మహిళా స్ఫూర్తి- మహోన్నత వ్యక్తిత్వం

దుర్గాబాయి

రంగరాజు పద్మజ

సామాన్యంగా పెద్దవారి జయంతులు- వర్ధంతులు ఎందుకు జరుపుకుంటామంటే వారి మహత్మ్యం లేదా గొప్ప కార్యాలు చేసిన వారి పుట్టిన రోజున వారు చేసిన పనులను తలుచుకొని ప్రేరణ పొందడానికి మరియు వారి అడుగు జాడలలో నడవడానికి దోహదపడుతుంది.
అటువంటి అరుదైన వ్యక్తిత్వం కలగినదే దుర్గాబాయి దేశ్ ముఖ్. సాంఘిక దురాచారాలకు గురైన మహిళల కోసం పోరాటం చేసిన ధైర్యవంతురాలు. ఇటువంటి వ్యక్తుల నుండి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవి కొత్తతరాలకు ఊపిరిలూదుతాయి .ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం అంటే ఏ తారీఖున పుట్టారు? ఎప్పుడు మరణించారని ?కాదు ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని, వారు సాధించిన సమాజపరమైన మంచిపనులను చేయడానికి చేసిన కృషి, వాటిని చేయడంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన వైనం తెలుసుకోవడమే!
వారి జీవితాల్లోనూ సమస్యలు, ప్రేమలు, ద్వేషాలు, విఫలాలు ఎన్నో ఉంటాయి. ఆ వ్యక్తి గురించి మంచిగాను- చెడుగాను మాట్లాడే వారూ ఉంటారు. కానీ వాటిని అన్నింటినీ పక్కకు నెట్టి సామాన్య స్త్రీలు చేయలేని ఎన్నో పనులు చేసారు దుర్గాబాయి.


