సంధ్యావందనం ముగించుకొని వచ్చే వరకు ఆ లింగాన్ని పట్టుకోమని, కింద పెట్టవద్దని దగ్గరలో మారు రూపంలో ఉన్న బాలగణపతి కి పురమాయిస్తాడు. దానికి అంగీకరించిన బాలుడు తాను పట్టకోగలిగినంత వరకు మాత్రమే పట్టుకుంటానని చెపుతాడు. తరువాత తాను ఆ బరువును మోయలేకపోతున్నా అని శివలింగాన్ని సముద్రతీరంలో భూమి మీద పెట్టేస్తాడు. దానికి ఆగ్రహించిన రావణుడు బాలగణపతి తల మీద ఒక మొట్టికాయ వేసాడట. దానివల్ల తలమీద చిన్న గుంట ఏర్పడిందట. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆలయం లో బాల గణపతి తల మీద  అభిషేకం సమయంలో ఆ గుంటను ఇప్పటికీ చూడవచ్చని స్థానికులు చెప్పారు. అలా భూమి మీద ఉన్న ఆత్మ లింగాన్ని పెకిలించడానికి రావణుడు చాలా ప్రయత్నం చేశాడు. ప్రయోజనం లేకపోగా మరింత పెరుగుతూ పోయిందట. మహా బలా! అని సంబోధించడం వలన ఆ ఆలయానికి మహాబలేశ్వర ఆలయంగా పేరు వచ్చిందట. ఇది త్రేతాయుగంలో జరిగిన సంఘటన. అప్పటి నుంచి నేటి కలియుగం దాకా అలల తాకిడికి శివలింగం లోపలికి పోయిందని స్థానికుల నమ్మకం. తర్వాత అక్కడ ఆలయనిర్మాణం జరిగిందట. మిగిలి ఉన్న లింగం పైన వెండి కవచాన్ని ఉంచారు. భక్తులు ఆ వెండి కవచం లో చేయి పెట్టి శివలింగాన్ని తాకుతారు. ఈ సదుపాయం రోజూ పన్నెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పుష్కరానికి ఒకసారి వెండి కవచం లేకుండా భక్తులు నిజరూప ఆత్మలింగాన్ని  దర్శించుకునే అవకాశం ఉంటుంది. తరువాత నేను సుజాత కలిసి కొండ మీద ఉన్న గుడికి వెళ్లాము. అక్కడ పాదాలపైన శివలింగం ఉండడం కొంత వింతగా అనిపించింది. అక్కడనుంచి బీచ్ కు వెళ్లాము. అప్పటికే మిత్రులందరూ సముద్రతీరంలో సేదతీరుతున్నారు. ఎప్పుడు చూసినా సముద్రం నాకు ఉద్వేగభరితంగా కనిపిస్తుంది. ప్రభుత్వ నిషేధం ఉందని తెలిసినా తీరం వరకూ వెళ్లిన నేను సముద్రంలోకి వెళ్లకుండా ఉండలేకపోయాను. అలా పది అడుగులు వేసానో లేదో పెద్ద అల ఒకటి నా వైపు దూసుకు వచ్చింది. కాళ్లకింద ఇసుక జర్రున జారిపోయింది. ఆ ఆనందంలో ఉన్న సమయంలోనే విజిల్ వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే…పోలీస్ నన్ను ఒడ్డుకు రమ్మని పిలుస్తు న్నాడు. ….. నాకు రాక తప్పలేదు. అక్కడనుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం. మధ్యలో హంపి వెళ్లే ప్రయత్నం చేశాము కానీ కుదరలేదు.

కర్ణాటకలోని దేవాలయాల వాస్తుశిల్పం నన్ను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ….. అక్కడి దేవాలయాల గర్భగుళ్లకు గోపురాలు లేవు. చాలా వరకు చెక్క నిర్మాణాలు. ఆలయానికి ముందు కొన్ని చోట్ల గోపురాలున్నాయి. గోపురం దాటి ఇంటిని తలపించే దేవాలయం లోనికి వెళ్ళాలి. ప్రసాదం ఇచ్చే పద్ధతి కూడా నాకు కన్పించలేదు. తీర్థం మాత్రం ఇస్తున్నారు. పురుషులు పై దుస్తులతో ఆలయంలోనికి ప్రవేశించడం నిషిద్ధం. కానీ స్త్రీ పురుషులు ఒకే లైనులో వెళ్లడం, ఒక్కోసారి లైను కాస్తా గుంపుగా మారినప్పుడు స్త్రీలకు ఇబ్బంది కలగడం వాస్తవం. నాకైతే చాలా చిరాకు వేసింది. బోలెడన్ని ఆనందాలు, కొన్ని చిరాకులు మూటగట్టుకుని తెల్లవారి ఝామున మూడు గంటలకు క్షేమంగా ఇంటికి చేరుకున్నాను.

Written by Girija Paidimarri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“బామ్మ ఆశయం”

మా కండ్ల పంట