పట్టుదల, కార్యదక్షత ఈనాటి తరం ఆమెను చూసి నేర్చుకోవాలి. దానికి ఉదాహరణగా తండ్రి రామారావు గారు చాలా చిన్న వయసులోనే చనిపోతే ఆమె తల్లిని చుట్టాలు బలవంతంగా సంప్రదాయం అనే పేరుతో ఆమెను వితంతువుగా మార్చాలని ఆమె జుట్టును కత్తిరించాలని చూస్తే , ఆ బంధువులకు ఎదురు తిరిగి వితంతువును చేయకుండా ఆపింది. అలాగే వారందరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. ఆ కాలంలో అదొక గొప్ప సంస్కరణే!
రాజమండ్రిలో 15- 7 -1909లో జన్మించిన ఈమె, కాకినాడలో పెరగడంతో ఆమెకు రాజకీయాల మీద పట్టు, కళలంటే ఇష్టం ఏర్పడింది. అందులో రాణించాలంటే విద్య ఒక్కటే పరిష్కారమనుకొని, ఆమె జాతీయభాషైన హిందీ చదువుకొని, ఒక పాఠశాలను స్వయంగా ఏర్పాటు చేసి, తన తల్లి కృష్ణవేణమ్మగారితో కలిసి, కొంతమంది బాలికలను, చేర్చుకొని, హిందీ పాఠాలు నేర్పించేది. తరువాత కాలంలో అది చాలా పెద్ద పాఠశాలగా మారింది. తాను స్థాపించిన ఆ పాఠశాలను జాతీయ పాఠశాలగా చేసేందుకు గట్టి పట్టుదలతో కృషి చేశారు. ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎవరి దగ్గరా చేతులు చాచలేదు. ఎవరైనా ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించేవారు. ఆ పాఠశాలలో ఎందరో చదువుకున్నారు. అలా హిందీ మీద పట్టు సాధించి జాతీయ స్థాయిలోని నాయకులతో ధారాళంగా హిందీ మాట్లాడేవారు.
తన చుట్టూ సమాజంలో ఏం జరుగుతున్నదని ఎప్పటికప్పుడు గమనించేది.
ఆ రోజుల్లో దేవదాసీలు, పరదా స్త్రీలు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారు. వారి జీవితాలు బాగు చేయాలని ఈ విషయం గాంధీ గారికి తెలియజేయాలనుకుంది.
1919-20 గాంధీగారు అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటన చేస్తుంటే తెలుసుకొని, కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి, గాంధీ గారిని తమ పాఠశాలకు ఆహ్వానించి, వారి సమస్యలను తెలిపారు. ఆమెకు హిందీ భాష చక్కగా మాట్లాడ రావడమంతోనే ఆ సమస్యలను తెలియజేయడానికి సాధ్యమైంది.
కాంగ్రెస్ ఫండ్ కోసం సేకరిస్తున్న సమయంలో తన చేతి బంగారు గాజులను గాంధీ గారి జోలెలో వేసింది. అంతటి ఉదార స్వభావురాలు ఆమె. కాంగ్రేసు సభలలో పాడడానికి హిందీలో దేశభక్తి పాటలు నేర్పించేది. గాంధీ ప్రభావంతో ఖాదీ వడకడం అలవాటు చేసుకుని, ఆనాటి నుండి చివరివరకూ ఖాదీ వస్త్రాలే ధరించేది. గాంధీ గారి ఉపన్యాసాలకు అనువాదం చేసి, ఆ ప్రసంగాలను అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పేది. రాజకీయాలపట్ల ఆసక్తి ఏర్పడి, 600 మంది మహిళా వాలంటీర్లను కాంగ్రేస్ సమావేశాల కోసం తయారు చేసింది. ఆ సమావేశాలకు అధ్యక్షుడుగా ఉన్న జాతీయ నాయకుడు వేంకటప్పయ్యగారు దుర్గాబాయతో కొంత ధనం ఇస్తేనే ఆ సమావేశాలలో ప్రవేశం కల్పిస్తామని అన్నాడు. సరేనని దుర్గాబాయి ఆ కాలంలోనే 5000 రూపాయలు కూడబెట్టింది. కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అంతటితో అయిపోలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశభక్తి గీతాలు పాడించేది. వెంకటప్పయ్య గారు ఆమెకు 18 సంవత్సరాల వయసు లేదని, దుర్గాబాయిని వాలంటీర్ గా తీసుకోలేదు.
తరువాత గాంధీ ఆమె చురుకుదనం, పాఠశాల నిర్వహణ, హిందీ భాషోచ్ఛారణ చూసి, తానే స్వయంగా ఆమె వాలంటీర్ గా పనిచేయవచ్చని, కొన్ని బాధ్యతలప్పగించాడు. అదేమిటంటే టికెట్లు లేనివారిని లోపలికి పంపించ వద్దని చెప్పాడు … నెహ్రూకు టిక్కెట్ లేదని లోపలికి పంపకుండా ఆపివేసింది, పని చేయడంలో నిబద్ధత! అంతటి ధీరవనిత దుర్గాబాయి. ఆమె నిక్కచ్ఛి తత్త్వానికి సంతోషపడి, నెహ్రూ టికెట్టుకొని లోపలికి వెళ్ళాడు.
ఆమె ఇంటి బయట నిక్కచ్చిగా ఉండటమే కాదు
తన వివాహ విషయంలోనూ అంతే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. మేనమామ సుబ్బారావుతో వివాహం తన ఎనిమిదవ ఏటనే జరిపించారు పెద్దలు. ఆ పెళ్లిపై ఆమెకు ఆసక్తి లేక భర్తతో వేరేపెళ్లి చేసుకోమని ఖచ్చితంగా చెప్పి, అతనికి పెళ్ళి జరిగేలా చూసింది.
పూర్తి పరిణితి చెందిన తరువాత కాంగ్రెస్ పార్టీలో పని చేసినప్పుడు పరిచయమైన అప్పటి ఆర్థిక మంత్రి “చింతామణి ద్వారకా నాథం దేశ్ ముఖ్” ను పెళ్లి చేసుకున్నది. పిల్లలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని సమాజ సేవలోనే గడిపింది. మహిళా సభలో ఎక్కువ సమయం ఉండేది. సాటివారికి పాటలు నేర్పించడం, నూలు వడకడం నేర్పి , వారికి ఆదాయం వచ్చేలా ప్రోత్సాహించేది. మహిళా సభకు ముందు దాని పేరు ద లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్* పెట్టారు. తరువాత అది పెరిగి పెరిగి పెద్ద వటవృక్షమైంది. గాంధీగారు పరిచయమైన తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని జైలు పాలయ్యారు. అక్కడ కూడా సంస్కరణలు తెచ్చారు కానీ ఆరోగ్యం చాలా పాడైపోయింది. లాఠీ దెబ్బలకు చేతులు వాచిపోయి, పుండ్లు పడ్డాయి, వాటినుండి రక్తం కారేవట! దాంతో రాజకీయాలకు ఆమె దూరమై సేవా రంగానికి ప్రాముఖ్యతను ఇచ్చారు.
స్త్రీని కట్టడి చేస్తే తిరగబడుతుంది అని ఆమె అభిప్రాయం.
రాజనీతి శాస్త్రం చదవడానికి కూడా ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ మగవారికే ప్రవేశం- వసతులు తప్ప మహిళలకు లేకపోవడమే! ఐనా సాధించి నెగ్గింది. తర్వాత మద్రాసులో ‘లా’ చదివారు. లా ప్రాక్టీస్ చేస్తూనే, మహిళా సభలో మహిళలకు ఉపయోగపడే కుట్లు, అల్లికలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు జరిపించేవారు. వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో వృత్తి విద్యలు నేర్పేవారు. అక్కడే చదువు -పని- నివాసం, సౌకర్యాలను కల్పించి ,ఇలా ఎంత మందికో ఆశ్రయం కల్పించారు. మహిళా విద్యాలయం ఏర్పాటు చేశారు.
ఆంధ్ర మహిళ అనే పత్రికను ఏర్పాటు చేసి దాని ద్వారా యుద్దవార్తలను ఎప్పటికప్పుడు అందించేవారు. కొంతకాలం ఆ పత్రిక నడిచి ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. కానీ మరి కొంత కాలానికి విజయదుర్గ అని మరో పత్రికను నడిపారామె. ఈ పనులు అన్నిటినీ ఎదుటివారిని చెప్పి, ఒప్పించడంలో ఎంతో తెగింపు, ధైర్యం ఉండేది.
ఎన్నో విజయాలు సాధించిన పూర్ణవ్యక్తిత్వం ఆమెది. ఆమె అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఎన్నికైంది. ఆమె ఆధ్వర్యంలో అలీఘర్ విశ్వవిద్యాలయానికి, అలాగే హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టే సందర్భంలోనూ, స్త్రీల వివాహం, వారి ఉనికి , స్త్రీల వారసత్వపు హక్కు, వరకట్న నిషేధం మొదలైన చట్టాలు రూపొందించబడ్డాయి .
ఆంధ్ర మహిళా సభ స్వంత భవనాల కోసం ఎందరెందరి చేతో సభ్యత్వం తీసుకొనేలా చేసి , ఆ డబ్బుతో భవనాలు ఏర్పాటు చేశారు. వితంతువులకు, వయసు పైబడ్డ వారికి ఎందరికో ఆసరాగా నిలిచింది ఆంధ్ర మహిళా సభ!
దుర్గాబాయి తలపెట్టిన అన్ని సేవలూ సక్రమంగా జరిగాయనడానికి స్త్రీ సేవాసదన్* లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ నుండి *దుర్గాబాయి అకాడమీ వరకు ఎన్నో సంస్థలు సేవలు అందించాయి.
ప్లానింగ్ కమిషన్ లో ఉండి దేశసంక్షేమ సంస్థలను ఎన్నింటినో అభివృద్ధి చేశారు.
దుర్గాబాయి దేశముఖ్ సాధించని పనిలేదు. కొన్ని వేల సంస్థలు -అంతకన్నా ఎక్కువ స్వచ్ఛంద సేవకులు ఇప్పటికి సేవలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఆమె అధ్వర్యంలో నెలకొల్పబడ్డవే !
పట్టుదలా; క్రమశిక్షణా ఆమె విజయానికి మెట్లు!
ఆమెను జాతీయ మహిళా విద్యా సమాఖ్య అధ్యక్షురాలుగా నిలబెట్టాయి.
తాను – తన భర్త విజయాలను చింతామణి- నేను అనే పుస్తకం రాసి, మరియు తన సంస్థ గురించి పలికే రాళ్ళు అనే పుస్తకం రాసి ఆమె రచయిత్రి గాను రాణించింది.
ఎన్నో పనులు స్వంతంగా చేసి, అందరూ కలిసి చేస్తేనే సాధ్యమని చెప్పే నిగర్వి ఆమె.
ఉత్సాహం అనే విగ్రహానికి ఖద్దరు చీర కడితే దుర్గాబాయి దేశ్ ముఖ్ గా కనపడేది.
9-5-1981 రోజున ఈలోకంలో సేవలు చాలించి పరలోక వాసుల సేవకై తరలివెళ్ళింది. మహోన్నత వ్యక్తిత్వం కల దుర్గాబాయిదేశ్ ముఖ్.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అరుణిమ సిన్హా ఓ పడి లేచిన కడలి తరంగం

రుధిరార్ణవ తేజస్సు